ఆత్మీయ.. పరామర్శ | YS Sharmila 2nd phase of Paramarsha Yatra in Nalgonda | Sakshi
Sakshi News home page

ఆత్మీయ.. పరామర్శ

Published Thu, Jan 22 2015 5:27 AM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM

ఆత్మీయ.. పరామర్శ - Sakshi

ఆత్మీయ.. పరామర్శ

దేవరకొండ  : దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణ వార్త విని గుండె పగిలి మరణించినవారి కుటుంబాలను పరామర్శించడానికి వైఎస్ తనయ షర్మిల చేపట్టిన పరామర్శ యాత్ర బుధవారం మొదటి రోజు దేవరకొండ నియోజకవర్గంలో ప్రారంభమైంది. చింతపల్లి మండలంలోని మదనాపురం, చందంపేట మండలంలోని యల్మలమంద గ్రామపంచాయతీ  పరిధిలో గల దేవరచర్ల, కంబాలపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గువ్వలగుట్ట గ్రామాల్లోని బాధితులను ఆమె పరామర్శించారు. ఆ కుటుంబాలను అక్కున చేర్చుకుని ఆత్మీయంగా ఆమె పలకరించారు. ఒక్కొక్క కుటుంబంతో అరగంటకు పైగా ఆమె గడిపి వారి బాగోగులను, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
 
 ఉదయం 11 గంటల 45 నిమిషాలకు మదనాపురం గ్రామానికి చేరుకున్న ఆమె అక్కడ వైఎస్ మరణించిన వార్తను తట్టుకోలేక మరణించిన ఆడెపు బాలమ్మ కుటుంబాన్ని పరామర్శించారు. బాలమ్మ భర్త మైబయ్య, కొడుకు సత్తయ్య, కూతుళ్లను పరామర్శించారు. మెబయ్య ఇంట్లోకి అడుగుపెట్టిన షర్మిల ఆయనను పెద్దయ్యా... అంటూ పలకరిం చారు. ఎట్లా ఉన్నావ్.. పెద్దయ్యా... ఆరోగ్యం ఎట్లా ఉంది పెద్దయ్యా... అని ప్రశ్నించగా అట్లనే ఉంది బిడ్డా... అంటూ మైబయ్య సమాధానం ఇచ్చాడు. యోగక్షేమాలను తెలుసుకునే క్రమంలో ఆమె మైబయ్యను, కొడుకు సత్తయ్యను పలు ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు.
 
 షర్మిల : ఎంత మంది కొడుకులు పెద్దయ్యా?
 మైబయ్య : ఒక కొడుకు, నలుగురు కూతుళ్లు. ముసలమ్మ చచ్చిపోవడంతో బిడ్డలకాడనే ఉంటున్నా.
 
 షర్మిల : పెన్షన్ వస్తుందా పెద్దయ్యా
 మైబయ్య : వస్తుందమ్మా
 
 షర్మిల : రేషన్ వస్తుందా అన్నా (సత్తయ్యనుద్దేశించి)
 షర్మిల :  పొలం కాడనే ఉంటున్నా. రేషన్ ఇంకా రాట్లే.
 
 షర్మిల : ఏం పంట వేశావ్ ?
 సత్తయ్య : వర్షం ఉంటేనే కాత. మెట్ట పంటలే వేశాం.
 
 షర్మిల : ఏమన్న మిగులుతుందా ?
 సత్తయ్య : పంటలు, పెట్టుబడులు ఏదో...
 
 షర్మిల : చేతనైతుందా పెద్దయ్యా ?
 షర్మిల : కాళ్ల నొప్పులు సేతనైతలేదు.
 
 షర్మిల : ఆ రోజు ఏమైంది ?
 మైబయ్య : అయ్య... సచ్చిపోయిండని తెలవడంతో ముద్ద దిగలె.. అప్పుడే అన్నం తింటున్న ముసల్ది అన్నం కుక్కలకేసింది. బయటనే కూసోని ఆలోచించింది. అట్లనే పడి సచ్చిపోయింది.
 
 షర్మిల : అప్పులు ఉన్నాయా అన్నా ?
 సత్తయ్య- మైబయ్య : ముసల్ది సచ్చినప్పుడే అప్పులు తెచ్చినం. మిత్తి మీద... మిత్తి అయ్యింది. మొన్న సంవత్సరం చూస్తే రూ. 17 వేలు అయ్యింది.
 
 షర్మిల : బాధపడకు పెద్దయ్యా... నీకు మేమున్నాం. ఆరోగ్యం జాగ్రత్త.. ఏ ఆపదున్నా ఫోన్ చెయ్.. (పర్సనల్ నంబర్లు ఉన్న విజిటింగ్ కార్డును ఇస్తూ) సుమారు 37 నిమిషాల పాటు వైఎస్ తనయ షర్మిల బాలమ్మ కుటుంబంలోని వ్యక్తులను పరామర్శించారు. మైబయ్య కూతుళ్లతో పాటు గ్రామ విశేషాలను కూడా ఆమె అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి దేవరచర్లకు వెళ్లిన ఆమె అక్కడ మరణించిన హన్మానాయక్ కొడుకు రతన్‌సింగ్, అతని కొడుకులు తులసీరాం, ధరమ్‌సింగ్‌లను పరామర్శించారు. అక్కడ కూడా అంతే ఆప్యాయతతో అంతే  ఓపికతో వారిని కూడా యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యుల వివరాలు, చదువు వివరాలు, వారి సాధక బాధకాలు అడిగి తెలుసుకున్నారు. షర్మిల పరామర్శించడంతో కన్నీరు మున్నీరైన హన్మానాయక్ మనవడు ధరమ్‌సింగ్‌ను బాధపడొద్దంటూ ఓదార్చారు. అక్కడ కూడా సుమారు అరగంట సేపు గడిపిన ఆమె అక్కడి నుంచి గువ్వలగుట్టకు వెళ్లి అక్కడ మరణించిన భీమిని కుటుంబాన్ని పరామర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement