'ఆయన బతికుంటే ఆశావర్కర్లు రెగ్యులరైజ్ అయ్యేవారు'
ప్రతి ఒక్కరికీ మేలు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేదవాడి గుండెల్లో రాజన్నగా సజీవంగా ఉన్నారని వైఎస్ షర్మిల అన్నారు. కరీంనగర్ జిల్లాలో రెండో రోజు పరామర్శ యాత్ర సందర్భంగా ఆమె మాట్లాడారు. రైతులు, రైతు కూలీలకు భరోసా ఇచ్చిన ఏకైక వ్యక్తి వైఎస్ఆర్ మాత్రమేనని ఆమె చెప్పారు.
వైఎస్ఆర్ బతికుంటే ప్రతి ఎకరాకు నీరు, పేదవాడికి ఇల్లు, నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్య అందేవని ఆమె తెలిపారు. వైఎస్ఆర్ ఆశయాలను బతికించుకుందామని, చేయి చేయి కలిపి రాజన్న రాజ్యం సాధించుకుందామని పిలుపునిచ్చారు. ఆశా వర్కర్ల వ్యవస్థను ప్రవేశపెట్టింది వైఎస్ రాజశేఖరరెడ్డేనని, ఆయన బతికుంటే ఆశా వర్కర్లు రెగ్యులరైజ్ అయ్యేవారని వైఎస్ షర్మిల చెప్పారు.
వ్యవసాయం దండగ అని కొందరు నాయకులు అన్న రోజుల్లో దాన్ని పండుగలా చేసిన మహా వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అని తెలంగాణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి కాకముందు రైతులు ఎలా ఉన్నారో, ఇప్పుడూ అలాగే ఉన్నారని ఆయన అన్నారు. రాజన్న కలలు సాకారం కావాలంటే మనమంతా ఐక్యం కావాలని పొంగులేటి పిలుపునిచ్చారు.