పరామర్శకు పయనం
నైతిక విలువలకు పర్యాయపదం ఆ కుటుంబం... ఇచ్చిన మాటకు, నమ్ముకున్న వారి బాగోగుల కోసం నిరంతరం పరితపించే మడమతిప్పని నైజం వారిది... దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని జీర్ణించుకోలేక సొంత కుటుంబసభ్యుడిని కోల్పోయామన్నంత ఆవేదనతో హృదయాలు పగిలి మరణించిన వారెందరో... వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఐదున్నర ఏళ్ల క్రితం నల్లకాల్వ సాక్షిగా జననేత జగనన్న చేసిన ఓదార్పు ప్రకటనలో భాగంగా షర్మిల బుధవారం నుంచి జిల్లాలో పర్యటించనున్నారు.
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఓ కుటుంబం తమను నమ్ముకున్న వారి పట్ల కనబరిచే వాత్సల్యమిది. కాలం కరిగిపోయినా... వారిపై తమ అభిమానం చెరగదనే పరామర్శ ఇది... తన తండ్రిని కోల్పోయిన ఆవేదనతో ఎంతో మంది నిలువునా కుప్పకూలిపోవడం కలచివేసిన సందర్భంలో చెప్పిన మాటను ఆచరణలో చూపేందుకు మడమతిప్పని కుటుంబ ప్రతినిధిగా షర్మిల 7 రోజుల పాటు జిల్లాలో పర్యటిస్తున్నారు. బుధవారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లోని నివాసగృహం నుంచి ఆమె యాత్రకు బయలుదేరుతున్నారు. 2009 సెప్టెంబర్ 2న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణాన్ని జీర్ణించుకోలేని ప్రజలు వార్త తెలిసిన మరుక్షణమే గుండెలు పగిలి కుటుంబాలను వదిలి తిరిగిరాని లోకాలకు వెళ్లారు. వారికి అండగా నేనున్నా అంటూ జననేత వైఎస్ జగన్ నల్లకాల్వ వద్ద మాట ఇచ్చిన విషయం తెలిసిందే.
కుటుంబ సభ్యుడిని కోల్పోయిన వారి స్థితిగతులను తెలుసుకునేందుకు ‘‘అన్న’’ మాట నిలిపేందుకు జిల్లా పర్యటనలో భాగంగా దేవరకొండ నియోజకవర్గంలోని మదనాపురంలో ఆడెపు బాలమ్మ కుటుంబాన్ని షర్మిల పరామర్శిస్తారు. అటు నుంచి దేవరచర్ల తండా, గువ్వలగుట్ట ప్రాంతాల్లో పర్యటించి నాగార్జునసాగర్‌లో రాత్రిబస చేస్తారు. మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల్లో చనిపోయిన వైఎస్సార్ అభిమానుల కుటుంబాలను పరామర్శిస్తారు. ఈ నెల 27న సూర్యాపేటలో యాత్ర ముగుస్తుంది. రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన 30 కుటుంబాలను పరామర్శిస్తారు. ఇందుకోసం జిల్లాలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టు శ్రీకాంత్‌రెడ్డి స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఇదీ టూర్ షెడ్యూల్
21వ తేదీన దేవరకొండ నియోజకవర్గంలో 3 కుటుంబాలకు పరామర్శ
22వ తేదీన నాగార్జునసాగర్ నియోజకవర్గంలో 3 కుటుంబాలకు పరామర్శ
23వ తేదీన మిర్యాలగూడ నియోజకవర్గంలో 4 కుటుంబాలకు పరామర్శ
24వ తేదీన హుజూర్‌నగర్ నియోజకవర్గంలో 5 కుటుంబాలకు పరామర్శ
25వ తేదీన కోదాడ నియోజకవర్గంలో 6 కుటుంబాలకు పరామర్శ
26,27 తేదీల్లో సూర్యాపేట నియోజకవర్గంలోని 9 కుటుంబాలకు పరామర్శ