జనం గుండెల్లో వైఎస్.. | ys sharmila first phase paramarsha yatra close in warangal district | Sakshi
Sakshi News home page

జనం గుండెల్లో వైఎస్..

Published Sat, Aug 29 2015 12:41 AM | Last Updated on Sat, Jul 7 2018 2:37 PM

జనం గుండెల్లో వైఎస్.. - Sakshi

జనం గుండెల్లో వైఎస్..

వరంగల్ జిల్లాలో ముగిసిన షర్మిల తొలిదశ పరామర్శ యాత్ర
సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఎవరిని కదిపినా ఆ మహానేత జ్ఞాపకాలే.. ఎవరిని పలకరించినా ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల మాటే.. మాకు పింఛన్ వచ్చిందని ఒకరంటే.. మాకు ఉచిత కరెంటిచ్చాడని మరొకరు.. మా అప్పులు మాఫీ జేశారని ఒకరంటే.. నాకు ఉచితంగా గుండె ఆపరేషన్ చేయించాడని ఇంకొకరు! వైఎస్సార్ తనయ షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన పరామర్శ యాత్రలో భాగంగా ఆమె వెళ్లిన ప్రతీచోట జనం వైఎస్ పాలననే గుర్తుకుతెచ్చుకున్నారు.

శుక్రవారం ఐదోరోజు పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం సోమారం వద్ద ఈ యాత్ర తొలిదశ ముగిసింది. మొత్తంగా జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, వర్ధన్నపేట, వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, పరకాల నియోజకవర్గాల్లోని 32 కుటుంబాలను పరామర్శించారు. షర్మిల వెళ్లిన ప్రతీచోట ప్రజలు అక్కున చేర్చుకున్నారు. ఆప్యాయంగా స్వాగతం పలుకుతూ వైఎస్‌పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు.
 
ఇంట్లో మనిషిలా..
పరామర్శ కోసం వెళ్లిన చోట షర్మిలపై ఆయా కుటుంబాలు ఎంతో ఆప్యాయత చూపాయి. రెండు చేతులతో నమస్కరిస్తూ.. అందరినీ పేరుపేరునా పలకరించిన ఆమెను ఇంట్లో మనిషిలా చూసుకున్నారు. ‘‘రాజన్న బిడ్డ మా ఇంటికి వచ్చింది. ఆ బిడ్డ మా ఇంటికి వచ్చి వెళ్లిందంటే ఇన్నాళ్ల మా బాధ తీరినట్టే. రాజన్న కూతురు మా గడపలో అడుగుపెట్టింది. ఇది మేం కలలో కూడా ఊహించలేదు. ఓట్ల కోసం వచ్చే రాజకీయ నాయకులను చూశాంగానీ.. మా కష్టసుఖాలు తెలుసుకుని.. మాతో మాట్లాడటం కోసమే వచ్చిన మొదటి నాయకురాలు షర్మిల’’ అని పలువురు పేర్కొన్నారు.
 
ఐదోరోజు 4 కుటుంబాలకు పరామర్శలు..
పరామర్శ యాత్రలో శుక్రవారం షర్మిల నాలుగు కుటుంబాలను పరామర్శించారు. పరకాల నియోజకవర్గం సంగెం మండలం రామచంద్రాపురంలోని బొల్లు ఎల్లమ్మ ఇంటికి వెళ్లి బొల్లు సమ్మయ్యతో మాట్లాడారు. ‘ఏం పనులు చేస్తున్నారు. ఆరోగ్యం ఎలా ఉంది’ అని తెలుసుకున్నారు. అనంతరం పర్వతగిరి మండలం ఏనుగల్లులో పెండ్యాల చంద్రకళ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పలకరించారు. ‘‘రాజన్న ఉన్నప్పుడు వర్షాలు పడ్డారుు. ఈరోజు మీరొచ్చారు. మళ్లీ వర్షం కురిసింది.

వరలక్ష్మి వ్రతం రోజు సాక్షాత్తు వరలక్ష్మిలా వచ్చావు. రేపు రాఖీ.. మా ఇంటికి పండగలా వచ్చావు’’ అని చంద్రకళ కుటుంబ సభ్యులు షర్మిలతో ఆనందం పంచుకున్నారు. అనంతరం పర్వతగిరి మండలం కేంద్రంలోని పల్లూరి కొమురమ్మ ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పారు. చివరగా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం సోమారంలో మేడిద శాంతమ్మ ఇంటికి వెళ్లి వారి కుటుంబసభ్యులను పరామర్శించారు.
 
వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం పార్లమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన పరామర్శ యాత్రలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పాయం వెంకటేశ్వర్లు(ఎమ్మెల్యే), గట్టు శ్రీకాం త్‌రెడ్డి, రాష్ట్ర ముఖ్యఅధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బీష్వ రవీందర్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు జి.సురేశ్‌రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు బి.అనిల్‌కుమార్, మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు ఎం.శ్యాంసుందర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు విలియం మునిగాల, నాడెం శాంతికుమార్, ఆకుల మూర్తి, కె.కుసుమకుమార్‌రెడ్డి, జి.శ్రీధర్‌రెడ్డి, ఎం.భగవంత్‌రెడ్డి, కె.వెంకట్‌రెడ్డి, ఎం.శంకర్, షర్మిల సం పత్, సాదు రమేశ్‌రెడ్డి, జార్జ్ హెర్బర్ట్, జి.శివకుమార్, ఎ.సంతోష్‌రెడ్డి, వనజ పాల్గొన్నారు.
 
వైఎస్ తరహా పాలన కోరుకుంటున్నారు
పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రజానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన సాగించారని వైఎస్సార్‌సీపీ రాష్ర్ట అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రస్తుత ప్రభుత్వాలు తుంగలో తొక్కుతున్నాయని విమర్శించారు. సంక్షేమ పథకాల స్ఫూర్తిని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు నీరుగార్చాయని అన్నారు.

వరంగల్ జిల్లాలో షర్మిల తొలిదశ పరామర్శయాత్ర ముగింపు సందర్భంగా తొర్రూరు మండలం సోమారంలో పొంగులేటి విలేకరులతో మాట్లాడారు. సంక్షేమ పథకాలతోనే వైఎస్ ప్రజానేత అయ్యారన్నారు. షర్మిల పరామర్శ యాత్రకు జిల్లాలో అద్భుతమైన స్పందన వచ్చిందన్నారు. రాజన్న రాజ్యాన్ని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు వరంగల్ జిల్లాలో రెండోదశ పరామర్శ యాత్ర నిర్వహించ నున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement