మెదక్ జిల్లాలో షర్మిల పరామర్శయాత్ర
హైదరాబాద్: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల పరామర్శ యాత్ర ఆదివారం ఉదయం మెదక్ జిల్లాలో ప్రారంభమైంది. తొలి రోజు మధ్యాహ్నానికి మూడు కుటుంబాలను షర్మిల పరామర్శించారు. వర్గల్ మండలం అంబర్ పేటలో జయమ్మ, తొగుట మండలం వేములగట్టులో బాలవ్వ, కానగల్లో బలరాం కుటుంబాలను షర్మిల పరామర్శించి వారికి భరోసా ఇచ్చారు.
షర్మిల చేపట్టిన పరామర్శయాత్రలో వైఎస్ఆర్సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు నేతలు ఉన్నారు. వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను షర్మిల పరామర్శిస్తున్న విషయం తెలిసిందే. తొలి రోజు ఏడు కుటుంబాలను పరామర్శించనున్నారు. మొత్తం జిల్లాలో 13 బాధిత కుటుంబాలను నేరుగా కలుసుకుంటారు. ఒక్క పటాన్‌చెరు నియోజకవర్గం మినహాయించి మిగిలిన 9 నియోజకవర్గాల్లోనూ షర్మిల పరామర్శయాత్ర కొనసాగనుంది.