ప్రజల బాధను గుండెలో పెట్టుకున్నారు
* అందుకే వైఎస్సార్ కోట్లాది మంది గుండెల్లో నిలిచిపోయారు
* వరంగల్ జిల్లా రెండోదశ పరామర్శయాత్రలో షర్మిల
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఒక నాయకుడి మరణాన్ని తట్టుకోలేక వందల మంది చనిపోవడం దేశచరిత్రలోనే లేదని.. అది ఒక్క వైఎస్ రాజశేఖరరెడ్డి విషయంలోనే జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చెప్పారు. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక వందల మంది గుండె పగిలి ఆయన వెంట వెళ్లిపోయారన్నారు.
ప్రాంతాలకు, కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా వైఎస్ పాలన సాగించారని.. ఆయన ఆశయాలను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆమె పిలుపునిచ్చారు. సోమవారం వరంగల్ జిల్లాలో రెండోదశ పరామర్శ యాత్ర ప్రారంభించిన షర్మిల... పాలకుర్తి నియోజకవర్గంలో పర్యటించారు. రాయపర్తి మండల కేంద్రంలో తనకు ఆత్మీయ స్వాగతం పలికేందుకు వచ్చిన ప్రజలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు.
ప్రజలను సొంత బిడ్డల్లా చూసుకున్న వైఎస్సార్ ఇప్పటికీ కోట్ల మంది ప్రజల గుండెల్లో బతికే ఉన్నారని పేర్కొన్నారు. ‘‘ఒక నాయకుడు చనిపోతే ఆ మరణాన్ని తట్టుకోలేక వందల మంది గుండె ఆగి చనిపోవడం దేశ చరిత్రలో ఎక్కడా జరగలేదు. అంతగొప్పగా వైఎస్సాఆర్ పాలన సాగించారు. ప్రజల బాధను వైఎస్సాఆర్ తన గుండెలో పెట్టుకుని ఆలోచించేవారు. ప్రజలకు అవసరమైన పథకాలను ప్రవేశపెట్టారు. రైతుల కష్టాలను తొలగించేందుకు ఉచిత విద్యుత్ ఇచ్చారు. రుణాలు మాఫీ చేశారు. నష్టపరిహారం పెంచారు.
మహిళలను లక్షాధికారులను చేశారు. అన్ని వర్గాల వారిని అక్కున చేర్చుకున్నారు. వైఎస్ పాలనా సమయంలో దేశం మొత్తం మీద ప్రభుత్వాలు 46 లక్షల ఇళ్లు నిర్మిస్తే... వైఎస్సార్ ప్రభుత్వం ఇక్కడ ఒక్క రాష్ట్రంలోనే 46 లక్షల ఇళ్లను నిర్మించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఎందరో పేదలు పెద్ద చదువులు చదివారు. ఆరోగ్యశ్రీతో కార్పొరేట్ వైద్యం అందించారు. అందుకే ప్రజలు వైఎస్సాఆర్‌ను తమ గుండెల్లో పెట్టుకున్నారు.
తెలుగుజాతి బతికి ఉన్నంతకాలం ప్రజల గుండెల్లో రాజన్నగా జీవించే ఉంటారు. అలాంటి వైఎస్సార్ ఆశయాలను, పథకాలను మనమే బతికించుకోవాలి. అందుకోసం అందరం చేయిచేయి కలపాలి. రాజన్న రాజ్యాన్ని మళ్లీ తెచ్చుకుందాం. వైఎస్సార్‌పై అభిమానంతో వచ్చిన ప్రతిఒక్కరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నా...’’ అని షర్మిల పేర్కొన్నారు.
తొలి రోజు.. ఆరు కుటుంబాలకు..
వరంగల్ జిల్లాలో షర్మిల రెండో దశ పరామర్శయాత్ర సోమవారం మొదలైంది. ఆమె హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్ నుంచి జనగామ మీదుగా కొడకండ్ల మండలం గండ్లకుంటకు చేరుకుని తొలుత ఏడెల్లి వెంకటయ్య కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఇదే మండలం రేగులలో కొత్తగట్టు శాంతమ్మ కుటుంబానికి భరోసా కల్పించారు. తర్వాత రాయపర్తి మండలం కేశవపురంలో రావుల మహేందర్ కుటుంబసభ్యులను ఓదార్చిన ఆమె... రాయపర్తి మండల కేంద్రంలో ముద్రబోయిన వెంకటయ్య కుటుంబాన్ని, నాంచారి మడూరులోని గద్దల ముత్తయ్య, మందపురి కొండమ్మ కుటుంబాలను పరామర్శించారు.
వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన ఈ కుటుంబాల వారికి అండగా ఉంటామని షర్మిల భరోసా కల్పించారు. సోమవారం పరామర్శ యాత్రలో ఆమె 217 కిలో మీటర్లు ప్రయాణించారు. యాత్రలో వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యద ర్శులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, నల్లా సూర్యప్రకాశ్‌రావు, ముఖ్య అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బీష్వ రవీందర్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు విలియం మునిగాల, నాడెం శాంతికుమార్, జార్జ్ హెర్బర్ట్, సయ్యద్ ముజతబ్ అహ్మద్, ఎం.సందీప్, బి.శ్రీనివాసరావు, ఎస్.భాస్కర్‌రెడ్డి, జి.సురేశ్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి, ఎ.గోపాలరావు, ఎం.భగవంత్‌రెడ్డి, బి.శ్రీనివాస్, ఎ.కుమార్, షర్మిల సంపత్, బి.బ్రహ్మానందరెడ్డి, సెగ్గం రాజేశ్, జి.జైపాల్‌రెడ్డి, జి.శివకుమార్, జె.అమరనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ పథకాలకు గండికొడుతున్నారు: పొంగులేటి
సాక్షి, హన్మకొండ: అన్ని వర్గాల అభ్యున్నతి, సంక్షేమమే పరమావధిగా వైఎస్ రాజశేఖరరెడ్డి పాలించారని వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. షర్మిల పరామర్శ యాత్రలో భాగంగా రాయపర్తిలో పొంగులేటి ప్రసంగించారు. ‘‘ప్రజల మనసు తెలుసుకుని వారికి అవసరమైన పథకాలను వైఎస్సార్ ప్రవేశపెట్టారు.
రాజకీయాలకు అతీతంగా వాటిని అమలు చేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం వైఎస్సార్ పథకాలను మార్చాలని చూస్తోంది. వాటి పేర్లు మార్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇలాంటి ప్రయత్నాలను వైఎస్సార్‌సీపీ సహించదు. ప్రభుత్వం ఇలా చేయవద్దని డిమాండ్ చేస్తున్నా...’’ అని పేర్కొన్నారు. వైఎస్సార్ ఆశయాలను నెరవేర్చడానికి అందరం కలసి కష్టపడదామని పిలుపునిచ్చారు.