పాత ఈవో ఆదేశాల మేరకే..!
సాక్షి, మంచిర్యాల: బాసర నుంచి నల్లగొండ జిల్లా దేవరకొండకు సరస్వతి అమ్మవారి విగ్రహం తరలించిన ఉదంతంలో పెద్ద హస్తాలే ఉన్నట్లు తెలుస్తోంది. దేవరకొండలోని పాఠశాలలో అక్షరాభ్యాసం చేయించేందుకు బాసర నుంచి విగ్రహం తీసుకెళ్లాలనే ఆలోచన ఎవరికి వచ్చింది? ఎవరి ఆదేశాలతో అంత దూరం పూజారులు వెళ్లారనే విషయాన్ని దాస్తున్నట్లు తెలుస్తోంది.
దేవరకొండలో నిర్వహించిన అక్షరాభ్యాస కార్యక్రమానికి గతంలో బాసర ఈవోగా పనిచేసి ప్రస్తుతం తెలంగాణ డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఈడీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎం. వెంకటేశ్వర్లు హాజరయ్యారు. దేవరకొండలోని బచ్‌పన్ పాఠశాలతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంబంధాలు ఉన్న ఆయన కోరిక మేరకే అమ్మవారి విగ్రహం తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆయన పేరు బయటకు రాకుం డా ప్రయత్నాలు జరిగినట్లు సమాచారం.
ఆలయ అర్చకులపై వేటుతో సరా?
ఆలయ ప్రధాన అర్చకుడు సంజీవ్ పూజారి, సప్తశతి పారాయణధారుడు ప్రణవ్‌శర్మలు దేవరకొండలోని రెండు ప్రైవేటు పాఠశాలల్లో అక్షరాభ్యాసం చేయించేందుకు అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్లినట్లు ప్రచారం జరగడంతో దేవాదాయ శాఖ స్పందించింది. దీంతో వారిద్దరినీ సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారంలో ఆలయ పరిచారకుడు విశ్వజిత్ కూడా ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో అసలు వ్యక్తిని వదిలి పూజారులను బలి చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుత ఈవో ఏం చేస్తున్నట్లు?
బాసర ఈవోగా ప్రస్తుతం ఎ. సుధాకర్‌రెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయనకు తెలియకుండా పూజారులే విగ్రహాన్ని దేవరకొండ తీసుకెళ్లారా అన్నది ప్రశ్న. తాను కొత్తగా వచ్చానని, దేవాలయంలో ఏం జరుగుతుందో తనకు తెలియదని, పూజారులకే తెలుసని ఆయన చెబుతుండడం కూడా అనుమానాలకు దారితీస్తోంది. అర్చకులను బలి చేసే విషయంలో ఓ టీఆర్‌ఎస్ నేత పూర్తిస్థాయిలో జోక్యం చేసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి.
ఆలయంలో దేవతా మూర్తులతో పాటు ఉత్సవ విగ్రహాల పరిరక్షణ బాధ్యతలు నిర్వర్తించే సూపరింటెండెంట్ గిరిధర్ ఉత్సవ విగ్రహాలు ఎక్కడికీ పోలేదని, స్టోర్‌రూంలోనే ఉన్నాయని చెబుతున్నారు. పూజారులు భక్తులు సమర్పించిన విగ్రహాలనే దేవరకొండ తీసుకెళ్లారని చెబుతుండడం గమనార్హం. ఏది ఏమైనా, ఆలయం నుంచి అమ్మవారి విగ్రహం తరలింపు వెనుక ఉన్నది ఎవరన్న విషయాన్ని తేల్చాలని భక్తులు కోరుతున్నారు.