బాసర గ్రామ సమీపంలోని దస్తగిరి గుట్ట మీద పెద్ద గుండుపై చెక్కిన శాసనమిదే
సాక్షి, హైదరాబాద్: సరస్వతీ దేవి కొలువుదీరిన బాసరలో కొత్త శాసనం వెలుగు చూసింది. ఇది 10వ శతాబ్దికి చెందినదని భావిస్తున్నారు. ఒక విశ్రాంతి వసతి, ఇళ్ల నిర్మాణం చేపట్టిన కార్యక్రమానికి చెందిన శాసనంగా పరిశోధకులు గుర్తించారు. బాసర గ్రామ సమీపంలోని దస్తగిరి గుట్ట మీద పెద్ద గుండుపై ఈ శాసనం చెక్కి ఉంది. స్థానిక యువకులు రమేశ్, యోగేశ్, ఆనంద్ తదితరుల ద్వారా సమాచారం అందుకున్న కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు బలగం రామ్మోహన్ దాన్ని పరిశీలించారు.
కల్యాణి చాళుక్య రాజ్యస్థాపకుడైన రెండో తైలపుని కుమారుడు సత్యాశ్రయుని పేరు ఇందులో కనిపిస్తోందని, సత్యాశ్రయునికి ఇరవ బెడంగ, సట్టి, సట్టిగ అనే పేర్లు కూడా ఉన్నాయని శాసనాన్ని పరిష్కరించిన శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు. బసది, నివాసాల కోసం ఈ శాసనాన్ని వేయించినట్టు తెలుస్తోందని తెలిపారు. అందులో రామస్వామి అన్న పేరు కనిపిస్తోందని, అప్పట్లో ఆయన న్యాయాధికారి అయ్యుంటాడని భావిస్తున్నట్టు వెల్లడించారు. దిగువన త్రిశూలం గుర్తు ఉన్నందున, ఆ రాజు శైవ ఆరాధకుడై ఉంటాడని భావిస్తున్నట్టు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment