Saraswati Devi
-
బాలాలయానికి సరస్వతీ అమ్మవారు!
భైంసా: సరస్వతీ దేవి కొలువైన బాసర ప్రధాన ఆలయం పునర్నీర్మాణానికి కసరత్తు పూర్తయింది. ఇప్పటికే అర్చకులు, అధికారులు, వైదిక బృందం శృంగేరి వెళ్లి పీఠాధిపతి విదుశేఖర భారతిస్వామి సూచనలతో నమూనా రూపొందించారు. గర్భగుడిలో మార్పులు చేర్పులపై పీఠాధిపతి చేసిన సూచనలను ఆలయ ఈవో విజయరామారావు, ఆలయ ప్రధాన పండితులు.. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, కలెక్టర్ వరుణ్‌రెడ్డికి వివరించారు. కొత్త నమూనాలు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. రెండు దశాబ్దాలుగా అభివృద్ధికి దూరమైన బాసర ఆలయానికి రూ.50 కోట్ల నిధులు మంజూరైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. దేశవ్యాప్తంగా భక్తులు వచ్చే ఈ క్షేత్రంలో అనునిత్యం అక్షరాభ్యాస పూజలు జరుగుతాయి. వేలాదిగా భక్తులు బాసర వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో పునర్నీర్మాణ పనులు ప్రారంభమైతే ప్రస్తుతం ఉన్న ప్రధానాలయం వద్ద భక్తుల దర్శనాలు నిలిచిపోనున్నాయి. పనుల సమయంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా అక్షర శ్రీకార మండపాన్ని బాలాలయంగా ఏర్పాటుచేసి అమ్మవారికి పూజలు నిర్వహించనున్నారు. విశాలమైన ఈ మండపంలో ప్రధానాలయం గర్భగుడి పనులు పూర్తయ్యేవరకు అమ్మవారి దర్శనాలు, అక్షరాభ్యాస పూజలు ఇక్కడే జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికలకు ముందే ప్రారంభించేలా.. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే ఆలయ పనులు ప్రారంభించాలని చూస్తున్నారు. ఇప్పటికే మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, కలెక్టర్ వరుణ్‌రెడ్డి పలు దఫాలుగా సమీక్షలు, సమావేశాలు నిర్వహించి నూతన నమూనాలు, మాస్టర్‌ప్లాన్ తదితరాలపై కసరత్తు పూర్తి చేశారు. ఇటీవల బాసర వచి్చన మంత్రి మాస్టర్ ప్లాన్ అమలుపై ఆలయ అధికారులతో చర్చించారు. కృష్ణ శిలలతో నిర్మాణం... గర్భాలయాన్ని కృష్ణశిలలతో అత్యద్భుతంగా నిర్మించనున్నారు. ప్రస్తుతం సరస్వతి అమ్మవారి దర్శన సమయంలో పక్కనే ఉన్న మహాలక్ష్మి అమ్మవారి ప్రతిమ కనిపించదు. రానున్న రోజుల్లో మహాలక్ష్మి అమ్మవారు కనిపించేలా ప్రత్యేక నిర్మాణాలు చేపట్టనున్నారు. మహంకాళి అమ్మవారి ప్రతిమ వెనుక ప్రాకార మండపం, ప్రాకారం లోపల శివాలయ పునః ప్రతిష్ట, దత్తాత్రేయ స్వామివారి స్థల మారి్పడి, నలుదిక్కులా రాజగోపురాల నిర్మాణం, అనివేటి మండప విస్తరణ, ద్వజ స్తంభం ఏర్పాటు, ఆలయ ప్రాంగణంలోనే యాగశాల ఏర్పాటు వంటివి చేపట్టనున్నారు. -
సరస్వతీదేవిపై అనుచిత వ్యాఖ్యలు
బాసర (ముథోల్): బాసరలోని జ్ఞాన సరస్వతీదేవిపై భారతీయ నాస్తిక సంఘం రాష్ట్ర శాఖకు చెందిన రేంజర్ల రాజేశ్ అనే గాయకుడు చేసిన అనుచిత వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మంగళవారం బాసరవ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. స్థానిక రైల్వేస్టేషన్ చౌరస్తాలో బైఠాయించి రాజేశ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అమ్మవారిని వ్యంగ్య పదాలతో దూషించిన రాజేశ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బాసర ఆలయ అర్చకులు, సిబ్బంది, ఆలయ తాత్కాలిక లేబర్ సొసైటీ సిబ్బంది సైతం అమ్మవారి ఆలయ ప్రధాన గోపురం ఎదుట ధర్నా చేశారు. గ్రామస్తులతో కలసి ర్యాలీగా వెళ్లి.. పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. రాజేశ్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజేశ్‌పై ఐపీíసీ 153, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేశ్ తెలిపారు. కాగా, సరస్వతీదేవిని దూషించిన హిందూ ద్రోహి రేంజర్ల రాజేశ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేయాలని వీహెచ్‌పీ రాష్ట్ర శాఖ ఓ ప్రకటనలో డిమాండ్ చేసింది. నరేశ్‌ను అరెస్ట్ చేసిన మహారాష్ట్ర పోలీసులు కాళేశ్వరం: హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఇప్పటికే వికారాబాద్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న హనుమకొండ జిల్లాకు చెందిన బైరి నరేశ్‌ను మహారాష్ట్ర పోలీసులు ఇదే తరహా కేసులో అరెస్టు చేశారు. అతన్ని గడ్చిరోలి జిల్లా సిరొంచ కోర్టులో మంగళవారం హాజరుపరచగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. గతేడాది డిసెంబర్ 24, 25 తేదీల్లో సిరొంచలో నిర్వహించిన కార్యక్రమంలో హిందూ దేవతలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడు. దీనిపై సిరొంచ, అహేరి తాలూకాల్లో అతనిపై కేసు నమోదైంది. హిందూ దేవుళ్లను తిడితే వీపులు పగలకొట్టండి ఎంపీ సోయం బాపూరావ్ బోథ్: హిందూ దేవుళ్లను తిట్టినా.. కించపరిచినా వారి వీపులు పగలకొట్టాలని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావ్ పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని దేవుల్‌నాయక్ తండాలో మంగళవారం నిర్వహించిన జగదాంబదేవి జాతరలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. -
బాసరలో పదో శతాబ్ది శాసనం
సాక్షి, హైదరాబాద్: సరస్వతీ దేవి కొలువుదీరిన బాసరలో కొత్త శాసనం వెలుగు చూసింది. ఇది 10వ శతాబ్దికి చెందినదని భావిస్తున్నారు. ఒక విశ్రాంతి వసతి, ఇళ్ల నిర్మాణం చేపట్టిన కార్యక్రమానికి చెందిన శాసనంగా పరిశోధకులు గుర్తించారు. బాసర గ్రామ సమీపంలోని దస్తగిరి గుట్ట మీద పెద్ద గుండుపై ఈ శాసనం చెక్కి ఉంది. స్థానిక యువకులు రమేశ్, యోగేశ్, ఆనంద్ తదితరుల ద్వారా సమాచారం అందుకున్న కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు బలగం రామ్మోహన్ దాన్ని పరిశీలించారు. కల్యాణి చాళుక్య రాజ్యస్థాపకుడైన రెండో తైలపుని కుమారుడు సత్యాశ్రయుని పేరు ఇందులో కనిపిస్తోందని, సత్యాశ్రయునికి ఇరవ బెడంగ, సట్టి, సట్టిగ అనే పేర్లు కూడా ఉన్నాయని శాసనాన్ని పరిష్కరించిన శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు. బసది, నివాసాల కోసం ఈ శాసనాన్ని వేయించినట్టు తెలుస్తోందని తెలిపారు. అందులో రామస్వామి అన్న పేరు కనిపిస్తోందని, అప్పట్లో ఆయన న్యాయాధికారి అయ్యుంటాడని భావిస్తున్నట్టు వెల్లడించారు. దిగువన త్రిశూలం గుర్తు ఉన్నందున, ఆ రాజు శైవ ఆరాధకుడై ఉంటాడని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. -
అక్షరాలకు ఆది.. అమ్మ సన్నిధి
ఆధ్యాత్మికతల నెలవు.. వేద పారాయణాల నిలయం.. అన్నార్తుల ఆకలి తీర్చే అన్నదాన క్షేత్రం.. వేలాది చిన్నారులకు జ్ఞాన వికాసం పంచుతున్న అక్షరాభ్యాస కేంద్రం.. భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారం మహిమాన్విత క్షేత్రం సిద్దిపేట జిల్లా వర్గల్ శంభుని కొండపై కొలువు దీరిన శ్రీవిద్యా సరస్వతీ దేవి సన్నిధానం. ఈ నెల 30న గురువారం వసంత పంచమి మహోత్సవ సంబరాలకు ముస్తాబైంది. సకల విద్యలకు మూలమైన శ్రీసరస్వతి మాత ఆవిర్భవించిన రోజు వసంతపంచమి (శ్రీపంచమి) మహోత్సవం సందర్భంగా వర్గల్ క్షేత్రం విశేషాల ప్రత్యేక కథనం. సాక్షి, వర్గల్(గజ్వేల్): వసంత పంచమి మహోత్సవం కోసం ముస్తాబైన వర్గల్ శ్రీవిద్యాసరస్వతి క్షేత్రం విద్యుత్ దివ్వెల వరుసలతో కాంతులీనుతున్నది. గురువారం పర్వదినం పురస్కరించుకుని క్షేత్రాన్ని విద్యుత్ దీపాల వరుసలతో తీర్చిదిద్దారు. అక్షరాభ్యాస మండపం వద్ద విద్యుత్ దీపాలను అమ్మవారి వివిధ అలంకారాల రూపంలో అమర్చారు. క్షేత్రాన్ని శోభాయమానంగా అలంకరించారు. ఉత్సవ శోభను నింపారు. సకల దేవతలు సంచరించిన పుణ్యస్థలం.. మహాత్ములు నడయాడిన ప్రదేశం, మునులు, తపోధనులు తపమాచరించిన మహిమాన్విత ప్రాంతం..సప్త స్వరాల గుండు పక్కన.. స్వయంభువుగా మహదేవుడు వెలసిన శంభుని కొండ శ్రీవిద్యా సరస్వతి ఆలయానికి నెలవైంది. ప్రముఖ పంచాంగకర్త యాయవరం చంద్రశేఖర సిద్ధాంతి సంకల్పం, సత్యపథం సేవాసమితి సహకారంతో 1989లో వసంత పంచమి రోజున ఆలయ నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. 1992లో పుష్పగిరి పీఠాధిపతి శ్రీవిద్యా నృసింహ్మ భారతీ స్వామి వారు ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. నాటి నుంచి తేజోమయమైన అమ్మవారు తన చెంత చేరిన భక్తులను కటాక్షిస్తూ. చిన్నారులకు అక్షర జ్ఞానకాంతులు పంచుతూ, భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా విలసిల్లుతున్నది. విశేష భక్త జనాధరణతో రెండో బాసరగా వినుతికెక్కింది. అరుదైన శనీశ్వరాలయం... వర్గల్ శ్రీవిద్యాసరస్వతి క్షేత్రం అనేక ఆలయాల సంగమం. నవగ్రహాల్లో అతి కీలకంగా పరిగణించే శనీశ్వరుని ఆలయాలు దేశంలోనే అరుదు. తెలంగాణ ప్రాంత భక్తులకు చేరువగా వర్గల్ అమ్మవారి ఆలయం దిగువన శనీశ్వరాలయం నిర్మితమైంది. శ్రీలక్ష్మీ గణపతి ఆలయం.. అమ్మవారి సన్నిధానం ఎడమ వైపు కొండపైన శ్రీలక్ష్మీ గణపతి ఆలయం నిర్మితమైంది. 2001లో కంచి కామకోటి పీఠాధిపతి శంకర జయేంద్ర సరస్వతి స్వామివారు ఈ ఆలయంలో శ్రీలక్ష్మీగణపతి విగ్రహం ప్రతిష్ఠించారు. ఇక్కడి శంభులింగేశ్వరుడి విగ్రహం స్వయంభూగా ప్రసిద్ధి. ఈ పురాతన ఆలయంలో 700 ఏళ్ల క్రితం నుంచే పూజలు జరిగినట్లు చరిత్ర చెబుతున్నది. ఉత్సవాల తోరణం.. వర్గల్ క్షేత్రం నిత్య ఉత్సవాల తోరణం. ప్రతి నిత్యం అమ్మవారి సన్నిధిలో విశేష పూజలు, కుంకుమార్చనలు కొనసాగుతాయి. ప్రతినెల అమ్మవారి జన్మనక్షత్రం మూలా నక్షత్రం రోజున విశేష అర్చనలు, చండీ హోమం నేత్రపర్వంగా జరుగుతాయి. ప్రతి మాఘ శుద్ధ త్రయోదశి రోజున దేవాలయ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు, చండీ హోమం జరుగుతుంది. ప్రతి సంవత్సరం వినాయక నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఆశ్వియుజ మాసంలో అమ్మవారి నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. వసంతపంచమి మహోత్సవం శ్రీవిద్యా సరస్వతి అమ్మవారి సన్నిధిలో మాఘ మాసంలో వసంత పంచమి మహోత్సవం జరుగుతుంది. మాఘ శుద్ధ పంచమి రోజున వసంత పంచమి (శ్రీపంచమి) సందర్భంగా విశేష పంచామృతాభిషేకం, చండీ హోమం, లక్ష పుష్పార్చన, 56 రకముల భోగాలతో నివేదన, విద్యా జ్యోతి దర్శనం తదితర కార్యక్రమాలు నేత్రపర్వం చేస్తాయి. అమ్మవారు వజ్ర వైఢూర్యాలు పొదిగిన స్వర్ణకిరీటంతో భక్తులను కటాక్షిస్తారు. ఈ విశేషోత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. చిన్నారులకు పెద్ద సంఖ్యలో అక్షరాభ్యాసాలు జరుగుతాయి. వేద పాఠశాల వేదవిద్య పరిరక్షణ, సనాతన వారసత్వ సంపదలైన వేదాలను భావి తరాలకు అందించాలనే çసంకల్పంతో అమ్మవారి సన్నిధిలో 1999 లో పుష్పగిరి పీఠాధిపతి శ్రీవిద్యా నృసింహ భారతి స్వామివారు శ్రీ శారదా వైదిక స్మార్త విద్యాలయాన్ని ప్రారంభించారు. ఉపనయం జరిగిన 8 నుంచి 12 సంవత్సరాల లోపు వయస్సు గల బ్రాహ్మణ పిల్లలకు ఇక్కడ పంచదశకర్మలు నేర్పుతారు. నిత్యాన్నదానం.. ప్రతి భక్తునికి అమ్మవారి మహా ప్రసాదం అందించాలనే సంకల్పంతో 2001లో అన్నదాన సత్రాన్ని ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం 8,00,000 మంది భక్తులకు ఇక్కడ అన్నదానం జరుగుతున్నది. టవర్ లిఫ్ట్.. ఎత్తైన కొండ మీద కొలువుదీరిన శ్రీసరస్వతీ మాతను దర్శించుకునేందుకు మెట్ల మార్గంలో చేరుకోలేని వికలాంగులు, వయో వృద్ధులు, అనారోగ్య పీడితులకు ఉపయుక్తంగా టవర్ లిఫ్ట్ ఏర్పాటు చేసారు. లిఫ్ట్ నుంచి ఆలయ గర్భగుడి వరకు చేరేందుకు వీల్ ఛైర్లు సమకూర్చారు. భక్తులు బస చేసేందుకు సత్రాలు క్షేత్ర సందర్శనకు వచ్చే యాత్రికులు బసచేసేందుకు సత్రాలు ఉన్నాయి. వీటికి అదనంగా కల్యాణ మండపం, శారదీయమ్, తదితర అనేక విశాలమైన భవనాలు వందలాది యాత్రికులు బస చేసేందుకు అందుబాటులో ఉన్నాయి. తాగునీటి వసతితోపాటు, మరుగుదొడ్లు, మూత్ర శాలలు ఉన్నాయి. వాహనాల పార్కింగ్‌కు సదుపాయం ఉన్నది. ఆకట్టుకునే వీణాపాణి విగ్రహం.. కొండ మీద భక్తులు వెళ్లే మెట్ల మార్గం పక్కన ఎత్తైన వీణాపాణి విగ్రహం టూరిస్టులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆలయ ప్రధాన ద్వారం ముందర వాటర్ ఫౌంటేన్, స్వాగత మహా కలశం ఆకట్టుకుంటాయి. ఆహ్లాదం పంచే చిల్డ్రన్ పార్క్ శ్రీసరస్వతి క్షేత్రానికి వచ్చిన భక్తులు, చిన్నారులు సేద తీరేందుకు పర్యాటక శాఖ చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు చేసింది. కార్పెట్ గ్రాస్, ఆర్నమెంటల్ ప్లాంట్స్, చిన్నారుల ఉయ్యాలలు, ఇతర ఆటల సామాగ్రితో ఆహ్లాదకరంగా ఈ పార్క్‌ను తీర్చిదిద్దారు. అక్షర స్వీకరాల కోసం మహామండపం చదువుల తల్లి సన్నిధిలో వేలాదిగా చిన్నారుల అక్షర స్వీకారాలు జరుగుతాయి. ప్రత్యేకంగా విశేష పర్వదినాల్లో, సెలవు రోజులలో రద్దీ మరింత పెరుగుతుంది. ఈ రద్దీని తట్టుకునేందుకు భక్తులకు సౌకర్యవంతంగా భక్తజన సహకారంతో మూడంతస్తుల మహామండపం నిర్మాణం చేపట్టారు. దాదాపు రూ. 4 కోట్ల పైచిలుకు వ్యయంతో కొనసాగుతున్న ఈ నిర్మాణం ఇప్పటికే 60 శాతం మేర పూర్తయింది. వసంత పంచమి సందర్భంగా అందులోనే అక్షరాభ్యాసం, లక్షపుష్పార్చనాది కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇలా చేరుకోవాలి.. వర్గల్ క్షేత్రానికి ఆర్టీసీ సౌకర్యాలు ఉన్నాయి. సికిందరాబాద్ గురుద్వార్ నుంచి ఉదయం 8.15 గంటలకు, 10 గంటలకు, మద్యాహ్నం 12.15 గంటలకు, సాయంత్రం 4.30 గంటలకు బస్సులు వర్గల్ క్షేత్రానికి వచ్చి వెళతాయి. ఇవే కాకుండా సికిందరాబాద్ నుంచి గజ్వేల్, సిద్దిపేట, కరీంనగర్ రూట్లో వెళ్లే ఆర్టీసీ బస్సులలో వర్గల్ క్రాస్‌రోడ్డు వరకు వచ్చి, అక్కడి నుంచి ఆటోలలో క్షేత్రానికి చేరుకోవచ్చు. -
లడ్డూ ప్రసాదంలో పురుగుల ఘటనపై అధికారుల ఆరా
-
సరస్వతీ మాతకు ముక్కుపుడక కానుక
బాసర సరస్వతీ అమ్మవారికి భక్తులు ముక్కుపుడకను కానుకగా అందజేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన సుద్దాల శ్రీనివాస్, లావణ్య దంపతులు శుక్రవారం రూ.40వేల విలువైన బంగారు ముక్కుపుడకను ఆలయంలో అందజేశారు. ఆలయ అధికారులు వారితో ప్రత్యేక పూజలు చేయించారు. -
నందివనపర్తిలో 101 నంది విగ్రహాలు
గ్రామం… చుట్టూ ఎక్కడచూసినా అవే.. ఈ పల్లెలోఆలయాలూ ఎక్కువే.. ఆ ఊరు ఆలయాలకు నెలవుగా మారింది.. ఒకటికాదు.. రెండు కాదు పదుల సంఖ్యలో అక్కడ గుళ్లు ఉన్నాయి. ఆదిదేవుడైన పరమశివుడు.. చదువులతల్లి సరస్వతీదేవి.. ఊరిని కాపాడే ముత్యాలమ్మ.. గ్రామాన్ని పరిరక్షించేలా ఊరిచుట్టూ నంది విగ్రహాలు.. ఇలా దేవుళ్లు కొలువుదీరిన ఆ పల్లె ఆధ్యాత్మిక పరిమళాలు పంచుతోంది. అదే యాచారం మండలంలోని నందివనపర్తి. ఈ గ్రామానికి ఘనమైన చరిత్ర ఉంది. 101 నంది విగ్రహాలు వెలిసినందునే ఈ ఊరికి నందివనపర్తి అని పేరు వచ్చిందని పూర్వీకులు చెబుతారు. ఆలయాలకు నిలయమైన ఈ పల్లె కథనమే ఆదివారం ప్రత్యేకం.. - యాచారం నందివనపర్తి గ్రామానికి ఘనమైన చరిత్ర ఉంది. గ్రామం చుట్టూ 101 నంది విగ్రహాలు వెలిసినందున నందివనపర్తిగా పేరు వచ్చిందంటారు. గ్రామంలో అక్కన్నమాదన్నల కాలంలో నిర్మించిన శివాలయం, చెన్నకేశవ ఆలయం, సోమనాథ క్షేత్రం, నందీశ్వరాలయం, రామలింగేశ్వరస్వామి ఆలయం, ముత్యాలమ్మ దేవాలయం ఉన్నాయి. పరమేశ్వరుడు స్వయంభూగా వెలియడంతో శివాల యంలోని లింగం యేటా కొద్దికొద్దిగా పెరుగుతూ వస్తోందని భక్తుల విశ్వాసం. గ్రామానికి ఉత్తరాన సోమనాథ దేవా లయం కొండల్లో ఉండడంతో అప్పట్లో పార్వతీపరమేశ్వరులు మారువేషంలో చుట్టుపక్కల గ్రామాల్లో సం చరించి వ్యవసాయ బావుల్లో జలకాలాడేవారని చెబుతారు. సరస్వతి అమ్మవారు చదువుల తల్లిగా, కొలువుల కల్పవల్లిగా విరాజిల్లుతోంది. అభిషేకాలకు తరించి.. వర్షాలు కురిపించి.. శివాలయంలోని లింగానికి 101 బిందెలతో జలాభిషేకం చేస్తే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని గ్రామస్తుల నమ్మకం. అప్పట్లో ఆర్యబట్ట అనే ఇంజినీర్ ఈ ప్రాంతం లో పర్యటిస్తూ గ్రా మం పడమర దిక్కు న నందిచెరువును, ఆ తర్వాత శివాల యాన్ని నిర్మించినట్లు పెద్దలు పేర్కొంటున్నారు. అప్పట్లో మల యాళ స్వామి ప్రప్రథమంగా ఈ శివాలయంలో గీతాయజ్ఞం ప్రారంభించి స్వామివారి అనుగ్రహంతో సమృద్ధిగా వర్షాలు కురిపించారని చెబుతారు. ప్రత్యేక ఆకర్షణగా ఏడడుగుల నంది విగ్రహం.. శివుడి మహిమలతో 150 ఏళ్ల క్రితమే గ్రామంలో 101 నంది విగ్రహాలు వెలిసాయని, శివాలయానికి తూర్పున గ్రామప్రధాన దారికి ముందు వెలిసిన నంది కుక్క నందిగా అవతరించి గ్రామాన్ని కంటికి రెప్పలా కాపాడుతోందని గ్రామస్తుల నమ్మకం. మిగతా నందులు గ్రామం చుట్టూ వ్యవసాయ పొలాల్లో ఉండగా, మరికొన్ని ఔరంగాజేబు దండయాత్రల కాలంలో ధ్వంసమయ్యాయి. రైతులు పంటల సాగు, ధాన్యం ఇంటికి తెచ్చుకునే సమయాల్లో పొలాల్లో ఉన్న నందులకు పూజలు నిర్వహిస్తుంటారు. గ్రామానికి పడమర దిక్కున నందీశ్వరాలయంలో ఏడడుగుల నంది విగ్రహం గంభీరంగా దర్శనమిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విశేష సంపదలున్న ఓంకారేశ్వరుడు.. గ్రామంలోని ఓంకారేశ్వరుడికి విశేష సంపదలున్నాయి. 1,400 ఎకరాలు ఓంకారేశ్వరుడికి సొంతం. వందేళ్ల క్రితం నల్లగొండ జిల్లా గుడిపల్లికి చెందిన లింగయ్య యోగానంద స్వామిగా మారి నగరంలోని ప్రస్తుత సెంట్రల్ లైబ్రరీ పక్కన శివాలయం నిర్మించారని, ఆ తర్వాత రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మరో 19 ఆలయాలను నిర్మించారని, 21వ ఆలయంగా నందివనపర్తిలో ఓంకారేశ్వరాలయాన్ని నిర్మించినట్లు చెబుతుంటారు. ఈ దేవాలయాన్ని నిర్మించిన యోగానందుడు ఇక్కడే జీవసమాధి అయ్యాడట. 1900 సంవత్సరంలోనే అప్పట్లో ప్రముఖ శిల్పి కాశరామన్న పర్యవేక్షణలో ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయంలో ఓంకారేశ్వరుడు, రామచంద్రస్వామి, దత్తాత్రేయుడు తదితర దేవాలయాలున్నాయి. ఈ ఆలయాల్లో రూ. కోట్ల విలువ జేసే పంచలోహ విగ్రహాలు కొలువుదీరాయి. సరస్వతీ ఆలయంతో ఖ్యాతి.. గొప్ప చరిత్ర కలిగిన నందివనపర్తి పూర్వవైభవానికి గ్రామస్తులు సంకల్పించారు. పూర్వ విద్యార్థుల కృషితో హంపీ పీ ఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతి స్వామిజీ పర్యవేక్షణలో జ్ఞాన సరస్వతి దేవాలయ నిర్మాణం జరుగుతోంది. నిత్యం ఈ దేవాలయంలో చిన్నారులకు ఉచితంగా అక్షరాభ్యాసం చేస్తున్నారు. ఇక్కడ వెలిసిన అమ్మవారికి మొక్కితే నిరుద్యోగులకు కొలువులు ఖాయమన్న నమ్మకం ఏర్పడింది. ఏళ్ల క్రితం నిర్మించిన ఓంకారేశ్వరాలయం పునర్నిర్మాణం సాగుతోంది. -
అమ్మవారికి శఠగోపం
బాసర : ‘లక్ష్మీ కొందరిది.. సరస్వతీ దేవి అందరిదీ’ అన్న నానుడిని బాసరలోని వ్యాపారులు రుజువు చేస్తున్నారు. సరస్వతీ దేవి అమ్మవారి ఆశీస్సులతో బుద్ధి జ్ఞానం వస్తుందనుకుంటే.. ఈ వ్యాపారులకు మాత్రం ధనలక్ష్మీ కటాక్షం ‘లాభి’స్తోంది. అమ్మవారి పేరిట ఏటా అరకోటి శఠగోపం పెడుతున్నా.. ఆలయాధికారులు పట్టించుకున్న దాఖ లాలు లేవు. బడావ్యాపార వేత్తలు బినామీ పేర్లతో ఆలయ టెండర్లలో పాల్గొని ఎనిమిదేళ్లుగా షాపులు నిర్వహిస్తున్న వైనంపై సాక్షి కథనం.. బాసర : తెలంగాణ రాష్ర్టంలోనే పేరుగాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరలో కొలువుదీరిన శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి క్షేత్రం దినదినం అభివృద్ధి చెందుతోంది. అమ్మవారికి మొక్కులు సమర్పించడానికి ఏటా ఇక్కడికి మన రాష్ట్రంతోపాటే ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా దేశవిదేశాల నుంచి వస్తుంటారు. అమ్మవారి చెంత చిన్నారులకు అక్షర శ్రీకార పూజలు జరిపిస్తే విద్యావంతులు అవుతారని వారి నమ్మకం. ఇందులోభాగంగానే.. భక్తులకు పూజా సామగ్రి తదితర వస్తువులను అందుబాటులో ఉండాలని దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో దుకాణ సముదాయం ఏర్పాటు చేసింది. ఏటా ఆలయాధికారులు ఈ దుకాణాలకు బహిరంగ వేలం పాట నిర్వహిస్తుంటారు. ఆలయ పరిధిలోని దుకాణాలు, పువ్వుల విక్రయాలు, అమ్మవారి చీరెలు, కుంకుమార్చన, పూజా సామగ్రి, కూల్‌డ్రింక్స్, జ్యూస్ సెంటర్లు, హోటళ్లు, కొబ్బరి చిప్పలు పోగు చేసుకోవడం, వెహికిల్ పార్కింగ్ సదుపాయం, పాదరక్షలు భద్రపరచడం, భక్తుల సామగ్రి భద్రపరిచేందుకు లాకర్లు, గోదావరి నది తీరాన పువ్వుల దుకాణాలకు సంబంధించి ఏటా బహిరంగ వేలం పాట నిర్వహిస్తారు. టెండర్లలో ఎవరైనా పాల్గొనే అవకాశం ఉంది. అయితే.. ఎనిమిదేళ్లుగా బడా, చోట వ్యాపారులు అధికారులతో కుమ్మక్కై సుమారు అరకోటికి పైగా ఆదాయానికి గండికొట్టారు. ఏం జరిగిందంటే..! దుకాణాల సముదాయం కోసం వచ్చే వ్యాపారులకు బహిరంగ వేలం పాటలో పాల్గొనే ముందు ఆలయ అధికారులు దేవాదాయ, ధర్మాదాయ శాఖ నిబంధనలను ముందుగా వినిపిస్తారు. ఓ దుకానాన్ని టెండర్ నిర్వహించిన తర్వాత వచ్చే ఏడాది 30 శాతం కంటే ఎక్కువ ధరకు వేలం పాట పాడిన వారికే దుకాణాలను అనుమతిస్తారు. వేలం పాటలో కొంత మొత్తాన్ని చెల్లించి మిగతా మొత్తాన్ని ఏదైనా జాతీయ గుర్తింపు పొందిన బ్యాంకు నుంచి గ్యారెంటీ ఇవ్వాలి. కానీ.. ఇక్కడ అలా జరగడం లేదు. 2005లో పువ్వుల దుకాణానికి ఆలయ అధికారులు వేలం పాట నిర్వహించగా.. రూ.10 లక్షలకు ఓ వ్యాపారి దక్కించుకున్నాడు. అనంతరం 2009లో అదే పువ్వుల దుకాణాన్ని అదే వ్యాపారికి రూ.4 లక్షల 75 వేలకు అంటగట్టారు ఆలయాధికారులు. దీంతో రూ.5 లక్షల 25 వేల వరకు నష్టం వాటిల్లింది. సదరు వ్యాపారి ఆ డబ్బులను కూడా పూర్తిస్థాయిలో చెల్లించకపోగా.. 2010లో బినామీ పేర్లతో తన అనుచరులతో రూ.11 లక్షల 81 వేలకు దక్కించుకున్నాడు. ఈ పువ్వుల దుకాణానికి సంబంధించే ఇలా ఉంటే.. మిగతా 50 దుకాణాల వేలం పాట ఎలా నడుస్తోందో అర్థం చేసుకోవచ్చు. అధికారుల చర్యలేవీ.. బహిరంగం వేలం పాటలో పాల్గొన్న వ్యాపారులకు ఆలయ అధికారుల అండదండలు ఉండడంతో ఇప్పటి వరకు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. డబ్బులు పూర్తిస్థాయిలో చెల్లించకపోయినా పదేపదే ఆ వ్యాపారులకే కేటాయించి విమర్శలకు తావిస్తోంది. 2006-07 సంవత్సరానికి సంబంధించి అన్ని దుకాణాలకు వేలం పాట నిర్వహించగా.. రూ.8 లక్షల 58 వేల 532 ఇంకా చెల్లించాల్సి ఉంది. 2007-08లో రూ.7 లక్షల 25 వేల 220, 2008-09లో రూ.18 లక్షల 52 వేల 25, 2009-10లో ఆగస్టు వరకు రూ. 30 లక్షల 32 వేల 525 బకాయిలున్నాయి. మొత్తంగా రూ.64 లక్షల 68 వేల 302 వరకు వ్యాపారులు చెల్లించాల్సి ఉంది. అలాగే 2010-11 వరకు రూ.11 లక్షల 94 వేల 135, 2011-12 రూ.9 లక్షల 48 వేల 501, 2012 సంవత్సరానికి సంబంధించి రూ.11లక్షల 60 వేలు రావాల్సి ఉంది. ఇప్పటి వరకు ఆలయాధికారులు టెండర్‌దారులకు దుకాణాల ఆదాయాలపై ఇప్పటివరకు రికవరీ కూడా చేయలేదు. దేవాదాయ శాఖ నిబంధనలు కఠినంగా ఉన్నా.. అధికారుల వైఖరితో ఆలయ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. ఇప్పటికైనా దేవాదాయ శాఖ కమిషనర్ దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చర్యలు తీసుకుంటున్నాం.. - ముత్యాలరావు, ఆలయ ఈవో వేలం పాట నిర్వహించిన దుకాణాల సముదాయానికి సంబంధించి బకాయిలు ఎనిమిదేళ్లుగా సుమారు అరకోటికి పైగా రావాల్సి ఉన్న మాట వాస్తవమే. వ్యాపారులకు ఇప్పటికే రెండు మూడు సార్లు నోటీసులు జారీ చేశాం. దేవాదాయ, ధర్మాదాయ శాఖ నిబంధనల ప్రకారం రెండు రోజుల్లో కోర్టు నుంచి ఆదేశాలు తీసుకుని వ్యాపారులకు నోటీసులు జారీ చేస్తాం. -
హంస వాహనంపై అమ్మవారు
-
హంస వాహనంపై అమ్మవారు
తిరుచానూరు బ్రహ్మోత్సవాల్లోగురువారం రాత్రి అలమేలు మంగమ్మ సరస్వతీ దేవి రూపంలో హంస వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం పెద్దశేష వాహనంపై ఊరేగారు. తిరుచానూరు : పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన గురువారం ఉదయం పెద్దశేష వాహనసేవ వైభవంగా జరిగింది. వైకుంఠనాథుని అలంకరణలో అమ్మవారు పెద్దశేషునిపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను ఆశీర్వదించారు. ఇందులో భాగంగా అమ్మవారిని వేకువజామున 4 గంటలకు సుప్రభాతంతో మేల్కొలిపి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. ఉదయం 7 గంటలకు అమ్మవారిని సన్నిధి నుంచి వేంచేపుగా వాహనమండపానికి తీసుకొచ్చి పెద్దశేష వాహనంపై కొలువుదీర్చారు. పట్టుపీతాంబర, వజ్రవైఢూర్య ఆభరణాలతో వైకుంఠనాథునిగా అలంకరించారు. అనంతరం 8 గంటలకు భక్తుల కోలాటం, మంగళవాయిద్యాలు, జియ్యర్ స్వాముల ప్రబంధ పారాయణం నడుమ అమ్మవారు తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. సాయంత్రం జరిగిన హంస వాహనసేవలో అమ్మవారు సరస్వతీదేవి అలంకరణలో భక్తులను కటాక్షించారు. కార్యక్రమంలో టీటీడీ ఈవో ఎంజీ.గోపాల్, తిరుపతి జేఈవో పోలా భాస్కర్, టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఆలయ స్పెషల్‌గ్రేడ్ డెప్యూటీ ఈవో చెంచులక్ష్మి, ఎస్ఈ రామచంద్రారెడ్డి, ఏఈవో నాగరత్న, సూపరింటెండెంట్లు శేషాద్రిగిరి, వరప్రసాద్ పాల్గొన్నారు. పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడవ రోజైన శుక్రవారం ఉదయం 8 గంటలకు ముత్యపుపందిరి వాహనం, రాత్రి 8గంటలకు సింహవాహనంపై తిరువీధుల్లో పద్మావతి అమ్మవారు భక్తులను అనుగ్రహించనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో పద్మావతి అమ్మవారికి స్నపన తిరుమంజనం, సాయంత్రం 6 గంటలకు ఆస్థాన మండపంలో ఊంజల్‌సేవ జరుగుతాయి. తిరుచానూరు : శ్రీపద్మావతి అమ్మవారికి పలు రకాల ప్రసాదాలను నైవేద్యంగా అర్చకులు ని వేదిస్తారు. ప్రతిరోజూ తెల్లవారుజామున, ఉద యం, సాయంత్రం అమ్మవారికి ప్రసాదాలను నివేదిస్తారు. ఈ ప్రసాదాలను అమ్మవారి ఆల యంలోని పోటులో తయారుచేస్తారు. మొదటి నివేదన : అమ్మవారికి తెల్లవారుజామున మొదటి నివేదనకు దద్దోజనం(పెరుగన్నం), పులిహోర, వెన్ పొంగల్, చక్కెర పొంగలి, మాత్ర(తిరుగబాత పెట్టకుండా పెరుగు, వెన్నతో చేసిన అన్నం), లడ్డు, వడ, సీర(కేసరి) నైవేద్యంగా అమ్మ వారికి సమర్పిస్తారు. రెండో నివేదన ఉదయం 9గంటలకు నిర్వహించే రెండవ నివేదనలో పులిహోర, చక్కెర పొంగలి, వెన్ పొంగళ్, దద్దోజనాన్ని సమర్పిస్తారు. మూడో నివేదన సాయంత్రం 6.30గంటలకు నిర్వహించే మూ డవ నివేదనలో దద్దోజనం, పులిహోర, చక్కెర పొంగలి, మిరియాల పొంగలిని నైవేద్యంగా సమర్పిస్తారు. శుక్రవారం రోజు : శుక్రవారం వేకువజాము నిర్వహించే అభిషేకానికి వెన్పొంగళ్, లక్ష్మీపూజకు సీర, కల్యాణోత్సవానికి చక్కెర పొంగలి, పులిహోర, వెన్పొంగళ్, అప్పంను సమర్పిస్తారు. అలాగే కదంబం(కూరగాయలతో చేసిన అన్నం), పా యసం, మధ్యాహ్నం ఉద్యానవనంలో జరిగే అభిషేకానికి అమ్మవారికి కారం పులిహోరను నైవేద్యంగా సమర్పిస్తారు. తిరుప్పావడ సేవకు : ప్రతి గురువారం నిర్వహించే తిరుప్పావడ సేవకు లడ్డు, వడ, జిలేబి, మురుకు, దోసె, అప్పం సమర్పిస్తారు. ధనుర్మాసంలో.. ధనుర్మాసంలో అమ్మవారికి వెన్పొంగళ్, బెల్లం దోసె, సుఖీలను నైవేద్యంగా సమర్పిస్తారు. బ్రహ్మోత్సవంలో.. బ్రహ్మోత్సవంలో అన్ని ప్రసాదాలతో పాటు వాహన సేవ సమయంలో గంగుండ్ర మం డపం వద్ద అమ్మవారికి దోసెను నైవేద్యంగా సమర్పిస్తారు. పర్వదినాల్లో : పర్వ దినాల్లో ప్రత్యేకంగా క్షీరాన్నం(పాలు కలిపిన అన్నం), కొబ్బరి అన్నం, చిత్రాన్నం, వడపప్పు, సుండల్, పానకం, బాదుషా, మైసూర్పాకును నైవేద్యంగా సమర్పిస్తారు. -
సరస్వతీదేవిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ: పోటెత్తిన భక్తజనం
సాక్షి, విజయవాడ : సర్వలోకపావని.. జగన్మాత కనకదుర్గమ్మను సరస్వతీదేవి అలంకారంలో దర్శించుకునేందుకు అశేష భక్తజనవాహిని ఇంద్రకీలాద్రికి తరలివచ్చింది. ఎటుచూసినా జనం.. ఎక్కడ విన్నా దుర్గమ్మ నామస్మరణతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అమ్మ జన్మనక్షత్రమైన మూలానక్షత్రం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఇంద్రకీలాద్రి కళకళలాడింది. క్యూలైన్లు కిలోమీటర్ల కొద్దీ బారులు తీరాయి. రద్దీ దృష్ట్యా గురువారం వేకువజామున 1.45 గంటల నుంచే అమ్మ దర్శనానికి భక్తులను అనుమతించారు. బుధవారం అర్ధరాత్రి నుంచే క్యూలైన్లో వేచి ఉన్నవారు తొలి దర్శనం చేసుకుని పులకించిపోయూరు. రద్దీ గురువారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. ఉదయం గంటన్నరలోపే దర్శనం కాగా, సాయంత్రం నాలుగు గంటల సమయం పట్టింది. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయూయి. ఒకదశలో బొడ్డుబొమ్మ సెంటర్‌ను దాటాయి. రద్దీ ఎక్కువగా ఉండటంతో ముందుగా నిర్ణయించినట్టే అంతరాలయ దర్శనం రద్దుచే శారు. కేవలం ముఖమండప దర్శనం చేయించారు. టికెట్లు రద్దుచేసి భక్తులకు అన్ని క్యూల్లోనూ ఉచిత ప్రవేశం కల్పించారు. జోరువానను సైతం లెక్కచేయకుండా.. ఫైలిన్ తుపాను కారణంగా బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు జోరున వర్షం కురుస్తూనే ఉంది. భక్తులు వర్షాన్ని, చలిని సైతం లెక్కచేయకుండా దర్శనానికి వచ్చారు. ప్రముఖుల రాక రాష్ర్ట ప్రభుత్వం తరఫున దుర్గమ్మకు మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కె.పార్థసారథి పట్టువస్త్రాలు సమర్పించారు. రాష్ర్ట గిరిజన సంక్షేమశాఖ మంత్రి పసుపులేటి బాలరాజు, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సతీమణి రాధికారెడ్డి, సీపీ బత్తిన శ్రీనివాస్ దంపతులు, సినీ నటుడు రాజేంద్రప్రసాద్, దర్శకుడు అడ్డాల శ్రీను తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. మూడు విడతలుగా కుంకుమార్చన మూలానక్షత్రాన్ని పురస్కరించుకుని భవానీదీక్షా మండపంలో మూడు విడతలుగా కుంకుమార్చన జరిగింది. ఉభయదాతల రద్దీ ఎక్కువగా ఉండటంతో అధికారులు త్వరత్వరగా దర్శనం చేయించి పంపించేందుకు ప్రయత్నించారు. కొండపైకి వాహనాల అనుమతి రద్దు భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో గురువారం తెల్లవారుజాము నుంచి కొండపైకి వీఐపీ, మీడియా వాహనాలను అనుమతించలేదు. దేవస్థానం రెండు బస్సులను కూడా నిలిపివేయడంతో వృద్ధులు, వికలాంగులు కొండపైకి చేరుకునేందుకు ఇబ్బందులు పడ్డారు. ఎన్సీసీ వలంటీర్ల సహాయంతో ఆలయూనికి చేరుకున్నారు. ఒకానొక సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం, దర్శనానికి మూడు గంటల సమయం పట్టడంతో పలువురు భక్తులు నీరసించి క్యూలైన్లోనే కుప్పకూలిపోయూరు. సీపీ శ్రీనివాసులు, సబ్ కలెక్టర్ హరిచందన, ఈవో ప్రభాకర శ్రీనివాస్ తదితరులు ఎప్పటికప్పుడు ఆలయంలో కలియ తిరుగుతూ ఏర్పాట్లు పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి భార్య రాకతో పోలీసుల హల్చల్ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సతీమణి రాధికారెడ్డి రాకతో పోలీసులు హడావుడి చేశారు. జాతీయ రహదారిపై రాజగోపురం వద్ద అరగంట సేపు వాహనాలు నిలిపివేయడంతో ప్రయూణికులు ఇబ్బందులు పడ్డారు. వృద్ధులు, వికలాంగులు నడుచుకుంటూ వస్తున్నా పట్టించుకోని అధికారులు ముఖ్యమంత్రి సతీమణి వాహనాన్ని రాజగోపురం వరకు తీసుకొచ్చి ప్రభుభక్తిని చాటుకున్నారు.