అమ్మవారికి శఠగోపం | Conduct a public auction to the shops | Sakshi
Sakshi News home page

అమ్మవారికి శఠగోపం

Published Sat, Nov 29 2014 2:32 AM | Last Updated on Sat, Sep 2 2017 5:17 PM

Conduct a public auction to the shops

బాసర : ‘లక్ష్మీ కొందరిది.. సరస్వతీ దేవి అందరిదీ’ అన్న నానుడిని బాసరలోని వ్యాపారులు రుజువు చేస్తున్నారు. సరస్వతీ దేవి అమ్మవారి ఆశీస్సులతో బుద్ధి జ్ఞానం వస్తుందనుకుంటే.. ఈ వ్యాపారులకు మాత్రం ధనలక్ష్మీ కటాక్షం ‘లాభి’స్తోంది. అమ్మవారి పేరిట ఏటా అరకోటి శఠగోపం పెడుతున్నా.. ఆలయాధికారులు పట్టించుకున్న దాఖ లాలు లేవు. బడావ్యాపార వేత్తలు బినామీ పేర్లతో ఆలయ టెండర్లలో పాల్గొని ఎనిమిదేళ్లుగా షాపులు నిర్వహిస్తున్న వైనంపై సాక్షి కథనం..

బాసర : తెలంగాణ రాష్ర్టంలోనే పేరుగాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరలో కొలువుదీరిన శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి క్షేత్రం దినదినం అభివృద్ధి చెందుతోంది. అమ్మవారికి మొక్కులు సమర్పించడానికి ఏటా ఇక్కడికి మన రాష్ట్రంతోపాటే ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా దేశవిదేశాల నుంచి వస్తుంటారు. అమ్మవారి చెంత చిన్నారులకు అక్షర శ్రీకార పూజలు జరిపిస్తే విద్యావంతులు అవుతారని వారి నమ్మకం. ఇందులోభాగంగానే.. భక్తులకు పూజా సామగ్రి తదితర వస్తువులను అందుబాటులో ఉండాలని దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో దుకాణ సముదాయం ఏర్పాటు చేసింది.

ఏటా ఆలయాధికారులు ఈ దుకాణాలకు బహిరంగ వేలం పాట నిర్వహిస్తుంటారు. ఆలయ పరిధిలోని దుకాణాలు, పువ్వుల విక్రయాలు, అమ్మవారి చీరెలు, కుంకుమార్చన, పూజా సామగ్రి, కూల్‌డ్రింక్స్, జ్యూస్ సెంటర్లు, హోటళ్లు, కొబ్బరి చిప్పలు పోగు చేసుకోవడం, వెహికిల్ పార్కింగ్ సదుపాయం, పాదరక్షలు భద్రపరచడం, భక్తుల సామగ్రి భద్రపరిచేందుకు లాకర్లు, గోదావరి నది తీరాన పువ్వుల దుకాణాలకు సంబంధించి ఏటా బహిరంగ వేలం పాట నిర్వహిస్తారు. టెండర్లలో ఎవరైనా పాల్గొనే అవకాశం ఉంది. అయితే.. ఎనిమిదేళ్లుగా బడా, చోట వ్యాపారులు అధికారులతో కుమ్మక్కై సుమారు అరకోటికి పైగా ఆదాయానికి గండికొట్టారు.

ఏం జరిగిందంటే..!
దుకాణాల సముదాయం కోసం వచ్చే వ్యాపారులకు బహిరంగ వేలం పాటలో పాల్గొనే ముందు ఆలయ అధికారులు దేవాదాయ, ధర్మాదాయ శాఖ నిబంధనలను ముందుగా వినిపిస్తారు. ఓ దుకానాన్ని టెండర్ నిర్వహించిన తర్వాత వచ్చే ఏడాది 30 శాతం కంటే ఎక్కువ ధరకు వేలం పాట పాడిన వారికే దుకాణాలను అనుమతిస్తారు. వేలం పాటలో కొంత మొత్తాన్ని చెల్లించి మిగతా మొత్తాన్ని ఏదైనా జాతీయ గుర్తింపు పొందిన బ్యాంకు నుంచి గ్యారెంటీ ఇవ్వాలి. కానీ.. ఇక్కడ అలా జరగడం లేదు. 2005లో పువ్వుల దుకాణానికి ఆలయ అధికారులు వేలం పాట నిర్వహించగా.. రూ.10 లక్షలకు ఓ వ్యాపారి దక్కించుకున్నాడు.

అనంతరం 2009లో అదే పువ్వుల దుకాణాన్ని అదే వ్యాపారికి రూ.4 లక్షల 75 వేలకు అంటగట్టారు ఆలయాధికారులు. దీంతో రూ.5 లక్షల 25 వేల వరకు నష్టం వాటిల్లింది. సదరు వ్యాపారి ఆ డబ్బులను కూడా పూర్తిస్థాయిలో చెల్లించకపోగా.. 2010లో బినామీ పేర్లతో తన అనుచరులతో రూ.11 లక్షల 81 వేలకు దక్కించుకున్నాడు. ఈ పువ్వుల దుకాణానికి సంబంధించే ఇలా ఉంటే.. మిగతా 50 దుకాణాల వేలం పాట ఎలా నడుస్తోందో అర్థం చేసుకోవచ్చు.

అధికారుల చర్యలేవీ..
బహిరంగం వేలం పాటలో పాల్గొన్న వ్యాపారులకు ఆలయ అధికారుల అండదండలు ఉండడంతో ఇప్పటి వరకు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. డబ్బులు పూర్తిస్థాయిలో చెల్లించకపోయినా పదేపదే ఆ వ్యాపారులకే కేటాయించి విమర్శలకు తావిస్తోంది. 2006-07 సంవత్సరానికి సంబంధించి అన్ని దుకాణాలకు వేలం పాట నిర్వహించగా.. రూ.8 లక్షల 58 వేల 532 ఇంకా చెల్లించాల్సి ఉంది. 2007-08లో రూ.7 లక్షల 25 వేల 220, 2008-09లో రూ.18 లక్షల 52 వేల 25, 2009-10లో ఆగస్టు వరకు రూ. 30 లక్షల 32 వేల 525 బకాయిలున్నాయి. మొత్తంగా రూ.64 లక్షల 68 వేల 302 వరకు వ్యాపారులు చెల్లించాల్సి ఉంది.

అలాగే 2010-11 వరకు రూ.11 లక్షల 94 వేల 135, 2011-12 రూ.9 లక్షల 48 వేల 501, 2012 సంవత్సరానికి సంబంధించి రూ.11లక్షల 60 వేలు రావాల్సి ఉంది. ఇప్పటి వరకు ఆలయాధికారులు  టెండర్‌దారులకు దుకాణాల ఆదాయాలపై ఇప్పటివరకు రికవరీ కూడా చేయలేదు. దేవాదాయ శాఖ నిబంధనలు కఠినంగా ఉన్నా.. అధికారుల వైఖరితో ఆలయ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. ఇప్పటికైనా దేవాదాయ శాఖ కమిషనర్ దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 చర్యలు తీసుకుంటున్నాం..
 - ముత్యాలరావు, ఆలయ ఈవో

వేలం పాట నిర్వహించిన దుకాణాల సముదాయానికి సంబంధించి బకాయిలు ఎనిమిదేళ్లుగా సుమారు అరకోటికి పైగా రావాల్సి ఉన్న మాట వాస్తవమే. వ్యాపారులకు ఇప్పటికే రెండు మూడు సార్లు నోటీసులు జారీ చేశాం. దేవాదాయ, ధర్మాదాయ శాఖ నిబంధనల ప్రకారం రెండు రోజుల్లో కోర్టు నుంచి ఆదేశాలు తీసుకుని వ్యాపారులకు నోటీసులు జారీ చేస్తాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement