మంథని: గోదావరి పరీవాహక తీర ప్రాంత కేంద్రాలను పర్యాటక క్షేత్రాలుగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గం (ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా)లో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో గోదావరి నిత్యం నిండుకుండలా ఉంటోంది. అంతేకాకుండా తీరం వెంట పచ్చని అడవులు, ఆధ్యాత్మిక కేంద్రాలు కొలువై ఉన్నాయి.
ఇవి యాత్రికులకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో నిర్మల్ జిల్లాలోని బాసర నుంచి భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం వరకు గోదావరి నదిపై పర్యాటకం అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా లాంచీలు నడిపే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.
బాసర నుంచి భద్రాచలం వరకు..
గోదావరి తీరం వెంట నిర్మల్ జిల్లా బాసరలో సరస్వతి అమ్మవారు, జగిత్యాల జిల్లాలో ధర్మపురి, పెద్దపల్లి జిల్లాలోని సుందిళ్లలో లక్ష్మీనరసింహస్వామి దేవాలయాలు, మంథని తీరంలో గౌతమేశ్వర, రామాలయం, మంచిర్యాల జిల్లాలో వేలాల మల్లన్న, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దక్షిణకాశీగా పేరుగాంచిన కాళేశ్వర ముక్తీశ్వరస్వామి, భద్రాద్రి రామాలయంతోపాటు అనేక శివాలయాలు, ఇతర దేవతల పుణ్యక్షేత్రాలు కొలువై ఉన్నాయి. జలమార్గంలో ప్రయాణిస్తూ వీటన్నిటినీ దర్శించుకోవడానికి పర్యాటకులు ఆసక్తి చూపిస్తారని అధికారులు అంటున్నారు.
తీరం వెంట అడవి అందాలు..
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మేడిగడ్డ, అన్నారం, పెద్దపల్లి జిల్లాలో సుందిళ్ల బ్యారేజీలు చేపట్టారు. ఈ బ్యారేజీలు, పంపుహౌస్‌ల సందర్శనకు రాష్ట్రం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తున్నారు. ఈ క్రమంలో ఇక్కడి బ్యారేజీల వద్ద పర్యాటకం అభివృద్ధికి ప్రభుత్వం ఇప్పటికే నిధులు కేటాయించింది. అలాగే గోదావరి తీరం వెంట ఉన్న అడవులు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఇవి యాత్రికులను ఆకట్టుకుంటాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రభుత్వానికి ఆదాయం
గోదావరి తీరం వెంట పర్యాటకం అభివృద్ధి చేయడం ద్వారా పుణ్యక్షేత్రాలకు భక్తుల సందర్శన పెరగనుంది. యాత్రికుల రాకవల్ల ప్రభుత్వానికి ఆదాయం కూడా సమకూరే అవకాశం ఉందని అధికారులు చెపుతున్నారు. కాళేశ్వరం వద్ద ఉన్న అంతర్రాష్ట్ర వంతెనతోపాటు బ్యారేజీ, ఇతర వంతెనలు, కేంద్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన గ్రీన్ ఫీల్డ్ హైవే ద్వారా రాకపోకలు సైతం పెరిగి.. పర్యాటక ప్రాంతాలకు సందర్శకులు పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం గోదావరిలో స్టీమర్లు, లాంచీలు ఏర్పాటు చేయాలని, తద్వారా ఆదాయాన్ని కూడగట్టవచ్చని భావిస్తోంది.
ప్రజాప్రతినిధుల ప్రయత్నాలు
గోదావరి తీర ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న మంథని వాసులు ఇక్కడికి వచ్చినప్పుడు వారికి ఆహ్లాదం పంచాలనే ఆలోచనతో పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. మంథని వద్ద గోదావరి తీర ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ఇటీవలే ఆయన ప్రకటన కూడా చేశారు. దీనికోసం ఆయన సీఎం కేసీఆర్‌తోపాటు కేంద్ర పర్యాటక అభివృద్ధి శాఖ మంత్రిని త్వరలో కలసి వినతిపత్రం సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు.
సీఎంను కలుస్తాం..
గోదావరి తీర ప్రాంతాన్ని పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని త్వరలోనే సీఎం కేసీఆర్‌తోపాటు కేంద్ర పర్యాటక శాఖ మంత్రిని కలుస్తాం. యాత్రికుల సందర్శనతో ఈ ప్రాంతాలు కచ్చితంగా అభివృద్ధి చెందుతాయి. ప్రభుత్వానికి కూడా ఆదాయం సమకూరుతుంది. - కొండేల మారుతి విద్యార్థి యువత వ్యవస్థాపకుడు, మంథని
ఆహ్లాదం పంచేలా ఏర్పాట్లు
గోదావరి నది తీరంలో పుణ్యస్నానాలకు వచ్చే భక్తులు, సందర్శనకు వచ్చే యాత్రికులకు ఆహ్లాదం పంచేలా ఏర్పాట్లు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఇతర దేశాల్లో నివాసం ఉండే మంథని వాసులు ఇక్కడికి వస్తే.. సేదతీరేందుకోసం కోనసీమను తలపించేలా తీర ప్రాంతాన్ని తీర్చిదిద్దాలనే ఆలోచన ఉంది. చిన్న పిల్లల కోసం పార్కులు, ఇతర సదుపాయాలను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. - పుట్ట మధు పెద్దపల్లి జెడ్పీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment