రక్తదాన శిబిరంలో దాతలు
పెద్దపల్లిరూరల్: తలసేమియా, రోడ్డు ప్రమాద బాధితులు, ఇతర రోగులకు అత్యవసరమైన రక్తాన్ని దానం చేయాలనే ఆలోచన ఆదర్శణీయమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశంసించారు. పెద్దపల్లి జిల్లా పోలీసు శాఖ రెడ్‌క్రాస్ సొసైటీ సమన్వయంతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ మైదానంలో సోమవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించింది.
మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి, ఎంపీ వెంకటేశ్ నేత, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, డీసీపీ వైభవ్ గైక్వాడ్, రెడ్‌క్రాస్ సొసైటీ ప్రతినిధులు శ్రీనివాస్, రాజ్‌గోపాల్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 6006 యూనిట్ల రక్తాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. 6,166 యూనిట్ల రక్తాన్ని ఈ శిబిరంలో సేకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ చరిత్రలోనే కాదు.. ప్రపంచ చరిత్రలోకూడా ఒకేరోజు 6,166 యూనిట్ల రక్తం సేకరించిన సందర్భాలు లేవన్నారు. ఇది గిన్నిస్ బుక్ లో నమోదు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
శిబిరం ద్వారా సేకరించిన రక్తయూనిట్లను రాష్ట్రంలోని అన్నిజిల్లాలకు అందించేలా రెడ్‌క్రాస్ సొసైటీ సహకారంతో ఏర్పాట్లు చేశామని, ఈ కార్యక్రమం విజయవంతం కావడం ఆనందాన్నిచ్చిందని సీపీ రెమారాజేశ్వరి అన్నారు. కాగా, ఈ రక్తదాన శిబిరంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ దంపతులు రక్తదానం చేశారు. అనంతరం పలుమార్లు రక్తదానం చేసిన వారిని మంత్రి తదితరులు సన్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment