KOPPULA Ishwar
-
ఒకేరోజు.. ఒకే చోట.. 6,166 యూనిట్ల రక్తదానం
పెద్దపల్లిరూరల్: తలసేమియా, రోడ్డు ప్రమాద బాధితులు, ఇతర రోగులకు అత్యవసరమైన రక్తాన్ని దానం చేయాలనే ఆలోచన ఆదర్శణీయమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశంసించారు. పెద్దపల్లి జిల్లా పోలీసు శాఖ రెడ్‌క్రాస్ సొసైటీ సమన్వయంతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ మైదానంలో సోమవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించింది. మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి, ఎంపీ వెంకటేశ్ నేత, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, డీసీపీ వైభవ్ గైక్వాడ్, రెడ్‌క్రాస్ సొసైటీ ప్రతినిధులు శ్రీనివాస్, రాజ్‌గోపాల్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 6006 యూనిట్ల రక్తాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. 6,166 యూనిట్ల రక్తాన్ని ఈ శిబిరంలో సేకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ చరిత్రలోనే కాదు.. ప్రపంచ చరిత్రలోకూడా ఒకేరోజు 6,166 యూనిట్ల రక్తం సేకరించిన సందర్భాలు లేవన్నారు. ఇది గిన్నిస్ బుక్ లో నమోదు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శిబిరం ద్వారా సేకరించిన రక్తయూనిట్లను రాష్ట్రంలోని అన్నిజిల్లాలకు అందించేలా రెడ్‌క్రాస్ సొసైటీ సహకారంతో ఏర్పాట్లు చేశామని, ఈ కార్యక్రమం విజయవంతం కావడం ఆనందాన్నిచ్చిందని సీపీ రెమారాజేశ్వరి అన్నారు. కాగా, ఈ రక్తదాన శిబిరంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ దంపతులు రక్తదానం చేశారు. అనంతరం పలుమార్లు రక్తదానం చేసిన వారిని మంత్రి తదితరులు సన్మానించారు. -
టీజీసెట్–22 ఫలితాలు విడుదల
సాక్షి,హైదరాబాద్: సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఐదోతరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీసెట్–22 ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. గురుకుల విద్యా సంస్థల పనితీరుపై మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆన్లైన్లో ప్రవేశ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాలను టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్, టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్, ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ ఈఐఎస్, టీఆర్ఈఐఎస్ సొసైటీల వెబ్సైట్లలో అందుబాటులో ఉంచారు. ఈ నాలుగు సొసైటీల పరిధిలో ఐదో తరగతికి 48,440 సీట్లు ఉన్నాయి. వీటి భర్తీకి టీజీసెట్–22 నిర్వహించారు. మార్కుల ఆధారంగా అభ్యర్థులకు ప్రాధాన్యత ప్రకారం సీట్లు కేటాయించారు. ఈ పరీక్ష కోసం మొత్తంగా 1,47,324మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుని పరీక్ష రాశారు. ‘సహజ’ఉత్పత్తులను సరఫరా చేయండి రాష్ట్రంలోని గురుకుల విద్యాసంస్థలు, సంక్షేమహాస్టళ్లకు ‘సహజ’ఉత్పత్తులు సరఫరా చేయాలని కొప్పుల ఈశ్వర్ సూచించారు. జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు చెందిన స్వయం సహాయకసంఘాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ‘సహజ’ద్వారా నిత్యావసరాలతోపాటు సబ్బులు, షాంపూలు, తలనూనెలు, కాస్మెటిక్స్‌ను ఉత్పత్తి చేస్తున్నారని వీటిని పరిశీలించి అన్ని గురుకులాలు, హాస్టళ్లకు సరఫరా చేసే అంశాన్ని పరిశీలించాలని సొసైటీ కార్యదర్శులకు ఆదేశించారు. -
118 నియోజకవర్గాల్లోనూ ‘దళితబంధు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 118 శాసనసభ నియోజకవర్గాల్లో దళితబంధు పథకం అమలు చేయాలని నిర్ణయించామని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో కుటుంబమే యూనిట్‌గా 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని, మార్చి నెలాఖరు కల్లా నూరుశాతం యూనిట్లు గ్రౌండింగ్ చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే వాసాలమర్రి గ్రామంతోపాటు హుజూరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఈ పథకాన్ని నూరు శాతం అమలు చేశామన్నారు. దళితబంధుపై శనివారం జిల్లా కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లకు పలు సూచనలు చేశారు.స్థానిక ఎమ్మెల్యేల సలహాతో లబ్ధిదారులను ఎంపిక చేసి ఆ జాబితాను సంబంధిత జిల్లా ఇన్చార్జి మంత్రులతో ఆమోదింపచేయాలని సూచించారు. ప్రతి లబ్ధిదారుకూ ఏ విధమైన బ్యాంకు లింకేజీ లేకుండా రూ.10 లక్షలను ఈ పథకం కింద ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. లబ్ధిదారు కోరుకున్న యూనిట్నే ఎంపిక చేయాలని, ఒక్కో లబ్ధిదారుకు మంజూరైన రూ.10 లక్షల నుంచి పదివేల రూపాయలతో ప్రత్యేకంగా దళితబంధు రక్షణనిధి ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో దళితబంధుకు రూ.1,200 కోట్లు కేటాయించామని, ఇప్పటికే రూ.100 కోట్లను విడుదల చేశామని చెప్పారు. విడతలవారీగా మిగతా నిధుల విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని, సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి, నాగర్‌కర్నూల్ జిల్లాలోని చారగొండ, కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ మండలాల్లో కూడా నూరు శాతం అమలు చేస్తున్నామని, విడతలవారీగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో ఈ పథకం అమలు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. కాన్ఫరెన్స్‌లో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, కార్పొరేషన్ ఎం.డి.కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. -
దళితబంధు ఆపించడం అవివేకం: కొప్పుల ఈశ్వర్
హుజూరాబాద్: దళితబంధు కార్యక్రమాన్ని ఎన్నికలు పూర్తయ్యే వరకు నిలిపివేయాల్సిందిగా ఎన్నికల కమిషన్‌కు బీజేపీ లేఖలు రాసి అడ్డుకోవడం అవివేకమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలనే సదుద్దేశంతో సీఎం కేసీఆర్ ఈ పథకం తెచ్చారని చెప్పారు. ఇప్పటికే 17 వేల మంది దళిత కుటుంబాలకు వారి వారి ఖాతాల్లో డబ్బులు పడ్డాయని తెలిపారు. సోమవారం స్థానిక టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. దళితబంధును పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో అమలుపరిస్తే, దానిని నిలిపివేయాలని బీజేపీ నాయకుడు ప్రేమేందర్ రెడ్డి లేఖ రాశారని, ఆ లేఖ ఆధారంగానే ఎన్నికల సంఘం దళితబంధును నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుందని విమర్శించారు. ఈటల రాజేందర్ కుట్రలో భాగంగానే దళితబంధును నిలిపివేశారని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. దళితబంధు పథకాన్ని నిలిపి వేయాల్సిందిగా ఒకవైపు ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేస్తూనే, మరోవైపు సీఎం కేసీఆర్‌ను నిందించడం వెనుక దగాకోరుతనం తేటతెల్లమవుతోందని అన్నారు. బీజేపీ కుట్రలు దళితులు అర్థం చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ.. అదాని, అంబానీలు బాగుపడితే చాలు, దళిత కుటుంబాలు బాగుపడవద్దనే ఉద్దేశంతోనే బీజేపీ ఇలాంటి నిర్ణయం తీసుకుందన్నారు. బీజేపీని దళిత సమాజం మొత్తం ప్రశ్నించాలన్నారు. అనంతరం బండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈటల దిష్టిబొమ్మను స్థానిక అంబేడ్కర్ చౌరస్తా వద్ద దహనం చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజ్, ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్, సుంకె రవిశంకర్, ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
దళితబంధు సర్వే..భేష్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు సర్వేను సమర్థవంతంగా నిర్వహించిన జిల్లా కలెక్టర్లు, అధికారులకు మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, తన్నీరు హరీశ్‌రావు అభినందనలు తెలిపారు. కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం మంత్రి కొప్పుల ఈశ్వర్ అధ్యక్షతన గంగుల, హరీశ్‌రావు, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి రాహుల్ బొజ్జా దళితబంధు సర్వే, దళితబంధు అమలుపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు 12,521 మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు మంత్రులు తెలిపారు. మిగిలిన లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని అధికారులను ఆదేశించారు. డబ్బులు ఖాతాలో జమయిన వెంటనే అందరికీ మొబైల్ఫోన్లో తెలుగులో సందేశాలు పంపించాలన్నారు. దళితబంధు సర్వేలో డోర్ లాక్, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారు, తప్పిపోయిన దళిత కుటుంబాల ఇళ్లను కూడా ఈ నెల 12 నుంచి వారం రోజుల్లో మరోసారి సందర్శించాలని నిర్ణయించారు. దళితబంధు కింద మంజూరైన డబ్బులను ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు తమకు వద్దని, ఈ డబ్బుల్ని ఇతర పేద దళిత కుటుంబాలకు సహాయం అందించాలని ‘‘గివ్ ఇట్ అప్’’అని స్వచ్ఛందంగా ఇచ్చినందుకు ఆ ఉద్యోగులను మంత్రులు అభినందించారు. 18 ఏళ్లలోపు తల్లిదండ్రులు లేని 14 మంది అనాథ పిల్లలకు మానవతా దృక్పథంతో వెంటనే దళితబంధు మంజూరు చేసివారి ఖాతాల్లో డబ్బులు జమచేయాలని నిర్ణయించారు. త్వరలోనే మిగిలిన వారికి..! దళితబంధు పథకం ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా మంజూరు చేసిన 15 మంది లబ్ధిదారులలో ఇంతవరకు ఆరుగురు లబ్ధిదారులకు యూనిట్లు గ్రౌండింగ్ చేశామని మిగిలిన వారికి కూడా స్కీముల ఎంపిక పూర్తి చేసి వారం రోజుల్లో గ్రౌండింగ్ చేయాలని మంత్రులు ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, నగర మేయర్ వై.సునీల్ రావు, అదనపు కలెక్టర్లు శ్యాం ప్రసాద్ లాల్ రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు. -
దళిత బంధు రాదంటూ ఈటల తప్పుడు ప్రచారం: మంత్రి హరీశ్ రావు
కరీంనగర్: దళిత బంధు రాదంటూ ఈటల తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈటల రాజేందర్ చెప్పే మోసపూరిత మాటలు నమ్మొద్దని హరీశ్‌రావు సూచించారు. ప్రతి దళిత కుటుంబానికి 9లక్షల 90వేలు వస్తున్నట్లు మేసేజ్‌లు వస్తున్నాయన్నారు. హుజురాబాద్ దళిత బంధు విజయం రాష్ట్రానికి, దేశానికి ఆదర్శం కావాలన్నారు. దళిత బంధుకు పైసలు ఎక్కడివి అని ఈటల అన్నారని, కానీ ఇప్పుడు అందరికీ దళిత బంధు వస్తుందని తెలిపారు. దీనికి ఈటల ఏం చెబుతారని ప్రశ్నించారు. కాగా హుజురాబాద్‌లో పోటాపోటీ ప్రచారాలు మొదలయ్యాయి. టీఆర్ఎస్ పార్టీ జమ్మికుంటలో సభను ఏర్పాటు చేసింది. బీజేపీ గోడ గడియారాలను, గొడుగులను సభలో ఓ యువకుడు ధ్వంసం చేశాడు. గోడ గడియారాలు భరోసానిస్తాయా అంటూ ప్రశ్నించారు. మంత్రులు హరీశ్ రావు, కొప్పుల వేదికపై ఉండగానే ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కొరుకంటి చందర్, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, కౌశిక్ రెడ్డిలు పాల్గొన్నారు. చదవండి: Huzurabad Bypoll: ఉప ఎన్నికపై ఈసీకి నివేదిక పంపాలి -
దళితుల కోసం ప్రత్యేక వర్సిటీ
సాక్షి, హైదరాబాద్: దళితుల కోసం ప్రత్యేకంగా యూనివర్సిటీని ఏర్పాటు చేసే ఆలోచన ముఖ్యమంత్రికి ఉందని, త్వరలో అది ఏర్పాటయ్యే అవకాశముందని ఎస్సీ అభివృద్ధి, సాంఘిక, సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు కూడా దీన్ని ఏర్పాటు చేయాలని సీఎంను కోరారని సభ దృష్టికి తెచ్చారు. పద్దులపై చర్చలో భాగంగా ఎస్సీ, బీసీ, మైనారిటీ సంక్షేమ విషయాలపై పలువురు సభ్యుల సందేహాలను నివృత్తి చేస్తూ కొప్పుల వివరాలు వెల్లడించారు. గురుకుల పాఠశాలల్లో ఉండేందుకు గతంలో ఇష్టపడేవారు కాదని, కానీ ప్రస్తుతం వాటిలో సీట్ల కోసం పెద్దపోటీ నెలకొందన్నారు. కల్యాణలక్ష్మి, ఉపాధి రుణాలతో ఆయా కుటుం బాలకు ఆసరాగా ఉంటుండగా, వారి పిల్లలకు నాణ్యమైన విద్యనందించి ప్రపంచంలో ఎక్కడైనా పోటీని తట్టుకునేలా నిలిచేందుకు దోహదం చేస్తున్నట్లు పేర్కొన్నారు. విదేశాల్లో నాణ్యమైన, ఉన్నత విద్యను పొందేందుకు కావాల్సిన ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తోందన్నారు. -
కరోనా దృష్యా అన్ని స్కూల్స్ కాలేజీలు మూసివేత
-
గడ్కరీతో మంత్రి కొప్పుల భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో రాష్ట్ర సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ సోమవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. మంత్రితో పాటు టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు కూడా ఉన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం పరిధిలో 15 రహదారుల అభివృద్ధి ప్రతిపాదనలకు సంబంధించి రూ.120 కోట్ల మేర నిధులివ్వాలని కోరుతూ ఒక వినతిపత్రం ఇచ్చారు. సెంట్రల్ రోడ్ ఫండ్ (సీఆర్ఎఫ్) గ్రాంటు కింద నిధులు మంజూరు చేయాలని కోరారు. జగదల్పూర్–నిజామాబాద్ జాతీయ రహదారి–63కు సంబంధించి 7 కి.మీ. మేర రహదారిని 4 వరుసల రహదారి గా విస్తరించాల్సి ఉందని, దీనికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని విన్నవించారు. -
రంజాన్‌కు పకడ్బందీ ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: రంజాన్ పండుగ నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశించారు. సోమవారం సచివాలయంలో మైనార్టీ సంక్షేమ శాఖతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. రంజాన్ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 832 మసీదులకు గిఫ్ట్ ప్యాక్‌లను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఇఫ్తార్ విందు నిర్వహణ కోసం ప్రతి మసీదుకు రూ.లక్ష మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. రంజాన్ పండుగ ఏర్పాట్లను పర్యవేక్షించాలని ఆయన జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని మసీదు ప్రాంతాల్లో శానిటేషన్, రోడ్లకు మరమ్మతులు, లైటింగ్ తదితర ఏర్పాట్లు చేయాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. మసీదుల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఇక జీహెచ్ఎంసీ పరిధిలోని మసీదుల వద్ద తాగునీటి వసతికి మెట్రో వాటర్ బోర్డు సహకారం తీసుకోవాలని పేర్కొన్నారు. విద్యుత్‌కు అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. రంజాన్ పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరంలో రాత్రి బజారు నిర్వహించే ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని వైద్య, ఆరోగ్య శాఖ ద్వారా మెడికల్ క్యాంపులను ఏర్పాటుచేసి ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా చార్మినార్ వద్ద గల జీహెచ్ఎంసీ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. మక్కా మసీదు, రాయల్ మాస్కులో మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్, మైనారిటీ సంక్షేమ శాఖ డైరెక్టర్ షానవాజ్ ఖాసీమ్, హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
లోక్‌సభ స్థానాలు కైవసానికై అమాత్యులు గురి..
ఉమ్మడి జిల్లా పరిధిలోని రెండు లోక్‌సభ స్థానాలు కైవసం చేసుకోవడంపై అమాత్యులు గురిపెట్టారు. అధినేత కేసీఆర్ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నెరవేర్చేందుకు రాష్ట్రమంత్రులు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. గతంలో పార్టీ ఖాతాలో ఉన్న ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్‌సభ స్థానాలను తిరిగి సాధించేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. లోక్‌సభ నియోజకవర్గాల బాధ్యతలు చేపట్టిన రాష్ట్రమంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్ పార్టీ అభ్యర్థులను విజయంవైపు నడిపిస్తున్నారు. సాక్షి మంచిర్యాల: ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలుపు బాధ్యతను నిర్మల్ జిల్లాకు చెందిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి పార్టీ అధినేత కేసీఆర్ అప్పగించారు. టీఆర్ఎస్ అభ్యర్థి గోడెం నగేష్‌ను గెలిపించే బాధ్యతను భుజానికెత్తుకున్న ఐకే.రెడ్డి పార్టీ కేడర్‌ను సమాయత్తపరుస్తూ ముందుకు కదులుతున్నారు. ఆదిలాబాద్ లోక్‌సభ పరిధిలో ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్, బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్, సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇందులో ఆరు అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఇటీవల ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కూడా టీఆర్ఎస్కు మద్దతు పలికారు. దీంతో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాలు కూడా టీఆర్ఎస్ చేతికి వెళ్లాయి. ఆరుగురు ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలను సమన్వయం చేసుకుంటూనే.. మంత్రి ఐకే.రెడ్డి పార్టీ అభ్యర్థి గెలుపు కోసం శ్రమిస్తున్నారు. సమన్వయ, ప్రచార బాధ్యతలను పూరి ్తగా చేపట్టిన ఆయన పార్టీని ఏకతాటిపై నడిపిం చేందుకు ప్రయత్నిస్తున్నారు. కచ్చితంగా ఆది లాబాద్ స్థానాన్ని నిలబెట్టుకోవాలనే పట్టుదలతో అన్నీతానై వ్యవహరిస్తున్నారు. ఆదిలాబాద్‌లో టీఆర్ఎస్కు కాంగ్రెస్, బీజేపీ నుంచి గట్టిపోటీ నెలకొంది. కాంగ్రెస్ నుంచి రమేష్ రాథోడ్, బీజేపీ నుంచి సోయం బాపురావు బరిలో ఉన్నారు. లం బడా తెగకు చెందిన రమేష్ రాథోడ్.. ఆదివాసీకి చెందిన సోయం బాపురావు బలమైన అభ్యర్థులు కావడంతో ఎక్కడా పొరపాట్లకు తావివ్వకుండా వ్యూహాత్మకంగా ప్రచారం సాగిస్తున్నారు. పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గ బాధ్యతలను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేపట్టారు. కేసీఆర్ ఆదేశంతో పెద్దపల్లి అభ్యర్థి బోర్లకుంట వెంకటేశ్ విజయానికి ఈశ్వర్ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. పెద్దపల్లి లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీలకు మంచి ర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి మంచిర్యాల జిల్లాలో.. పెద్దపల్లి, రామగుండం, మంథని పెద్దపల్లి జిల్లాలో.. మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న ధర్మపురి నియోజకవర్గం జగిత్యాల జిల్లాలో ఉన్నా యి. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో మంథని, రామగుండం స్థానాలను టీఆర్ఎస్ కోల్పోయింది. ధర్మపురి, మంచిర్యాల, పెద్దపల్లిల్లో స్వల్ప మెజార్టీతో గట్టెక్కింది. ఆ తరువాత రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ టీఆర్ఎస్లో చేరడంతో బలం మరింత పెరిగింది. ఇప్పుడు ఒక్క మంథని మినహా మిగిలిన ఆరుస్థానాల్లోనూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఐదుగురు ఎమ్మెల్యేలు, ఒకమాజీ ఎమ్మెల్యేతో కలిసి కొప్పుల ఈశ్వర్ వ్యూహాత్మకంగా సాగుతున్నారు. స్వయంగా ప్రచార బాధ్యతలు నిర్వర్తించడంతో పాటు.. ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలను సమన్వ యం చేసుకుంటూ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అడుగులు వేస్తున్నారు. మాజీ ఎంపీ జి.వివేక్‌కు పార్టీ టికెట్ నిరాకరించడంతో నెలకొన్న పరిస్థితులు టీఆర్ఎస్కు కొంత ఇబ్బందికరంగా మారాయి. ఆ సమస్యను అధిగమించడానికి వివేక్ లక్ష్యంగా కొప్పుల ఈశ్వర్, బాల్క సుమన్ మాటలతూటాలు ఎక్కుపెట్టారు. వివేక్ అనుచరులను పార్టీ అభ్యర్థి గెలుపు కోసం మళ్లించడానికి కొప్పుల పావులు కదుపుతున్నారు. ఏదేమైనా ఆదిలాబాద్, పెద్దపల్లిలో పార్టీ అభ్యర్థుల గెలుపు బాధ్యతలను చేపట్టిన అమాత్యుల మంత్రాంగం ఏ మేరకు ఫలించనుందో వేచిచూడాలి. -
మిషన్‌కాకతీయతో సమృద్ధిగా నీరు
ధర్మారం : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకంలో మరమ్మతు చేయడంతో చెరువుల్లో నీరు సమృద్ధిగా నిల్వ ఉంటుందని ప్రభుత్వ చీఫ్‌విఫ్ కొప్పుల ఈశ్వర్ అన్నారు. మండలంలో నాల్గవ విడత మిషన్ కాకతీయలో భాగంగా చామనపల్లి, రచ్చపల్లి, ఖానంపెల్లి గ్రామాల్లో చెరువులు, కుంటల నిర్మాణ పనులను గురువారం ప్రారంభించి మాట్లాడారు. గత ప్రభుత్వాలు రైతు సంక్షేమానికి విస్మరించగా టీఆర్ఎస్ హయాంలో రైతు సంక్షేమానికి కోట్లాది రూపాయలు వెచ్చించిందన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని దాదాపు అన్ని చెరువులు, కుంటల మరమ్మతులకు నిధులు విడుదల చేసి పనులు పూర్తి చేయిస్తుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గుర్రం మోహన్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యుడు పుస్కూరి జితెందర్‌రావు, పాక వెంకటేశం, ఎండీ. రఫీ, టీఆర్ఎస్వీ నియోజకవర్గ ఇన్చార్జి ఎండీ. అజాంబాబా, వైస్ ఎంపీపీ నార ప్రభాకర్, చింతల తిరుపతి, మూల మల్లేశం, సర్పంచులు పాలమాకుల ఉపేందర్‌రెడ్డి, ఐత స్వర్ణలత, అరుణ, ఎంపీటీసీలు మూల మంగ, వేల్పుల రేవతి, నాయకులు పాల్గొన్నారు. వికలాంగులకు వీల్‌చైర్ అందజేత మండలం పరిషత్ కార్యాలయంలో దివ్యాంగులకు చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ గురువారం వీల్చైర్లను అందించారు. నర్సింగపూర్‌కు చెందిన బుదారపు నర్సయ్యకు వీల్‌చైర్, వెల్గటూర్ మండలం పాతగూడూరుకు చెందిన జానవేణి తిరుపతికి ట్రైసైకిల్ అందించారు. -
జానారెడ్డిని ఎవరాపుతున్నారు: కొప్పుల
సాక్షి, హైదరాబాద్: ఎన్నో మాట్లాడాల్సి వస్తుందంటున్న జానారెడ్డిని ఎవరు ఆపుతున్నారని ప్రభుత్త చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు. శాసన మండలి విప్ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీలు భానుప్రసాద్, నారదాసు లక్ష్మణ్‌రావులతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జానారెడ్డి ఏం మాట్లాడాలనుకుంటున్నారో అది మాట్లాడాలన్నారు. టీఆర్ఎస్కు పెరుగుతున్న ప్రజాదరణను ప్రతిపక్షాలు ఓర్చుకోలేకపోతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలంటే కేవలం ఎన్నికల పార్టీలుగా మిగిలిపోయాయని ఎద్దేవా చేశారు. సింగరేణి నుంచే ఎన్నికల పతనం ప్రారంభం అవుతుందని హెచ్చరించిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్.. ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. సింగరేణి ఎన్నికలను టీడీపీ నేత రేవంత్ రెడ్డి వంటి వారు మలినం చేశారని విమర్శించారు. కాంగ్రెస్, టీడీపీ కళ్లతో కోదండరాం చూస్తున్నారని, ఉన్న గౌరవాన్ని పోగొట్టుకున్నారన్నారు. నీతులు చెబుతున్న జానారెడ్డి తన పార్టీ నేతలకు బుద్ధి చెప్పాలన్నారు. -
కాంగ్రెస్ పారిపోతోంది
వారికి మాట్లాడేందుకు అంశాలే లేవు: కొప్పుల సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడకుండా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పారిపోతోందని ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో తమకు మాట్లాడే సమయం ఇవ్వడం లేదని విపక్షం ఆరోపించడం సరికాదన్నారు. శుక్రవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావులతో కలిసి ఈశ్వర్ విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం 12.36 గంటలు మాట్లాడితే.. అధికారపక్షం 9 గంటలే మాట్లాడిందని చెప్పారు. భూసేకరణ చట్టాన్ని ఆమోదించిన తర్వాత కాంగ్రెస్ సభ నుంచి పారిపోవడం విచారకరమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కోరిక మేరకు నోట్ల రద్దు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల అంశాలపై ఇప్పటికే చర్చించామని.. ప్రభుత్వం ఆయా అంశాలపై తగిన విధంగా సమాధానం ఇచ్చిందని వివరించారు. విపక్షాలు ఒకటి అడిగితే తాము పది సమాధానాలు ఇచ్చామని చెప్పారు. తెల్లమొహం వేశారు కాంగ్రెస్‌కు లేవనెత్తేందుకు అసలు అంశాలేవీ లేవని.. అసెంబ్లీ సమావేశాలు పొడిగిస్తున్నామని సీఎం చెబితే ఆ పార్టీ నేతలు తెల్లమొహం వేశారని కొప్పుల ఈశ్వర్ ఎద్దేవా చేశారు. ప్రాజెక్టులు నిర్మించడానికి భూసేకరణ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. దానికోసం తెస్తున్న భూసేకరణ చట్టాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని, అంటే ఆ పార్టీకి సాగునీటి ప్రాజెక్టులు పూర్తికావడం ఇష్టం లేదని తేలిందని వ్యాఖ్యానించారు. సభలో సవివరమైన చర్చ జరుగుతోందని, ఇంత సజావుగా సమావేశాలు జరగడం ఇదే మొదటిసారని చెప్పారు. ఇకనైనా కాంగ్రెస్ హుందాగా వ్యవహరించాలన్నారు.