
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో రాష్ట్ర సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ సోమవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. మంత్రితో పాటు టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు కూడా ఉన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం పరిధిలో 15 రహదారుల అభివృద్ధి ప్రతిపాదనలకు సంబంధించి రూ.120 కోట్ల మేర నిధులివ్వాలని కోరుతూ ఒక వినతిపత్రం ఇచ్చారు. సెంట్రల్ రోడ్ ఫండ్ (సీఆర్‌ఎఫ్) గ్రాంటు కింద నిధులు మంజూరు చేయాలని కోరారు. జగదల్‌పూర్–నిజామాబాద్ జాతీయ రహదారి–63కు సంబంధించి 7 కి.మీ. మేర రహదారిని 4 వరుసల రహదారి గా విస్తరించాల్సి ఉందని, దీనికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని విన్నవించారు.