కాంగ్రెస్ పారిపోతోంది
వారికి మాట్లాడేందుకు అంశాలే లేవు: కొప్పుల
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడకుండా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పారిపోతోందని ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో తమకు మాట్లాడే సమయం ఇవ్వడం లేదని విపక్షం ఆరోపించడం సరికాదన్నారు. శుక్రవారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావులతో కలిసి ఈశ్వర్ విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం 12.36 గంటలు మాట్లాడితే.. అధికారపక్షం 9 గంటలే మాట్లాడిందని చెప్పారు. భూసేకరణ చట్టాన్ని ఆమోదించిన తర్వాత కాంగ్రెస్ సభ నుంచి పారిపోవడం విచారకరమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కోరిక మేరకు నోట్ల రద్దు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల అంశాలపై ఇప్పటికే చర్చించామని.. ప్రభుత్వం ఆయా అంశాలపై తగిన విధంగా సమాధానం ఇచ్చిందని వివరించారు. విపక్షాలు ఒకటి అడిగితే తాము పది సమాధానాలు ఇచ్చామని చెప్పారు.
తెల్లమొహం వేశారు
కాంగ్రెస్‌కు లేవనెత్తేందుకు అసలు అంశాలేవీ లేవని.. అసెంబ్లీ సమావేశాలు పొడిగిస్తున్నామని సీఎం చెబితే ఆ పార్టీ నేతలు తెల్లమొహం వేశారని కొప్పుల ఈశ్వర్ ఎద్దేవా చేశారు. ప్రాజెక్టులు నిర్మించడానికి భూసేకరణ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. దానికోసం తెస్తున్న భూసేకరణ చట్టాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని, అంటే ఆ పార్టీకి సాగునీటి ప్రాజెక్టులు పూర్తికావడం ఇష్టం లేదని తేలిందని వ్యాఖ్యానించారు. సభలో సవివరమైన చర్చ జరుగుతోందని, ఇంత సజావుగా సమావేశాలు జరగడం ఇదే మొదటిసారని చెప్పారు. ఇకనైనా కాంగ్రెస్ హుందాగా వ్యవహరించాలన్నారు.