హుజూరాబాద్: దళితబంధు కార్యక్రమాన్ని ఎన్నికలు పూర్తయ్యే వరకు నిలిపివేయాల్సిందిగా ఎన్నికల కమిషన్‌కు బీజేపీ లేఖలు రాసి అడ్డుకోవడం అవివేకమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలనే సదుద్దేశంతో సీఎం కేసీఆర్ ఈ పథకం తెచ్చారని చెప్పారు. ఇప్పటికే 17 వేల మంది దళిత కుటుంబాలకు వారి వారి ఖాతాల్లో డబ్బులు పడ్డాయని తెలిపారు. సోమవారం స్థానిక టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
దళితబంధును పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో అమలుపరిస్తే, దానిని నిలిపివేయాలని బీజేపీ నాయకుడు ప్రేమేందర్ రెడ్డి లేఖ రాశారని, ఆ లేఖ ఆధారంగానే ఎన్నికల సంఘం దళితబంధును నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుందని విమర్శించారు. ఈటల రాజేందర్ కుట్రలో భాగంగానే దళితబంధును నిలిపివేశారని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. దళితబంధు పథకాన్ని నిలిపి వేయాల్సిందిగా ఒకవైపు ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేస్తూనే, మరోవైపు సీఎం కేసీఆర్‌ను నిందించడం వెనుక దగాకోరుతనం తేటతెల్లమవుతోందని అన్నారు. బీజేపీ కుట్రలు దళితులు అర్థం చేసుకోవాలని సూచించారు.
ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ.. అదాని, అంబానీలు బాగుపడితే చాలు, దళిత కుటుంబాలు బాగుపడవద్దనే ఉద్దేశంతోనే బీజేపీ ఇలాంటి నిర్ణయం తీసుకుందన్నారు. బీజేపీని దళిత సమాజం మొత్తం ప్రశ్నించాలన్నారు. అనంతరం బండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈటల దిష్టిబొమ్మను స్థానిక అంబేడ్కర్ చౌరస్తా వద్ద దహనం చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజ్, ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్, సుంకె రవిశంకర్, ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment