సాక్షి, హైదరాబాద్: రంజాన్ పండుగ నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశించారు. సోమవారం సచివాలయంలో మైనార్టీ సంక్షేమ శాఖతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. రంజాన్ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 832 మసీదులకు గిఫ్ట్ ప్యాక్‌లను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఇఫ్తార్ విందు నిర్వహణ కోసం ప్రతి మసీదుకు రూ.లక్ష మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. రంజాన్ పండుగ ఏర్పాట్లను పర్యవేక్షించాలని ఆయన జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని మసీదు ప్రాంతాల్లో శానిటేషన్, రోడ్లకు మరమ్మతులు, లైటింగ్ తదితర ఏర్పాట్లు చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు. మసీదుల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఇక జీహెచ్‌ఎంసీ పరిధిలోని మసీదుల వద్ద తాగునీటి వసతికి మెట్రో వాటర్ బోర్డు సహకారం తీసుకోవాలని పేర్కొన్నారు.
విద్యుత్‌కు అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. రంజాన్ పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరంలో రాత్రి బజారు నిర్వహించే ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని వైద్య, ఆరోగ్య శాఖ ద్వారా మెడికల్ క్యాంపులను ఏర్పాటుచేసి ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా చార్మినార్ వద్ద గల జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. మక్కా మసీదు, రాయల్ మాస్కులో మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిషోర్, మైనారిటీ సంక్షేమ శాఖ డైరెక్టర్ షానవాజ్ ఖాసీమ్, హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రంజాన్‌కు పకడ్బందీ ఏర్పాట్లు
Published Tue, Apr 30 2019 12:07 AM | Last Updated on Tue, Apr 30 2019 12:07 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment