ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తా
ఏపీ సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి
హైదరాబాద్: ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తానని ఆంధ్రప్రదేశ్ సమాచార, పౌర సంబంధాలు, ఐటీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. మంత్రిగా ఆయన ఆదివారం సచివాలయంలో బాధ్యత లు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను మీడియా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. రాష్ట్రంలో కనీస మౌలిక సదుపాయాలు కలిగిన అన్ని నగరాలు, ముఖ్య పట్టణాల్లో ఐటీ హబ్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్‌లోనే ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయటంతో విభజన సమయంలో ఇబ్బందులొచ్చాయన్నారు. ఇక ముందు అలాంటి పరిస్థితి రాకుండా చూసుకుంటామన్నారు. మైనారిటీల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. మైనారిటీల స్థలాలు, వక్ఫ్ ఆస్తులు ఎక్కడైనా అన్యాక్రాంతమై ఉంటే స్వాధీనం చేసుకుంటామన్నారు.
తెలుగు భాష, సంస్కృతి కాపాడేవిధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 176 దేశాల్లో ఉన్న తెలుగువారు రాష్ట్ర రాజధాని నిర్మాణానికి తమ వంతు సహాయం అందించాలని కోరారు. విద్యా సంస్థల ద్వారా కూడా విరాళాలు స్వీకరిస్తామన్నారు. తాను ఒక నెల వేతనాన్ని నూతన రాష్ట్ర రాజధాని నిర్మాణానికి విరాళంగా ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా మరో మంత్రి రావెల కిశోర్‌బాబు, సమాచార, పౌరసంబంధాల శాఖ సంచాలకులు సుభాష్‌గౌడ్, ఐటీ శాఖ కార్యదర్శి సంజయ్‌జాజు, వివిధ శాఖల అధికారులు, టీడీపీ నేతలు జయరామిరెడ్డి, వీవీవీ చౌదరి, ఐటీ రంగ నిపుణుడు జేఏ చౌదరి, పుట్టపర్తి నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు, అభిమానులు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రఘునాథరెడ్డిని అభినందించారు.