Lanchi services
-
కృష్ణానదిలో పర్యాటకుల 'లాంచీ.. రెడీ'..!
మహబూబ్‌నగర్: ఇటీవల కురిసిన వర్షాలకు కృష్ణానదికి వరదలు రావడంతో శ్రీశైలం ప్రాజెక్టులో బ్యాక్‌వాటర్ క్రమంగా పెరుగుతోంది. దీంతో కృష్ణానది తీర ప్రాంతాలు ఆహ్లాదకరంగా మారాయి. నదీ అందాలతోపాటు ప్రకృతి సోయగాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు విచ్చేస్తున్నారు. సోమశిల సమీపంలోని కృష్ణానదిలో పర్యాటకులు విహరించేందు కోసం పర్యాటక శాఖ లాంచీలు ముస్తాబయ్యాయి. సోమశిల సమీప ప్రాంతాలతోపాటు శ్రీశైలం వరకు నదిలో ప్రయాణాలు సాగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో.. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని సోమశిలలో పర్యాటక శాఖ రెండు లాంచీలను ఏర్పాటు చేసింది. ఎనిమిదేళ్ల క్రితం సోమేశ్వర అనే పేరుతో మినీ నాన్ ఏసీ లాంచీని ఏర్పాటు చేసి శ్రీశైలం వరకు నదీ ప్రయాణం కల్పించింది. అప్పట్లో లాంచీ ప్రయాణానికి పర్యాటకులు ఉత్సాహం చూపించారు. పర్యాటకుల తాకిడి పెరగడంతో 2019లో స్వదేశి దర్శన్ నిధులు రూ.2.5 కోట్లతో 120 మంది ప్రయాణించేందుకు వీలుగా మరో ఏసీ లాంచీని ఏర్పాటు చేశారు. దీనినే ప్రస్తుతం సోమశిల నుంచి శ్రీశైలం వరకు నదిలో ప్రయాణించేందుకు వినియోగిస్తున్నారు. మినీ నాన్ ఏసీ సోమేశ్వర లాంచీని మాత్రం సోమశిల పరిసర ప్రాంతాల్లోనే తిప్పుతున్నారు. సోమశిల పరిసరాల్లో.. ఈ ఏడాది వర్షాలు సరిగా కురవకపోవడంతో నదిలోకి నీరు చేరడం ఆలస్యమైంది. కొన్ని రోజులుగా శ్రీశైలం ప్రాజెక్టుకు వరద జలాలు చేరుతుండటంతో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం సోమశిల సమీపంలో పుష్కర ఘాట్ల వద్దకు నీళ్లు చేరుకున్నాయి. దీంతో మినీ నాన్ఏసీ లాంచీ ప్రయాణాలను పర్యాటక శాఖ అధికారులు ప్రారంభించారు. ఇక శ్రీశైలానికి తిప్పే ఏసీ లాంచీ ప్రయాణాలు ప్రారంభమయ్యేందుకు మాత్రం కొంత సమయం పడుతుందని చెబుతున్నారు. రెండు లాంచీలను శుభ్రం చేసి నది ప్రయాణాలకు సిద్ధంగా ఉంచారు. త్వరలోనే ప్రారంభిస్తాం.. కృష్ణానదిలో పర్యాటకులు విహరించేందుకు లాంచీ ప్రయాణాలు ప్రారంభించాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సోమశిలలోని రెండు లాంచీలను నదీ ప్రయాణాల కోసం అందుబాటులోకి వచ్చాయి. అలాగే శ్రీశైలం టూర్‌కు దాదాపుగా 70 మంది ప్రయాణికులు ఉంటేనే లాంచీ తిప్పుతాం. లేదంటే నిర్వహణ భారం మీదపడుతుంది. మినీ లాంచీ టికెట్ల ధరలో ఇప్పుడు ఎలాంటి మార్పులు లేవు. శ్రీశైలానికి తిప్పే ఏసీ లాంచీ ధరలను ఈనెలాఖరులోగా అధికారులు నిర్ణయిస్తారు. – రాజేష్‌గౌడ్, లాంచీ నిర్వహణ పర్యవేక్షకుడు టూర్‌కు పర్యాటకుల కొరత.. శ్రీశైలం లాంచీని 2019లో ప్రారంభించాక ఇప్పటి వరకు కేవలం 20 సార్లు మాత్రమే సోమశిల– శ్రీశైలం మధ్య తిప్పారు. 2019లో నాలుగు సార్లు, 2020లో 11 సార్లు తిప్పగా.. 2021లో ఒక్కసారి కూడా తిప్పలేదు. 2022లో మాత్రం 5 సార్లు లాంచీ ప్రయాణం సాగింది. శ్రీశైలానికి లాంచీలో ప్రయాణించాలంటే కనీసం 70 మంది ప్రయాణికులు ఉండాలి. లేదా రూ.1.30 లక్షలకు పైగా చార్జీల రూపంలో చెల్లించాలి. అలా అయితేనే లాంచీ ప్రయాణం ప్రారంభిస్తారు. అంతమంది ఒకేసారి రాకపోవడంతో ఆశించిన స్థాయిలో శ్రీశైలం టూర్ ప్రయాణాలు పెద్దగా సాగడం లేదు. పాతాళగంగ వరకు.. సోమశిల నుంచి శ్రీశైలం వరకు పర్యాటకులను తీసుకువెళ్లేందుకు ఏసీ లాంచీ ఏర్పాటు చేశారు. కానీ, ఇప్పుడు అది శ్రీశైలం వరకు కాకుండా ఈగలపెంట వద్దే ఆపుతున్నారు. అక్కడి నుంచి మరో 21 కి.మీ., మేరకు బస్సులో ప్రయాణించి శ్రీశైలం చేరుకోవాల్సి ఉంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న సరిహద్దుల కారణంగా పర్యాటక శాఖ లాంచీ పాతాళగంగ వద్దకు వెళ్లడం లేదు. పర్యాటక శాఖ అధికారులు స్పందించి పాతాళగంగ వద్దకు పర్యాటకులను చేర్చేలా చర్యలు చేపట్టాలి. అలాగే నదీ ప్రయాణంలో ఒకటి లేదా రెండుచోట్ల కొద్దిసేపు పర్యాటకులు విరామం తీసుకునేలా షెల్టర్లు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. – శ్రీనివాసులు, కొల్లాపూర్ మినీ లాంచీకి డిమాండ్.. సోమశిల పరిసరాల్లో మాత్రమే తిప్పే సోమేశ్వర లాంచీ (మినీ నాన్ఏసీ లాంచీ)లో విహరించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. ఈ లాంచీలో 15 నిమిషాలపాటు తిప్పేందుకు ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.50, చిన్నపిల్లలకు రూ.30 చొప్పున వసూలు చేస్తున్నారు. 20 మంది ప్రయాణికులు జమ అయితే ఈ లాంచీని నదిలో తిప్పుతారు. ఒకవేళ ఎవరైనా రూ.4 వేలు చెల్లిస్తే గంటపాటు వారి బృందం మొత్తాన్ని నదిలో తిప్పుతారు. ఈ ధరలు తక్కువగా ఉండడంతో చాలామంది పర్యాటకులు సోమేశ్వర లాంచీలో తిరిగేందుకు ఇష్టపడుతున్నారు. ఈ లాంచీ ద్వారా పర్యాటక శాఖకు ప్రతినెలా రూ.లక్షకుపైగా ఆదాయం లభిస్తోంది. శ్రీశైలం టూర్‌కు తిప్పే ఏసీ లాంచీ ప్రయాణ చార్జీలు అధికంగా ఉండటంతో పర్యాటకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. -
బాసర నుంచి భద్రాచలానికి లాంచీ!
మంథని: గోదావరి పరీవాహక తీర ప్రాంత కేంద్రాలను పర్యాటక క్షేత్రాలుగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గం (ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా)లో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో గోదావరి నిత్యం నిండుకుండలా ఉంటోంది. అంతేకాకుండా తీరం వెంట పచ్చని అడవులు, ఆధ్యాత్మిక కేంద్రాలు కొలువై ఉన్నాయి. ఇవి యాత్రికులకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో నిర్మల్ జిల్లాలోని బాసర నుంచి భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం వరకు గోదావరి నదిపై పర్యాటకం అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా లాంచీలు నడిపే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. బాసర నుంచి భద్రాచలం వరకు.. గోదావరి తీరం వెంట నిర్మల్ జిల్లా బాసరలో సరస్వతి అమ్మవారు, జగిత్యాల జిల్లాలో ధర్మపురి, పెద్దపల్లి జిల్లాలోని సుందిళ్లలో లక్ష్మీనరసింహస్వామి దేవాలయాలు, మంథని తీరంలో గౌతమేశ్వర, రామాలయం, మంచిర్యాల జిల్లాలో వేలాల మల్లన్న, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దక్షిణకాశీగా పేరుగాంచిన కాళేశ్వర ముక్తీశ్వరస్వామి, భద్రాద్రి రామాలయంతోపాటు అనేక శివాలయాలు, ఇతర దేవతల పుణ్యక్షేత్రాలు కొలువై ఉన్నాయి. జలమార్గంలో ప్రయాణిస్తూ వీటన్నిటినీ దర్శించుకోవడానికి పర్యాటకులు ఆసక్తి చూపిస్తారని అధికారులు అంటున్నారు. తీరం వెంట అడవి అందాలు.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మేడిగడ్డ, అన్నారం, పెద్దపల్లి జిల్లాలో సుందిళ్ల బ్యారేజీలు చేపట్టారు. ఈ బ్యారేజీలు, పంపుహౌస్‌ల సందర్శనకు రాష్ట్రం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తున్నారు. ఈ క్రమంలో ఇక్కడి బ్యారేజీల వద్ద పర్యాటకం అభివృద్ధికి ప్రభుత్వం ఇప్పటికే నిధులు కేటాయించింది. అలాగే గోదావరి తీరం వెంట ఉన్న అడవులు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఇవి యాత్రికులను ఆకట్టుకుంటాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వానికి ఆదాయం గోదావరి తీరం వెంట పర్యాటకం అభివృద్ధి చేయడం ద్వారా పుణ్యక్షేత్రాలకు భక్తుల సందర్శన పెరగనుంది. యాత్రికుల రాకవల్ల ప్రభుత్వానికి ఆదాయం కూడా సమకూరే అవకాశం ఉందని అధికారులు చెపుతున్నారు. కాళేశ్వరం వద్ద ఉన్న అంతర్రాష్ట్ర వంతెనతోపాటు బ్యారేజీ, ఇతర వంతెనలు, కేంద్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన గ్రీన్ ఫీల్డ్ హైవే ద్వారా రాకపోకలు సైతం పెరిగి.. పర్యాటక ప్రాంతాలకు సందర్శకులు పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం గోదావరిలో స్టీమర్లు, లాంచీలు ఏర్పాటు చేయాలని, తద్వారా ఆదాయాన్ని కూడగట్టవచ్చని భావిస్తోంది. ప్రజాప్రతినిధుల ప్రయత్నాలు గోదావరి తీర ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న మంథని వాసులు ఇక్కడికి వచ్చినప్పుడు వారికి ఆహ్లాదం పంచాలనే ఆలోచనతో పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. మంథని వద్ద గోదావరి తీర ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ఇటీవలే ఆయన ప్రకటన కూడా చేశారు. దీనికోసం ఆయన సీఎం కేసీఆర్‌తోపాటు కేంద్ర పర్యాటక అభివృద్ధి శాఖ మంత్రిని త్వరలో కలసి వినతిపత్రం సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. సీఎంను కలుస్తాం.. గోదావరి తీర ప్రాంతాన్ని పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని త్వరలోనే సీఎం కేసీఆర్‌తోపాటు కేంద్ర పర్యాటక శాఖ మంత్రిని కలుస్తాం. యాత్రికుల సందర్శనతో ఈ ప్రాంతాలు కచ్చితంగా అభివృద్ధి చెందుతాయి. ప్రభుత్వానికి కూడా ఆదాయం సమకూరుతుంది. - కొండేల మారుతి విద్యార్థి యువత వ్యవస్థాపకుడు, మంథని ఆహ్లాదం పంచేలా ఏర్పాట్లు గోదావరి నది తీరంలో పుణ్యస్నానాలకు వచ్చే భక్తులు, సందర్శనకు వచ్చే యాత్రికులకు ఆహ్లాదం పంచేలా ఏర్పాట్లు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఇతర దేశాల్లో నివాసం ఉండే మంథని వాసులు ఇక్కడికి వస్తే.. సేదతీరేందుకోసం కోనసీమను తలపించేలా తీర ప్రాంతాన్ని తీర్చిదిద్దాలనే ఆలోచన ఉంది. చిన్న పిల్లల కోసం పార్కులు, ఇతర సదుపాయాలను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. - పుట్ట మధు పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ -
నాగార్జునకొండకు ప్రారంభమైన లాంచీ సర్వీసులు
విజయపురిసౌత్ (మాచర్ల): పర్యాటక కేంద్రమైన నాగార్జునకొండకు లాంచీ సర్వీసులు పునః ప్రారంభమయ్యాయి. విజయపురిసౌత్ లోని లాంచీస్టేషన్ నుంచి జలవనరుల శాఖ ఏఈఈ కేవీ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో శనివారం నాగసిరి లాంచీని ప్రారంభించారు. కొండలో విధులు నిర్వహించే 30 మంది ఉద్యోగులతో నాగసిరి లాంచీ కొండకు వెళ్లింది. రెండేళ్లుగా కోవిడ్, భద్రతా కారణాలతో నాగార్జునకొండకు లాంచీ సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. చదవండి: కోడె ధర రూ.2 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట భద్రత నడుమ లాంచీలు నాగార్జునకొండకు తిప్పేందుకు అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో వారం రోజులపాటు పురావస్తుశాఖ సిబ్బంది కొండపై పిచ్చి మొక్కలను, ముళ్ల చెట్లను తొలగించి శుభ్రం చేయనున్నారు. అనంతరం పర్యాటకులను లాంచీల ద్వారా కొండకు చేరవేయనున్నట్లు అధికారులు తెలిపారు. -
కోటిపల్లి వద్ద పోటెత్తుతున్న వరద
సాక్షి, కోటిపల్లి(తూర్పు గోదావరి): గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అధికారులు లాంచి(పంటి) ప్రయాణాన్ని గురువారం తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించారు. గోదావరి పరిసర ప్రాంతాల్లో బలహీనంగా ఉన్న ప్రదేశాల్లో రక్షణ చర్యలను చేపట్టారు. కోటిపల్లి గెస్ట్‌హౌస్ వద్ద వరద ఉధృతిని తట్టుకునేందుకు కర్రలు, ఇసుక బస్తాలతో అవసరమైన ఏర్పాట్లు చేశారు. కోటిపల్లి వద్ద వరద ప్రవాహంపై అధికారులు ఎప్పటికప్పడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. వరదల నేపథ్యంలో నీటి పారుదల శాఖ, రెవెన్యూ శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పై అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కోటిపల్లి, ముక్తేశ్వరం నుంచి నిత్యం లాంచిలపై వెళ్లే వ్యాపారులు, కూలీలు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
లాంచీస్టేషన్ నిర్మాణానికి స్థలం అప్పగింత
నాగార్జునసాగర్ : అంతర్జాతీయ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‌లో శాశ్వతలాంచీస్టేషన్, జట్టీ, రోడ్డు నిర్మాణానికి టెండర్లు పూర్తికావడంతో పనులు చేసేందుకు తెంలగాణ పర్యాటక అభివృద్ధిసంస్థ అధికారులు స్థలాన్ని సంబంధిత కంపెనీకి గురువారం అప్పగించారు. రాష్ట్ర విభజనలో భాగంగా గతంలో సాగర్‌లో ఉన్న లాంచీస్టేషన్, జట్టీ, లాంచీలు ఆంధ్రప్రధేశ్ పర్యాటక అభివృద్ధిసంస్థకు వెళ్లాయి. దీంతో తాత్కాలిక లాంచీస్టేషన్ ద్వారా పర్యాటకులను నాగార్జునకొండకు పంపుతున్నారు. గత మూడేళ్ల క్రితమే లాంచీస్టేషన్ నిర్మాణానికిగాను నీతి అయోగ్ రూ.4.5కోట్ల నిధులు మంజూరు చేసింది. టూరిజం అధికారులు లాంచీస్టేషన్ నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో సాక్షిపత్రిక నిధులున్నా శాశ్వతలాంచీస్టేషన్ నిర్మించరా అని కథనాలను ప్రచురించింది. దీనికి స్పందించిన అ«ధికారులు ఎట్టకేలకు విజయవిహార్ దిగువభాగాన స్థలాన్ని నిర్ధారించి గతనెలలో టెండర్లు పిలిచారు. హిమసాయి కన్స్ట్రక్షన్కు నిర్మాణ పనుల కాంట్రాక్టర్‌ను దక్కిం చుకుంది. వారికి టూరిజం ఎస్ఈ క్రాంతికుమార్ నిర్మాణాలు చేయాల్సిన ప్రాంతాన్ని నిర్మాణ సంస్థ ప్రతినిధులకు చూయించారు. తొమ్మి మాసాల్లో పనులు పూర్తి ఈ సందర్భంగా ప్రాజెక్టు ఎస్ఈ క్రాంతికుమార్ మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలోనే బుద్ధిజానికి పెద్దపీటవేస్తూ సాగర్ జలాశయతీరంలో శ్రీపర్వతారామం నిర్మాణమవుతోంది. దీనికి దీటుగా అం తర్జాతీయ స్థాయిలో పర్యాటకులకు సౌకర్యవంతంగా ఉండేవిదంగా లాంచీస్టేషన్‌ను నిర్మిస్తామని పేర్కొన్నారు. దిగువకు ఎస్ ఆకారంలో రోడ్డు, నూతన సాంకేతికతను వినియోగించుకుని లాంచీస్టేషన్, జట్టీ నిర్మాణాలను తొమ్మిది మాసాల్లో పూ ర్తి చేస్తామని తెలిపారు. వీరి వెంట ఏఈ ఆంజనేయులు, అశోక్, మేనేజర్ హరి, సర్వేయర్ రవి, కాంట్రాక్టర్ కంకణాల ప్రవీణ్రెడ్డిలున్నారు. -
ఆ లాంచీ ప్రమాద నిందితులు దొరికారు
పశ్చిమగోదావరి ,పోలవరం: పోలవరం మండలంలోని వాడపల్లి వద్ద గోదావరి నదిలో ఈ నెల 15న జరిగిన లాంచీ ప్రమాద ఘటనకు సబంధించి నిందితులను అరెస్ట్ చేసినట్టు దర్యాప్తు అధికారి, పోలవరం డీఎస్పీ ఏటీవీ రవికుమార్ తెలిపారు. పోలవరం పోలీస్ స్టేషన్లో గురువారం ఆయన విలేకరులకు ప్రమాదం జరగటానికి కారణాలను వెల్లడించారు. దేవిపట్నంలో ప్రయాణికులను ఎక్కించుకున్న లక్ష్మీవెంకటేశ్వర లాంచీ మంటూరు–వాడపల్లి గ్రామాల మధ్యకు వచ్చేసరికి ఈదురు గాలులు వీచాయన్నారు. దీంతో ప్రయాణికులు లాంచీని నిలిపివేయమని కోరినా, నిర్లక్ష్యంగా లాంచీ నడిపి ప్రమాదానికి కారణమైన లాంచీ యజమాని షేక్ ఖాజామొహిద్దీన్, సరంగు బండి మోహనరావును అరెస్ట్ చేశామని చెప్పారు. వీరికి సరంగు లైసెన్సులు కూడా లేవని తెలిపారు. వీరిని వైద్యపరీక్షల అనంతరం కోర్టుకు హాజరు పరుస్తామన్నారు. నిందితులు కోండ్రుకోట వీఆర్వో ఎదుట లొంగిపోయారని చెప్పారు. ప్రమాద సమయంలో లాంచీలో సిమెంట్ బస్తాలు, ఇతర సామగ్రి ఉన్నాయన్నారు. లాంచీ తలుపులు మూసివేయటంతో గాలిపోయే మార్గంలేక లాంచీపై ఒత్తిడి పెరిగిందన్నారు. లాంచీలో లైఫ్ జాకెట్లు ఉన్నా వాటిని ప్రయాణీకులకు ఇవ్వలేదన్నారు. 304 పార్ట్–2 సెక్షన్ కింద కేసు నమోదు చేశామన్నారు. ప్రయాణికులకు రక్షణ చర్యలు చేపట్టే వరకు, నిబంధనలు పూర్తిగా పాటించే వరకు లాంచీలకు, బోట్లకు అనుమతి ఇచ్చేది లేదన్నారు. అధికారులు లాంచీలు, బోట్లు తనిఖీ చేస్తున్నారని తెలిపారు. సెప్టెంబర్ 1 నుంచి కొత్త నిబందనలు అమలులోకి వస్తాయని, వాటిని తప్పనిసరిగా పాటించాలన్నారు. పోలవరం సీఐ ఎం.రమేష్‌బాబు, ఎస్సై కె.శ్రీహరిరావు పాల్గొన్నారు. -
ముంబై-గోవాల మధ్య లాంచీ సేవలు
రూ. 868 కోట్ల ప్రాజెక్టుకు సిద్ధమవుతున్న ప్రతిపాదనలు సాక్షి, ముంబై: ముంబై-గోవాల మధ్య జలరవాణ మార్గాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నాలు మళ్లీ మొదలయ్యాయి. కొద్ది రోజుల కిందట ఈ ప్రతిపాదన తెరమీదకు వచ్చినప్పటికీ అనివార్య కారణాల వల్ల అది అటకెక్కింది. అయితే రోడ్డు మార్గం ద్వారా రాకపోకలు సాగించే ప్రజారవాణా సదుపాయాలపై ప్రయాణికుల భారం విపరీతంగా పడుతోంది. ఈ భారాన్ని తగ్గించాలంటే ముంబై-గోవాల మధ్య లాంచి సేవలు ప్రారంభించాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో ప్రభుత్వం ఆ దిశగా మళ్లీ సన్నాహాలు చేస్తోంది. సుమారు 500 మంది ప్రయాణించే సామర్థ్యంగల స్టీమర్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ముంబై-గోవా మధ్య స్టీమర్లను ప్రారంభిస్తే గణపతి పుళే, మాల్వణ్, వెంగుర్లా, తార్కలి ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. విలువైన సమయంతోపాటు చార్జీలు కూడా గిట్టుబాటు అవుతాయి. అదే రోడ్డు మార్గం మీదుగా వెళ్లాలంటే వ్యయప్రయాసాలను భరించాల్సి వస్తోంది. ముంబైలోని భావుచా ధక్కా నుంచి నేరుల్ వయా జేఎన్పీటీ, అలాగే నారిమన్ పాయింట్ నుంచి జుహూ టెర్మినల్, మార్వే నుంచి బోరివలి ఇలా లాంచి సేవలు అందుబాటులోకి తీసుకురావడం వల్ల ప్రయోజనకరంగా ఉటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకు రూ.868 కోట్ల ప్రాజెక్టుకు ప్రతిపాదనలను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. దాదాపు రెండు దశాబ్దాల కిందట కొంకణ్ శక్తి, కొంకణ్ సేవక్ పేరుతో రెండు లాంచీలు ముంబై-గోవా మధ్య ప్రయాణించేవి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ సేవలు నిలిపివేశారు. అనంతరం దమానియా షిప్పింగ్ కంపెనీ కొన్ని నెలలపాటు హోవర్ క్రాఫ్ట్ సేవలు అందించింది. ఇవి కూడా మూతపడిపోయాయి. దీంతో ప్రభుత్వం ఆధ్వర్యంలో లాంచీ సేవలను ప్రారంభించాలనే డిమాండ్లు పెరగడంతో అందుకు అవసరమైన టెండర్లను పిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సేవలు అందించే బాధ్యత మేరీ టైమ్ బోర్డుకు అప్పగించాలని యోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది.