మహబూబ్‌నగర్: ఇటీవల కురిసిన వర్షాలకు కృష్ణానదికి వరదలు రావడంతో శ్రీశైలం ప్రాజెక్టులో బ్యాక్‌వాటర్ క్రమంగా పెరుగుతోంది. దీంతో కృష్ణానది తీర ప్రాంతాలు ఆహ్లాదకరంగా మారాయి. నదీ అందాలతోపాటు ప్రకృతి సోయగాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు విచ్చేస్తున్నారు. సోమశిల సమీపంలోని కృష్ణానదిలో పర్యాటకులు విహరించేందు కోసం పర్యాటక శాఖ లాంచీలు ముస్తాబయ్యాయి. సోమశిల సమీప ప్రాంతాలతోపాటు శ్రీశైలం వరకు నదిలో ప్రయాణాలు సాగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
పర్యాటక శాఖ ఆధ్వర్యంలో..
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని సోమశిలలో పర్యాటక శాఖ రెండు లాంచీలను ఏర్పాటు చేసింది. ఎనిమిదేళ్ల క్రితం సోమేశ్వర అనే పేరుతో మినీ నాన్ ఏసీ లాంచీని ఏర్పాటు చేసి శ్రీశైలం వరకు నదీ ప్రయాణం కల్పించింది. అప్పట్లో లాంచీ ప్రయాణానికి పర్యాటకులు ఉత్సాహం చూపించారు. పర్యాటకుల తాకిడి పెరగడంతో 2019లో స్వదేశి దర్శన్ నిధులు రూ.2.5 కోట్లతో 120 మంది ప్రయాణించేందుకు వీలుగా మరో ఏసీ లాంచీని ఏర్పాటు చేశారు. దీనినే ప్రస్తుతం సోమశిల నుంచి శ్రీశైలం వరకు నదిలో ప్రయాణించేందుకు వినియోగిస్తున్నారు. మినీ నాన్ ఏసీ సోమేశ్వర లాంచీని మాత్రం సోమశిల పరిసర ప్రాంతాల్లోనే తిప్పుతున్నారు.
సోమశిల పరిసరాల్లో..
ఈ ఏడాది వర్షాలు సరిగా కురవకపోవడంతో నదిలోకి నీరు చేరడం ఆలస్యమైంది. కొన్ని రోజులుగా శ్రీశైలం ప్రాజెక్టుకు వరద జలాలు చేరుతుండటంతో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం సోమశిల సమీపంలో పుష్కర ఘాట్ల వద్దకు నీళ్లు చేరుకున్నాయి. దీంతో మినీ నాన్‌ఏసీ లాంచీ ప్రయాణాలను పర్యాటక శాఖ అధికారులు ప్రారంభించారు. ఇక శ్రీశైలానికి తిప్పే ఏసీ లాంచీ ప్రయాణాలు ప్రారంభమయ్యేందుకు మాత్రం కొంత సమయం పడుతుందని చెబుతున్నారు. రెండు లాంచీలను శుభ్రం చేసి నది ప్రయాణాలకు సిద్ధంగా ఉంచారు.
త్వరలోనే ప్రారంభిస్తాం..
కృష్ణానదిలో పర్యాటకులు విహరించేందుకు లాంచీ ప్రయాణాలు ప్రారంభించాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సోమశిలలోని రెండు లాంచీలను నదీ ప్రయాణాల కోసం అందుబాటులోకి వచ్చాయి. అలాగే శ్రీశైలం టూర్‌కు దాదాపుగా 70 మంది ప్రయాణికులు ఉంటేనే లాంచీ తిప్పుతాం. లేదంటే నిర్వహణ భారం మీదపడుతుంది. మినీ లాంచీ టికెట్ల ధరలో ఇప్పుడు ఎలాంటి మార్పులు లేవు. శ్రీశైలానికి తిప్పే ఏసీ లాంచీ ధరలను ఈనెలాఖరులోగా అధికారులు నిర్ణయిస్తారు. – రాజేష్‌గౌడ్, లాంచీ నిర్వహణ పర్యవేక్షకుడు
టూర్‌కు పర్యాటకుల కొరత..
శ్రీశైలం లాంచీని 2019లో ప్రారంభించాక ఇప్పటి వరకు కేవలం 20 సార్లు మాత్రమే సోమశిల– శ్రీశైలం మధ్య తిప్పారు. 2019లో నాలుగు సార్లు, 2020లో 11 సార్లు తిప్పగా.. 2021లో ఒక్కసారి కూడా తిప్పలేదు. 2022లో మాత్రం 5 సార్లు లాంచీ ప్రయాణం సాగింది. శ్రీశైలానికి లాంచీలో ప్రయాణించాలంటే కనీసం 70 మంది ప్రయాణికులు ఉండాలి. లేదా రూ.1.30 లక్షలకు పైగా చార్జీల రూపంలో చెల్లించాలి. అలా అయితేనే లాంచీ ప్రయాణం ప్రారంభిస్తారు. అంతమంది ఒకేసారి రాకపోవడంతో ఆశించిన స్థాయిలో శ్రీశైలం టూర్ ప్రయాణాలు పెద్దగా సాగడం లేదు.
పాతాళగంగ వరకు..
సోమశిల నుంచి శ్రీశైలం వరకు పర్యాటకులను తీసుకువెళ్లేందుకు ఏసీ లాంచీ ఏర్పాటు చేశారు. కానీ, ఇప్పుడు అది శ్రీశైలం వరకు కాకుండా ఈగలపెంట వద్దే ఆపుతున్నారు. అక్కడి నుంచి మరో 21 కి.మీ., మేరకు బస్సులో ప్రయాణించి శ్రీశైలం చేరుకోవాల్సి ఉంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న సరిహద్దుల కారణంగా పర్యాటక శాఖ లాంచీ పాతాళగంగ వద్దకు వెళ్లడం లేదు. పర్యాటక శాఖ అధికారులు స్పందించి పాతాళగంగ వద్దకు పర్యాటకులను చేర్చేలా చర్యలు చేపట్టాలి. అలాగే నదీ ప్రయాణంలో ఒకటి లేదా రెండుచోట్ల కొద్దిసేపు పర్యాటకులు విరామం తీసుకునేలా షెల్టర్లు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. – శ్రీనివాసులు, కొల్లాపూర్
మినీ లాంచీకి డిమాండ్..
సోమశిల పరిసరాల్లో మాత్రమే తిప్పే సోమేశ్వర లాంచీ (మినీ నాన్‌ఏసీ లాంచీ)లో విహరించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. ఈ లాంచీలో 15 నిమిషాలపాటు తిప్పేందుకు ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.50, చిన్నపిల్లలకు రూ.30 చొప్పున వసూలు చేస్తున్నారు.
20 మంది ప్రయాణికులు జమ అయితే ఈ లాంచీని నదిలో తిప్పుతారు. ఒకవేళ ఎవరైనా రూ.4 వేలు చెల్లిస్తే గంటపాటు వారి బృందం మొత్తాన్ని నదిలో తిప్పుతారు. ఈ ధరలు తక్కువగా ఉండడంతో చాలామంది పర్యాటకులు సోమేశ్వర లాంచీలో తిరిగేందుకు ఇష్టపడుతున్నారు. ఈ లాంచీ ద్వారా పర్యాటక శాఖకు ప్రతినెలా రూ.లక్షకుపైగా ఆదాయం లభిస్తోంది. శ్రీశైలం టూర్‌కు తిప్పే ఏసీ లాంచీ ప్రయాణ చార్జీలు అధికంగా ఉండటంతో పర్యాటకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment