ముంబై-గోవాల మధ్య లాంచీ సేవలు
రూ. 868 కోట్ల ప్రాజెక్టుకు సిద్ధమవుతున్న ప్రతిపాదనలు
సాక్షి, ముంబై: ముంబై-గోవాల మధ్య జలరవాణ మార్గాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నాలు మళ్లీ మొదలయ్యాయి. కొద్ది రోజుల కిందట ఈ ప్రతిపాదన తెరమీదకు వచ్చినప్పటికీ అనివార్య కారణాల వల్ల అది అటకెక్కింది. అయితే రోడ్డు మార్గం ద్వారా రాకపోకలు సాగించే ప్రజారవాణా సదుపాయాలపై ప్రయాణికుల భారం విపరీతంగా పడుతోంది.
ఈ భారాన్ని తగ్గించాలంటే ముంబై-గోవాల మధ్య లాంచి సేవలు ప్రారంభించాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో ప్రభుత్వం ఆ దిశగా మళ్లీ సన్నాహాలు చేస్తోంది. సుమారు 500 మంది ప్రయాణించే సామర్థ్యంగల స్టీమర్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ముంబై-గోవా మధ్య స్టీమర్లను ప్రారంభిస్తే గణపతి పుళే, మాల్వణ్, వెంగుర్లా, తార్కలి ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
విలువైన సమయంతోపాటు చార్జీలు కూడా గిట్టుబాటు అవుతాయి. అదే రోడ్డు మార్గం మీదుగా వెళ్లాలంటే వ్యయప్రయాసాలను భరించాల్సి వస్తోంది. ముంబైలోని భావుచా ధక్కా నుంచి నేరుల్ వయా జేఎన్‌పీటీ, అలాగే నారిమన్ పాయింట్ నుంచి జుహూ టెర్మినల్, మార్వే నుంచి బోరివలి ఇలా లాంచి సేవలు అందుబాటులోకి తీసుకురావడం వల్ల ప్రయోజనకరంగా ఉటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకు రూ.868 కోట్ల ప్రాజెక్టుకు ప్రతిపాదనలను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది.
దాదాపు రెండు దశాబ్దాల కిందట కొంకణ్ శక్తి, కొంకణ్ సేవక్ పేరుతో రెండు లాంచీలు ముంబై-గోవా మధ్య ప్రయాణించేవి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ సేవలు నిలిపివేశారు. అనంతరం దమానియా షిప్పింగ్ కంపెనీ కొన్ని నెలలపాటు హోవర్ క్రాఫ్ట్ సేవలు అందించింది. ఇవి కూడా మూతపడిపోయాయి. దీంతో ప్రభుత్వం ఆధ్వర్యంలో లాంచీ సేవలను ప్రారంభించాలనే డిమాండ్లు పెరగడంతో అందుకు అవసరమైన టెండర్లను పిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సేవలు అందించే బాధ్యత మేరీ టైమ్ బోర్డుకు అప్పగించాలని యోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది.