విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న దర్యాప్తు అధికారి, పోలవరం డీఎస్పీ రవికుమార్. వెనుక చేతులు కట్టుకుని నిలుచున్న వారు నిందితులు
పశ్చిమగోదావరి ,పోలవరం: పోలవరం మండలంలోని వాడపల్లి వద్ద గోదావరి నదిలో ఈ నెల 15న జరిగిన లాంచీ ప్రమాద ఘటనకు సబంధించి నిందితులను అరెస్ట్ చేసినట్టు దర్యాప్తు అధికారి, పోలవరం డీఎస్పీ ఏటీవీ రవికుమార్ తెలిపారు. పోలవరం పోలీస్ స్టేషన్‌లో గురువారం ఆయన విలేకరులకు ప్రమాదం జరగటానికి కారణాలను వెల్లడించారు. దేవిపట్నంలో ప్రయాణికులను ఎక్కించుకున్న లక్ష్మీవెంకటేశ్వర లాంచీ మంటూరు–వాడపల్లి గ్రామాల మధ్యకు వచ్చేసరికి ఈదురు గాలులు వీచాయన్నారు. దీంతో ప్రయాణికులు లాంచీని నిలిపివేయమని కోరినా, నిర్లక్ష్యంగా లాంచీ నడిపి ప్రమాదానికి కారణమైన లాంచీ యజమాని షేక్ ఖాజామొహిద్దీన్, సరంగు బండి మోహనరావును అరెస్ట్ చేశామని చెప్పారు. వీరికి సరంగు లైసెన్సులు కూడా లేవని తెలిపారు.
వీరిని వైద్యపరీక్షల అనంతరం కోర్టుకు హాజరు పరుస్తామన్నారు. నిందితులు కోండ్రుకోట వీఆర్వో ఎదుట లొంగిపోయారని చెప్పారు. ప్రమాద సమయంలో లాంచీలో సిమెంట్ బస్తాలు, ఇతర సామగ్రి ఉన్నాయన్నారు. లాంచీ తలుపులు మూసివేయటంతో గాలిపోయే మార్గంలేక లాంచీపై ఒత్తిడి పెరిగిందన్నారు. లాంచీలో లైఫ్ జాకెట్లు ఉన్నా వాటిని ప్రయాణీకులకు ఇవ్వలేదన్నారు. 304 పార్ట్–2 సెక్షన్ కింద కేసు నమోదు చేశామన్నారు. ప్రయాణికులకు రక్షణ చర్యలు చేపట్టే వరకు, నిబంధనలు పూర్తిగా పాటించే వరకు లాంచీలకు, బోట్లకు అనుమతి ఇచ్చేది లేదన్నారు. అధికారులు లాంచీలు, బోట్లు తనిఖీ చేస్తున్నారని తెలిపారు. సెప్టెంబర్ 1 నుంచి కొత్త నిబందనలు అమలులోకి వస్తాయని, వాటిని తప్పనిసరిగా పాటించాలన్నారు. పోలవరం సీఐ ఎం.రమేష్‌బాబు, ఎస్సై కె.శ్రీహరిరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment