సాక్షి, విజయవాడ : సర్వలోకపావని.. జగన్మాత కనకదుర్గమ్మను సరస్వతీదేవి అలంకారంలో దర్శించుకునేందుకు అశేష భక్తజనవాహిని ఇంద్రకీలాద్రికి తరలివచ్చింది. ఎటుచూసినా జనం.. ఎక్కడ విన్నా దుర్గమ్మ నామస్మరణతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అమ్మ జన్మనక్షత్రమైన మూలానక్షత్రం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఇంద్రకీలాద్రి కళకళలాడింది.
క్యూలైన్లు కిలోమీటర్ల కొద్దీ బారులు తీరాయి. రద్దీ దృష్ట్యా గురువారం వేకువజామున 1.45 గంటల నుంచే అమ్మ దర్శనానికి భక్తులను అనుమతించారు. బుధవారం అర్ధరాత్రి నుంచే క్యూలైన్‌లో వేచి ఉన్నవారు తొలి దర్శనం చేసుకుని పులకించిపోయూరు. రద్దీ గురువారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. ఉదయం గంటన్నరలోపే దర్శనం కాగా, సాయంత్రం నాలుగు గంటల సమయం పట్టింది. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయూయి. ఒకదశలో బొడ్డుబొమ్మ సెంటర్‌ను దాటాయి. రద్దీ ఎక్కువగా ఉండటంతో ముందుగా నిర్ణయించినట్టే అంతరాలయ దర్శనం రద్దుచే శారు. కేవలం ముఖమండప దర్శనం చేయించారు. టికెట్లు రద్దుచేసి భక్తులకు అన్ని క్యూల్లోనూ ఉచిత ప్రవేశం కల్పించారు.
జోరువానను సైతం లెక్కచేయకుండా..
ఫైలిన్ తుపాను కారణంగా బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు జోరున వర్షం కురుస్తూనే ఉంది. భక్తులు వర్షాన్ని, చలిని సైతం లెక్కచేయకుండా దర్శనానికి వచ్చారు.
ప్రముఖుల రాక
రాష్ర్ట ప్రభుత్వం తరఫున దుర్గమ్మకు మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కె.పార్థసారథి పట్టువస్త్రాలు సమర్పించారు. రాష్ర్ట గిరిజన సంక్షేమశాఖ మంత్రి పసుపులేటి బాలరాజు, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సతీమణి రాధికారెడ్డి, సీపీ బత్తిన శ్రీనివాస్ దంపతులు, సినీ నటుడు రాజేంద్రప్రసాద్, దర్శకుడు అడ్డాల శ్రీను తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.
మూడు విడతలుగా కుంకుమార్చన
మూలానక్షత్రాన్ని పురస్కరించుకుని భవానీదీక్షా మండపంలో మూడు విడతలుగా కుంకుమార్చన జరిగింది. ఉభయదాతల రద్దీ ఎక్కువగా ఉండటంతో అధికారులు త్వరత్వరగా దర్శనం చేయించి పంపించేందుకు ప్రయత్నించారు.
కొండపైకి వాహనాల అనుమతి రద్దు
భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో గురువారం తెల్లవారుజాము నుంచి కొండపైకి వీఐపీ, మీడియా వాహనాలను అనుమతించలేదు. దేవస్థానం రెండు బస్సులను కూడా నిలిపివేయడంతో వృద్ధులు, వికలాంగులు కొండపైకి చేరుకునేందుకు ఇబ్బందులు పడ్డారు. ఎన్‌సీసీ వలంటీర్ల సహాయంతో ఆలయూనికి చేరుకున్నారు. ఒకానొక సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం, దర్శనానికి మూడు గంటల సమయం పట్టడంతో పలువురు భక్తులు నీరసించి క్యూలైన్‌లోనే కుప్పకూలిపోయూరు. సీపీ శ్రీనివాసులు, సబ్ కలెక్టర్ హరిచందన, ఈవో ప్రభాకర శ్రీనివాస్ తదితరులు ఎప్పటికప్పుడు ఆలయంలో కలియ తిరుగుతూ ఏర్పాట్లు పర్యవేక్షించారు.
ముఖ్యమంత్రి భార్య రాకతో పోలీసుల హల్‌చల్
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సతీమణి రాధికారెడ్డి రాకతో పోలీసులు హడావుడి చేశారు. జాతీయ రహదారిపై రాజగోపురం వద్ద అరగంట సేపు వాహనాలు నిలిపివేయడంతో ప్రయూణికులు ఇబ్బందులు పడ్డారు. వృద్ధులు, వికలాంగులు నడుచుకుంటూ వస్తున్నా పట్టించుకోని అధికారులు ముఖ్యమంత్రి సతీమణి వాహనాన్ని రాజగోపురం వరకు తీసుకొచ్చి ప్రభుభక్తిని చాటుకున్నారు.
సరస్వతీదేవిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ: పోటెత్తిన భక్తజనం
Published Fri, Oct 11 2013 2:04 AM | Last Updated on Fri, Nov 9 2018 6:22 PM
Advertisement