దేశమంతటా పెద్దఎత్తున జరుపుకొనే పండగల్లో ఒకటైన ‘దసరా’ను పదిరోజుల పాటు వేడుకగా జరుపుకుంటారు. అందులో భాగంగా ఆ అమ్మను సేవించడం, ఆమె కొలువు తీరి ఉన్న ప్రాంతాలను దర్శించుకుని భక్తితో తన్మయులం కావడం సహజం. అందుకే ఈ పండుగ రోజులలో దేశవ్యాప్తంగా వెలసిన అష్టాదశ శక్తిపీఠాలు, అమ్మవారి ఆలయాలు భక్తజన సంద్రాలుగా మారతాయి. అయితే ఇలా విభిన్న పేర్లతో, వేర్వేరు రూపాల్లో ఆయా ప్రాంతాల్లో కొలువైన ఆ ఆదిపరాశక్తి నామాల మీదుగా ఏకంగా కొన్ని నగరాలు... ఆ మాటకొస్తే మహానగరాలే వెలశాయంటే నమ్మశక్యం కాకపోవచ్చు కానీ అది ముమ్మాటికీ నిజం. దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారి పేర్ల మీద వెలసిన కొన్ని నగరాలు, వాటి ప్రాశస్త్యం గురించి తెలుసుకుందాం..
కాళీ ఘాట్ పేరు... కోల్‌కతా
మామూలుగానే కోల్‌కతా పేరు చెప్పగానే కాళీమాత నిండైన విగ్రహమే మనో ఫలకంలో మెదులుతుంది. ఇక దసరా సందర్భంగా అయితే కోల్‌కతా మహా నగరంలో అమ్మవారి మండపాలే దర్శనమిస్తుంటాయి. ఇంతకూ కోల్‌కతాకు ఆ పేరు రావడానికి కారణమేమిటో తెలుసా? కోల్‌కతా అనేది బెంగాలీ భాషలోని కాలిక్ క్షేత్ర అనే పదం నుంచి ఉద్భవించింది.
కాలిక్ క్షేత్ర అంటే.. కాళికా దేవి నిలయమైన ప్రాంతం అని అర్థం. ఎర్రటి కళ్లతో, నల్లటి రూపంతో, నాలుక బయటపెట్టి ఎంతో గంభీరంగా కనిపించే ఈ దేవి తనను భక్తి శ్రద్ధలతో పూజించే భక్తులను దయతో కా΄ాడుతుంది. అలాగే ‘కాళీఘాట్’ అనే పదం నుంచి ఈ నగరానికి కోల్‌కతా అనే పేరొచ్చినట్లు మరో కథనం ప్రచారంలో ఉంది. ఇక్కడ కాళీమాత కొలువైన ‘కాళీఘాట్ కాళీ దేవాలయా’నికి 200 ఏళ్ల చరిత్ర ఉన్నట్లు స్థల పురాణం.
ముంబయి – ముంబాదేవి
ముంబాయికి దక్షిణ ముంబయిలోని బులేశ్వర్ అనే ప్రాంతంలో కొలువైన ఆలయంలోని ముంబాదేవి పేరు మీదుగానే ఆ పేరు వచ్చిందని ప్రతీతి. వెండి కిరీటం, బంగారు కంఠసరి, ముక్కుపుడకతో అత్యంత శోభాయమానంగా విరాజిల్లుతుంటుంది అమ్మవారు.
పార్వతీమాత కాళికా దేవిగా అవతారమెత్తే క్రమంలో పరమ శివుని ఆదేశం మేరకు ఇప్పుడు ముంబయిగా పిలుస్తోన్న ప్రాంతంలో ఓ మత్స్యకారుల వంశంలో జన్మించిందట. మత్స్యాంబ అనే పేరుతో పుట్టిన అమ్మవారు అవతారం చాలించే సమయంలో మత్స్యకారుల కోరిక మేరకు ‘మహా అంబ’గా వెలిసిందని, కాలక్రమేణా ఆమె పేరు ‘ముంబా దేవి’గా మారినట్లు స్థల పురాణం చెబుతోంది.
శ్యామలా దేవి పేరే సిమ్లాకు
సిమ్లా.. సాక్షాత్తూ ఆ కాళీ మాతే శ్యామలా దేవిగా వెలసిన నగరం కాబట్టే సిమ్లాకు ఆ పేరు వచ్చిందని స్థలపురాణం చెబుతోంది. ఈ గుడిని 1845లో బ్రిటిష్ పరిపాలనా కాలంలో బెంగాలీ భక్తులు జకు అనే కొండపై నిర్మించారట! ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో శ్యామవర్ణంలో మెరిసే దుర్గామాత రూపం చూపరులను కట్టిపడేస్తుంది.
చండీ మందిర్...చండీగఢ్
చండీ అంటే పార్వతీ దేవి ఉగ్ర రూపమైన చండీ మాత అని, గఢ్ అంటే కొలువుండే చోటు అని అర్థం.. ఇలా ఈ నగరానికి చండీగఢ్ అని పేరు రావడానికి అక్కడ కొలువైన ‘చండీ మందిర్’ దేవాలయమే కారణం.
చండీగఢ్‌కు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంచకుల జిల్లాలో కల్క పట్టణంలో కొండపై వెలసిందీ దేవాలయం. ఈ చండీ గుడి, మాతా మానసి దేవి ఆలయం నుంచి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి నుంచి కనుచూపు మేరలో గల శివాలిక్ కొండలు ఈ ఆలయానికి అదనపు సొబగులు.
మంగళూరు... మంగళాదేవి
కర్ణాటకలోని ముఖ్య పట్టణాల్లో ఒకటైన మంగళూరుకు ఇక్కడ కొలువైన మంగళాదేవి పేరు మీదే ఆ పేరొచ్చింది. పురాణాల ప్రకారం.. మంగళాదేవి ఆలయాన్ని పరశురాముడు నెలకొల్పినట్లు తెలుస్తుంది. నేపాల్ నుంచి వచ్చిన కొందరు సాధువుల సూచన మేరకు 9వ శతాబ్దంలో తులునాడును పరిపాలించిన అలుపారాజ వంశస్థుడు కుందవర్మన్ ఈ ఆలయాన్ని కేరళ శిల్పకళా రీతిలో కట్టించాడు.
ప్రతిసారీ దసరా శరన్నవరాత్రుల సమయంలో మంగళాదేవికి ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దశమి రోజు అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరించిన తర్వాత నిర్వహించే రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది.
పటన్ దేవి పేరుతో పట్నా
పట్నాకు ఆ పేరు రావడానికి శక్తి స్వరూపిణి అయిన ‘పతన్ దేవి’ అమ్మవారు కొలువైన ఆలయమే కారణం. ఈ ఆలయం 51 సిద్ధ శక్తిపీఠాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. పురాణ గాథల ప్రకారం.. దక్షయజ్ఞం సమయంలో ఆత్మాహుతి చేసుకున్న సతీదేవి శరీరాన్ని మహావిష్ణువు ముక్కలుగా ఖండించగా, కుడి తొడభాగం ఈ ప్రాంతంలో పడిందట! అలా వెలసిన అమ్మవారిని మొదట్లో ‘సర్వానంద కారి పతనేశ్వరి’ అనే పేరుతో కొలిచేవారు. కాలక్రమంలో.. ఆ పేరు ‘పతనేశ్వరి’గా, ఇప్పుడు ‘పతన్ దేవి’గా రూపాంతరం చెందుతూ వచ్చింది.
నైనాదేవి పేరుతో నైనితాల్ నగరం
దక్షయజ్ఞంలో దహనమైన సతీదేవి శరీరాన్ని ఖండించినప్పుడు ఆమె నేత్రాలు ఈ ప్రదేశంలో పడినట్లుగా స్థలపురాణం చెబుతోంది. మహిషాసురుడిని సంహరించిన కారణంగా నైనాదేవిని, మహిషపీత్ అని కూడా పిలుస్తారు.
అలా మహిషుణ్ణి సంహరించిన సమయంలో దేవతలందరూ అమ్మవారిని ‘జై నైనా’ అంటూ నినదించడం వల్ల ఈ అమ్మవారు ‘‘నైనా దేవి’గా పూజలందుకుంటోందట. శక్తిపీఠాలలో ఒకటైన ఈ ఆలయంలో విజయదశమి ఉత్సవాలు మహాద్భుతంగా జరుగుతాయి.
మరికొన్ని ప్రదేశాలు
త్రిపుర – త్రిపుర సుందరి
మైసూరు – మహిషాసుర మర్దిని
కన్యాకుమారి – కన్యాకుమారి దేవి
తుల్జాపుర్ – తుల్జా భవాని (మహారాష్ట్ర)
హస్సాన్ – హసనాంబె (కర్ణాటక)
అంబాలా – భవానీ అంబా దేవి (హరియాణా)
– డి.వి.ఆర్. భాస్కర్
(చదవండి: బలి తంతు లేకుండా జరిగే 'పూల తల్లి ఆరాధన'..! ఇక్కడ దసరా..)
Comments
Please login to add a commentAdd a comment