ఇవాళ సద్దుల బతుకమ్మ. తెలంగాణ అంతటా స్త్రీలు పూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో గౌరమ్మను కొలుస్తారు. ఈ సందర్భంగా స్థానిక సంస్కృతిలో బతుకమ్మ విశిష్ఠతను వివరిస్తున్నారు
ప్రసిద్ధ చారిత్రక పరిశోధకులు జయధీర్ తిరుమలరావు.
ఆదివాసీ సంస్కృతులలో అమ్మతల్లి ఆరాధన గురించి..?
ఆదివాసీ సంస్కృతిలో, వారి జీవితంలో స్త్రీ దేవతారాధన విడదీయరానిది. ఆదివాసీలలోనే కాదు శ్రామిక జీవితంలో, జానపద సమాజంలో అమ్మదేవతలు విశిష్ట స్థానంలో ఉంటారు. ఆదిమ కాలంలో వ్యవసాయానికి స్త్రీలే పునాది వేశారు. బీజం, క్షేత్రం స్త్రీ అనుభవం. పునరుత్పత్తి భావనకి స్త్రీ ఆలంబన. విత్తనాలు నాటడం, కలుపు తీయడం, కోత కోయడం అంతా స్త్రీలే. పొలంలో పంట తీయడం, గర్భంలో శిశువుని మోయడం రెండూ స్త్రీల వంతే.
అంతేకాదు, దానికి కావలసిన భాషని సృజించుకున్నదీ స్రీయే. భాషని సాహిత్యీకరించినదీ వారే. అనేక రకాల పాటలు పాడటం, పూజకు కావల్సిన కర్మకాండని తీర్చిదిద్దినదీ వారే. ఆ విధంగా స్త్రీ అనేక రంగాలలో, అనేక రూపాలతో తన శక్తి సామర్థ్యాలను వ్యక్తం చేసింది. మహత్తులను చూపి అమ్మదేవతారాధనకి ఆలంబన అయ్యింది. ఒక్కో అంశానికి ఒక్కో దేవతని ఏర్పరుచుకుని ఆయా రుతువులలో, పంటల కాలంలో దేవతారాధన చేశారు.
ఆయా దేవతలను జ్ఞాపకం చేసుకోవడం, పూజించడం, రాబోయే తరాలకు వారిని జ్ఞాపకం చేయడం జరుగుతోంది. మాతృస్వామ్య వ్యవస్థ ప్రాధాన్యత అమ్మతల్లి ఆరాధనకు పట్టుగొమ్మ. అందులో భాగమే బతుకమ్మ. జన్మనిచ్చి, బతకడానికి అన్ని రకాలుగా చేయూతనిచ్చే ఆరాధన ఉంది. ప్రస్తుత కాలంలో ఆదివాసుల సమ్మక్క సారలమ్మలు, మైదాన ప్రాంతాల బతుకమ్మ పండగలు రోజు రోజుకూ ప్రాచుర్యం పొందుతున్నాయి.
ఈ పరంపరను ఎలా అర్థం చేసుకోవాలి?
బతుకమ్మ పండగ ప్రధానంగా తెలంగాణ స్త్రీల పండగ. దీనినే పూల పండగ అంటారు. ఎలాంటి బలి తంతు లేకుండా జరిగే క్రతువు. ఆ రోజు శాకాహారమే. బతుకమ్మలో ఆహారం, నృత్యం, పాట, సంగీతం అన్నీ సమపాళ్లల్లో కలగలసి ఉంటాయి. చాలారకాల ఆదివాసుల నృత్యాలు వర్తులాకార నృత్యాలే. పాల్గొనే స్త్రీలు అందరూ గుండ్రంగా చేరతారు. గుండ్రంగా కదులుతూ వంగుతూ, లేస్తూ, చప్పట్లు కొడుతూ చక్కని సంగీతాన్ని సృష్టిస్తారు. వారు తమ శరీర లయకు అనుగుణంగా పాటల్ని పాడతారు. ఒకరు ప్రధాన గాయనిగా పాటని అందుకుంటే మిగతావారు సామూహికంగా లయాత్మకంగా పాడతారు. బొడ్డెమ్మ, బతుకమ్మ వంటి ఆటపాటలలో, పండగలో స్త్రీలదే ప్రధాన పాత్ర. ఈ పండగలో స్త్రీలు అందరూ సమానమే.
పాటల రాగం చేతులతో చప్పట్లు మోగించే శైలిలో పాడబడుతుంది. ఇదే విధానం తెలంగాణ అంతటా కనిపించడం విశేషం. ప్రతిరోజు కొత్త ధాన్యంతో రకరకాల పిండివంటలు చేసి అందరూ కలిసి పంచుకుని భుజించడం ఆనవాయితి. ఇక్కడ కులాల, అంతస్తుల ప్రమేయం కనిపించదు. కాని మారిన కాలంలో కులాలవారీగా కట్టుకున్న అపార్టమెంట్ల మాదిరిగా అక్కడక్కడా కులభావన కనిపించడం మరీ ఆధునికం.
కాని బతుకమ్మ పండగలో స్త్రీల సంప్రదాయ బలం లోతు చాలా ఎక్కువ. అందుకే దేశంలోని వేరే రాష్ట్రాలలో జరిగే పూల పండగల కన్నా ఎంతో విలక్షణంగా, ప్రత్యేకంగా నేటికీ జరుగుతున్నది. ఈ పరంపర తెలంగాణకి ప్రత్యేకం. సుమారు వేయి సంవత్సరాల చరిత్ర దీనికి ఉందని చెప్పవచ్చు. పండగ సందర్భంగా సోదరిని పుట్టింటికి తీసుకురావడం అనే ఆచారం కూడా కొనసాగడం గమనించాలి.
బతుకమ్మ ఆంధ్ర, రాయలసీమలో ఎందుకు కానరాదు?
నిజానికి పూల పండగ మనదేశంలో కేరళ రాజస్థాన్, గుజరాత్ వంటి రాష్ట్ర్రాలలో జరుపుతారు. విదేశాలలో కూడా జరుపుతారు. అంటే పూలను ప్రేమించడం, సేకరించడం, ఊరేగించడం, తలమీద ఎత్తుకుని తీసుకు΄ోవడం అనే ఆచారం ఉంది. కానీ తెలంగాణాలో జరిగే రీతి రివాజు మరెక్కడా కనపడదు. బతుకమ్మ పండగ విధానం కాదు. అది స్వభావం. దాని లక్ష్యం కుటుంబ అభివృద్ధి. స్త్రీని అత్తవారింటికి పంపి ఊర్కోవడం కాదు. పెళ్లి తదితర ఫంక్షన్లకి రావడం కాదు. హక్కుగా తల్లిగారింటికి వచ్చి పూలతో ఇంటిని వెలిగించడం ముఖ్యం. అన్న లేదా తమ్ముడు సోదరిని తోలుకుని వచ్చి గౌరవించడం, కట్నకానుకలను పెట్టడం తప్పనిసరి.
ఇలాంటి సంప్రదాయాలు వేరే చోట్ల బలంగా కనబడవు. కాని పూలను పేర్చి పండగ చేయడం కృష్ణానది కింద చూశాను. ప్రకృతి ఆరాధన కూడా ఈ పండగలో ఒక ముఖ్య భాగం. నిండిన చెరువుల దగ్గర, కుంటల దగ్గర, జలాశయాల దగ్గర ఆట ఆడి ఆ నీటిలోనే పూలను కలుపుతారు. ఏ జలం ఆధారంగా పూసిన పువ్వులు ఆ జలానికే అంకితం కావడం ఒక గొప్ప తాత్వికత. ఇక్కడ ఆడపిల్లలు బొడ్డెమ్మలు ఆడతారు. ఆంధ్రాప్రాంతంలో గొబ్బెమ్మలు ఆడతారు.
తెలంగాణ గ్రామీణంలో దసరా ప్రత్యేకత ఏమిటి?
దసరా మంచికి, చెడుకి మధ్య జరిగిన యుద్ధం. జమ్మిచెట్టు చిన్నదే. కాని పాండవులు తమ ఆయుధాలు దానిపై దాచి ఉంచారు. కాబట్టి జమ్మి ఆకుని ‘బంగారం’ అంటారు. ఆ ఆకుని ఇచ్చిపుచ్చుకుని అలాయి బలాయి తీసుకుంటారు. అదేరోజు సాయంకాలం చాలా చోట్ల రావణుడి బొమ్మని తయారుచేసి, దానిని కొలుస్తారు. అలా కాకుండా చాలా ఆదివాసీ ప్రాంతాలలో సమూహాలలో రావణుడిని పూజిస్తారు. అక్కడ మనలా దసరా పండగ జరపరు.
తెలంగాణలో దసరా పండగ రోజున మద్యం, మాంసం తప్పనిసరి. బంధువులు, స్నేహితులతో కలిసి పేదలు సైతం పండగని ఘనంగా జరుపుకుంటారు. కుల భావన లేకుండా ఆలింగనం చేసుకుంటారు. కొన్ని తావులలో వైషమ్యాలు మరిచి కలసిపోతారు. బతుకమ్మ పండగకి ఇంటికి సోదరి వస్తుంది. దసరాకి అల్లుణ్ణి పిలుచుకుంటారు. లేదా సోదరిని దసరాకి అత్తగారింటికి పంపిస్తారు. ఆ విధంగా తెలంగాణ లో దసరా అతి పెద్ద పండగ. ఈ రెండు పండగలు ఒకే రుతువులో ఒకే వారంలో, ఒకదాని తరువాత మరొకటి జరగడం గమనించాలి. బతుకమ్మ స్త్రీల పండగ. దసరా ఒక రకంగా పురుష ప్రధానమైన పండగ.
Comments
Please login to add a commentAdd a comment