Batukamma Celebration
-
యూకేలో ఘనంగా బతుకమ్మ వేడుకలు..
యూకేలోని రీడింగ్‌లో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. రీడింగ్ జాతర బృందం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. వేడుకలకు సుమారు వెయ్యి మంది హాజరైనట్లు అధ్యక్షులు విశ్వేశ్వర మంథని, ఉపాధ్యక్షులు ప్రసాద్ అవధానుల తెలిపారు. ఈ వేడుకను రంజిత్, రమేష్, రఘు, చైతన్య, నటరాజ్, చందు, ప్రవీణ్, రామ్‌రెడ్డి, శ్రీనివాస్ నేతృత్వంలోని కోర్ టీమ్ ఎంతో శ్రద్ధగా ఏర్పాటు చేసింది. ముఖ్యంగా మహిళలు, పిల్లలు సంప్రదాయ దుస్తులు ధరించి ఆడిన బతుకమ్మ, దాండియా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.అందరూ భక్తిశ్రద్ధలతో అష్టలక్ష్మీ పూజలు చేసుకున్నారు. ఈ వేడుకలో ప్రముఖ గాయని కారుణ్య సంప్రదాయ బతుకమ్మ పాటలతో మరింత ఉత్సాహాన్ని నింపి అలరించారు ఈ వేడుకల్లో పాల్గొన్న వారికి వలంటీర్లు తెలంగాణ ప్రత్యేక వంటకాలు వడ్డించారు, విందులో మామిడి లస్సీ కూడా అందజేయడం అందరినీ ఆకట్టుకుంది.ఈ వేడుకలు ప్రవాసులకు వారి జన్మస్థలంలోని సంప్రదాయాలను గుర్తుచేయడమే గాక సాంస్కృతిక ఐక్యతను పెంపొందిస్తాయని నిర్వాహకులు అన్నారు. ఈ వేడుకలో పాల్గొన్నవారు 360 ఫోటో బూత్‌ను ఉపయోగించి బతుకమ్మతో ఫోటోలు దిగి ఆనందాన్ని పంచుకున్నారు. తర్వాత దుర్గా దేవికి ఆరతితో కార్యక్రమం ముగుస్తుంది. సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించిన ఈ వేడుకలో ఉన్నతమైన సాంస్కృతిక వైభవం, భక్తి మరియు ఆనందాన్ని ప్రతిబింబించింది.(చదవండి: కెనడాలో ఘనంగా బతుకమ్మ పండగ సంబరాలు) -
బలి తంతు లేకుండా జరిగే 'పూల తల్లి ఆరాధన'..! ఇక్కడ దసరా..
ఇవాళ సద్దుల బతుకమ్మ. తెలంగాణ అంతటా స్త్రీలు పూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో గౌరమ్మను కొలుస్తారు. ఈ సందర్భంగా స్థానిక సంస్కృతిలో బతుకమ్మ విశిష్ఠతను వివరిస్తున్నారు ప్రసిద్ధ చారిత్రక పరిశోధకులు జయధీర్ తిరుమలరావు.ఆదివాసీ సంస్కృతులలో అమ్మతల్లి ఆరాధన గురించి..?ఆదివాసీ సంస్కృతిలో, వారి జీవితంలో స్త్రీ దేవతారాధన విడదీయరానిది. ఆదివాసీలలోనే కాదు శ్రామిక జీవితంలో, జానపద సమాజంలో అమ్మదేవతలు విశిష్ట స్థానంలో ఉంటారు. ఆదిమ కాలంలో వ్యవసాయానికి స్త్రీలే పునాది వేశారు. బీజం, క్షేత్రం స్త్రీ అనుభవం. పునరుత్పత్తి భావనకి స్త్రీ ఆలంబన. విత్తనాలు నాటడం, కలుపు తీయడం, కోత కోయడం అంతా స్త్రీలే. పొలంలో పంట తీయడం, గర్భంలో శిశువుని మోయడం రెండూ స్త్రీల వంతే. అంతేకాదు, దానికి కావలసిన భాషని సృజించుకున్నదీ స్రీయే. భాషని సాహిత్యీకరించినదీ వారే. అనేక రకాల పాటలు పాడటం, పూజకు కావల్సిన కర్మకాండని తీర్చిదిద్దినదీ వారే. ఆ విధంగా స్త్రీ అనేక రంగాలలో, అనేక రూపాలతో తన శక్తి సామర్థ్యాలను వ్యక్తం చేసింది. మహత్తులను చూపి అమ్మదేవతారాధనకి ఆలంబన అయ్యింది. ఒక్కో అంశానికి ఒక్కో దేవతని ఏర్పరుచుకుని ఆయా రుతువులలో, పంటల కాలంలో దేవతారాధన చేశారు. ఆయా దేవతలను జ్ఞాపకం చేసుకోవడం, పూజించడం, రాబోయే తరాలకు వారిని జ్ఞాపకం చేయడం జరుగుతోంది. మాతృస్వామ్య వ్యవస్థ ప్రాధాన్యత అమ్మతల్లి ఆరాధనకు పట్టుగొమ్మ. అందులో భాగమే బతుకమ్మ. జన్మనిచ్చి, బతకడానికి అన్ని రకాలుగా చేయూతనిచ్చే ఆరాధన ఉంది. ప్రస్తుత కాలంలో ఆదివాసుల సమ్మక్క సారలమ్మలు, మైదాన ప్రాంతాల బతుకమ్మ పండగలు రోజు రోజుకూ ప్రాచుర్యం పొందుతున్నాయి. ఈ పరంపరను ఎలా అర్థం చేసుకోవాలి?బతుకమ్మ పండగ ప్రధానంగా తెలంగాణ స్త్రీల పండగ. దీనినే పూల పండగ అంటారు. ఎలాంటి బలి తంతు లేకుండా జరిగే క్రతువు. ఆ రోజు శాకాహారమే. బతుకమ్మలో ఆహారం, నృత్యం, పాట, సంగీతం అన్నీ సమపాళ్లల్లో కలగలసి ఉంటాయి. చాలారకాల ఆదివాసుల నృత్యాలు వర్తులాకార నృత్యాలే. పాల్గొనే స్త్రీలు అందరూ గుండ్రంగా చేరతారు. గుండ్రంగా కదులుతూ వంగుతూ, లేస్తూ, చప్పట్లు కొడుతూ చక్కని సంగీతాన్ని సృష్టిస్తారు. వారు తమ శరీర లయకు అనుగుణంగా పాటల్ని పాడతారు. ఒకరు ప్రధాన గాయనిగా పాటని అందుకుంటే మిగతావారు సామూహికంగా లయాత్మకంగా పాడతారు. బొడ్డెమ్మ, బతుకమ్మ వంటి ఆటపాటలలో, పండగలో స్త్రీలదే ప్రధాన పాత్ర. ఈ పండగలో స్త్రీలు అందరూ సమానమే. పాటల రాగం చేతులతో చప్పట్లు మోగించే శైలిలో పాడబడుతుంది. ఇదే విధానం తెలంగాణ అంతటా కనిపించడం విశేషం. ప్రతిరోజు కొత్త ధాన్యంతో రకరకాల పిండివంటలు చేసి అందరూ కలిసి పంచుకుని భుజించడం ఆనవాయితి. ఇక్కడ కులాల, అంతస్తుల ప్రమేయం కనిపించదు. కాని మారిన కాలంలో కులాలవారీగా కట్టుకున్న అపార్టమెంట్ల మాదిరిగా అక్కడక్కడా కులభావన కనిపించడం మరీ ఆధునికం. కాని బతుకమ్మ పండగలో స్త్రీల సంప్రదాయ బలం లోతు చాలా ఎక్కువ. అందుకే దేశంలోని వేరే రాష్ట్రాలలో జరిగే పూల పండగల కన్నా ఎంతో విలక్షణంగా, ప్రత్యేకంగా నేటికీ జరుగుతున్నది. ఈ పరంపర తెలంగాణకి ప్రత్యేకం. సుమారు వేయి సంవత్సరాల చరిత్ర దీనికి ఉందని చెప్పవచ్చు. పండగ సందర్భంగా సోదరిని పుట్టింటికి తీసుకురావడం అనే ఆచారం కూడా కొనసాగడం గమనించాలి. బతుకమ్మ ఆంధ్ర, రాయలసీమలో ఎందుకు కానరాదు?నిజానికి పూల పండగ మనదేశంలో కేరళ రాజస్థాన్, గుజరాత్ వంటి రాష్ట్ర్రాలలో జరుపుతారు. విదేశాలలో కూడా జరుపుతారు. అంటే పూలను ప్రేమించడం, సేకరించడం, ఊరేగించడం, తలమీద ఎత్తుకుని తీసుకు΄ోవడం అనే ఆచారం ఉంది. కానీ తెలంగాణాలో జరిగే రీతి రివాజు మరెక్కడా కనపడదు. బతుకమ్మ పండగ విధానం కాదు. అది స్వభావం. దాని లక్ష్యం కుటుంబ అభివృద్ధి. స్త్రీని అత్తవారింటికి పంపి ఊర్కోవడం కాదు. పెళ్లి తదితర ఫంక్షన్లకి రావడం కాదు. హక్కుగా తల్లిగారింటికి వచ్చి పూలతో ఇంటిని వెలిగించడం ముఖ్యం. అన్న లేదా తమ్ముడు సోదరిని తోలుకుని వచ్చి గౌరవించడం, కట్నకానుకలను పెట్టడం తప్పనిసరి. ఇలాంటి సంప్రదాయాలు వేరే చోట్ల బలంగా కనబడవు. కాని పూలను పేర్చి పండగ చేయడం కృష్ణానది కింద చూశాను. ప్రకృతి ఆరాధన కూడా ఈ పండగలో ఒక ముఖ్య భాగం. నిండిన చెరువుల దగ్గర, కుంటల దగ్గర, జలాశయాల దగ్గర ఆట ఆడి ఆ నీటిలోనే పూలను కలుపుతారు. ఏ జలం ఆధారంగా పూసిన పువ్వులు ఆ జలానికే అంకితం కావడం ఒక గొప్ప తాత్వికత. ఇక్కడ ఆడపిల్లలు బొడ్డెమ్మలు ఆడతారు. ఆంధ్రాప్రాంతంలో గొబ్బెమ్మలు ఆడతారు. తెలంగాణ గ్రామీణంలో దసరా ప్రత్యేకత ఏమిటి?దసరా మంచికి, చెడుకి మధ్య జరిగిన యుద్ధం. జమ్మిచెట్టు చిన్నదే. కాని పాండవులు తమ ఆయుధాలు దానిపై దాచి ఉంచారు. కాబట్టి జమ్మి ఆకుని ‘బంగారం’ అంటారు. ఆ ఆకుని ఇచ్చిపుచ్చుకుని అలాయి బలాయి తీసుకుంటారు. అదేరోజు సాయంకాలం చాలా చోట్ల రావణుడి బొమ్మని తయారుచేసి, దానిని కొలుస్తారు. అలా కాకుండా చాలా ఆదివాసీ ప్రాంతాలలో సమూహాలలో రావణుడిని పూజిస్తారు. అక్కడ మనలా దసరా పండగ జరపరు. తెలంగాణలో దసరా పండగ రోజున మద్యం, మాంసం తప్పనిసరి. బంధువులు, స్నేహితులతో కలిసి పేదలు సైతం పండగని ఘనంగా జరుపుకుంటారు. కుల భావన లేకుండా ఆలింగనం చేసుకుంటారు. కొన్ని తావులలో వైషమ్యాలు మరిచి కలసిపోతారు. బతుకమ్మ పండగకి ఇంటికి సోదరి వస్తుంది. దసరాకి అల్లుణ్ణి పిలుచుకుంటారు. లేదా సోదరిని దసరాకి అత్తగారింటికి పంపిస్తారు. ఆ విధంగా తెలంగాణ లో దసరా అతి పెద్ద పండగ. ఈ రెండు పండగలు ఒకే రుతువులో ఒకే వారంలో, ఒకదాని తరువాత మరొకటి జరగడం గమనించాలి. బతుకమ్మ స్త్రీల పండగ. దసరా ఒక రకంగా పురుష ప్రధానమైన పండగ. (చదవండి: పూల పండుగ..తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ.. ) -
పూల పండుగ..ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ
తెలంగాణ ఆడపడుచుల పండుగ బతుకమ్మ. ఈ పండుగ సందడి తెలంగాణలోని ప్రతి వీధిలోనూ కనిపిస్తూ ఉంటుంది. తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై..అప్పుడే ఎనిమిదో రోజుకి చేరుకున్నాయి. ఇక ఈ రోజున తెలంగాణ ఆడబిడ్లలంతా బతుకమ్మను వెన్నముద్దల బతుకమ్మగా ఆరాధిస్తారు.ప్రత్యేకత..ఇక బతుకమ్మ పండుగలో 8వ రోజును 'వెన్నముద్దల బతుకమ్మ'గా బతుకమ్మను ఆరాధిస్తారు. ఈరోజు తంగేడు, గునుగు, చామంతి, గులాబీ, గడ్డి పువ్వు, మొదలైన పువ్వులతో ఎనిమిది అంతరాలను బతుకమ్మగా పేర్చి ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఆట, పాటలతో బతుకమ్మ ఆడి చెరువులో బతుకమ్మను నిమజ్జనం చేస్తారు.ఈరోజు వాయనంగా నువ్వులు, బెల్లం కలిపి ప్రసాదంగా పెడుతారు. కొందరు వెన్న ముద్దలు అంటే..బియ్యపిండి, వెన్నతో చేసిన ముద్దలను డీప్ ఫ్రేచేసి చివరగా పానకంలో వేసి..నైవేద్యంగా సమర్పిస్తారు.(చదవండి: చరిత్రలో తొలిసారి..న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో దుర్గా పూజ..!) -
కాన్సస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కాన్సస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో స్థానిక హిందూ దేవాలయంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. దాదాపు 1500 మంది తెలుగు వారు వచ్చిన ఈ సంబరాలు చాలా ఉత్సాహంగా జరిగాయి. ఎంతో మంది చక్కగా బతుకమ్మ లను చేసుకొని వచ్చి, మొదటి నుంచి చివరి వరకు తెలంగాణ జానపద పాటలకు, బతుకమ్మ పాటలకు ఆడి, పాడి ఆనందించారు. దేవాలయ పూజారి నిర్వహించిన అమ్మ వారి పూజ తో సంబరాలు ఆరంభం అయ్యాయి. పెద్ద వాళ్ళే కాకుండా, చిన్నపిల్లలు, యువతులు ఎంతో ఉత్సాహంగా బతుకమ్మ పాటలకు నృత్యం చేశారు. బతుకమ్మలు తెచ్చిన వారికి రాఫెల్ టికెట్స్ ఇచ్చి మధ్య మధ్యలో రాఫెల్స్‌లో గెలిచిన వారికి బహుమతులు అందజేశారు. బతుకమ్మలన్నింటిలో మంచిగా చేసిన 8 బతుకమ్మలకు బహుమతులు ఇచ్చారు.చివరన బతుకమ్మలను నిమజ్జనం చేసి అందరూ ఒక కుటుంబం వలె ప్రసాదం పంచుకొని సంబరాలని ముగించారు. ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడానికి సహకరించిన సంఘం కార్యవర్గ సభ్యులకి, స్పాన్సర్‌కి సంఘం అధ్యక్షుడు యక్కలి చంద్ర, ట్రస్ట్ ఛైర్ శివ తియగూర ధన్యవాదాలు తెలిపారు.(చదవండి: అమెరికా వర్జీనియా నగరంలో వైభవంగా దసరా, బతుకమ్మ వేడుకలు!) -
ఉజ్జీవన్ బ్యాంకు రంగురంగుల పూలతో అతిపెద్ద బతుకమ్మ..!
దసరా నవరాత్రి వేడుకలను పురస్కరించుకుని, తెలంగాణ సంస్కృతికి చిహ్నమైన ప్రకృతి పండుగకు నివాళులర్పిస్తూ పెద్ద ఇండోర్ బతుకమ్మను ఏర్పాటు చేసింది ఉజ్జీవన్ బ్యాంక్. హైదరాబాద్‌లోని పంజాగుట్టలో వున్న గలేరియా మాల్లో ఈ అతిపెద్ద బతుకమ్మను ఏర్పాటు చేసింది. సుమారు 14 అడుగులు మేర ఎత్తు వరకు అద్భుతమైన బతుకమ్మను ఏర్పాటు చేశారు. రంగురంగుల పూల ప్రదర్శనతో ఈ ప్రాంతం గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని సామాజికి స్ఫూర్తిని మా బ్యాంకు గౌరవిస్తుందని సదరు బ్యాంకు అధికారులు తెలిపారు. ఈ బతుకమ్మ వద్ద ఉజ్జీవన్ సెల్ఫీ స్టేషన్లతో సహా ఇంటరాక్టివ్ బూత్‌లను కూడా ఏర్పాటు చేశామని, అలాగే బ్యాంక్ బ్యాంకింగ్ ఉత్పత్తులు అండ్ సేవలను అన్వేషించడానికి కస్టమర్లకు ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తున్నామని వెల్లడించారు. (చదవండి: నవరాత్రులు..ఇవాళ లలితా త్రిపుర సుందరిగా అలంకారం..!) -
బతుకమ్మకు వేళాయే.. తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మ
తెలంగాణ సంస్కృతి చిహ్నం ఈ బతుకమ్మ పండుగ. ప్రకృతితో మమేకమై పండుగ ఇది. జానపద గీతాలతో చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ఆడుతూ పాడుతూ చేసుకునే గొప్ప పండుగ. రంగురంగుల పూలతో తెలంగాణలోని ప్రతి గ్రామం శోభాయమానంగా మారిపోతుంది. ప్రకృతి రమణీయత కొట్టొచ్చినట్లుగా కనిపించే కలర్‌ఫుల్ పండుగ ఇది. ఇవాళ నుంచే (అక్టోబర్ 2) బతుకమ్మ సంబరాలు మొదలవుతున్న నేపథ్యంలో ఆ పండుగ విశిష్టత, తొలిరోజు జరుపుకునే ఎంగిలి బతుకమ్మ పండుగకు ఆ పేరు ఎలా వచ్చింది తదితర విశేషాలు గురించి సవివరంగా తెలుసుకుందాం.బతుకు అంటే తెలుగులో జీవించే లేదా జీవితం అని అర్థం. అమ్మ అంటే తల్లి అని అర్థం. దాన్నే బతుకమ్మ అని అంటారు. అంటే.. జీవితమంతా సంతోషకరంగా సాగిపోవాలనేది ఈ బతుకమ్మ పండుగ ఆంతర్యం. ఈ పండుగ మహాలయ అమావాస్య లేదా భాద్రపద అమావాస్యతో ప్రారంభమవుతుంది.దీన్ని తెలంగాణలో పెత్ర అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ రోజున గునుగు, తంగేడు, పట్టుకుచ్చు, బంతి, చామంతి.. వంటి రకరకాల పూలతో బతుకమ్మను పేర్చి మహిళలంతా ఒకచోట చేరి ఆడి పాడడం సంప్రదాయం. అయితే ఇలా తొలిరోజున పేర్చిన బతుకమ్మను 'ఎంగిలిపూల బతుకమ్మ'గా పేర్కొంటారు. అలాగే ఈ రోజున అమ్మకు తులసి ఆకులు, వక్కలు నైవేద్యంగా సమర్పిస్తారు. ఆట పూర్తయిన తర్వాత మహిళలు ఈ ప్రసాదాన్ని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. ఇలా తొలి రోజు బతుకమ్మ పూర్తవుతుంది.ఆ పేరు ఎలా వచ్చిందంటే..బతుకమ్మ తయారీ కోసం ఒక రోజు ముందే పూలను సేకరించి అలా నిద్ర చేసిన పూలతో బతుకమ్మను పేర్చడం వల్ల ఎంగిలిపూల బతుకమ్మ అని పిలుస్తారని కథనం. కొన్ని ప్రాంతాలలో తిన్న తర్వాత బతుకమ్మను పేరుస్తారు కాబట్టి ఎంగిలి పూల బతుకమ్మ అని పేరు వచ్చిందని చెబుతుంటారు. ఏది ఏమైనా బతుకమ్మ ఓ కమనీయ పూల సంబరం. ఈ రోజున మహిళలు చక్కగా ముస్తాబై గునుగు, తంగేడు, కట్ల, మొల్ల, సీత జడలు, రుద్రాక్ష, మందార, పారిజాతం, కమలం, తామర, గన్నేరు వంటి రకరకాల పూలతో బతుకమ్మలను పేర్చి తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా పాటలు పాడుతూ ఎంగిలిపూల బతుకమ్మకు స్వాగతం పలుకుతారు. ముందుగా ఇంట్లో బతుకమ్మను పూజిస్తారు. ఆ తర్వాత సాయంత్రం సమీపంలో ఉన్న దేవాలయాలు, చెరువుల వద్ద మహిళలంతా గుమిగూడి సమిష్టిగా బతుకమ్మ వేడుకలు జరుపుకుంటారునైవేద్యంగా..నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు. -
మగవారు బతుకమ్మ ఆడతారు.. ఎక్కడో తెలుసా..!
సాక్షిప్రతినిధి, వరంగల్ః హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం సీతంపేట గ్రామం ఇది. ఇక్కడ దీపావళి పర్వ దినాన్ని పురస్కరించుకొని బతుకమ్మ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ. నేతకాని కులానికి చెందిన వారు ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. నేతకాని కులానికి చెందిన మహిళలే కాకుండా పురుషులు కూడా బతుకమ్మ ఎత్తడం ఆచారం. 200 సంవత్సరాల నుంచి ఈ ఆచారం కొనసాగుతూ వస్తుందని స్థానికులు తెలిపారు. మూడు రోజులపాటు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. గురువారం తొలి రోజు చెరువు నుంచి మట్టిని సేకరించి దేవతల ప్రతిమలను తయారుచేసి ఓ ప్రత్యేక గదిలో ప్రతిష్టించి నైవేద్యం సమర్పించారు. అనంతరం విశేష పూజలు నిర్వహించారు. శుక్రవారం రెండో రోజు దేవతల ప్రతిమలను పురుషులు భారీ ప్రదర్శనగా వెళ్లి స్థానిక చెరువులో నిమజ్జనం చేస్తారు. అనంతరం దీక్ష విరమిస్తారు. అనంతరం చెరువు నుంచి జలాన్ని తీసుకొచ్చి ప్రత్యేక గది లో పెట్టి పూజలు నిర్వహిస్తారు. శనివారం మూడవరోజు మహిళలు బతుకమ్మలను తయారు చేసి భారీ ఊరేగింపుగా బయలుదేరుతారు. మహిళలతో పాటు పురుషులు కూడా బతుకమ్మలను ఎత్తుకొని ముందుకు సాగడం విశేషం. సుమారు రెండు కిలోమీటర్ల దూరం వరకు ప్రదర్శన సాగనుంది. ఈ వేడుకలను చుట్టుపక్కల గ్రామాల వారు తండోపతండాలుగా వచ్చి తిలకిస్తారు. కోలాటాల మధ్య ఉత్సవాలు దీపావళి బతుకమ్మ వేడుకలు కోలాటాల మధ్య కొనసాగనున్నాయి. యువకులు కోలాటాల మధ్య బతుకమ్మను సాగనంపుతారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన నేతకాని కులస్తులు ఈ వేడుకలను తిలకించడానికి ఇక్కడికి వస్తారు. -
సరదా.. సరదాగా
సిద్దిపేటజోన్: సద్దుల బతుకమ్మ సందర్భంగా గురువారం రాత్రి కోమటిచెరువుౖ వద్ద రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్‌రావు తన కుటుంబ సభ్యులతో సందడి చేశారు. కోమటిచెరువులో సతీమణి శ్రీనిత, కూతురు వైష్ణవి, మున్సిపల్ చైర్మన్ మంజుల, మహిళా ప్రజాప్రతినిధులు కవిత, వినితతో పాటు పలువురితో బోటింగ్ చేశారు. తానే స్వయంగా బోట్ నడుపుతూ చెరువు చుట్టూ ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నెక్లెస్ రోడ్డు, నీటిపై తేలియాడే వంతెన, గ్లో గార్డెన్, నైట్‌పార్క్‌లో మంత్రి హరీశ్‌రావు కలియతిరిగారు. ఈ సందర్భంగా ప్రజలను పలకరించి వారితో సెల్ఫీలు దిగారు. ఆయన వెంట కడవేర్గ్ రాజనర్స్, మచ్చ వేణు, కొండం సంపత్ తదితరులు ఉన్నారు. -
నేడు, రేపు సద్దుల బతుకమ్మ వేడుకలు
సాక్షి, హైదరాబాద్: ఉత్సాహంగా కొనసాగుతున్న బతుకమ్మ సంబరాలు ముగింపుదశకు చేరుకున్నాయి. ఇప్పటికే ఏడు రోజుల బతుకమ్మ వేడుకలు ముగిశాయి. ఎంగిలిపువ్వు బతుకమ్మ, అటుకల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ వేడుకలను ముగించుకున్న తెలంగాణ ఆడపడుచులు వెన్నముద్దల బతుకమ్మ సంబరానికి సిద్దమవుతున్నారు. అయితే ఈ ఏడాది ప్రత్యేక పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బుధ, గురువారాల్లో సద్దుల బతుకమ్మను నిర్వహించుకుంటున్నారు. బతుకమ్మ ముగింపు ఉత్సవాల ముగింపు వేడుక అయిన సద్దుల బతుకమ్మ పండుగ కొన్ని ప్రాంతాలు నేడే నిర్వహిస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో రేపు (గురువారం) నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ విద్వత్సభ, జ్యోతిష్య పండితులు, పూజారులు వేర్వేరు తేదీలు ప్రకటించడంతో స్థానిక సాంప్రదాయం ప్రకారం నిర్వహించుకునేందుకు ఆయా ప్రాంతాల వాసులు రడీ అవుతున్నారు. దుర్గాష్టమినాడే సద్దుల బతుకమ్మగా పండితులు నిర్ణయించగా, కొండపాక, వేములవాడల్లో ఏడు రోజులు నిర్వహిస్తారని, కొన్ని ప్రాంతాల్లో 9, మరికొన్ని ప్రాంతాల్లో 11, 13 రోజులు ఆడతారని తెలంగాణ విద్వత్సభ అధ్యక్షుడు చంద్రశేఖర సిద్ధాంతి పేర్కొన్నారు.అయితే తొమ్మిది రోజులు బతుకమ్మ ఆడాల్సిందే అని తీర్మానించుకున్న వారు గురువారం సద్దుల బతుకమ్మను నిర్వహించుకోనున్నారు. ఇక హైదరాబాద్‌లో దుర్గాష్టమినాడే (నేడే) బతుకమ్మ ముగింపు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు ఎంఎల్సీ కవిత కూడా ఈ మేరకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు చెపుతూ ట్వీట్ చేశారు. ఇక బతుకమ్మ పండుగలో 8వ రోజును 'వెన్నముద్దల బతుకమ్మ'గా బతుకమ్మను ఆరాధిస్తారు. ఈరోజు తంగేడు, గునుగు, చామంతి, గులాబీ, గడ్డి పువ్వు, మొదలైన పువ్వులతో ఎనిమిది అంతరాలను బతుకమ్మగా పేర్చి ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఆట, పాటలతో బతుకమ్మ ఆడి చెరువులో బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. ఈరోజు వాయనంగా నువ్వులు, బెల్లం కలిపి ప్రసాదంగా పెడతారు. పూల పండుగతో తెలంగాణ పులకించింది. ఎంగిలిపూల బతుకమ్మ నుండి సద్దుల బతుకమ్మ వరకు ఆడపడుచుల ఆనందం ఉప్పొంగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన ఆడబిడ్డలందరికీ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు చిహ్నమైన సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.#బతుకమ్మ #Bathukamma pic.twitter.com/WxYc9Oh36W — Kavitha Kalvakuntla (@RaoKavitha) October 13, 2021 -
పండుగపూట తడిసి ముద్దయిన నగరం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని నైరుతి రుతుపవనాలు వీడటంలేదు. వరుస వర్షాలతో రాష్ట్రం తడిసి ముద్దయింది. దీంతో బతుకమ్మ ఉత్సవాలకు అనేకచోట్ల ఆటంకం కలిగింది. ఈ వర్షాల కారణంగా పలు పంటలపై వ్యతిరేక ప్రభా వం చూపే పరిస్థితి కనిపిస్తుంది. పత్తి కాయ పగిలే దశలో ఉన్నందున నష్టం వాటిల్లుతుందని అంటున్నారు. దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి కోస్తా కర్ణాటక వరకు తెలంగాణ, ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇంటీరియర్ ఒడిశ ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో సోమవారం కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం ఒకట్రెండుచోట్ల భారీవర్షాలతోపాటు, చాలాచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు వెల్లడించారు. నగరంలో 10 సెంటీమీటర్ల వర్షం రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్ నగరం వరుస వర్షాలతో నిండా మునుగుతోంది. ఆదివారం క్యుములోనింబస్ మేఘాల కారణంగా నగరంలో కుండపోత వర్షం కురిసింది. ఆదివారం మధ్యా హ్నం నుంచి హైదరాబాద్‌లోని కూకట్పల్లి మండ లం రాజీవ్‌గృహకల్ప, జగద్గిరిగుట్ట ప్రాంతా ల్లో 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కుతు్బల్లాపూర్ మండలం గాజులరామారం, ఉషోదయపార్కు వద్ద 9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇక షాపూర్‌నగర్‌లో 8.5, సుభాష్‌నగర్, ఆలి్వ న్ కాలనీలలో 7, అంబర్‌పేట, రామంతాపూర్‌లలో 6 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. దీంతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాల్లోని వందకుపైగా బస్తీలు నీటమునిగాయి. ప్రధాన రహదారులపై ఉన్న భారీ వృక్షాలు కుప్పకూలడంతో వాటి కింద పార్కింగ్ చేసిన వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇళ్లలోకి చేరిన వరదనీటిని తోడేందుకు పలు బస్తీల వాసులు నానా అవస్థలు పడ్డారు. జీహెచ్ఎంసీ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు రంగంలోకి దిగి సహాయకచర్యలు చేపట్టాయి. పలు నాలాలు ఉగ్రరూపం దాల్చడంతో వాటికి ఆనుకుని ఉన్న బస్తీ వాసులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఇంట్లోకి చేరిన నీటిలో మునిగి వ్యక్తి మృతి బొల్లారం: తిరుమలగిరిలో ఆదివారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షం ఓ వ్యక్తి ప్రాణాలను హరించింది. ఇక్కడి శాస్త్రీనగర్‌లోని నాలా ఉప్పొంగి దానికి ఆనుకొని ఉన్న ఇంట్లోకి ప్రవహించడంతో నిద్రలో ఉన్న ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల కథనం మేరకు శాస్త్రీనగర్‌కు చెందిన జగదీశ్(35), తల్లితో కలిసి గత రెండేళ్లుగా అద్దె ఇంట్లో ఉంటున్నాడు. తల్లి బాయమ్మ స్థానిక చర్చితో పాటు పలు చర్చిల వద్ద యాచిస్తూ జీవనం సాగిస్తోంది. కాగా ఆదివారం మధ్యాహ్నం జగదీశ్ ఇంట్లో నిద్రిస్తున్నాడు. ఇదే సమయంలో భారీగా వర్షం కురవడంతో అతని ఇల్లు కూడా నాలా వెంట ఉండడంతో వరద నీళ్లు ఉప్పొంగి వారి ఇంట్లోకి ప్రవేశించాయి. గాఢ నిద్రలో ఉన్న జగదీశ్ ఈ విషయం తెల్సుకునేలోపే ఊపిరందనిస్థితికి చేరుకొని ప్రాణాలు కోల్పోయాడు. వర్షం తగ్గిన తరువాత ఇంట్లోని గడప వద్ద పడివున్న జగదీశ్ మృతదేహాన్ని స్థానికులు గమనించి తల్లికి విషయాన్ని చేరవేశారు.విగతజీవుడిగా ఉన్న కుమారుడిని చూసి తల్లి కుప్పకూలింది. కాగా అతనికి మూర్ఛవ్యాధి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. బస్తీవాసులతో పాటు బోర్డు సభ్యురాలు భాగ్యశ్రీ, టీఆర్ఎస్ ఏడోవార్డు అధ్యక్షుడు కేబీశంకర్‌రావు ఆర్థిక సాయం చేయడంతో జగదీశ్‌కు అంత్యక్రియలు జరిపారు. -
కువైట్ లో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు
కువైట్: బతుకమ్మ పండుగ వేడుకల్ని కువైట్ తెలంగాణ అసోసియేషన్ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కువైట్ లో భారత రాయబారి సునీల్ రాజ్, ఎంఎల్ఎ రసమయి బాలకిషన్, కువైట్ తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు రవికాంత్ లు హాజరయ్యారు. ఈ ఉత్సవాలకు మహిళలు, తెలంగాణ వాదులు భారీగా హాజరయ్యారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా కువైట్ లో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించడం సంతోషంగా ఉందని రసమయి బాలకిషన్ అన్నారు.