బతుకమ్మకు వేళాయే.. తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మ | Dussehra 2024: Telangana Bathukamma Celebrations Specialty Of 1st Day Engili Bathukamma | Sakshi
Sakshi News home page

బతుకమ్మ సంబరాలకు వేళాయే.. తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మ

Published Tue, Oct 1 2024 5:47 PM | Last Updated on Wed, Oct 2 2024 8:39 AM

Dussehra 2024: Telangana Bathukamma Celebrations Specialty Of 1st Day Engili Bathukamma

తెలంగాణ సంస్కృతి చిహ్నం ఈ బతుకమ్మ పండుగ. ప్రకృతితో మమేకమై పండుగ ఇది. జానపద గీతాలతో చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ఆడుతూ పాడుతూ చేసుకునే గొప్ప పండుగ. రంగురంగుల పూలతో తెలంగాణలోని ప్రతి గ్రామం శోభాయమానంగా మారిపోతుంది. ప్రకృతి రమణీయత కొట్టొచ్చినట్లుగా కనిపించే కలర్‌ఫుల్‌ పండుగ ఇది. ఇవాళ నుంచే (అక్టోబర్‌ 2) బతుకమ్మ సంబరాలు మొదలవుతున్న నేపథ్యంలో ఆ పండుగ విశిష్టత, తొలిరోజు జరుపుకునే ఎంగిలి బతుకమ్మ పండుగకు ఆ పేరు ఎలా వచ్చింది తదితర విశేషాలు గురించి సవివరంగా తెలుసుకుందాం.

బతుకు అంటే తెలుగులో జీవించే లేదా జీవితం అని అర్థం. అమ్మ అంటే తల్లి అని అర్థం. దాన్నే బతుకమ్మ అని అంటారు. అంటే.. జీవితమంతా సంతోషకరంగా సాగిపోవాలనేది ఈ బతుకమ్మ పండుగ ఆంతర్యం. ఈ పండుగ మహాలయ అమావాస్య లేదా భాద్రపద అమావాస్యతో ప్రారంభమవుతుంది.దీన్ని తెలంగాణలో పెత్ర అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ రోజున గునుగు, తంగేడు, పట్టుకుచ్చు, బంతి, చామంతి.. వంటి రకరకాల పూలతో బతుకమ్మను పేర్చి మహిళలంతా ఒకచోట చేరి ఆడి పాడడం సంప్రదాయం. 

అయితే ఇలా తొలిరోజున పేర్చిన బతుకమ్మను 'ఎంగిలిపూల బతుకమ్మ'గా పేర్కొంటారు. అలాగే ఈ రోజున అమ్మకు తులసి ఆకులు, వక్కలు నైవేద్యంగా సమర్పిస్తారు. ఆట పూర్తయిన తర్వాత మహిళలు ఈ ప్రసాదాన్ని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. ఇలా తొలి రోజు బతుకమ్మ పూర్తవుతుంది.

ఆ పేరు ఎలా వచ్చిందంటే..
బతుకమ్మ తయారీ కోసం ఒక రోజు ముందే పూలను సేకరించి అలా నిద్ర చేసిన పూలతో బతుకమ్మను పేర్చడం వల్ల ఎంగిలిపూల బతుకమ్మ అని పిలుస్తారని కథనం. కొన్ని ప్రాంతాలలో తిన్న తర్వాత బతుకమ్మను పేరుస్తారు కాబట్టి ఎంగిలి పూల బతుకమ్మ అని పేరు వచ్చిందని చెబుతుంటారు. ఏది ఏమైనా బతుకమ్మ ఓ కమనీయ పూల సంబరం. 

ఈ రోజున మహిళలు చక్కగా ముస్తాబై గునుగు, తంగేడు, కట్ల, మొల్ల, సీత జడలు, రుద్రాక్ష, మందార, పారిజాతం, కమలం, తామర, గన్నేరు వంటి రకరకాల పూలతో బతుకమ్మలను పేర్చి తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా పాటలు పాడుతూ ఎంగిలిపూల బతుకమ్మకు స్వాగతం పలుకుతారు. ముందుగా ఇంట్లో బతుకమ్మను పూజిస్తారు. ఆ తర్వాత సాయంత్రం సమీపంలో ఉన్న దేవాలయాలు, చెరువుల వద్ద మహిళలంతా గుమిగూడి సమిష్టిగా బతుకమ్మ వేడుకలు జరుపుకుంటారు

నైవేద్యంగా..
నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement