
సాక్షిప్రతినిధి, వరంగల్ః హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం సీతంపేట గ్రామం ఇది. ఇక్కడ దీపావళి పర్వ దినాన్ని పురస్కరించుకొని బతుకమ్మ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ. నేతకాని కులానికి చెందిన వారు ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. నేతకాని కులానికి చెందిన మహిళలే కాకుండా పురుషులు కూడా బతుకమ్మ ఎత్తడం ఆచారం.
200 సంవత్సరాల నుంచి ఈ ఆచారం కొనసాగుతూ వస్తుందని స్థానికులు తెలిపారు. మూడు రోజులపాటు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. గురువారం తొలి రోజు చెరువు నుంచి మట్టిని సేకరించి దేవతల ప్రతిమలను తయారుచేసి ఓ ప్రత్యేక గదిలో ప్రతిష్టించి నైవేద్యం సమర్పించారు. అనంతరం విశేష పూజలు నిర్వహించారు.
శుక్రవారం రెండో రోజు దేవతల ప్రతిమలను పురుషులు భారీ ప్రదర్శనగా వెళ్లి స్థానిక చెరువులో నిమజ్జనం చేస్తారు. అనంతరం దీక్ష విరమిస్తారు. అనంతరం చెరువు నుంచి జలాన్ని తీసుకొచ్చి ప్రత్యేక గది లో పెట్టి పూజలు నిర్వహిస్తారు.
శనివారం మూడవరోజు మహిళలు బతుకమ్మలను తయారు చేసి భారీ ఊరేగింపుగా బయలుదేరుతారు. మహిళలతో పాటు పురుషులు కూడా బతుకమ్మలను ఎత్తుకొని ముందుకు సాగడం విశేషం. సుమారు రెండు కిలోమీటర్ల దూరం వరకు ప్రదర్శన సాగనుంది. ఈ వేడుకలను చుట్టుపక్కల గ్రామాల వారు తండోపతండాలుగా వచ్చి తిలకిస్తారు.
కోలాటాల మధ్య ఉత్సవాలు
దీపావళి బతుకమ్మ వేడుకలు కోలాటాల మధ్య కొనసాగనున్నాయి. యువకులు కోలాటాల మధ్య బతుకమ్మను సాగనంపుతారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన నేతకాని కులస్తులు ఈ వేడుకలను తిలకించడానికి ఇక్కడికి వస్తారు.
Comments
Please login to add a commentAdd a comment