హంస వాహనంపై అమ్మవారు
తిరుచానూరు బ్రహ్మోత్సవాల్లోగురువారం రాత్రి అలమేలు మంగమ్మ సరస్వతీ దేవి రూపంలో హంస వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం పెద్దశేష వాహనంపై ఊరేగారు.
తిరుచానూరు : పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన గురువారం ఉదయం పెద్దశేష వాహనసేవ వైభవంగా జరిగింది. వైకుంఠనాథుని అలంకరణలో అమ్మవారు పెద్దశేషునిపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను ఆశీర్వదించారు. ఇందులో భాగంగా అమ్మవారిని వేకువజామున 4 గంటలకు సుప్రభాతంతో మేల్కొలిపి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. ఉదయం 7 గంటలకు అమ్మవారిని సన్నిధి నుంచి వేంచేపుగా వాహనమండపానికి తీసుకొచ్చి పెద్దశేష వాహనంపై కొలువుదీర్చారు. పట్టుపీతాంబర, వజ్రవైఢూర్య ఆభరణాలతో వైకుంఠనాథునిగా అలంకరించారు.
అనంతరం 8 గంటలకు భక్తుల కోలాటం, మంగళవాయిద్యాలు, జియ్యర్ స్వాముల ప్రబంధ పారాయణం నడుమ అమ్మవారు తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. సాయంత్రం జరిగిన హంస వాహనసేవలో అమ్మవారు సరస్వతీదేవి అలంకరణలో భక్తులను కటాక్షించారు. కార్యక్రమంలో టీటీడీ ఈవో ఎంజీ.గోపాల్, తిరుపతి జేఈవో పోలా భాస్కర్, టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఆలయ స్పెషల్‌గ్రేడ్ డెప్యూటీ ఈవో చెంచులక్ష్మి, ఎస్‌ఈ రామచంద్రారెడ్డి, ఏఈవో నాగరత్న, సూపరింటెండెంట్లు శేషాద్రిగిరి, వరప్రసాద్ పాల్గొన్నారు.
పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడవ రోజైన శుక్రవారం ఉదయం 8 గంటలకు ముత్యపుపందిరి వాహనం, రాత్రి 8గంటలకు సింహవాహనంపై తిరువీధుల్లో పద్మావతి అమ్మవారు భక్తులను అనుగ్రహించనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో పద్మావతి అమ్మవారికి స్నపన తిరుమంజనం, సాయంత్రం 6 గంటలకు ఆస్థాన మండపంలో ఊంజల్‌సేవ జరుగుతాయి.
తిరుచానూరు : శ్రీపద్మావతి అమ్మవారికి పలు రకాల ప్రసాదాలను నైవేద్యంగా అర్చకులు ని వేదిస్తారు. ప్రతిరోజూ తెల్లవారుజామున, ఉద యం, సాయంత్రం అమ్మవారికి ప్రసాదాలను నివేదిస్తారు. ఈ ప్రసాదాలను అమ్మవారి ఆల యంలోని పోటులో తయారుచేస్తారు.
మొదటి నివేదన : అమ్మవారికి తెల్లవారుజామున మొదటి నివేదనకు దద్దోజనం(పెరుగన్నం), పులిహోర, వెన్ పొంగల్, చక్కెర పొంగలి, మాత్ర(తిరుగబాత పెట్టకుండా పెరుగు, వెన్నతో చేసిన అన్నం), లడ్డు, వడ, సీర(కేసరి) నైవేద్యంగా అమ్మ వారికి సమర్పిస్తారు.
రెండో నివేదన
ఉదయం 9గంటలకు నిర్వహించే రెండవ నివేదనలో పులిహోర, చక్కెర పొంగలి, వెన్ పొంగళ్, దద్దోజనాన్ని సమర్పిస్తారు.
మూడో నివేదన
సాయంత్రం 6.30గంటలకు నిర్వహించే మూ డవ నివేదనలో దద్దోజనం, పులిహోర, చక్కెర పొంగలి, మిరియాల పొంగలిని నైవేద్యంగా సమర్పిస్తారు.
శుక్రవారం రోజు :
శుక్రవారం వేకువజాము నిర్వహించే అభిషేకానికి వెన్‌పొంగళ్, లక్ష్మీపూజకు సీర, కల్యాణోత్సవానికి చక్కెర పొంగలి, పులిహోర, వెన్‌పొంగళ్, అప్పంను సమర్పిస్తారు. అలాగే కదంబం(కూరగాయలతో చేసిన అన్నం), పా యసం, మధ్యాహ్నం ఉద్యానవనంలో జరిగే అభిషేకానికి అమ్మవారికి కారం పులిహోరను నైవేద్యంగా సమర్పిస్తారు.
తిరుప్పావడ సేవకు :
ప్రతి గురువారం నిర్వహించే తిరుప్పావడ సేవకు లడ్డు, వడ, జిలేబి, మురుకు, దోసె, అప్పం సమర్పిస్తారు.
ధనుర్మాసంలో..
ధనుర్మాసంలో అమ్మవారికి వెన్‌పొంగళ్, బెల్లం దోసె, సుఖీలను నైవేద్యంగా సమర్పిస్తారు.
బ్రహ్మోత్సవంలో..
బ్రహ్మోత్సవంలో అన్ని ప్రసాదాలతో పాటు వాహన సేవ సమయంలో గంగుండ్ర మం డపం వద్ద అమ్మవారికి దోసెను నైవేద్యంగా సమర్పిస్తారు.
పర్వదినాల్లో :
పర్వ దినాల్లో ప్రత్యేకంగా క్షీరాన్నం(పాలు కలిపిన అన్నం), కొబ్బరి అన్నం, చిత్రాన్నం, వడపప్పు, సుండల్, పానకం, బాదుషా, మైసూర్‌పాకును నైవేద్యంగా సమర్పిస్తారు.