నందివనపర్తిలో 101 నంది విగ్రహాలు
గ్రామం… చుట్టూ ఎక్కడచూసినా అవే..
ఈ పల్లెలోఆలయాలూ ఎక్కువే..
ఆ ఊరు ఆలయాలకు నెలవుగా మారింది.. ఒకటికాదు.. రెండు కాదు పదుల సంఖ్యలో అక్కడ గుళ్లు ఉన్నాయి. ఆదిదేవుడైన పరమశివుడు.. చదువులతల్లి సరస్వతీదేవి.. ఊరిని కాపాడే ముత్యాలమ్మ.. గ్రామాన్ని పరిరక్షించేలా ఊరిచుట్టూ నంది విగ్రహాలు.. ఇలా దేవుళ్లు కొలువుదీరిన ఆ పల్లె ఆధ్యాత్మిక పరిమళాలు పంచుతోంది. అదే యాచారం మండలంలోని నందివనపర్తి. ఈ గ్రామానికి ఘనమైన చరిత్ర ఉంది. 101 నంది విగ్రహాలు వెలిసినందునే ఈ ఊరికి నందివనపర్తి అని పేరు వచ్చిందని పూర్వీకులు చెబుతారు. ఆలయాలకు నిలయమైన ఈ పల్లె కథనమే ఆదివారం ప్రత్యేకం.. - యాచారం
నందివనపర్తి గ్రామానికి ఘనమైన చరిత్ర ఉంది. గ్రామం చుట్టూ 101 నంది విగ్రహాలు వెలిసినందున నందివనపర్తిగా పేరు వచ్చిందంటారు. గ్రామంలో అక్కన్నమాదన్నల కాలంలో నిర్మించిన శివాలయం, చెన్నకేశవ ఆలయం, సోమనాథ క్షేత్రం, నందీశ్వరాలయం, రామలింగేశ్వరస్వామి ఆలయం, ముత్యాలమ్మ దేవాలయం ఉన్నాయి. పరమేశ్వరుడు స్వయంభూగా వెలియడంతో శివాల యంలోని లింగం యేటా కొద్దికొద్దిగా పెరుగుతూ వస్తోందని భక్తుల విశ్వాసం. గ్రామానికి ఉత్తరాన సోమనాథ దేవా లయం కొండల్లో ఉండడంతో అప్పట్లో పార్వతీపరమేశ్వరులు మారువేషంలో చుట్టుపక్కల గ్రామాల్లో సం చరించి వ్యవసాయ బావుల్లో జలకాలాడేవారని చెబుతారు. సరస్వతి అమ్మవారు చదువుల తల్లిగా, కొలువుల కల్పవల్లిగా విరాజిల్లుతోంది.
అభిషేకాలకు తరించి.. వర్షాలు కురిపించి..
శివాలయంలోని లింగానికి 101 బిందెలతో జలాభిషేకం చేస్తే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని గ్రామస్తుల నమ్మకం. అప్పట్లో ఆర్యబట్ట అనే ఇంజినీర్ ఈ ప్రాంతం లో పర్యటిస్తూ గ్రా మం పడమర దిక్కు న నందిచెరువును, ఆ తర్వాత శివాల యాన్ని నిర్మించినట్లు పెద్దలు పేర్కొంటున్నారు. అప్పట్లో మల యాళ స్వామి ప్రప్రథమంగా ఈ శివాలయంలో గీతాయజ్ఞం ప్రారంభించి స్వామివారి అనుగ్రహంతో సమృద్ధిగా వర్షాలు కురిపించారని చెబుతారు.
ప్రత్యేక ఆకర్షణగా ఏడడుగుల నంది విగ్రహం..
శివుడి మహిమలతో 150 ఏళ్ల క్రితమే గ్రామంలో 101 నంది విగ్రహాలు వెలిసాయని, శివాలయానికి తూర్పున గ్రామప్రధాన దారికి ముందు వెలిసిన నంది కుక్క నందిగా అవతరించి గ్రామాన్ని కంటికి రెప్పలా కాపాడుతోందని గ్రామస్తుల నమ్మకం. మిగతా నందులు గ్రామం చుట్టూ వ్యవసాయ పొలాల్లో ఉండగా, మరికొన్ని ఔరంగాజేబు దండయాత్రల కాలంలో ధ్వంసమయ్యాయి. రైతులు పంటల సాగు, ధాన్యం ఇంటికి తెచ్చుకునే సమయాల్లో పొలాల్లో ఉన్న నందులకు పూజలు నిర్వహిస్తుంటారు. గ్రామానికి పడమర దిక్కున నందీశ్వరాలయంలో ఏడడుగుల నంది విగ్రహం గంభీరంగా దర్శనమిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
విశేష సంపదలున్న ఓంకారేశ్వరుడు..
గ్రామంలోని ఓంకారేశ్వరుడికి విశేష సంపదలున్నాయి. 1,400 ఎకరాలు ఓంకారేశ్వరుడికి సొంతం. వందేళ్ల క్రితం నల్లగొండ జిల్లా గుడిపల్లికి చెందిన లింగయ్య యోగానంద స్వామిగా మారి నగరంలోని ప్రస్తుత సెంట్రల్ లైబ్రరీ పక్కన శివాలయం నిర్మించారని, ఆ తర్వాత రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మరో 19 ఆలయాలను నిర్మించారని, 21వ ఆలయంగా నందివనపర్తిలో ఓంకారేశ్వరాలయాన్ని నిర్మించినట్లు చెబుతుంటారు. ఈ దేవాలయాన్ని నిర్మించిన యోగానందుడు ఇక్కడే జీవసమాధి అయ్యాడట. 1900 సంవత్సరంలోనే అప్పట్లో ప్రముఖ శిల్పి కాశరామన్న పర్యవేక్షణలో ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయంలో ఓంకారేశ్వరుడు, రామచంద్రస్వామి, దత్తాత్రేయుడు తదితర దేవాలయాలున్నాయి. ఈ ఆలయాల్లో రూ. కోట్ల విలువ జేసే పంచలోహ విగ్రహాలు కొలువుదీరాయి.
సరస్వతీ ఆలయంతో ఖ్యాతి..
గొప్ప చరిత్ర కలిగిన నందివనపర్తి పూర్వవైభవానికి గ్రామస్తులు సంకల్పించారు. పూర్వ విద్యార్థుల కృషితో హంపీ పీ ఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతి స్వామిజీ పర్యవేక్షణలో జ్ఞాన సరస్వతి దేవాలయ నిర్మాణం జరుగుతోంది. నిత్యం ఈ దేవాలయంలో చిన్నారులకు ఉచితంగా అక్షరాభ్యాసం చేస్తున్నారు. ఇక్కడ వెలిసిన అమ్మవారికి మొక్కితే నిరుద్యోగులకు కొలువులు ఖాయమన్న నమ్మకం ఏర్పడింది. ఏళ్ల క్రితం నిర్మించిన ఓంకారేశ్వరాలయం పునర్నిర్మాణం సాగుతోంది.