గయాసురుడు... పేరుకే అసురుడు కానీ ఎంతో మంచి మనసున్న దైవభక్తి పరాయణుడు. అతడొకసారి విష్ణువును గురించి గొప్ప తపస్సు చేసి, తనను తాకిన వారికి మోక్షం లభించే విధంగా వరం పొందాడు. తన శక్తితో శరీరాన్ని కొన్ని యోజనాల పొడవు, వెడల్పు విస్తరించి, జీవించసాగాడు. దాంతో ప్రతివారూ గయుణ్ణి తాకి మోక్షం ΄పొందసాగారు. ఫలితంగా స్వర్గానికి, నరకానికి వచ్చేవారే లేకుండా పోవడంతో ఇంద్రుడికి, యమధర్మరాజుకు పని లేకుండా పోయింది. దాంతో వారిద్దరూ కలిసి బ్రహ్మవద్దకు వెళ్లి, ఈ విషయాన్ని గురించి మొరపెట్టుకున్నారు. సృష్టికి విరుద్ధంగా జరుగుతున్న ఈ వైచిత్రి గురించి త్రిమూర్తులు పరిపరివిధాలుగా ఆలోచించి చివరకు ఒక నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారం ఇంద్రుడు గయాసురుడి వద్దకెళ్లాడు.
‘‘గయాసురా! లోకకల్యాణం కోసం మేమంతా కలసి ఒక యజ్ఞం చేయదలచుకున్నాము. ఆ యజ్ఞాన్ని చేసేందుకు అనువైన ప్రదేశం కోసం అన్వేషించగా పరమ పవిత్రమైన నీ శరీరమే అందుకు తగినదనిపించింది. కనుక నీవు అనుమతిస్తే, నీ శరీరాన్ని యజ్ఞకుండంగా మార్చుకుని ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తాము’’ అని అడిగాడు ఇంద్రుడు.
గయాసురుడు అందుకు ఆనందంగా అంగీకరించి, తన శరీరాన్ని పెంచి ఉత్తరదిశగా తలను ఉంచి పడుకున్నాడు. సకల దేవతలు, రుషులు అందరూ ఈ ప్రాంతానికి చేరుకోగా, బ్రహ్మదేవుడు యజ్ఞం ఆరంభించాడు. అయితే, యజ్ఞంలో ప్రజ్వరిల్లుతున్న అగ్నితత్వాన్ని తట్టుకోలేక గయుడి తల కదలడం ప్రారంభించింది. బ్రహ్మ సూచన మేరకు ‘దేవవ్రత’ అనే శిలను గయుడి తల మీద ఉంచి, ఆ శిలమీద విష్ణువు నిల్చున్నాడు.
ఫలితంగా గయాసురుడి శరీరం కదలడం ఆగిపోయింది. బ్రహ్మదేవుడు చేస్తున్న యజ్ఞవేడిమిని, తన భారాన్ని మౌనంగా భరిస్తున్న గయాసురుడిని చూసి హృదయం ద్రవించిపోయిన విష్ణువు ‘‘వత్సా! ఏదైనా వరాన్ని కోరుకో’’ అని అడిగాడు. అందుకు గయాసురుడు ‘‘దేవా! ఈ పవిత్రమైన యజ్ఞం వల్ల, అంతకన్నా పరమ పవిత్రమైన నీ పాదధూళి సోకడం వల్ల నా జన్మ ధన్యమైంది. నేను ఇంతకుముందు నేను కోరుకున్న వరం ఎంతో అనుచితమైనదైనప్పటికీ, మీ భక్తుడినైన నన్ను సంహరించలేక, ఈ విధంగా చేశారని నాకు అర్థమైంది. అందుకు క్షమాపణలు కోరుకుంటున్నాను.
నేను మిమ్మల్ని కోరేది ఒకటే! నా తలపై ఉంచిన శిలమీద మీ పాదాలను శాశ్వతంగా ఉంచే భాగ్యాన్ని ప్రసాదించండి. మీ పాదాలను దర్శించుకున్న వారికీ, ఈ క్షేత్రంలో కానీ, మరెక్కడైనా కానీ, నన్ను తలచుకుంటూ పిండప్రదానాలు, పితృదేవతల పూజలూ చేస్తే వారి పితరులు తరించేటట్లు, వారి వంశం అభివృద్ధి చెందేటట్లు వరాన్ని ప్రసాదించండి’’ అని కోరుకున్నాడు.
నిష్కల్మషమైన హృదయంతో గయాసురుడు కోరుకున్న వరాన్ని విష్ణువు అనుగ్రహించాడు. గయుడి శరీరాన్ని ఉంచిన ప్రదేశమే గయ. పాదాలను ఉంచిన ప్రదేశం పాదగయ. రాక్షసుడైనప్పటికీ, లోకహితం కోరుకున్న గయుడు ధన్యుడైనాడు.
‘‘నేను మిమ్మల్ని కోరేది ఒకటే! నా తలపై ఉంచిన శిలమీద మీ పాదాలను శాశ్వతంగా ఉంచే భాగ్యాన్ని ప్రసాదించండి. మీ దాలను దర్శించుకున్న వారికీ, ఈ క్షేత్రంలో కానీ, మరెక్కడైనా కానీ, నన్ను తలచుకుంటూ పిండప్రదానాలు, పితృదేవతల పూజలూ చేస్తే వారి పితరులు తరించేటట్లు, వారి వంశం అభివృద్ధి చెందేటట్లు వరాన్ని ప్రసాదించండి’’
– డి.వి.ఆర్
Comments
Please login to add a commentAdd a comment