పింఛన్..టెన్షన్!
పిఠాపురం, న్యూస్‌లైన్ : పింఛన్ల పంపిణీలో అవకతవకలు జరగకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ విధానం వృద్ధులను కష్టాల్లోకి నెట్టింది. గతంలో తీసుకున్న వేలిముద్రలతో వారి ప్రస్తుత వేలిముద్రలు సరిపోలడంలేదు. ఫలితంగా జిల్లాలో ఈ నెలలో సుమారు 26 వేల మంది వృద్ధులకు ఇంతవరకూ పింఛన్లు అందలేదు. దీంతో ప్రభుత్వం ఇచ్చే రూ.200 స్వల్ప మొత్తం కోసం వారు అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన దుస్థితి దాపురించింది. జిల్లాలో వివిధ పింఛన్ల కింద ప్రతి నెలా రూ.12,39,47,700 అందజేస్తున్నారు. ఈ ఏడాది మే, జూన్, జూలై నెలల్లో మూడు విడతలుగా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో బయోమెట్రిక్ విధానం అమలు చేశారు. ఆగస్ట్ నుంచి జిల్లా అంతటా ఈ విధానం అమలులోకి వచ్చింది.
అయితే నెట్వర్క సమస్యల వల్ల ఏజెన్సీలో మాత్రం దీనిని అమలు చేయడంలేదు. ఈ కొత్త విధానం అమలు కోసం కస్టమర్ సర్వీస్ ప్రొవైడర్ (సీఎస్పీ) ద్వారా 941 మందిని నియమించి, వారికి 941 బయోమెట్రిక్ యంత్రాలు అందజేశారు. లబ్ధిదార్లకు పోస్టాఫీసుల్లోను, కొన్ని పంచాయతీల్లో ఐసీఐసీఐ బ్యాంకులోను ఖాతాలు తెరిచి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. అమలాపురం పోస్టల్ డివిజన్లో 132, కాకినాడ డివిజన్లో 84, రాజమండ్రిలో 148, రామచంద్రపురంలో 148, రాజోలులో 129, సామర్లకోట పోస్టల్ డివిజన్లో 300 బయోమెట్రిక్ యంత్రాలను పింఛన్ల పంపిణీకి ఉపయోగిస్తున్నారు.
ఇదీ సమస్య
పింఛను కోసం వెళ్లిన వృద్ధుల ఆధార్ నంబర్‌ను తొలుత బయోమెట్రిక్ యంత్రంలోకి ఎంటర్ చేస్తారు. వేలిముద్రలను సరిపోల్చేందుకు వారి చేతి వేళ్లను యంత్రంపై ఉంచుతారు. అవి సరిపోలిన వెంటనే వారి వివరాలు ఆన్లైన్లో అనుసంధానం అవుతాయి. అలా జరగకపోతే సంబంధిత లబ్ధిదారుడి పింఛను నిలిచిపోతోంది.
ఎందుకంటే..!
2011లో ఆధార్ నమోదు జరిగింది. ఆ సమయంలో వేలిముద్రలు తీసుకున్నారు. ఆ తరువాత వృద్ధుల్లో శారీరక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ కారణంగా గతంలో తీసుకున్న వేలిముద్రలతో వారి ప్రస్తుత వేలిముద్రలు సరిపోలడంలేదని సిబ్బంది చెబుతున్నారు. ఈ నెలలో ఇప్పటివరకూ జిల్లాలో 2,42,876 మందికి బయోమెట్రిక్ పద్ధతిలో పింఛన్లు అందించారు. ఏజెన్సీలోని 1,05,990 మందికి కూడా పాత పద్ధతిలో పింఛన్లు పంపిణీ చేశారు. మరో 26,058 మందికి వేలిముద్రలు సరిపోలడం లేదు. దీంతో వారికి ఈ నెలలో ఇప్పటివరకూ పింఛన్లు అందలేదు. మరోపక్క నెట్వర్కులు పని చేయక కొన్నిచోట్ల, యంత్రాలు మొరాయించి కొన్నిచోట్ల పింఛన్ల పంపిణీలో జాప్యం జరుగుతోంది. కొన్నిచోట్ల బ్రాంచి పోస్ట్‌మాస్టర్ వేలిముద్రలతో కొందరికి పింఛన్లు ఇచ్చే అవకాశం కల్పించారు. అయినప్పటికీ ఈ నెలలో ఇప్పటికీ ఇంకా వేలాదిగా వృద్ధులు పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకుని సకాలంలో పింఛన్లు అందించాలని పలువురు కోరుతున్నారు.