గురువా.. ఇది తగునా ?
దేవరకొండ : విద్యార్థులకు ఆదర్శప్రాయుడిగా నిలిచి, వారిని సన్మార్గంలో పయనించేలా చూడాల్సిన ఉపాధ్యాయుడే తలదించుకునే పనిచేశాడు..పూటుగా తాగి పాఠశాలలో వీరంగమాడాడు..అడ్డువచ్చిన సహచర ఉపాధ్యాయులపై చిందులేశాడు..అతడి నిర్వాకం చూసి సహచరులే ఛీకొట్టారు..విద్యార్థులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకొండ మండలం గొట్టిముక్కల ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఎండీ అలీం గురువారం విధులకు హాజరయ్యాడు. మధ్యాహ్నం తన స్నేహితులను పిలిపించుకుని పాఠశాలలోని ఓ గదిలో మద్యం సేవించాడు.
అనంతరం తాగిన మత్తులో ఆ గది నుంచి బయటకు వచ్చిన అలీం వీరంగం సృష్టించాడు. తానేం చేస్తున్నాడో తెలియని స్థితిలో తరగతి గది కిటికీలో నుంచి బయటకు మూత్రం పోయడానికి ప్రయత్నిస్తూ తరగతి గదిలోనే ఆ పని కానిచ్చేశాడు. పాఠశాలకు చెందిన రిజిస్టర్లను కొన్నింటిని చిందరవందరగా పడేసి చించేశాడు. తోటి ఉపాధ్యాయురాలి స్కూటర్‌లో గాలి తీసేశాడు. ఇదేంటని అడగటానికి వచ్చిన హెడ్మాస్టర్ ఇద్దయ్యపై జులుం ప్రదర్శించాడు. విద్యార్థుల ముందే విచ్చలవిడిగా ప్రవర్తించడంతో ఈ విషయం గ్రామస్తులకు తెలిసింది. పాఠశాలలో జరుగుతున్న వ్యవహారం మీడియాకు తెలియడంతో అక్కడి నుంచి పరారయ్యాడు.
గతంలోనూ....
ఉపాధ్యాయుడు అలీం గతంలోనూ ఇలాంటి నిర్వాకానికి పాల్పడినట్లు తెలిసింది. మరో ఉపాధ్యాయుడుతో కలిసి అలీం మహిళా ఉపాధ్యాయురాళ్లతో అసభ్యంగా ప్రవర్తించినట్లు సమాచారం. దీనిపై సదరు ఉపాధ్యాయురాళ్లు రాతపూర్వకంగా ఎంఈఓకు ఫిర్యాదు చేశారు. క్షమాపణ చెప్పడంతో అప్పట్లో క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా విడిచిపెట్టారు.
అటువంటి వారిని ఉపేక్షించేది లేదు : విశ్వనాథరావు, డీఈఓ
పాఠశాలలో వీరంగమాడిన ఉపాధ్యాయుడు అలీంపై క్రమ శిక్షణా చర్యలు తీసుకోనున్నట్లు డీఈఓ విశ్వనాథరావు చెప్పారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని ఆయన స్పష్టం చేశారు. ఎంఈఓ సెలవులో ఉండడంతో విషయం తన దృష్టికి రాలేదన్నారు. సదరు ఉపాధ్యాయుడిని వెంటనే సస్పెండ్ చేసి క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామన్నారు.