రాఘవాపురంలో పోలీసుల అదుపులో ఉపాధ్యాయుడు ధంజు బానోతు
పశ్చిమగోదావరి, చింతలపూడి: తెలంగాణ నుంచి ఏలూరుకు బొలేరో వాహనంలో అక్రమంగా మద్యం తరలిస్తూ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు పోలీసులకు చిక్కాడు. రాఘవాపురం గ్రామం వద్ద రూ.1.25 లక్షలు విలువ చేసే మద్యం తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఏలూరు శనివారపుపేటలోని పాఠశాలలో సోషల్ టీచర్‌గా పనిచేస్తున్న ధంజు బానోతును అక్రమంగా మద్యం తరలిస్తుండగా పట్టుకుని బుధవారం అరెస్ట్ చేసినట్టు సీఐ పి.రాజేష్ తెలిపారు. నిందితునిపై కేసు నమోదు చేసి మద్యంతో పాటు బొలేరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
మొదటి నుంచీ వివాదాస్పదమే
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): మద్యం అక్రమ రవాణాలో పట్టుబడిన ఉపాధ్యాయుడు ధంజు భానోతులో ఉన్న భిన్న కోణాలపై జిల్లాలోని ఉపాధ్యాయ వర్గాల్లో ప్రస్తుతం వేడివేడి చర్చ జరుగుతోంది. రాత్రికి రాత్రే ఎదగాలనే అతని ఆశ పతనం దిశగా నడిపించిందని, చివరికి జైలు ఊచలు లెక్కపెట్టే స్థితికి దిగజార్చిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉపాధ్యాయుడిగా మొదలైన అతని ప్రస్థానం తరువాత అతని భార్యకు సార్వత్రిక విద్యాపీఠం జిల్లా కో–ఆర్డినేటర్‌గా నియమింప చేసుకునే స్థాయికి ఎదిగింది. ఈ నేపథ్యంలోనే గతంలో ఆ స్థానంలో పని చేసిన ఉద్యోగులు, జిల్లా విద్యాశాఖాధికారులపై కులం అడ్డుపెట్టుకుని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయడం, లొంగని వారిని బెదిరించడం నైజంగా మారిందనే ఆరోపణలున్నాయి. ఇదిలా ఉండగా గత ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి టిక్కెట్ ఆశించడం విశేషం. దీనిపై అప్పట్లోనే విచారణ చేసిన జిల్లా విద్యాశాఖాధికారులు కైకరంలో పని చేస్తున్న అతనిని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. గత సంవత్సరం ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకుని తిరిగి ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం యలమంచిలి మండలం ఏనుగువానిలంకలో పనిచేస్తున్నాడు. కాగా బుధవారం మద్యం అక్రమ రవాణా చేస్తూ పోలీసులకు చిక్కిన ధంజు బానోతు ఆ వాహనంతో లాక్‌డౌన్ కాలంలో తెలంగాణ నుంచి మన జిల్లాకు కనీసం పదిసార్లు తిరిగినట్లు పోలీసుల పరిశీలనలో తేలింది.
Comments
Please login to add a commentAdd a comment