కనిపించే దైవాలు అమ్మానాన్న. తల్లి నవమా సాలు మోసి ప్రాణం పోస్తే.. ఆలనాపాలనతో బంగారు భవిష్యత్‌కు దిశానిర్దేశం చేస్తాడు తండ్రి. కడుపులో ఉండగా తల్లిని.. ఆడుకుంటూ తండ్రి గుండెలపై కాళ్లతో తన్నినా తరగని ప్రేమ చూపడం వారికే చెల్లు. తడబడే అడుగులను
సరిచేస్తూ.. చిన్న గాయమైనా ఆ బాధ తమదిగా భావించే తల్లిదండ్రుల రుణం ఏమిచ్చి తీర్చుకోగలం. లింగ భేదం లేకుండా.. వైకల్యంపై వివక్ష చూపకుండా కంటికి రెప్పలా చూసుకునే ఆ దేవుళ్లు పిల్లల దృష్టిలో ఉత్సవ విగ్రహాలవుతున్నారు. పెరిగి పెద్దయ్యాక.. జీవితంలో స్థిరప డ్డాక.. వారికంటూ ఓ కుటుంబం ఏర్పడ్డాక.. తల్లిదండ్రులు కానివారవుతున్నారు. ఈ కోవలోనే
ఓ వృద్ధ జంట రోడ్డు పాలైంది.
దేవనకొండ, న్యూస్‌లైన్: చేతిలో చిల్లిగవ్వ లేదు.. తినేందుకు తిండి లేదు.. కట్టుకునేందుకు గుడ్డ లేదు. ఉన్నదంతా.. పిల్లల కోసం కరిగించిన కండలు.. రెక్కలు ముక్కలు చేసుకోగా చుట్టుముట్టిన వ్యాధులే. ఇదీ కల్లూరు మండలం పర్ల గ్రామానికి చెందిన మంగలి వెంకటన్న(75), లక్ష్మమ్మ(65) దంపతుల దీనగాథ. భిక్షాటనతో ప్రస్తుతం దేవనకొండ చేరుకున్న వీరిని ‘న్యూస్‌లైన్’ పలకరించగా కన్నీటి గాథను ఏకరువు పెట్టారు.
పర్లలో కుల వృత్తి చేసుకుని జీవనం సాగించే ఈ దంపతులకు ఐదుగురు సంతానం. నలుగురు ఆడ పిల్లలు కాగా.. ఒక్క కుమారుడు ఉన్నారు. తమను కంటికి రెప్పలా చూసుకుంటాడనే ఉద్దేశంతో ఆడ పిల్లలను కాదని.. కొడుకు పరమేష్‌ను మాత్రమే పాఠశాలకు పంపారు. డిగ్రీ వరకు చదివించారు. ఆ తర్వాత కల్లూరు మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన పద్మావతితో వివాహం జరిపించారు.
ఇదే సమయంలో నలుగురు కూతుళ్లకూ పెళ్లిళ్లు చేశారు. ప్రస్తుతం ముగ్గురు కూతుళ్లు కర్నూలు నగరంలోని షరీఫ్‌నగర్‌లో, మరో కూతురు ముజఫర్‌నగర్‌లో నివసిస్తున్నారు. ఇంతవరకు ఆ కుటుంబం సాఫీగానే సాగింది. బాధ్యతలన్నీ నెరవేర్చిన ఆ దంపతులను ఆ తర్వాతే కష్టాలు చుట్టుముట్టాయి. కుమారుడికి అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాల్‌లో ఉన్న ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం లభించింది. ఇక తనకు తల్లిదండ్రులతో పని లేదన్నట్లుగా భార్యతో కలిసి ఆ ప్రాంతానికి మకాం మార్చాడు. కొంత కాలం కుల వృత్తితోనే జీవనం సాగించిన వెంకటన్న, లక్ష్మమ్మలకు వయస్సు మీద పడే కొద్దీ పూట గడవటం కష్టమైంది. పూలమ్మిన చోటే కట్టెలమ్మడం ఇష్టం లేక ఇరువురూ దాదాపు 16 సంవత్సరాల క్రితం ఊరొదిలారు. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో తిరుగుతూ మనసొప్పకపోయినా పొట్ట నిం పుకునేందుకు చేయి చాచారు.
ఈ కోవలోనే పత్తికొండలో ఉండగా నాలుగు నెలల క్రితం వెంకటన్న కిందపడటంతో తుంటి భాగంలో ఎముక విరిగింది. అప్పటి నుంచి భర్తను లక్ష్మమ్మ కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. ఆసుపత్రిలో చూపించేందుకు అష్టకష్టాలు పడుతోంది. రెండు నెలల క్రితం దేవనకొండకు చేరుకున్న ఈ దంపతులకు స్థానిక బస్టాండ్ ఆశ్రయిమిస్తోంది. అటువైపుగా వెళ్లే స్థానికులు వీరి దీనస్థితికి కరిగిపోయి తోచిన సహాయం చేస్తూ అండగా నిలుస్తున్నారు. అదే ప్రాంతంలోని హోటల్ నిర్వాహకుడు కాశీం రోజూ తిండి పెట్టి మానవత్వం చాటుకుంటున్నాడు. విషయం తెలిసిన వీరి స్వగ్రామంలోని పెద్దలు కుమారుడితో సంప్రదించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.
తన కుటుంబం గడవటమే కష్టమైన పరిస్థితుల్లో తల్లిదండ్రుల పోషణభారం భుజానికెత్తుకునేందుకు ససేమిరా అనడంతో వారు కూడా తమ ప్రయత్నాలను విరమించుకున్నారు. చివరి మజిలీలోని ఈ దంపతులు ఒకరికొకరు తోడుగా జీవితాన్ని భారంగా వెల్లదీస్తున్నారు. పున్నామ నరకాన్ని తప్పించే కొడుకు పుట్టాడని వీరు ఆ సమయంలో ఎంతో సంతోషించినా.. ప్రస్తుతం కాటికి వెళ్లక ముందే ప్రత్యక్ష నరకాన్ని చేరువ చేసిన ఆ తనయుడు గుర్తుకొచ్చినప్పుడల్లా వీరి కళ్లలో కన్నీళ్లు నిండుకుంటున్నాయి.