అడుగడుగునా ఆత్మీయత
దేవరకొండ/చింతపల్లి : అదో చిన్న గ్రామం... అప్పటి వరకు నిర్మానుష్యంగా ఉందా ప్రాంతమంతా. అక్కడక్కడా ఉన్న పోలీసులు బందోబస్తుకు సూచికగా కనిపిస్తున్నారు. ఎవరినో ఆహ్వానించడానికి అన్నట్లు కొంతమంది నాయకులు ఎదురుచూపులు చూస్తున్నారు. అప్పుడే దూరం నుంచి ఓ బస్సు దగ్గరకొచ్చింది. ఆ బస్సు దగ్గరకు సమీపించే కొద్దీ జనం కూడారు. బస్సుపై ఓవైపు మౌన మునిలా యోగాసనంలో కూర్చున్న దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రం. మరో వైపు... నేనున్నానంటూ చిరునవ్వుతో చేయి ఊపుతూ భరోసానిస్తున్నట్లు ఉన్న జగనన్న చిత్రం... బస్సు దగ్గరకొచ్చి జనం మధ్యలో ఆగింది. చిరునవ్వుతో అభివాదం చూస్తూ, ఆత్మీయతనంతా మోములో ఒదగగా బస్సు దిగి వచ్చారామె. ఆమె దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల. ఆమెను చూడగానే ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా హోరెత్తిపోయింది. జై వైఎస్‌ఆర్ నినాదాలతో మార్మోగిపోయింది. అప్పటి వరకు నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతమంతా ఒక్కసారిగా వం దల మందితో గుమికూడింది. ఇదంతా చింతపల్లి మండలం మాల్ గ్రామంలోని సదృశ్యం. సోమవారం మహబూబ్‌నగర్ జి ల్లాకు పరామర్శయాత్రకు వెళ్తున్న వైఎస్ కుమార్తె షర్మిల జిల్లాలోని మాల్, కుర్మేడు గ్రామాల మీదు గా వెళ్తూ అక్కడ ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తమ ప్రియతమ నేత వైఎస్ కుమార్తె షర్మిలను చూడటానికి మహిళలు వృద్ధులు, విద్యార్థులు ఎంతో ఆసక్తి కనబరిచారు. ఇళ్లు, భవనాలు ఎక్కి ఆమెను చూడటానికి, ఆమె మాటలు వినడానికి ఉత్సుకత చూపారు.
పలకరింపు..
అక్కడికి వచ్చిన వారిలో మహిళలు షర్మిలను ఆత్మీయంగా పలకరించారు. బాగున్నావా అమ్మా.. అంటూ పలకరించారు. మరికొంత మంది తమ గోడు చెప్పుకున్నారు. వైఎస్ హయాం లో పింఛన్ వచ్చేది.. ఇప్పుడు పింఛన్ రాకపోవడంతో ఎలా బతకాలో తెలియడం లేదంటూ ఆమెకు ఏకరువు పెట్టుకున్నారు. దీంతో వారిని ఊరడించిన షర్మిల మన రోజులు.. వ
ుంచి రోజులు వస్తాయంటూ భరోసానిచ్చారు. బాధ పడవద్దంటూ ధైర్యం చెప్పి ఆమె అక్కడినుంచి కదిలారు.
కిక్కిరిసిన జనం..
షర్మిల కుర్మేడు, మాల్ గ్రామాలలో సుమారు 20 నిమిషాల పాటు గడిపారు. ఆమె వెంట వందలాది వాహనాలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అనుచరులు, కార్యకర్తలు రావడంతో గ్రామమంతా కిక్కిరిసిపోయింది. దీంతో షర్మిలను చూడటానికి వచ్చిన కొంత మంది గ్రామస్తులు రాజన్న బిడ్డను చూడలేక నిరాతో వెనుదిరిగారు. కాగా షర్మిల వెంట తెలంగాణ వైఎస్‌ఆర్‌సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు నల్లా సూర్యప్రకాష్, రాష్ట్ర కమిటీ సభ్యులు శివకుమార్, మల్లు రవీందర్‌రెడ్డి, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు ఇరుగు సునీల్‌కుమార్, బెదరకోట భాస్కర్, పార్టీ చింతపల్లి, పీఏపల్లి మండలాల కన్వీనర్లు కర్నాటి శ్రీనివాస్, వంగాల వెంకట్‌రెడ్డి, పుప్పాల పాండు, ముడిగ మల్లేష్‌యాదవ్, సిద్ధిఖ్‌బాబా, గబ్బార్‌పాష, అల్వాల యాదయ్య, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.