శ్రధ్ధాంజలి ఘటిస్తున్న వైఎస్సార్ కుటుంబ సభ్యులు,తదితరులు
సాక్షి,ఇడుపులపాయ : దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తొమ్మిదో వర్థంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఆయన కుటుంబసభ్యులు ఆదివారం ఉదయం ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్సార్ సతీమణి విజయమ్మ, కోడలు వైఎస్ భారతి, కుమార్తె షర్మిల, అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్, ఇతర కుటుంబ సభ్యులతోపాటు వైఎస్సార్‌సీపీ నేతలు వైఎస్ సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. నివాళులు అర్పించినవారిలో మాజీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, అంజాద్ బాషా, కడప మేయర్ సురేష్ బాబు, రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి తదితరులు ఉన్నారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్సార్‌కు నివాళులర్పించేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఈ సందర్భంగా మహానేత సేవలను, ప్రజాసంక్షేమ పథకాలను గుర్తుచేసుకున్నారు.
వైఎస్సార్ కారణజన్ముడు: వైఎస్ విజయమ్మ
దివంగత మహానేత వైఎస్సార్ ఒక కారణజన్ముడని, ఆయన చేసిన కార్యక్రమాలు, పథకాలు కూడా ప్రజల గుండెల్లో నిలిచిపోయాయని వైఎస్సార్ సతీమణి, వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ సమాధి వద్ద నివాళులర్పించిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ రాజశేఖరరెడ్డిగారు ఇవాళ దేవుడి దగ్గర ఉన్నారు. ఆయన చేసిన కార్యక్రమాలు ప్రజల గుండెల్లో ఉన్నాయి. ఆయన నిజంగా ఒక కారణజన్ముడు. ఆయన వచ్చి.. చేయాల్సిన కార్యాలన్నీ చేసి.. దేవుడి దగ్గరికి వెళ్లిపోయారు. వైఎస్సార్ ఆశయాలను కాపాడేందుకు జగన్‌బాబు ప్రజాసంకల్పయాత్రలో ప్రజలందరి దగ్గరకు వస్తున్నారు. ఆయనను ఆశీర్వదించండి. జగన్ ప్రజలందరికీ అండగా ఉంటాడు. మీ అందరికి ఒక అన్నగా, తమ్ముడిగా, ఒక మనవడిగా కాపాడుతాడు. రాజశేఖరరెడ్డి రాజ్యాన్ని మరల తెచ్చుకుందాం. వైఎస్ జగన్‌కు అండగా నిలువండి’ అని విజయమ్మ విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment