సమకాలీనం
ప్రజల గోడు పట్టించుకునే నాథుడే లేని దుర్భర పరిస్థితుల్లో నాటి విపక్షనేత వైఎస్ రాజశేఖరరెడ్డి ‘ప్రజాప్రస్థానం’ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అప్పుడు ఎన్నికలేం లేవు! ఎన్నికల ముంగిట్లో రాజకీయ లబ్ధికోసం జరిపిన కొంగ జపం కాదు. కష్టాల కడలిని ఈదు తున్న జనం పట్ల తన తపనకి, ఏం చేసైనా వారిని కాపాడుకోవాలనే లోలోపలి ఆర్ద్రతకి ఓ కార్యాచరణే పాదయాత్ర అని తర్వాత ఆయన పాలన నిరూపించింది. కానీ, అధికారం ఇవ్వడానికి చాలా ముందే ఆయన నిబద్ధతకు నాటి ప్రజానీకం నీరాజనాలర్పించింది.
‘‘ఈ పాదయాత్ర నన్ను సమూలంగా మార్చివేసింది. అనేక అంశాలు నేర్చుకున్నాను. సమాజంలోని వివిధ వర్గాల సమస్యలేమిటో వారిని చూసి, వారితో మాట్లాడి తెలుసుకున్నాను. ప్రజల జీవితాలను, వారి జీవన విధానాన్ని చాలా దగ్గర్నుంచి పరిశీలించే అవకాశం కలిగింది. కష్టాలు పడుతున్న, అణగారిన వర్గాలకు ఏదో ఒకటి చేయాలన్న స్ఫూర్తిని ఇది నాలో మరింత రగిలించింది.’’
చరిత్రాత్మక ‘ప్రజాప్రస్థానం’ పూర్తయిన తర్వాత విశాఖపట్నంలో విలేకరుల సమావేశంలో మాట్లాడినప్పుడు డా. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉద్వేగ పూరితంగా అన్న మాటలివి. సమకాలీన రాజకీయ చరిత్రలో ‘ప్రజాప్రస్థానం’ కొన్ని ప్రత్యేక పుటలను సొంతం చేసుకుంది. ఒక నాయకుడు మహానేతగా ఆవిర్భవించడానికి అంకురార్పణ జరిగింది అప్పుడే! భారతీయులకు, మరీ ముఖ్యంగా తెలుగు ప్రజలకు పాదయాత్రలు, బస్సుయాత్రలు, సైకిల్ యాత్రలు, రథయాత్రలు కొత్తేమీ కాదు. అయితే ప్రజల మనోఫలకాలపై చెరగని ముద్రవేసుకున్నవి వేళ్లపై లెక్కించవచ్చు. అలాంటి వాటిలో ప్రజా ప్రస్థానం శీర్షభాగాన ఉంటుంది. ఇది ఓ పాదయాత్ర మాత్రమే కాదు. అనం తర కాలంలో ఆవిష్కృతమైన ఒక సంక్షేమ రాజ్యానికి పడిన పటిష్ట పునాది. గ్రామీణార్థిక వ్యవస్థ వికాసానికి పడిన రాజమార్గం! అందుకే అంతటి ప్రాధాన్యం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ సారథ్యంలో... అభివృద్ధి- సంక్షేమం జోడుగుర్రాలుగా సాగిన ప్రగతిరథానికి ఇంధనం, ఇతర వనరులు సమకూరింది ఈ పాదయాత్రలోనే.
‘ప్రజాప్రస్థానం’ పాదయాత్రకు 13 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సంప్రదాయ మీడియాలోనూ, సోషల్ మీడియా లోనూ విస్తృతంగా చర్చ జరగటాన్ని ‘సాక్షి’ సహోద్యోగి, సీనియర్ జర్నలిస్టు పోతుకూరి శ్రీనివాసరావు నాతో ప్రస్తావించారు. నాటి పాదయాత్ర నేపథ్యం గురించి, వైఎస్‌ఆర్ మహానేతగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి పోవడానికి గల కారణాల గురించి, ఆ పాదయాత్ర వల్ల రాష్ర్ట ప్రజలకు జరిగిన మేళ్ల గురించి నెటిజన్లు విశేషంగా చెప్పుకోవడం మా మధ్య చర్చకు వచ్చింది. రాజకీయాలకు, ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా వైఎస్‌పై ఎల్లలె రుగని రీతిలో ప్రజలు కురిపించిన ప్రేమాభిమానాలకు హేతువేంటని విశ్లేషిం చినపుడు చాలా అంశాలు స్ఫురణకు వచ్చాయి. దశాబ్దకాలం పాటు పాలకుల నిర్లక్ష్యానికి గురై కుదేలైన గ్రామీణార్థిక వ్యవస్థని ఎజెండా పైకి తెచ్చి, పట్టాలెక్కించి, పరుగులు తీయించిన రాజకీయ-సామాజిక దార్శనికుడు డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డికి అందుకు ప్రేరణ ఇచ్చినది ప్రజాప్రస్థానమే.
కల్మషమెరుగని కరుణ నుంచి పుట్టింది
‘ప్రజాప్రస్థానం’ నిజానికి ఓ చెంప ప్రజలకు భరోసా ఇస్తూ, మరో చెంప వారి సమస్యల అధ్యయనం కోసం చేపట్టిన యాత్ర. ఇంకా, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి కూడా! ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నారో.. వాటి పరిష్కార మార్గాలేమిటో అన్వేషించేందుకు మండుటెండలో సాహసోపేతంగా సాగిన ఓ బృహత్తర యత్నం. గౌతమ బుద్ధుడి నుంచి గాంధీ వరకు, ఆదిశంకరుడి నుంచి వివేకానందుడి వరకు.... మహనీయులైన వారందరూ చేసిందదే! ప్రజాక్షేత్రమే వారికి పాఠశాల, గ్రంథాలయం. కడకు... కర్తవ్య దీక్షతో చేసే కార్యాచరణకు ప్రయోగశాల కూడా ఆ ప్రజా క్షేత్రమే. అప్పటికి తొమ్మిదిన్నరేళ్ల చంద్రబాబునాయుడు పాలనలో అన్ని వ్యవస్థలూ కుప్పకూలిపోయాయి. కరువు కరాళ నృత్యం చేస్తోంది. అన్నదాతల ఆత్మహత్యలతో తెలుగునేల హృదయవిదారకంగా రోదిస్తున్న కాలం. రోజువారీ కూలీలు, చేతి వృత్తుల వారు చేయడానికి పనిలేక, తినడానికి తిండి లేక ఊళ్లకు ఊళ్లు వలసబాట పట్టాయి. ‘పల్లే కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల...... తల్లీ బందీ అయిపోయిందో.....’ అని గోరటి వెంకన్న రాసిన పాట నాటి పల్లెల దుస్థితిని కళ్లకు కట్టింది.
పాట సాంతం విన్న ప్రతిమనిషి కంట చెమ్మ పుట్టిన దురవస్థ. ఉద్యమాలపై ఉక్కుపాదం మోపడమేకాదు, రైతుల నుంచి సహకార రుణాలను బలవంతంగా వసూలు చేస్తూ.. పొలాలు, ఇళ్లు వేలం వేస్తూ... చేతులకు సంకెళ్లు వేసి జైళ్లకు పంపుతున్న దుర్దినాలవి. ప్రజల గోడు పట్టించుకునే నాథుడే లేని దుర్భర పరిస్థితుల్లో నాటి విపక్షనేత వైఎస్ రాజశేఖరరెడ్డి ‘ప్రజాప్రస్థానం’ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అప్పుడు ఎన్నికలేం లేవు! ఎన్నికల ముంగిట్లో రాజకీయ లబ్ధికోసం జరిపిన కొంగ జపం కాదు. కష్టాల కడలిని ఈదుతున్న జనం పట్ల తన తపనకి, ఏం చేసైనా వారిని కాపాడుకోవాలనే లోలోపలి ఆర్ద్రతకి ఓ కార్యాచరణే పాదయాత్ర అని తర్వాత ఆయన పాలన నిరూపించింది. కానీ, అధికారం చేజిక్కడానికంటే చాలా ముందే ఆయన నిబద్ధతకు నాటి ప్రజానీకం నీరాజనాలర్పించింది. ‘మా కోసం, మా మనుగడకోసం తన శరీరాన్ని కష్టపెట్టుకుంటున్నాడే...!‘ అని భావించని హృదయం లేదానాడు.
తీవ్ర దుర్భిక్షం ఒకవైపు, వ్యవసాయం దండగ అంటున్న నాటి ముఖ్య మంత్రి చంద్రబాబు ఈసడింపులు మరోవైపు అన్నదాతలతో పాటు వ్యవసాయ రంగంపై ఆధారపడ్డ అన్ని అనుబంధ రంగాలనూ సంక్షోభంలోకి నెట్టేశాయి. రైతులు, రైతు కూలీలు, చేతివృత్తులవారు, పేద, మధ్యతరగతి వారంతా నానా ఇబ్బందులు పడుతున్నారు. అసలే అరకొర పింఛన్లు.. పైగా ఆరునెలలకొకమారు కూడా రాని రోజులవి. కొత్తగా పెన్షన్ రావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి. అప్పటికే అవి పొందుతున్న వారిలో ఎవరో ఒకరు మరణిస్తే తప్ప అర్హులైన మరొకరికి కొత్తగా పెన్షన్ రాని దుస్థితి. ‘జరుగుబాటు కష్టంగా ఉంది, జీతంరాళ్లు పెంచండీ’ అన్న పాపానికి అంగన్‌వాడి మహిళల్ని గుర్రా లతో తొక్కించిన పాలకుల దాష్టీకం మరొకటి. విద్యుత్ చార్జీలు ఎడాపెడా పెంచడంతో...‘ చలో హైదరాబాద్’ అంటూ రాజధానికి వచ్చిన ఉద్యమ కారులపై కాల్పులకు తెగబడి, ముగ్గురి ప్రాణాలను బాబు సర్కారు బలి గొంది.
శాసనసభలో ప్రతిపక్షం గొంతెత్తకుండా సస్పెన్షన్లతో దాడిచేసింది. విపక్షమైన కాంగ్రెస్ పార్టీలో ఇంటి తగాదాలు చిత్రవిచిత్రంగా ఉండేవి. కొందరు కాంగ్రెస్ నేతలు, పరోక్షంగా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ‘చెల్లింపు జాబితా’లో లబ్ధిదారులుగా ఉంటూ సొంతింటిలో కుంపట్లు రగిలిం చేవారు. ఏదున్నా ఎదురు నిలిచి పోరాడటమే తప్ప, గోడచాటు వ్యవహా రాలెరుగని వై.ఎస్. పై నీలాపనిందలు మోపేవారు. చంద్రబాబుతో కుమ్మక్కై కేసులు ఉపసంహరించారంటూ లేనిపోనివేవో అంటగట్టారు. ఇటు పార్టీలో పనికిమాలిన వ్యవహారాలు, అటు కష్టాల కడలిలో దారి కానని ప్రజలు.... ఇలాంటి పరిస్థితుల్లో నేరుగా ప్రజల వద్దకే వెళ్లి వారి కష్టాల్లో పాలుపంచు కోవాలని వైఎస్‌ఆర్ గాఢంగా భావించారు. అనుకున్నదే తడవుగా ‘ప్రజా ప్రస్థానం’ యాత్రకు శ్రీకారం చుట్టారు.
జనం కష్టాల ధ్యాసలో తన కష్టం కనబడలే!
వైఎస్‌ఆర్ ప్రజాప్రస్థానం యాత్రకు బయల్దేరింది 2003 ఏప్రిల్ 9న. అప్పటికే ఎండలు బాగా ముదిరిపోయాయి. ఏప్రిల్ 8 రాత్రి నేనాయన్ని కలసి మాట్లా డాను. ‘ఇంత ఎండలో నెలల తరబడి ఎలా నడుస్తావు, వద్దు అంటూ అమ్మ (జయమ్మ) ఎంతో ఆందోళనతో వారిస్తోంద‘ని ఆయన నాతో అన్న మాట తెల్లారి పత్రికలో పతాక శీర్షికయింది. ఏప్రిల్, మే ఎండల్ని తలచుకొని పాద యాత్రకిది తగిన సమయం కాదన్న వారూ ఉన్నారు. పైగా ఇప్పుడప్పుడే ఎన్నికలూ లేవని కొందరన్నారు. అయినా ఆయన వెనక్కి తగ్గలేదు. యాత్ర ఆరంభానికి ముందు రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో మిట్ట మధ్యాహ్నం బహిరంగ సభ జరిగింది. పెద్ద సంఖ్యలో జనం వైఎస్ మాటల కోసం ఎదురుచూ స్తున్నారు. నడినెత్తిన సూరీడు చండప్రచండంగా చెలరేగుతున్నా ప్రజలు తన కోసం నిరీక్షించడం చూసి వైఎస్ చలించిపోయారు. రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేదలు, ఈ సభతో తమ కడుపు నిండదని తెలిసీ... తానేమి చెబుతానో వినేందుకు, తనను ఆశీర్వదించేందుకు వేలాదిగా తరలివచ్చి మండుటెండలో మాడిపోతుంటే తాను షామియానా నీడలో, కూలర్ల గాలిలో కూర్చుండడం సరికాదని భావించారు. వేదిక మీద షామియానాలను, కూలర్లను తీయించే శారు. చేవెళ్లలోనే కాదు పాదయాత్ర ఆసాంతం వైఎస్‌ఆర్ జనంతో, వారి కష్టాలతో, కడగండ్లతో మమేకమయ్యారు.
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు ఎండకు ఎండి, వానకు తడిసి వైఎస్‌ఆర్ చేసిన ఆ పాదయాత్ర ఓ చెరగని చరిత్ర. మొత్తం 11 జిల్లాల్లోని 56 అసెంబ్లీ నియోజకవర్గాలలో 690 గ్రామాల ప్రజలను కలుసుకుంటూ మొత్తం 1,475 కిలోమీటర్ల మేర వైఎస్ పాదయాత్ర చేశారు. ఏప్రిల్ 9న మొదలై జూన్ 15న ఇచ్ఛాపురంలో ముగి సింది. రాజమండ్రికి దగ్గర్లో వడదెబ్బకు ఆరోగ్యం పాడయి ఆయన అస్వస్థు లయినపుడు ఓ తోటలో విడిది చేశారు. అక్కడే చికిత్స పొంది, కొంత స్వస్థత చేకూరాక తిరిగి యాత్ర కొనసాగించారు. రేపు యాత్ర ముగుస్తుందనగా సోంపేట సమీపంలో, భోజన సమయంలో నేను కలిసినపుడు వైఎస్ మంద్ర స్వరంతో మాట్లాడారు. రాజకీయాలకతీతంగా విశేషమైన ప్రజాభిమానం ఆయన సొంతమైంది. దాని ప్రాతిపదికగానే ఇక తన భవిష్యత్తు సాగడం గురించి అప్పటికే ఆయన హృదయంలో ఓ భావన ఆవిష్కృతమైనట్టు నాకని పించింది. మనసు విప్పి వెల్లడించిన ఆయన మాటలే ‘నడత మార్చిన నడక’ శీర్షిక కింద మరుసటి రోజు పత్రికలో పెద్ద కథనంగా రూపుకట్టాయి. ఆ రోజు ఇచ్ఛాపురం ఓ జనసంద్రమైంది. ప్రజల బతుకులు మార్చాలన్న వై.ఎస్. దీక్ష బలపడింది.
రైతు క్షేమమంటే ఎందుకంత తపన?
నాటి తీవ్ర దుర్భిక్షం నేపథ్యంలో మహబూబ్‌నగర్, కరీంనగర్, కర్నూలు వంటి చోట్ల వామపక్షాలు గంజి కేంద్రాలు ఏర్పాటు చేశాయి. అయితే అంతటి దుర్భర పరిస్థితుల్లోనూ రైతన్నలు, వారి కుటుంబాలు పస్తులున్నారేగానీ ఆ కేంద్రాలవైపు కన్నెత్తి చూడలేదు. రైతులంతే! నిన్నా ఇవాళ కూడా వరంగల్, కరీంనగర్‌లలో పుట్టెడు కష్టాల్లో ఆత్మహత్య చేసుకుంటూ.... ‘అప్పులిచ్చిన దాతలూ...! మా ఇల్లూ, పొలం అమ్ముకొని బాకీ జమ చేసుకోండి’ అని నోట్ రాశారే తప్ప పెళ్లాం పిల్లల గురించి యోచించలేదు! అన్నదాతల ఆత్మాభి మానానికి ఇదో తార్కాణం. రైతన్నల ఇలాంటి మనస్తత్వమే అప్పట్లో వైఎస్‌ఆర్‌ను కదిలించివేసింది. రైతన్న బాగుంటే రాజ్యం బాగుంటుంది అని వైఎస్ మనస్ఫూర్తిగా నమ్మారు. అందుకే రైతు సంక్షేమరాజ్యానికి బాటలు పరిచారు. ప్రజా ప్రస్థానం దారిపొడవునా తన అడుగులో అడుగేసిన రైతులు, రైతు కూలీలు, చేతివృత్తులు, కులవృత్తుల వారితో ఆయన మమేకమయ్యారు. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. తాను చూసిన, మాట్లాడి తెలుసు కున్న అన్ని వివరాలను డైరీలో నోట్ చేసుకునేవారు. పేదల కడగండ్లను పోగొట్టి వారి జీవితాలను సమూలంగా మార్చివేయడానికి ఏం చేయాలో పాదయాత్ర సందర్భంగానే ఆయన నిర్దిష్ట అంచనాకొచ్చారు. అందుకే, ప్రజలు అధికారపగ్గాలు అందించిన వెనువెంటనే సంక్షేమ సౌధానికి పునాదులు వేశారు. ఉచిత విద్యుత్ సరఫరా ఫైలుపై చేసిన తొలి సంతకం రైతన్నల సంకటాల్ని పోగొట్టి వారిలో జీవితేచ్ఛను నింపింది. వ్యవసాయ రంగానికి ఊపిరి పోసింది.
ఆలస్యంగా వచ్చి తొందరగా వెళ్లారు
రాష్ట్ర ముఖ్యమంత్రిగా వై.ఎస్. ఇంకా ఎంతో ముందే వచ్చి ఉండాల్సిందనే భావనను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇంకొంతకాలం ఆయన ఉండాల్సిందని, రాష్ట్రానికే దురదృష్టకరమైన ఓ దుర్ఘటనతో ఆయన తొందరగా వెళ్లిపోయారని గుర్తు చేసుకుంటూ ఉంటారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి తుదిశ్వాస విడిచేవరకు ఆయనను నడిపించింది- ప్రజాప్రస్థానం ద్వారా అందిన వజ్ర సంకల్పమే! ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను ఆ పాదయాత్రలో కళ్లారా చూసిన అనుభవం ఆయనని అనేక యోచనలకు, యోజనలకు, జనప్రయోజన రచనలకు పురి కొల్పింది. ప్రజల సంక్షేమం కోసం పరితపించేలా చేసింది.
ఆ తపనలోంచి పుట్టినవే ఉచిత విద్యుత్, జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, పేదలు-వితంతువులు-వృద్ధులకు పింఛన్లు, తెల్ల రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు వంటి ఎన్నో పథకాలు! సంక్షేమ కార్యక్రమాలన్నిటినీ సంతృప్త స్థాయికి అమలు చేసిన ఘనత వైఎస్.దే. ఆయన హయాంలో పింఛన్లు గానీ, ఇళ్లు గానీ, రేషన్ కార్డులు గానీ లేవన్నవారే లేరు. గాడి తప్పిన వ్యవసాయ రంగాన్ని తిరిగి దారికి తేవడంతో పాటు గ్రామీణార్థిక వ్యవస్థను ప్రగతి పట్టా లెక్కిచ్చారు. హరితాంధ్రప్రదేశ్ దిశగా రాష్ట్రాన్ని అడుగులు వేయించారు. బడుగులకు బతుకుపై భరోసా కల్పించారు. పేద వారి పెద్ద చదువులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఆలంబనగా నిలిచి వారి ఆరోగ్యాలకు ఆరోగ్యశ్రీతో ధీమానిచ్చారు.
ఆయన ఆపన్నహస్తం ప్రత్యక్షంగా, పరోక్షంగా తెలుగునేలపై ప్రతి ఇంటిని తడిమింది. ప్రజలపై ఎలాంటి భారాలూ మోపకుండా అభివృద్ధి సాధించడం ఆషామాషీ వ్యవహారమేం కాదు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు సహా దేశంలో మరే రాష్ట్రంలోనూ ఎవరూ చేసి ఉండని సంక్షేమ పథకాలను ఆయన అమలుచేసి చూపించారు. రాష్ర్టంలోనూ లోగడ ఏ ముఖ్యమంత్రికీ సాధ్యప డని అభివృద్ధి-సంక్షేమాలను సుసాధ్యం చేశారు. వై.ఎస్. మరణానంతరం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ఓ సంస్మరణ సభలో సీనియర్ సంపాదకులైన కె. రామచంద్రమూర్తి, ఐ. వెంకట్రావు, టంకసాల అశోక్, కె. శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొని ‘ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి, ఇలా ప్రజాసేవ చేయాలి అని చెప్పడానికి వై.ఎస్. ఓ బెంచ్‌మార్క్‌గా నిలిచారు, ఇకపై ఏ రాష్ట్రంలోనైనా, తదుపరి ఏ ముఖ్యమంత్రి పనితీరునైనా.... ఈ ప్రమాణాల ఆధారంగానే ప్రజలు అంచనా వేస్తారు‘ అంటూ ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వై.ఎస్. హయాంలో పడిన పటిష్టమైన ఆ పాలనకు పునాది ఆనాటి ‘ప్రజాప్రస్థానం’లోనే పడింది. అందుకే 13 ఏళ్లవుతున్నా ఆ పాదయాత్ర జ్ఞాపకాలింకా పదిలంగానే ఉన్నాయి. ఆయన హఠాన్మరణం పొంది ఏడేళ్లు కావస్తున్నా ప్రజల గుండెల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి స్థానం సుస్థిరంగానే ఉంది. ఆ స్థానం అమరం! అజరామరం!!
తండ్రి బాటలో తనయ!
‘ప్రజాప్రస్థానం’ గురించి చర్చించే సమయంలో ‘మరో ప్రజా ప్రస్థానం’ గుర్తుకు రావడం సహజం. తెలుగునాట చరిత్ర సృష్టించిన సుదీర్ఘ పాదయాత్ర ఇది. వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల ఈ పాదయాత్రతో సంచలనం సృష్టించారు. రాష్ర్టంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయి కేసులు, కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని కకావికలం చేయడానికి ప్రయత్నిస్తున్న రోజుల్లో... పార్టీ అధ్యక్షుడు, సోదరుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని అక్రమంగా నిర్బంధించిన సమయంలో.. అత్యంత కష్టకాలంలో ప్రజల మధ్యకు షర్మిల నడిచి వచ్చారు. అత్యంత సాహసోపేతమైన, సుదీర్ఘమైన పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. జరుగుతున్న కుట్రల గురించి ప్రజలకు వివరిస్తూ, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా తాము ప్రజల పక్షాన నిలుస్తామని భరోసా కల్పిస్తూ షర్మిల పాదయాత్ర సాగింది.
2012 అక్టోబర్ 18న ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ సమాధివద్ద ప్రారంభమైన ఈ పాదయాత్ర 2013 ఆగస్టు 4 న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద ముగిసింది. మొత్తం 230 రోజుల్లో 14 జిల్లాల్లో 3,112 కిలోమీటర్ల దూరం షర్మిల పాదయాత్ర సాగింది. వైఎస్సార్ జిల్లాతో మొదలుపెట్టి అనంతపురం, కర్నూలు, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ, గుంటూరు, కృష్ణా, ఖమ్మం, పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో సాగింది. 14 జిల్లాల్లోని 116 అసెంబ్లీ నియోజకవర్గాలు, తొమ్మిది మున్సిపల్ కార్పొరేషన్లు, 45 మున్సిపాలిటీలు, 195 మండలాల్లో ఏర్పాటు చేసిన అనేక బహిరంగ సభల్లో షర్మిల మాట్లాడారు. వైఎస్‌ఆర్ మరణానంతరం తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా చంద్రబాబు ఏ రకంగా కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారు? ఏ రకంగా ప్రజలను మోసం చేస్తున్నారన్న విషయాన్ని ప్రజలకు విడమరిచి చెప్పారు. రాష్ర్టంలో మూడో శక్తి ఎదగకూడదన్న లక్ష్యంతో జగన్‌మోహన్‌రెడ్డిపై పన్నిన కుట్రలు, కుతంత్రాలను వివరించడంలో ఆమె సఫలమయ్యారు.
వైఎస్ ‘ప్రజాప్రస్థానం’ పాదయాత్రకు 13 ఏళ్లు పూర్తయిన సందర్భంగా
దిలీప్ రెడ్డి , ఈమెయిల్: dileepreddy@sakshi.com