ఇడుపులపాయ, న్యూస్‌లైన్ : సుధీర్ఘంగా సాగిన పాదయాత్ర విజయవంతంగా ముగిసిన వేళ.. మహానేత వైఎస్ తనయ షర్మిల ఇడుపులపాయకు మంగళవారం వచ్చారు. ఈ సందర్భంగా ఆమెను చూసేందుకు అభిమానులు వెల్లువలా తరలివచ్చారు. మరోవైపు ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జిల్లాలో వైఎస్‌ఆర్ సీపీ ఘన విజయం సాధించడంతో.. సర్పంచులు, వార్డు సభ్యులు పెద్ద ఎత్తున ఇక్కడి కి తర లివచ్చారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పులివెందుల నియోజకవర్గంలోని వేలాది మంది కార్యకర్తలు ఇక్కడికి చేరుకున్నారు.
వైఎస్‌ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, కోడూరు మాజీ ఎమ్మెల్యే గుంటి ప్రసాద్, కడప డీసీసీబీ బ్యాంకు చెర్మైన్ తిరుపాల్‌రెడ్డి, డాక్టర్ ఈసీ గంగిరెడ్డి, కడప, ప్రొద్దుటూరు నియోజకవర్గాల సమన్వయకర్తలు అంజద్ బాషా, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, జిల్లా రైతు విభాగం కన్వీనర్ సంబటూరు ప్రసాద్‌రెడ్డి, రాష్ట్ర మహిళా నేత వాసిరెడ్డి పద్మ, అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సతీమణి భారతి, అల్లె ప్రభావతి, వైఎస్‌ఆర్ సీపీ కడప పట్టణ మైనార్టీ విభాగపు కన్వీనర్ షఫీ, చక్రాయపేట, వేం పల్లె మండల కన్వీనర్లు బెల్లం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, చంద్ర ఓబుళరెడ్డి తరలివచ్చిన వారిలో ఉన్నారు. వైఎస్‌ఆర్ ఘాట్ జై జగన్.. జై జై జగన్.. వైఎస్‌ఆర్ అమర్ రహే వంటి నినాదాలతో మార్మోగింది.
సర్పంచులను పరిచయం చేసుకున్న వైఎస్ విజయమ్మ
ఇటీవల ఎన్నికైన సర్పంచులను వైఎస్‌ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పరిచయం చేసుకున్నారు. ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ గెస్ట్‌హౌస్‌లో దాదాపు 2 గంటల పాటు ఒక్కో గ్రామం వారీగా సర్పంచ్ వివరాలను తెలుసుకుంటూ.. వారి గ్రామాల సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు.