సాక్షి, అమరావతి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఐదేళ్ల మూడు నెలల కొద్ది కాలంలోనే మనసుండాలే కానీ ప్రజలకు ఎంత మేలు చేయవచ్చో చేతల్లో చూపించారు. సాగునీటి ప్రాజెక్టులు, రహదారులు, పేదలకు పక్కా ఇళ్లు వంటి పథకాలతో సమగ్రాభివృద్ధి వైపు ఎలా పరుగెత్తించవచ్చో దేశానికే చాటిచెప్పారు.
ఆయన మరణించి 13 ఏళ్లవుతున్నా ఇప్పటికీ ప్రజలు నమ్మలేకపోతున్నారు. వైఎస్సార్ అనే పదం వినగానే స్వచ్ఛమైన చిరునవ్వు మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. నమస్తే అక్కయ్యా.. నమస్తే చెల్లెమ్మా.. నమస్తే తమ్ముడూ.. అని ఆప్యాయంగా పిలిచే పిలుపు మన చెవుల్లో ఎప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది.
అందుకే ఆ మహానేత చిరస్మరణీయుడు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక అడుగు వేస్తే.. ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాలుగు అడుగులు వేస్తున్నారు.
జనం కోసం ఎందాకైనా..
వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో 1949 జూలై 8న జన్మించిన వైఎస్ రాజశేఖరరెడ్డి వైద్య విద్యను అభ్యసించారు. పులివెందులలో ఆస్పత్రి నెలకొల్పి ఒక్క రూపాయికే వైద్యం చేసి రూపాయి డాక్టర్‌గా ప్రజల ప్రేమాభిమానాలు పొందారు. డాక్టర్‌గా ప్రజల నాడి తెలిసిన వైఎస్సార్ 1978లో రాజకీయ అరంగేట్రం నాటి నుంచి 2009 సెప్టెంబర్ 2న హెలికాఫ్టర్ ప్రమాదంలో హఠాన్మరణం చెందేవరకూ తన జీవితాన్ని ప్రజలకే అంకితం చేశారు.
మండుటెండలో 1,475 కి.మీల ప్రజా ప్రస్థానం పాదయాత్ర ద్వారా వరుస ఓటములతో జీవచ్ఛవంలా మారిన కా>ంగ్రెస్‌కు ప్రాణం పోశారు. 2004లో ఇటు ఉమ్మడి రాష్ట్రంలోనూ.. అటు కేంద్రంలోనూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు. పాదయాత్రలో ప్రజల కష్టాలను అర్థం చేసుకుని నేనున్నానంటూ భరోసా ఇచ్చిన వైఎస్సార్.. అధికారంలోకి వచ్చాక కన్నీళ్లు తుడిచారు.
ఐదేళ్లు సంక్షేమాభివృద్ధి పథకాలతో జనరంజక పాలన అందించి.. 2009 ఎన్నికల సందర్భంగా గెలుపోటములకు తనదే బాధ్యత అని నిబ్బరంగా ప్రకటించారు. ఇటు రాష్ట్రంలో.. అటు కేంద్రంలో ఒంటిచేత్తో కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తెచ్చారు. రూ.లక్ష కోట్ల వ్యయంతో కోటి ఎకరాలకు నీళ్లందించేలా ఒకేసారి 84 ప్రాజెక్టులను చేపట్టారు. వైఎస్సార్ హఠాన్మరణం అనంతరం ఆ ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కొనసాగించక తప్పని పరిస్థితి ఏర్పడింది.
ప్రజారోగ్యానికి ఆరోగ్యశ్రీతో భరోసా
2004 మే 14 నుంచి 2007 జూన్ 26 వరకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద వైద్య సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి రూ.168.52 కోట్లను అధికారంలో ఉండగా వైఎస్ రాజశేఖరరెడ్డి విడుదల చేశారు. ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని అందించేలా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు.
ప్రమాదంలో గాయపడిన వారిని తక్షణమే ఆస్పత్రికి తరలించేలా 108 వాహనాలతోపాటు గ్రామీణ ప్రాంతాలకు వైద్య సేవలను విస్తరిస్తూ 104 సర్వీసులను ప్రారంభించారు. ఈ సేవలను పలు రాష్ట్రాలు అనుసరించాయి. ఆరోగ్యశ్రీ స్ఫూర్తితోనే కేంద్రం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని చేపట్టింది.
రైతును రాజు చేసిన మారాజు
సీఎంగా ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేసి రైతు రాజ్యానికి వైఎస్ రాజశేఖరరెడ్డి పునాది వేశారు. విద్యుత్ చార్జీలు కట్టలేని రైతులపై నాడు టీడీపీ సర్కార్ రాక్షసంగా బనాయించిన కేసులను ఒక్క సంతకంతో ఎత్తి వేశారు. రూ.1,100 కోట్ల వ్యవసాయ విద్యుత్ బకాయిలను మాఫీ చేశారు. రూ.400 కోట్లతో మొదలైన వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ ఆ తర్వాత ఏడాది రూ.6 వేల కోట్లకు చేరినా ఉచిత విద్యుత్‌పై వెనక్కు తగ్గలేదు.
వైఎస్ స్ఫూర్తితో పలు రాష్ట్రాలు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నాయి. పావలా వడ్డీకే రైతులకు రుణాలు అందించి పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితిని తప్పించారు. పంటల బీమాను అమలు చేశారు. ఇన్‌ఫుట్ సబ్సిడీ అందించారు. మద్దతు ధర కల్పించడం కోసం ఢిల్లీతో పోరాడారు.
పేదరికానికి విద్యతో విరుగుడు
పేదరికం వల్ల ఏ ఒక్కరూ ఉన్నత చదువులకు దూరం కారాదనే లక్ష్యంతో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి వైఎస్సార్ రూపకల్పన చేశారు. డాక్టర్, ఇంజనీర్ లాంటి ఉన్నత చదువులు పేదవాడి సొంతమైతేనే పేదరిక నిర్మూలన సాధ్యమని దృఢంగా విశ్వసించి.. ఆ దిశగా అడుగులు వేశారు.
ఫీజుల పథకం ద్వారా లక్షలాది మంది నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతోపాటు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోన్న ఓసీ విద్యార్థులు సైతం ఉన్నత చదువులను అభ్యసించి దేశ విదేశాల్లో ఉన్నత ఉద్యోగాలను నిర్వర్తిస్తున్నారు. జిల్లాకు ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. తాడేపల్లిగూడెంలో ఉద్యానవర్శిటీ, తిరుపతిలో పశు వైద్యకళాశాలను నెలకొల్పారు.
ప్రతిష్టాత్మక జాతీయ విద్యా సంస్థ ఐఐటీ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)ని హైదరాబాద్ సమీపంలో కంది వద్ద ఏర్పాటు చేశారు. బాసర, ఇడుపులపాయ, నూజివీడు వద్ద ట్రిపుల్ ఐటీలను నెలకొల్పి లక్షలాది మందికి ఉన్నత చదువుల భాగ్యం కల్పించారు. వైఎస్సార్ బాటలో పలు రాష్ట్రాలు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమలు చేస్తున్నాయి.
మాంద్యం ముప్పు తప్పించిన ఆర్థికవేత్త
ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలను 2007–08, 2008–09లో ఆర్థిక మాంద్యం అతలాకుతలం చేసింది. ఆ మాంద్యం ప్రభావం దేశాన్ని కూడా తాకినా, ఉమ్మడి రాష్ట్రంపై పడకుండా వైఎస్సార్ నివారించగలిగారు.
సాగునీటి ప్రాజెక్టులు, పేదల ఇళ్ల నిర్మాణం, రహదారుల నిర్మాణం లాంటి అభివృద్ధి పనులు చేపట్టి ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చారు. ఐటీ పరిశ్రమకు వెన్నుదన్నుగా నిలవడం ద్వారా ఎగుమతులు రెట్టింపు చేశారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేపట్టి శరవేగంగా పూర్తి చేసి హైదరాబాద్‌ను ప్రపంచ చిత్రపటంలో నిలిపారు. ఇది జంట నగరాల్లో ఐటీ రంగం వేళ్లూనుకునేందుకు దోహదం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment