‘సమైక్య ఉద్యమ ఉధృతి తీవ్రరూపం దాల్చింది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల దాకా...కూలీల నుంచి ఉద్యోగుల వరకు, చిరు వ్యాపారుల నుంచి గెజిటెడ్ ఉద్యోగుల దాకా అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొంటున్నారు.
ఆరు దశాబ్దాలుగా కలిసి ఉన్న తెలుగువారిని విడదీస్తున్నారనే ఆవేదన ..విభజనతో అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందనే ఆందోళన ...ఇంత జరుగుతున్నా ప్రజాప్రతినిధులు ఉద్యమంలోకి రాలేదనే ఆగ్రహం ..వెరసి ఎనిమిదోరోజు ఉద్యమంలో మరింత వేడిని రగిల్చాయి. పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా జిల్లాలోని అన్ని చోట్ల ఎవరికి తోచిన రీతిలో వారు నిరసనలు చేపట్టారు.
సాక్షి, కడప: రాష్ట్రవిభజనను వ్యతిరేకిస్తూ ఎనిమిదిరోజులుగా జిల్లాలో సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమసెగలు నింగికెగశాయి. బుధవారం జిల్లా కేంద్రంలో కూరగాయల మార్కెట్, ఆస్పత్రులు, అత్యవసర సేవలు మినహా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతో పాటు విద్యాసంస్థలు, వ్యాపార దుకాణాలు మూతపడ్డాయి. మాజీ ఎమ్మెల్యే కందుల శివానందరెడ్డి సోదరులు భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సర్కిల్ నుంచి కోటిరెడ్డి సర్కిల్ మీదుగా సెవెన్‌రోడ్స్ వరకూ సాగిన ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో కేఎస్‌ఆర్‌ఎం ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు, నగర ప్రజలు పాల్గొన్నారు. చెక్కభజన చేసుకుంటూ, సమైక్యాంధ్రకు మద్దతుగా పాటలు పాడుతూ నిరసన తెలిపారు.
సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. అన్ని రాజకీయపార్టీల నేతలు జెండాలను, పార్టీ అజెండాలను పక్కనపెట్టి ఉద్యమంలోకి వచ్చి కేంద్రం దిగివచ్చే దాకా పోరాటం చేయాలని శివానందరెడ్డి పిలుపునిచ్చారు. అన్ని పార్టీల నేతలు తెలుగుజాతికి ద్రోహం చేశాయని రాజమోహన్‌రెడ్డి విమర్శించారు. కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు నిత్యానందరెడ్డి చేపట్టిన ఆమరణ దీక్ష శిబిరాన్ని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ సురేశ్‌బాబు, యువజన విభాగం అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, నగర సమన్వయకర్త అంజద్‌బాషా సందర్శించారు. దీక్షకు సంఘీభావంగా వంశీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో వంటా-వార్పు చేపట్టారు. ఉరితీసేవారిని కూడా చివరి కోరిక అడుగుతారని, కానీ కాంగ్రెస్‌పార్టీ నిరంకుశత్వంగా విభజన నిర్ణయాన్ని ప్రకటించిందని అవినాష్‌రెడ్డి విమర్శించారు. న్యాయవాదులు, టీచర్ల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ప్రగతిభవన్ ఎదుట ఎస్సీ, ఎస్టీ, బీసీ వెల్ఫేర్ ఉద్యోగులు వంటా-వార్పు చేపట్టారు. సాధారణ ప్రజలు కూడా కాలనీల వారీగా ఉద్యమంలో పాల్గొన్నారు. ఏడురోడ్ల కూడలిలో సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మల దహనాలు కొనసాగాయి. రిమ్స్ జే ఏసీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు చేపట్టారు. కాలేజీ పేరులో రాజీవ్ పేరును తొలగించి రాయలసీమ అని స్టిక్కర్ అంటించారు.
ప్రొద్దుటూరులో పుట్టపర్తి సర్కిల్‌లో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పట్టాభిరామ మండీమర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 5వేల మందికి వంటా-వార్పు నిర్వహించారు. బైక్ మెకానిక్, ఎల్‌ఐసీ, వస్త్రభారతి, ఎరువులు, పురుగుమందులు, చిల్లర అంగళ్ల వ్యాపారులు వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించి దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. న్యాయవాదులు, ప్రైవేటు, ఏయిడెడ్ ఉపాధ్యాయుల నిరసనదీక్షలు కొనసాగుతున్నాయి.
శివాలయం వీధిలో ఆందోళన కారులు పలు ఆటోల అద్దాలను ధ్వంసం చేశారు. మునిసిపల్ ఉద్యోగులు కార్యాలయం ఎదుట బైఠాయించి సమైక్య నినాదాలు చేశారు. రాయచోటిలో ద్విచక్రవాహనాలను కూడా తిరగనివ్వకుండా ఆందోళన కారులు పట్టణాన్ని దిగ్బంధనం చేశారు. ఓ పెట్రోలు బంకుపై ఆందోళన కారులు రాళ్లతో దాడి చేసి ధ్వంసం చేశారు. జమ్మలమడుగు పాతబస్టాండ్‌లో కొనసాగుతున్న నిరసనదీక్షలను ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వేర్వేరుగా సందర్శించి సంఘీభావం తెలిపారు.
పట్టణంలో మునిసిపల్, నియోజకవర్గ పరిధిలో రెవెన్యూ ఉద్యోగులు పెన్‌డౌన్ చేశారు. ముస్లింలు భారీ ర్యాలీ చేపట్టారు. ఎర్రగుంట్లలో జువారీ ఉద్యోగులు, కార్మికులు ర్యాలీ నిర్వహించారు. చెక్కభజన చేశారు. ఆర్‌టీపీపీ ఉద్యోగులు రోడ్డుపై ఖో..ఖో, కబడ్డీ ఆడి నిరసన తెలిపారు. మైదుకూరులో ైవె ఎస్‌ఆర్‌సీపీ క్రమశిక్షణకమిటీ సభ్యుడు రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. డీసీసీబీ చైర్మన్ తిరుపాల్‌రెడ్డి పాల్గొని ప్రసంగించారు. పులివెందులలో జేఏసీ ఆధ్వర్యంలో సాగుతున్న రిలేదీక్షలను వైఎస్ అవినాష్‌రెడ్డి, దేవిరెడ్డి శంకర్‌రెడ్డి సందర్శించారు.
అక్కడే వంటా- వార్పు చేపట్టారు. అవినాష్‌రెడ్డి రోడ్డుపై క్రికెట్ ఆడారు. ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కేసీఆర్ శవపేటికకు మహిళలు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించారు. బద్వేలులో జేఏసీ నేతలు కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలను దహనం చేశారు. కలసపాడులో వంటావార్పు చేపట్టారు. రాజంపేటలో పట్టణ పురోహితుల ఆధ్వర్యంలో కేసీఆర్, సోనియా, దిగ్విజయ్‌సింగ్‌లకు పిండ ప్రదానం చేశారు. బోయినపల్లిలో వంటావార్పు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అమర్‌నాథరెడ్డి పాల్గొన్నారు.
ఉప్పెనలా ఉద్యమం
Published Thu, Aug 8 2013 4:14 AM | Last Updated on Sun, Sep 2 2018 4:03 PM
Advertisement