సాక్షి, కడప: దారిద్య్రరేఖకు దిగువనున్న నిరుపేదలకు స్వాంతన చేకూర్చాలనే ఉద్దేశంతో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద దళిత, గిరిజనుల ఇళ్లకు ఉచితంగా విద్యుత్‌ను అందించే చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. బిల్లుల చెల్లింపునకు సంబంధించి సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్‌పీటర్ ఈనెల 2న జీవో 58 జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 93, 159 ఎస్సీ కుటుంబాలు ఉన్నాయి. వీరిలో 50 యూనిట్లలోపు విద్యుత్‌ను వినియోగించే కుటుంబాలు 23,176 ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో 20,260 కుటుంబాలకు సంబంధించిన పాత బకాయిలు కూడా ఉన్నాయి.
వీటితో పాటు జూలై నెల నుంచి విద్యుత్ బిల్లులన్నింటినీ చెల్లించేలా చర్యలు చేపట్టాలని ఆదేశిస్తూ జిల్లా సాంఘిక సంక్షేమశాఖకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులకు అనువుగా జిల్లాలోని లబ్ధిదారులు, వారికున్న బకాయిల వివరాలను పంపించాల్సిందిగా విద్యుత్‌శాఖను సాంఘిక సంక్షేమశాఖ కోరింది. వారిందించే వివరాల ఆధారంగా పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రతి నెలా మొదటివారంలోనే వాటిని చెల్లించేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. జూలై నుంచి రెగ్యులర్ బిల్లులు చెల్లిస్తారు. బకాయిలను మాత్రం రెండు విడతల్లో చెల్లించేలా ప్రభుత్వం నిర్ణయించింది.
ఎస్టీలకు ఎప్పుడో..!:
ఎస్సీల విద్యుత్తు బిల్లుల చెల్లింపుపై జీవో జారీ చేసిన ప్రభుత్వం ఎస్టీల విషయంలో నిర్లిప్తత వహించింది. గిరిజన తాండాల్లో నివసించే ఎస్టీల బిల్లులు చెల్లించేందుకు ఇంకా ఉత్తర్వులు వెలువరించలేదు. దీంతో జూలైకు సంబంధించిన ఎస్సీల బిల్లులు ప్రభుత్వం చెల్లిస్తే, ఎస్టీలు మాత్రం వారి బిల్లులు వారే చెల్లించుకోవాల్సి ఉంది. జిల్లాలో మొత్తం 15, 178 గిరిజన కుటుంబాలు ఉన్నట్లు అంచనా. ఇందులో కొన్ని తాండాలకు ఇప్పటికీ విద్యుత్ సౌకర్యం లేదు. తాండాల్లో నివసించేవారిలో 60 శాతం మంది 50 యూనిట్లలోపు విద్యుత్‌ను వినియోగిస్తున్నట్లు అధికారిక నివేదికలు చెబుతున్నాయి.
మిగిలిన వారి పరిస్థితేంటి..!:
దళిత, గిరిజన వాడల్లోని ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా విద్యుత్‌ను అందించాలనే నిర్ణయం మంచిదైన్పటికీ అద్దె ఇళ్లలో ఉంటున్నవారు, ఇతర ప్రాంతాల్లో నివసించే వారిలో 50 యూనిట్ల విద్యుత్‌ను వాడే వారి పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
పేదవర్గాలకు చెందిన ఎస్సీ, ఎస్టీలందరికీ మేలు చేసేలా వ్యవహరించాల్సిన ప్రభుత్వం కేవలం సమూహంగా ఉండే కాలనీలకే వర్తింపజేస్తామనే విధానం సరైంది కాదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇతర ప్రాంతాల్లో నివసించేవారిలో మెజార్టీ శాతం కూలీపైనే ఆధారపడి జీవిస్తున్నవారు ఎందరో ఉన్నారు. తమను పట్టించుకోకుండా కేవలం దళితవాడలకు ఇస్తామనడంలో తమకు అన్యాయం చేసినట్లేనని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
బిల్లులు చెల్లిస్తాం: పీఎస్‌ఏ ప్రసాద్, జేడీ
జూలై నెల నుంచి ఎస్సీల విద్యుత్తు బిల్లులను చెల్లిస్తాం. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా 50 యూనిట్లలోపు ఎంతమంది విద్యుత్తును వినియోగిస్తున్నారో ఆ వివరాలను ఎస్‌పీడీసీఎల్ అధికారులు పంపిస్తే బిల్లులను మేమే చెల్లిస్తాం. పాత బకాయిలను రెండు విడత లుగా చెల్లిస్తాం.
ఎస్సీ, ఎస్టీ వాడల్లో...ఉచిత ‘వెలుగులు’
Published Thu, Aug 8 2013 4:23 AM | Last Updated on Fri, Sep 1 2017 9:42 PM
Advertisement
Advertisement