సమ్మె షాక్
- జిల్లాలో విద్యుత్ ఉద్యోగుల సమ్మె తీవ్రతరం
- విధులకు సిబ్బంది దూరం
- అత్యవసర సేవలకూ ససేమిరా
- ఈదురుగాలులతో వందలాది గ్రామాల్లో అంధకారం
- వినియోగదారులకు నరకం
సాక్షి, విశాఖపట్నం: విద్యుత్ ఉద్యోగులు సమ్మెబాట పట్టడంతో జిల్లాలో ఆందోళన నెలకొంది. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం పే రివిజన్ అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఉద్యోగులు ఆదివారం ఉదయం నుంచి సమ్మెలోకి దిగుతున్నట్టు ప్రకటించారు. జిల్లా విద్యుత్‌శాఖలో పనిచేస్తున్న 1600 మంది ట్రాన్స్‌కో ఉద్యోగులు సమ్మెలో కొనసాగుతున్నారు.
లైన్‌మన్లు, అటెండర్లు, ఎల్‌డీసీలు, క్లరికర్, ఇంజినీరింగ్ క్యాడర్‌నుంచి చీఫ్ ఇంజినీర్ వరకు ఆందోళన బాట పట్టారు. అటు తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్)లో 300 మంది ఉద్యోగులు సమ్మెలో ఉన్నారు. వీరంతా పీఆర్‌సీ అమలు చేయనందుకు నిరసనగా ఆందోళన చేపట్టడంతోపాటు అత్యవసర సేవలు కూడా అందించడానికి ససేమిరా అంటున్నారు. జిల్లాలో రెండురోజుల నుంచీ వర్షాలతోపాటు భారీస్థాయిలో ఈదురు గాలులు వీస్తున్నాయి.
దీంతో జిల్లాలో అనేక మండలాల్లో పెద్దపెద్ద చెట్లు విరిగి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలపై పడడంతో అవన్నీ నేలకొరిగాయి. అనేక లైన్లు ధ్వంసమయ్యాయి. ఫలితంగా ప్రస్తుతం వందలాది గ్రామాల్లో అంధకారం నెలకొంది. కొన్నిచోట్ల విద్యుత్ 30 గంటల నుంచి లేదు. అటు విశాఖ నగరంలోని బీచ్‌రోడ్డులో అంధకారం నెలకొంది. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. సిబ్బంది సమ్మెలో ఉండడంతో పనులు జరగలేదు.
అనకాపల్లి, చోడవరం, మాడుగుల, పాయకరావుపేట, యలమంచిలి, నర్సీపట్నం, పాడేరు, పరవాడ, పెందుర్తి తదితర ప్రాంతాల్లో అనేక గ్రామాలకు విద్యుత్ లేదు. వినియోగదారులు ఫోన్ చేస్తున్నా సిబ్బంది స్పందించడం లేదు. అల్పపీడనం కాస్తా ఆదివారం రాత్రి నుంచి తీవ్ర అల్పపీడనంగా బలపడింది.
ఈ నేపథ్యంలో బలమైన గాలులు వీయనున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని వల్ల విద్యుత్‌శాఖకు మరింత నష్టం వాటిల్లనుంది. ఒకవేళ ఎక్కడైనా ట్రాన్స్‌ఫార్మర్లు, లైన్లు ధ్వంసం అయినా పట్టించుకునే పరిస్థితి లేదు. విద్యుత్ ఉద్యోగుల సమ్మె, మరోపక్క వర్షం, ఈదురుగాలులు పొంచి ఉండడంతో విద్యుత్ కష్టాలు మరింత తీవ్రతరం కానున్నాయి.