pay revision
-
ఆర్టీసీ ఉద్యోగుల వేతన సవరణకు లైన్‌క్లియర్?
సాక్షి, హైదరాబాద్: వేతన సవరణకు ఎదురుచూస్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురు చెప్పేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. ఈనెల 31న జరిగే మంత్రివర్గ సమావేశ ఎజెండాలో ఆర్టీసీ ఆర్థికపరమైన అంశాలను చేర్చటంతో ఈ చర్చ జరుగుతోంది. 44 శాతం ఫిట్మెంట్తో... 2013 సంవత్సరానికి సంబంధించి 2015లో ప్రభుత్వం వేతన సవరణ చేసిన విషయం తెలిసిందే. 30 శాతం మేర ఫిట్మెంట్ ప్రకటిస్తారని కార్మిక సంఘాలు భావించగా, ప్రభుత్వం ఏకంగా 44 శాతం ఫిట్మెంట్ ఇచ్చి ఆశ్చర్యపరిచింది. దీంతో ఆర్టీసీపై రూ.850 కోట్ల వార్షికభారం పడింది. అప్పటి నుంచి ప్రభుత్వం తర్వాత వేతన సవరణల జోలికి పోలేదు. వేతన సవరణ 2017లో చేయాల్సి ఉండగా.. 2017లో వేతన సవరణ చేయాల్సి ఉండగా, ప్రభుత్వం స్పందించలేదు. దీంతో అప్పట్లో కార్మిక సంఘాలు సమ్మెబాట పట్టాయి. మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం కార్మిక సంఘాలతో చర్చలు జరిపింది. వేతనసవరణ రూపంలో పడే భారాన్ని తట్టుకునే పరిస్థితి లేక, మధ్యంతర భృతితో సరిపెట్టింది. 16 శాతం ఇంటీరియమ్ రిలీఫ్ ఇవ్వగా, ఇప్పటికీ అదే కొనసాగుతోంది. 2021లో ఇవ్వాల్సిన వేతన సవరణపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అదే 16 శాతాన్ని ఖాయం చేస్తే రూ.40 కోట్ల భారం ప్రస్తుతం 2017కు సంబంధించిన 16 శాతం మధ్యంతర భృతి కొనసాగుతోంది. అంతే శాతాన్ని ఫిట్‌మెంట్‌గా మారిస్తే నెలవారీ భారం ఏకంగా రూ.40 కోట్లుగా ఉంటుందని ఇప్పటికే ఆర్టీసీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ప్రస్తుతం అమలు చేస్తున్న మధ్యంతర భృతికి అదనంగా ఒక్కశాతం అదనంగా ఫిట్మెంట్ ప్రకటించినా ప్రతినెలా రూ.3 కోట్ల మేర అదనపు భారం పడుతుందని అధికారులు పేర్కొన్నారు. 18, 20, 22, 24 శాతం లెక్కలను కూడా పరిశీలించి ఓ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. -
బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు బొనాంజా..
సాక్షి, న్యూఢిల్లీ : బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. వేతన, పెన్షన్ సవరణలతో పాటు వారి ప్రధాన డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. బీఎస్ఎన్ఎల్ ఉద్యోగ సంఘాల ప్రతిపాదనలకు అనుకూలంగా ఆర్థిక మంత్రిత్వ శాఖకు లేఖ రాశామని టెలికమ్యూనికేషన్ల మంత్రి మనోజ్ సిన్హా వెల్లడించారు. ఈ సమస్యకు సానుకూల పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నామని మంత్రి చెప్పారు. కాగా, బీఎస్ఎన్ఎల్లో ప్రస్తుత ఉద్యోగుల వేతన సవరణతో ముడిపెట్టకుండా తమకు వేరుగా పెన్షన్ సవరణ చేపట్టాలన్నరిటైర్డ్ ఉద్యోగుల డిమాండ్‌కు టెలికాం మంత్రిత్వ శాఖ అంగీకరించిందని ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో 15 శాతం ఫిట్మెంట్తో వేతన సవరణకు మార్గం సుగమం కానుంది. బీఎస్ఎన్ఎల్కు మార్కెట్ వాటా బలోపేతం కోసం సంస్థకు 4జీ స్పెక్ర్టమ్ కేటాయించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఈ డిమాండ్‌ను నొక్కిచెబుతూ నిరవధిక సమ్మెకు ఉద్యోగ సంఘాలు సిద్ధమవగా బీఎస్ఎన్ఎల్కు 4జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు కోరుతూ టెలికాం శాఖ కేబినెట్ నోట్‌ను సిద్ధం చేయడం గమనార్హం. -
విద్యుత్ పీఆర్సీపై ప్రకటన రేపే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగుల వేతన సవరణపై రేపు (సెప్టెంబర్ 1న) ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కీలక ప్రకటన చేయనున్నారు. వేతన సవరణ ఫిట్మెంట్ శాతం, వెయిటేజీ ఇంక్రిమెంట్ల సంఖ్య, వైద్య సదుపాయం తదితర అంశాలపై ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు నేతృత్వంలోని విద్యుత్ ఉద్యోగుల సంఘాల ప్రతినిధి బృందంతో శనివారం మధ్యా హ్నం 3 గంటలకు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి చర్చలు జరిపి అప్పటికప్పుడు తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. ట్రాన్స్‌కో జేఎండీ సి.శ్రీనివాస రావు నేతృత్వంలో నియమించిన విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణ సంప్రదింపుల కమిటీ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. నాలుగేళ్ల కిందట.. చివరిసారిగా నాలుగేళ్ల కిందట విద్యుత్ ఉద్యోగులకు 30 శాతం ఫిట్మెంట్, 3 వెయిటేజీ ఇంక్రిమెంట్లతో కలిపి పీఆర్సీని ప్రకటించారు. గత మార్చి 31తో ఈ పీఆర్సీ కాలపరిమితి ముగిసిపోగా, ఏప్రిల్ 1 నుంచి కొత్త పీఆర్సీని వర్తింపజేయాల్సి ఉంది. దీంతో ట్రాన్స్‌కో, జెన్కో, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్లో పని చేస్తున్న 25 వేల మంది విద్యుత్ ఉద్యోగులు కొత్త పీఆర్సీపై ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఉద్యోగులకు 25 శాతం ఫిట్మెంట్తోపాటు 3 వెయిటేజీ ఇంక్రిమెంట్లతో వేతన సవరణను అమలు చేస్తున్నారు. చివరిసారిగా ప్రకటించిన 30 శాతం ఫిట్మెంట్ కన్నా ఎక్కువ మొత్తంలో ఫిట్మెంట్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఏపీలో 25 శాతం ఫిట్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో అంతకంటే కొద్దిగా ఎక్కువ శాతం ఫిట్‌మెంట్‌ను తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు ప్రకటించే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఫిట్మెంట్ శాతంపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం కీలకంగా మారనుంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో విద్యుత్ సరఫరా వ్యవస్థను గాడిలో పెట్టి నిరంతర విద్యుత్ సరఫరాను అమలు చేసేందుకు ఉద్యోగులు బాగా పని చేశారని కేసీఆర్ పలుమార్లు ప్రశంసించారు. జేఏసీ ప్రతినిధులతో ప్రభాకర్‌రావు చర్చలు పీఆర్సీ ప్రకటనలో జాప్యానికి నిరసనగా ఆందోళనకు సిద్ధమైన తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ ప్రతినిధులతో ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావు గురువారం విద్యుత్ సౌధలో చర్చలు జరి పారు. సెప్టెంబర్ 1న ప్రగతి భవన్లో యూనియన్ల నేతలతో చర్చించి పీఆర్సీపై సీఎం ప్రకటన చేస్తారని ట్రాన్స్‌కో సీఎండీ హామీ ఇచ్చినట్లు జేఏసీ అధ్యక్ష, కార్యదర్శులు పద్మారెడ్డి, సాయిబాబా తెలిపారు. -
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
డీసీసీబీ చైర్మన్‌కు పీఏసీఎస్ ఉద్యోగుల వినతి హన్మకొండ : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్) ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర పీఏసీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు జి.యాదగిరి, ప్రధాన కార్యదర్శి ఎం.భాస్కర్‌రెడ్డి కోరారు. హన్మకొండలోని డీసీసీబీ కార్యాలయంలో చైర్మన్ జంగా రాఘవరెడ్డికి ఈమేరకు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెరిగిన నిత్యావసరాల ధరల ప్రకారం తమ వేతనాలు పెంచాలన్నారు. 2012 సంవత్సరం నుంచి వేతన సవరణ జరిపించాలన్నారు. గ్రాట్యుటీ సీఈఓలకు రూ.5 లక్షలు, స్టాఫ్ అసిస్టెంట్లకు రూ.3 లక్షలు, అటెండర్లకు రూ.2 లక్షలు ఇవ్వాలన్నారు. ఉద్యోగులకు ఇంటీరియం రిలీఫ్ 30 శాతం ఇవ్వాలన్నారు. పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, హెచ్ఆర్ఏ 30 శాతం చెల్లించాలని డిమాండ్ చేశారు. దీనిపై డీసీసీబీ చైర్మన్ రాఘవరెడ్డి స్పందిస్తూ తన పరిధిలో ఉన్నంత మేరకు సహాయం చేస్తానన్నారు. పీఏసీఎస్ ఉద్యోగుల డిమాండ్లు ప్రభుత్వానికి, టీఎస్ కాబ్‌కు పంపుతానని ఆయన అన్నారు. -
వేతన సవరణకు యూజీసీ కమిటీ
న్యూఢిల్లీ: యూనివర్సిటీలు, కాలేజీల్లోని బోధన సిబ్బందికి వేతన సవరణ కోసం ఐదుగురు సభ్యుల కమిటీని గురువారం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) ఏర్పాటు చేసింది. కమిటీకి యూజీసీ సభ్యుడు ప్రొఫెసర్ వీఎస్ చౌహాన్ నేతృత్వం వహిస్తారు. ప్రొఫెసర్ దురైస్వామి(మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీస్), ప్రొఫెసర్ రాంసింగ్(ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్), ఆర్సీ పాండా(మాజీ ఐఏఎస్), హెచ్చార్డీ శాఖ సంయుక్త కార్యదర్శి ప్రవీణ్ కుమార్ సభ్యులుగా ఉన్న ఈ కమిటీ ఆరునెలల్లో నివేదిక సమర్పిస్తుంది. వర్సిటీలు, కాలేజీ టీచర్లు, లైబ్రేరియన్లు, వ్యాయామ ఉపాధ్యాయులు ఇతర బోధన సిబ్బంది వేతనాలకు సంబంధించి గతంలో ప్రభుత్వం లేదా యూజీసీ తీసుకున్న నిర్ణయాల అమలునూ ఈ కమిటీ పరిశీలిస్తుంది. అలాగే, ప్రస్తుత వేతన వ్యవస్థ తీరును, కనీస అర్హత, కెరియర్ అడ్వాన్స్మెంట్ అవకాశాలు, సర్వీసు నిబంధనలు, మొత్తంగా లభించే ప్రయోజనాలు(రిటైర్మెంట్, వైద్య, గృహనిర్మాణ సౌకర్యాలు సహా).. తదితరాలనూ ఈ కమిటీ సమీక్షించనుంది. అలాగే, సమర్థులను బోధనారంగంలోకి ఆకర్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలను కూడా ఈ కమిటీ సిఫారసు చేస్తుంది. -
సంఘటిత రంగానిదే సింహభాగం
అవినీతికి ఆస్కారం లేకుండా వేగంగా పనులు జరిగేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలను సూచించకుండానే 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 23.55 శాతం జీతాలు పెంచాలంటూ సిఫార్సు చేసి 7వ వేతన సంఘం చేతులు దులుపుకున్నది. నిజానికి, వేతన సంఘం చేయవలసింది కేవలం వేతనాల పెంపుదలకు సంబంధించిన సిఫార్సులు చేయడమే కాదు. నరేంద్రమోదీకి 2014 కలలు సాకారమైన సంవత్సరమైతే 2015 ఎదురు దెబ్బలు తగిలిన ఏడాది. ఢిల్లీ, బిహార్ శాసనసభ ఎన్నికలలో పరాజయం మోదీ ప్రభంజనానికి అడ్డుకట్ట వేసింది. మొదటి దెబ్బ ఢిల్లీలో తగలడానికి పరిశీలకులు పేర్కొన్న అనేక కారణాలలో కేంద్ర ప్రభుత్వోద్యోగులను కట్టడి చేయడానికి మోదీ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఒకటి. ఉదయం తొమ్మిదింటికి ఉద్యోగి ఆఫీసులో తన సీటులో కూర్చోకపోతే ఆ సంగతి ప్రధానమంత్రి కార్యాలయానికి తెలిసిపోయే విధంగా సాఫ్ట్వేర్ తయారు చేసి ఉపయోగిస్తున్నారనీ, ఇటువంటి ఆంక్షలు అలవాటు లేని ప్రభుత్వోగులు ఆగ్రహించి భారతీయ జనతా పార్టీని ఓడించడంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు సంపూర్ణంగా సహకరించారనీ ఢిల్లీ రాజకీయ వర్గాలలో అప్పట్లో వినిపించేది. ప్రభుత్వోద్యోగులను ప్రసన్నం చేసుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయని పని లేదు. వారిని ఉపేక్షించే సాహసం ఏ ప్రభుత్వమూ చేయదు. జీవన వ్యయం పెరుగుతున్నకొద్దీ వారి జీతభత్యాలు పెంచడం ఆనవాయితీ. ఏడవ వేతన సంఘం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చేసిన సిఫార్సులు ఈ కోవలోకే వస్తాయి. కొత్త వేతన ప్రమాణాలను అమలు చేస్తే కేంద్ర ప్రభుత్వంపైన రూ.73,650 కోట్లూ, రైల్వేలపైన రూ.28,450 కోట్లూ, వెరసి రూ.1,02,100 కోట్ల అదనపు వ్యయభారం పడుతుందని అంచనా. దీనికి తోడుగా ఉద్యోగ విరమణ చేసిన సైనికులకు ఓఆర్ఓపీ (వన్ ర్యాంక్ వన్ పెన్షన్) విధానం అమలు చేయడం వల్ల పెరిగే వ్యయం. పెరిగిన మొత్తం భారం స్థూల జాతీయ ఉత్పత్తిలో నాలుగు శాతం కంటే అధికం. ఈ వరుస ఇంతటితో ఆగదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలతో సమానంగా తమ వేతనాలు పెంచాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులూ, స్థానికి సంస్థల ఉద్యోగులూ ఉద్యమాలు చేస్తారు. వచ్చే రెండు సంవత్సరాలలో వారి జీతాలు కూడా పెంచక తప్పదు. దీని వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బ తింటుందనీ, ద్రవ్యలోటు తగ్గకపోగా పెరుగుతుందనీ కొందరు ఆర్థికవేత్తలు హెచ్చరిస్తుంటే వేతనాలు పెరగడం వల్ల ఖర్చు పెరుగుతుందనీ, పరోక్షంగా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందనీ, స్తబ్దుగా ఉన్న విపణిలో చలనం వస్తుందనీ మరికొందరు వాదిస్తున్నారు. ప్రభుత్వ వ్యయం పెరిగితేనే నయం? రెండో వాదనను ముందుగా పరిశీలిద్దాం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉంది. ఉత్పత్తుల ధరలు పడిపోతున్నాయి. తగ్గిపోయిన వస్తు వినియోగం వేగంగా పెరగడం లేదు. ద్రవ్యోల్బణం అదుపు తప్పకుండా బుద్ధిగానే ఉంటోంది. పరిశ్రమలు శక్తికి తగిన స్థాయిలో ఉత్పత్తి చేయడం లేదు. కార్పొరేట్ రంగంలో పెట్టుబడులు పెరగడం లేదు. ఈ పరిస్థితులలో మార్కెట్‌ను ఉత్తేజపరచాలంటే ప్రభుత్వ వ్యయం పెంచడం ఒక్కటే మార్గం. ఏడవ వేతన సంఘం సిఫార్సులను అమలు చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వోద్యోగుల ఆదాయం పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతాలలో సగటున 20 శాతం ఆదాయం పన్ను కింద చెల్లిస్తారు. వేతనాల పెంపు వల్ల పెరిగిన వ్యయభారంలో అయిదో వంతు అదనపు ఆదాయం పన్ను రూపంలో ప్రభుత్వ ఖజానాకు వాపసు వస్తుంది. ఇది కాకుండా, కేంద్ర ఉద్యోగి వినిమయ వస్తువులు కొనుగోలు చేసినా, ఇల్లు కట్టుకున్నా, విహారయాత్రలకు వెళ్లినా, ఇతరత్రా ఎటువంటి ఖర్చులు చేసినా పరోక్ష పన్నుల రూపంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పెరుగుతుంది. కనుక యూపీఏ సర్కార్‌లో నాటి ఆర్థికమంత్రి చిదంబరం ద్రవ్యలోటుకు బెదిరి ప్రభుత్వ వ్యయంపైన కోత విధించినట్టు ఎన్డీఏ ప్రభుత్వంలో అరుణ్ జైట్లీ సర్కారు వ్యయాన్ని తగ్గించే ఆలోచన చేయరాదనీ, ప్రభుత్వ వ్యయాన్ని పెంచాలనీ ఈ వర్గం ప్రవీణులు నొక్కి చెబుతున్నారు. వినిమయం, పెట్టుబడి, ఉత్పత్తి పెరుగుదల, లాభాలు, ఇతర అంశాలతో కూడిన విపణి చోదక ఆర్థికచక్రం అగకుండా తిరుగుతూ ఉండాలంటే వేతనాలు పెంచడం అవసరం. కాకపోతే, 2014లో, 2015లో సమర్పించిన చచ్చు బడ్జెట్ కాకుండా 2016లో భారీ సంస్కరణలకు ఊతం ఇచ్చే వైవిధ్య భరితమైన బడ్జెట్‌ను జైట్లీ ప్రతిపాదించాలని ఆర్థిక సంస్కరణలు అత్యవసరమని భావించే ఆర్థికవేత్తలు స్పష్టం చేస్తున్నారు. పన్నులు తగ్గించా లనీ, ప్రభుత్వ రంగంలో ఉన్న పరిశ్రమలను ప్రైవేటు రంగానికి అప్పగించాలనీ, ప్రభుత్వ రంగంలోని భారీ (నవరత్న) సంస్థలలో వాటాలను ప్రైవేటు సంస్థలకు అమ్మివేయాలనీ సంస్కరణవాదుల అభిలాష. వచ్చే బడ్జెట్ ప్రతి పాదనలలో సైతం జైట్లీ విఫలమైతే పుణ్యకాలం కాస్తా గడిచిపోతుందనీ, ఎన్డీఏకి 2019 ఎన్నికలలో ఎదురుగాలి అనివార్యం అవుతుందనీ హెచ్చ రిస్తున్నారు. వాజపేయి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో 2001-02 నుంచి దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ 2003-04లో కోలుకున్నదనీ, కానీ అప్పటికే సమయం మించిపోయిందనీ, ఎన్డీఏ ఓటమి పాలయిందనీ ప్రవీణులు గుర్తు చేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం వేతనాలు పెంచడాన్ని వ్యతిరేకిస్తున్నవారి వాదనలో సైతం బలం లేకపోలేదు. ప్రస్తుతం ద్రవ్యలోటు 3.4 శాతం ఉన్నది. ఈ లోటును పూడ్చడానికి ప్రయత్నించవలసిన ప్రభుత్వం వ్యయం పెంచుకుంటూ పోతే ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుందంటూ సిటీ గ్రూప్, ఇండియా రేటింగ్స్ వంటి సంస్థలు ప్రమాద సూచికలు ఎగురవేస్తున్నాయి. ఇప్పుడున్న ద్రవ్యలోటు పూడాలంటే ప్రభుత్వ ఆదాయం రూ.80,000 కోట్లు పెరగాలి. ప్రభుత్వ రంగ సంస్థలలో వాటాలు విక్రయించి రూ.70,000 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సమీకరించాలని ప్రణాళిక వేసుకున్న ప్రభుత్వం ఇంతవరకూ సేకరించగలిగిన మొత్తం కేవలం రూ.12,700 కోట్లు. అంతర్జాతీయ చమురు ధరలు బాగా తగ్గి ఉన్న కారణంగా ఆర్థిక వ్యవస్థలో అంతగా ఒడిదుడుకులు రాలేదు. ముడి చమురు ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఖజానాపైన భారం మరింత పెరుగుతుంది. ఇవన్నీ ప్రభుత్వ ఉద్యోగులకు అవసరం. పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా తమ ఆదాయం పెరగాలనుకోవడం సహజం. అందుకు వారిని తప్పు పట్టడం భావ్యం కాదు. సంఘటిత రంగంలో ఉన్న ఉద్యోగులు ప్రభుత్వం మెడలు వంచి జీతాలు పెంచుకోగలరు. అసంఘటిత రంగంలో ఉన్న రైతులు బతకలేక ఆత్మహత్యలకు ఒడికడుతున్నారు. గ్రామాలలో రోజుకు రూ.32లు, పట్టణాలలో రూ.47లు ఖర్చు చేసేవారు పేదవారి జాబితాలోకి రారంటూ రంగరాజన్ కమిటీ నిర్ణయించింది. హైదరాబాద్‌లో రూ.47లకు రెండు పూటలా తిండి దొరుకుతుందా? ఈ లెక్కన చూసుకున్నా దేశ జనాభాలో 29.5 శాతం మంది దారిద్య్ర రేఖ దిగువన ఉన్నారని అర్థం. అటువంటి కటిక పేదల సంగతి కానీ, వ్యవసాయం గిట్టుబాటు కాక ప్రాణాలు తీసుకుంటున్న రైతుల గురించి కానీ, కోట్లాది మంది నిరుద్యోగుల గురించి కానీ వేతన సంఘంలో ఉన్న ప్రవీణులూ, సంఘం అధ్యక్షుడు జస్టిస్ మాథుర్ ఒక్క క్షణం కూడా ఆలోచించి ఉండరు. కోటి ఉద్యోగాలు సృష్టిస్తానన్న మోదీ ఎన్నికల హామీ అమలు అయ్యే అవకాశాలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. సమష్టి భావం లోపించడం వల్ల, ఎవరి ప్రయోజనాలు వారు సాధించుకో వాలనే ధోరణి కారణంగా సంఘటితరంగంలోని ఉద్యోగులు ప్రధానుల, ముఖ్యమంత్రుల ముక్కుపిండి జీతనాతాలు వసూలు చేసుకుంటున్నారు. పెంచిన జీతాలకు న్యాయం చేస్తున్నారా అంటే అదీ అనుమానమే. జీతాలతో పాటు గీతాలూ పెరుగుతున్నాయి. పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంటున్నాయి. ఉత్పత్తికీ, వేతనాలకూ ప్రైవేటు రంగంలో సంబంధం ఉన్నది. ఒక ఉద్యోగి వల్ల సంస్థకు ప్రయోజనం కలిగితేనే అతనికి లేదా ఆమెకు పదోన్నతి కానీ, వేతనం పెరుగుదల కానీ ఉంటుంది. పనికీ, జీతాల పెరుగుదలకీ సంబంధం ఉండాలనే వాదనకు ఏడవ వేతన సంఘం 880 పేజీల నివేదికలో కొన్నింటిని కేటాయించింది. కానీ చివరికి ఏమని సిఫార్సు చేసింది? పని చేయనివారిని గుర్తించి ఇరవై సంవత్సరాలలో ఉద్యోగాల నుంచి తొలగించాలని చెప్పింది (అదే ప్రైవేటురంగంలో ఉద్యోగి పనితీరుపై ప్రతి మూడు మాసాలకూ ఒకసారి మదింపు ఉంటుంది). వేతనసంఘం ప్రతిభకు పట్టం కట్టినట్టా, గోరీ కట్టినట్టా? పని చేయనివారికి ఇరవై సంవత్సరాల వెసులుబాటు కల్పిస్తూ, పని తీరును సమీక్షించేందుకూ, పనిచేయనివారిని ఉద్యోగాల నుంచి తొలగించేందుకూ ఎటువంటి విధానం అనుసరించాలో చెప్పకుండా నివేదికను ముగించడం వేతన సంఘం బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. కొసమెరుపు ఈ నివేదికలో కొస మెరుపు ఏమిటంటే ఐఏఎస్ అధికారుల ఆధిక్యాన్ని తగ్గిస్తూ ఐపీఎస్, ఐఎఫ్ఎస్లను ఐఎస్ఎస్ అధికారులతో సమానంగా పరిగణించాలనే ప్రయత్నం. ఈ అధికారులతో పని చేయించుకునే ముఖ్యమంత్రులను కానీ పనిచేయించే రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులను కానీ సంప్రదించకుండా ఐఏఎస్‌ల తోక కోసి సున్నం పెట్టాలంటూ వేతన సంఘం సిఫార్సు చేయడం అర్థరహితం. ఐఏఎస్‌లు జిల్లా కలెక్టర్లుగా, జిల్లా మెజిస్ట్రేట్లుగా సంక్లిష్టమైన బాధ్యతలు నిర్వహిస్తారు. ప్రభుత్వ ప్రతినిధులుగా వారు దాదాపు అన్ని రంగాలలోనూ జోక్యం చేసుకుంటారు. సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్ని స్తుంటారు. వారిపైన పని ఒత్తిడి ఎక్కువ. వారితో సమానంగా తమ తమ శాఖలకు పరిమితమై పనిచేసే పోలీసు ఉన్నతాధికారులనూ, అటవీశాఖ ఉన్నతాధికారులనూ పరిగణించాలనడం సరికాదని ఇదివరకటి వేతన సంఘాలూ, సుప్రీంకోర్టూ స్పష్టం చేశాయి. ఈ స్పూర్తికి భిన్నమైన సిఫార్సును తాజా వేతన సంఘం చేయడం విడ్డూరం. ఐఏఎస్, ఐపీఎస్‌ల మధ్య ఆధిక్య పోరు చాలాకాలంగా చూస్తున్నాం. ఐఎఫ్ఎస్లను కూడా ఈ పోరాటంలో భాగస్వాములను చేయడం ఎందుకు? వేతనం కానీ హోదా కానీ పని స్వభావంపైనా, సంక్లిష్టతపైనా ఆధారపడి ఉండాలి. ప్రతిభావంతులను ప్రభుత్వ ఉద్యోగాలలో నియమించేందుకు వీలుగా, సామర్థ్యానికి పెద్దపీట వేసే విధంగా, జవాబుదారీతనాన్నీ, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించే మనస్తత్వాన్నీ ప్రోత్సహించే పని సంస్కృతిని పెంపొందించే విధంగా సిఫార్సులు చేయాలంటూ ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకొని బృహత్ సంకల్పం చెప్పుకున్న వేతన సంఘం లక్ష్య సాధనలో విఫలమైనట్టే. ఉద్యోగవర్గం (బురాక్రసీ) పనితీరు మెరుగుపరిచేందుకు చేపట్టవలసిన చర్యలను కానీ, అవినీతికి ఆస్కారం లేకుండా వేగంగా పనులు జరిగేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలను కానీ సూచించకుండానే 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 23.55 శాతం జీతాలు పెంచాలంటూ సిఫార్సు చేసి చేతులు దులుపుకున్నది. నిజానికి, వేతన సంఘం చేయవలసింది కేవలం వేతనాల పెంపుదలకు సంబంధించిన సిఫార్సులు చేయడమే కాదు. బురాక్రసీని సంస్కరించడానికీ, దాని సామర్థ్యం పెంచడానికీ, పనితీరులో పారదర్శకతను పెంపొందించడానికీ, తాము ప్రజాసేవకులమని గుర్తెరిగి జనహితంకోసం పని చేయడానికీ ఏమేమి సంస్కరణలు అమలు చేయాలో సిఫార్సు చేయాలి. ఈ దిశగా జస్టిస్ మాథుర్, ఇతర సభ్యులు కృషి చేసిన దాఖలా వేతన సంఘం నివేదికలో పెద్దగా కనిపించదు. వేతన సంఘం చేసిన సిఫార్సులను అమలు చేయడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించే విధంగా ఉద్యోగులు తమ బాధ్యతలను నిర్వర్తించేట్టు చేయడం కూడా కేంద్ర ప్రభుత్వ కర్తవ్యం. క్రమశిక్షణతో, నిబద్ధతతో, సృజనాత్మకంగా, ప్రయోజనకరంగా పని చేసే ఉద్యోగులకు ప్రోత్సహకాలు ఉండాలి. గుర్రాన్నీ, గాడిదనూ ఒకే గాట కట్టే సంస్కృతికి ఇప్పటికైనా స్వస్తి చెప్పకే పోతే భావి తరాలు క్షమించవు. -
తెలుగు రాష్ట్రాల్లో అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె
-
ఎక్కడికక్కడే నిలిచిపోయిన బస్సులు
-
చక్రాలకు బ్రేక్
తెలుగు రాష్ట్రాల్లో అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె ► కార్మికుల వేతన సవరణపై చర్చలు విఫలం ► 27% ఐఆర్‌ను ఫిట్‌మెంట్‌గా మారుస్తామన్న ప్రభుత్వం ► 43% ఇచ్చి తీరాల్సిందేనని కార్మిక సంఘాల పట్టు ► రోజంతా చర్చోపచర్చలు.. హైడ్రామా ► మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తామన్న సర్కారు ► సమ్మెకే కార్మిక సంఘాల నిర్ణయం ► ఎక్కడికక్కడే నిలిచిపోయిన బస్సులు ►సూపర్వైజర్లూ లేక ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు విఘాతం ► {పయాణికులకు తీవ్ర ఇక్కట్లు హైదరాబాద్: ప్రగతి రథ చక్రాలకు బ్రేకులు పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. వేతన సవరణపై ఆర్టీసీ కార్మిక సంఘాలు, ప్రభుత్వ వర్గాల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి తెలంగాణ, ఏపీలో ఆర్టీసీ కార్మికులంతా ఆందోళన బాట పట్టారు. ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. బుధవారం ఉదయం ప్రారంభమయ్యే సర్వీసులన్నీ ఆగిపోయాయి. 27 శాతంగా ఉన్న మధ్యంతర భృతి(ఐఆర్)ని ఫిట్‌మెంట్‌గా మారుస్తామని, మెరుగైన వేతన సవరణ కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వాలు చేసిన ప్రతిపాదనను కార్మిక సంఘాలు తోసిపుచ్చడంతో సమ్మె అనివార్యమైంది. మరోవైపు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సరిగా లేకపోవడంతో బస్సు సర్వీసులకు అంతరాయం ఎదురైంది. ప్రయాణికులకు ఇక్కట్లు మొదలయ్యాయి. చివరిరోజు హైరానా...: మంగళవారం అర్ధరాత్రి నుంచి సమ్మెకు కార్మిక సంఘాలు సిద్ధం కాగా.. అప్పటి వరకు చోద్యం చూసిన రాష్ర్ట ప్రభుత్వం చివరిరోజున హడావుడి చేసింది. ఉదయం బస్‌భవన్‌లో ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘాలైన ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ)-తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ) కూటమి ప్రతినిధులతో సంస్థ ఎండీ సాంబశివరావు, జేఎండీ రమణారావు, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లు చర్చించారు. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా 43 శాతం ఫిట్మెంట్ కోసం పట్టుబట్టడం సరికాదని ఎండీ పేర్కొన్నారు. అయితే ఆర్టీసీ దుస్థితికి ప్రభుత్వ విధానాలే కారణమని, దాన్ని వేతన సవరణ కు ముడిపెట్టడం సరికాదని కార్మిక సంఘాల నేతలు తేల్చి చెప్పారు. ప్రస్తుతం అమలులో ఉన్న 27 శాతం ఐఆర్‌ను ఫిట్‌మెంట్‌గా మారుస్తామని యాజమాన్యం ప్రకటించడంతో చర్చలు అర్ధంతరంగా ముగిశాయి. మధ్యాహ్నం ఆర్టీసీ ఎండీ సాంబశివరావు మీడియా సమావేశం నిర్వహించి కార్మిక సంఘాల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. 43 శాతం వేతన సవరణకు పట్టుబట్టడం సరికాదని, దాదాపు రూ.850 కోట్ల భారం పడుతున్నప్పటికీ 27 శాతం ఫిట్‌మెంట్‌కు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఉద్యోగులు పట్టువీడాలని, సమ్మె అనివార్యమైతే ప్రత్యామ్నాయ చర్యలకు సిద్ధమని తేల్చి చెప్పారు. దీంతో ఇక సమ్మె తప్పదనే సంకేతాలు వెళ్లాయి. కాగా, సాయంత్రం క్యాంపు కార్యాలయంలో సీఎం కె. చంద్రశేఖర్‌రావుతో ఎండీ సాంబశివరావు, జేఎండీ రమణారావు భేటీ అయ్యారు. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి, 43 శాతం ఫిట్మెంట్తో పడే భారం, నిధుల సమీకరణ యత్నాలు వంటి వివరాలను ఆయన ముందుంచారు. అప్పటికే ఓ నిర్ణయంతో ఉన్న ముఖ్యమంత్రి.. వెంటనే కార్మిక సంఘం నేతలతో చర్చించాల్సిందిగా మంత్రులు మహేందర్‌రెడ్డి, నాయిని నరసింహారెడ్డిని పురమాయించారు. దీంతో నాయిని చాంబర్లో సాయంత్రం నుంచి రాత్రి వరకు సుదీర్ఘ చర్చలు జరిగాయి. కాలయాపనతో గందరగోళం... 43 శాతం ఫిట్మెంట్ ప్రకటించకుంటే సమ్మెకు దిగుతామని పక్షం రోజుల క్రితమే ఆర్టీసీ గుర్తింపు సంఘమైన ఎంప్లాయీస్ యూనియన్-తెలంగాణ మజ్దూర్ యూనియన్ కూటమి నోటీసు ఇచ్చింది. ఆ వెంటనే ఎండీ సాంబశివరావు వారితో చర్చించి అంత ఫిట్మెంట్ ఇవ్వాలంటే ఆర్టీసీపై రూ.1800 కోట్ల భారం పడుతుందని, దాన్ని భరించే శక్తి ఆర్టీసీకి లేదని తేల్చేశారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని భరిస్తేనే ఆ మేరకు పెంపు సాధ్యమని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లామన్నారు. కానీ ప్రభుత్వాలు మాత్రం చివరి వరకూ పెద్దగా పట్టించుకోకపోవడంతో సమ్మెకు దారితీసింది. రంగంలోకి ప్రైవేట్ డ్రైవర్లు సమ్మె అనివార్యమైతే ఒక్క రోజు కూడా బస్సులు డిపోలకే పరిమితం కావద్దన్న ఉద్దేశంతో ఆర్టీసీ యాజమాన్యం మూడు రోజుల క్రితమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టింది. ప్రైవేటు బస్సులు, లారీల డ్రైవర్లను సమీకరించింది. అందుబాటులో ఉన్న డ్రైవర్లను గుర్తించి ఆర్టీసీకి కేటాయించాల్సిందిగా జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు వెళ్లాయి. ఇలా ఇప్పటివరకు సమీకరించిన దాదాపు ఐదు వేల మంది ప్రైవేటు డ్రైవర్లను రంగంలోకి దింపారు. మరో ఐదు వేల మందిని రెండు రోజుల్లో నియమించే పనిలోపడ్డారు. ప్రైవేటు డ్రైవర్లకు రోజుకు రూ. వెయ్యి చొప్పున చెల్లించాలని నిర్ణయించారు. కండక్టర్ విధులు నిర్వర్తించే వారికి రూ.800 చొప్పున చెల్లిస్తారు. అలాగే ప్రైవేటు వాహనాలు, ఓమ్ని బస్సులకు స్టేజీ క్యారియర్‌గా తిప్పుకునేందుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకు ఒక్కో వాహనం ప్రత్యేక ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. బుధవారం ఉత్తర్వులు జారీకానున్నాయి. సూపర్వైజర్లూ లేకపోతే ఇబ్బందే కార్మికులతో పాటు ఆర్టీసీ సూపర్వైజర్ల సంఘం కూడా సమ్మె బాట పట్టడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు తీవ్ర విఘాతం ఏర్పడింది. ప్రైవేటు డ్రైవర్లతో బస్సులు నడిపించాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. కానీ అలా వచ్చే డ్రైవర్లకు సూచనలు చేయాలన్నా, వారిని నియంత్రించాలన్నా, వారి డ్రైవింగ్ సామర్థ్యాన్ని పరిశీలించాలన్నా డిపోలో సిబ్బంది అవసరం. కానీ దాదాపు అన్ని విభాగాల సిబ్బంది సమ్మెకు దిగారు. డిపో మేనేజర్, సెక్యూరిటీ సిబ్బంది మినహా మరెవరూ విధుల్లో లేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రైవేటు డ్రైవర్లతో బస్సులు నడపడం కుదిరేలా కనిపించడం లేదు. ఎన్నికల వేళ కార్మిక సంఘాల పట్టు వేతన సవరణ విషయంలో గుర్తింపు కార్మిక సంఘాలైన ఎంప్లాయీస్ యూనియన్-తెలంగాణ మజ్దూర్ యూనియన్ కూటమి బెట్టు వీడకపోవడానికి కారణం ఎన్నికలే. ప్రస్తుత గుర్తింపు యూనియన్ గడువు తీరిపోయింది. దీంతో త్వరలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ తరుణంలో వేతన సవరణపై బెట్టు వీడితే కార్మికుల్లో చెడ్డ పేరు వస్తుందని గుర్తింపు సంఘం కూటమి ఆందోళన చెందుతోంది. ప్రభుత్వ వాదనకు తలొగ్గి సమస్యను కొనితెచ్చుకోవద్దన్న అభిప్రాయంతోనే సమ్మెకు దారితీసింది. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు రావాలంటే 62 శాతం ఫిట్మెంట్ కావాలని, అయితే గుర్తింపు సంఘం మాత్రం 43 శాతమే డిమాండ్ చేసి కార్మికులకు అన్యాయం చేసిందంటూ నేషనల్ మజ్దూర్ యూనియన్ ఇప్పటికే దాడి ప్రారంభించింది. చార్జీలు 40 శాతం పెంచాల్సి వస్తుంది ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి అత్యంత అధ్వానంగా ఉన్నందున సమ్మె వద్దని సర్కారు చేసిన విన్నపాన్ని కార్మిక సంఘాలు మొండిగా తిరస్కరించాయి. సమస్యల పరిష్కారానికి మరింత గడువు కోరినా వినలేదు. 43 శాతం ఫిట్మెంట్ అమలు చేయాలంటే దాదాపు 40 శాతం వరకు టికెట్ ధరలు పెంచాల్సి వస్తుంది. ఇంతభారం ప్రజలపై మోపడం సరికాదు. ఆర్టీసీని కూడా లాభాల బాట పట్టించే పక్కా ప్రణాళిక ప్రభుత్వం వద్ద ఉంది. దాన్ని అమలు చేసి భవిష్యత్తులో లాభాలు వస్తే కార్మికులకు కూడా ఎంతో మేలు జరుగుతుంది. మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. అయినా సమ్మెకు దిగారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించాం. - రాష్ర్ట రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి ఇప్పటికే కాలయాపన ప్రభుత్వానికి ఇప్పటికే చాలా సమయం ఇచ్చాం. సమ్మె నోటీసు ఇచ్చి నెల రోజులు దాటినా స్పందించలేదు. ఇప్పుడు గడువు కోరడం దాటవేసేందుకే. 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చే వరకూ సమ్మె విరమించేది లేదు. జీతాలు పెంచితే 40 శాతం చార్జీలు పెంచాలన్న వాదన అసత్యం. ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు పంపి పక్కదారి పట్టిస్తోంది. నిర్వహణ మా చేతికిస్తే పైసా చార్జీలు పెంచకుండా జీతాలు పెంచుకుంటాం. డీజిల్, రవాణా పన్ను రూపేణ ఆర్టీసీ నుంచి ప్రభుత్వం ఏటా రూ. 400 కోట్లు వసూలు చేస్తోంది. పైగా పలు వర్గాలకు ఇస్తున్న రాయితీల డబ్బును ప్రభుత్వం చెల్లించడం లేదు. రీయింబర్స్మెంట్ డబ్బులు చెల్లించి, మూడేళ్ల పన్ను మినహాయింపునిస్తే చాలు ఆర్టీసీ లాభాల్లోకి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులందరికీ కొత్త రాష్ట్రంలో జీతాలు పెరిగాయి. మేం ఏం పాపం చేశాం. తెలంగాణ కోసం చాలా పోరాటం చేశాం. ముఖ్యమంత్రికి వాస్తవ పరిస్థితి తెలుసు. ఆయన చొరవ తీసుకుని సమస్య పరిష్కరిస్తారనే నమ్మకం మాకుంది. అప్పటి వరకు సమ్మె వల్ల ప్రజలు పడే ఇబ్బందులకు యాజమాన్యమే బాధ్యత వహించాలి. సమ్మెకు ప్రత్యామ్నాయంగా ప్రైవేటు డ్రైవర్లను, అడ్డా కూలీలను వినియోగిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. -- కార్మిక సంఘాల నేతలు అశ్వద్ధామరెడ్డి, రాజిరెడ్డి ఏపీలోనూ నిలిచిన బస్సులు ఆంధ్రప్రదేశ్‌లోనూ మంగళవారం అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రారంభమైంది. రాష్ట్రంలోని 126 బస్సు డిపోలు, నాలుగు వర్క్‌షాపుల్లో ఇది కొనసాగనుంది. మరోవైపు ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ర్ట రవాణా మంత్రి శిద్ధా రాఘవరావు వెల్లడించారు. ప్రైవేటు బస్సుల యజమానులతో, దక్షిణ మధ్య రైల్వేతో మాట్లాడుతామని పేర్కొన్నారు. సమ్మెపై కేబినెట్లో చర్చించామని, సీఎం వెంటనే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. సోమవారం అర్ధరాత్రిలోగా కార్మిక సంఘాలతో చర్చించి సమ్మె విరమణకు ప్రయత్నిస్తామన్నారు. ఏపీ ఆర్టీసీలో 68 వేల మంది కార్మికులు ఉన్నారని, వీరికి ఫిట్మెంట్ ప్రకటించాలంటే బస్సు చార్జీలను కనీసం 15 శాతం పెంచాలని సీఎం చంద్రబాబు ద ృష్టికి తీసుకెళ్లామని, అయితే ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోలేదని మంత్రి తెలిపారు. కేబినెట్ సబ్ కమిటీకి అన్ని విషయాలు చెప్పి కార్మిక సంఘాలు సమ్మెను విరమించుకోవాలన్నారు. మరోవైపు ఆర్టీసీలో వేతన సవరణ, సంస్థాగత సామర్థ్యం పెంపు కోసం ఆర్థిక, రవాణా, కార్మిక శాఖల మంత్రులతో ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆగస్టు 15లోగా ఈ మంత్రుల కమిటీ నివేదిక సమర్పిస్తుంది. 10,800 రాష్ట్రంలో నిలిచిపోనున్న బస్సులు 94 మొత్తం డిపోలు 2 వర్క్ షాపులు 57,500 కార్మికుల సంఖ్య -
'సీఎం లేరు, సమయం కావాలి'
హైదరాబాద్: వేతన సవరణపై కార్మికశాఖతో ఆర్టీసీ యూనియన్లు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. వేతన సవరణపై మరికొంత సమయం కావాలని ఆర్టీసీ యాజమాన్యం కోరింది. సీఏం చంద్రబాబు అందుబాటులో లేనందున వెంటనే నిర్ణయం తీసుకోలేమని తెలిపింది. ఈ నెల 18లోపు వేతన సవరణపై ప్రకటన చేయాలని ఎంప్లాయిస్ యూనియన్(ఈయూ), టీఎమ్ యూ డిమాండ్ చేశాయి. ఈనెల 22 తర్వాత సమ్మెకు సిద్ధంగా ఉండాలని ఆర్టీసీ కార్మికులకు యూనియన్ నేతలు పద్మాకర్, అశ్వద్థామరెడ్డి పిలుపునిచ్చారు. -
పీఆర్సీ బకాయిలు రూ.5 వేల కోట్లు
ఆర్థిక మంత్రి యనమల పేషీకి చేరిన ఫైలు సీఎం చైనా పర్యటన తరువాత జరిగే కేబినెట్ భేటీలో ఎజెండా హైదరాబాద్: ఉద్యోగుల 10వ వేతన సవరణ (పీఆర్సీ) బకాయిల కింద రూ. 5 వేల కోట్లు చెల్లించాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ లెక్క తేల్చింది. పీఆర్సీని గత ఏడాది జూన్ నుంచి అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ ఏడాది మార్చి వరకు పది నెలలకు సంబంధించిన ఈ బకాయిల మొత్తాన్ని ఏ విధంగా చెల్లించాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చైనా పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటారని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. ఇలా ఉండగా ఏప్రిల్ నుంచి పెరిగిన వేతనాలను మే నెలలో ఇచ్చే జీతాలతో కలిపి చెల్లించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే పీఆర్సీ అమలుకు సంబంధించిన ఫైలును ఆర్థిక శాఖ రూపొందించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు పరిశీలన తర్వాత ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కార్యాలయానికి చేరింది. జిల్లాల పర్యటనలో ఉన్న యనమల ఈ నెల 10వ తేదీన హైదరాబాద్‌కు రానున్నారు. ఆయన ఆమోదానంతరం ఫైలు ముఖ్యమంత్రి ఆమోదానికి వెళ్తుంది. అయితే ఈ నెల 12 చైనా వెళుతున్న చంద్రబాబు 18వ తేదీన తిరిగి హైదరాబాద్ రానున్నారు. అప్పుడు ఆయన ఫైలుపై ఆమోదముద్ర వేస్తే ఆ తర్వాత జరిగే కేబినెట్ సమావేశం అజెండాలో పీఆర్సీ అమలు అంశాన్ని పొందుపరచనున్నారు. ఉద్యోగులకు 3.14 శాతం డీఏ! ఇలా ఉండగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి నుంచి కరువు భత్యం 6 శాతం పెరిగిన నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జనవరి నుంచి వేతనాలపై 3.14 శాతం మేరకు కరువు భత్యం పెరుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. దీంతో ప్రభుత్వ ఖజానాపై నెలకు రూ.18 కోట్ల నుంచి రూ.21 కోట్ల అదనపు భారం పడుతుందని వివరించాయి. -
వేతన సవరణ సశేషం!
మార్గదర్శకాలపై సాగదీస్తున్న సర్కారు వేతన స్థిరీకరణకు విధివిధానాలతో తాజాగా ఉత్తర్వులు మరిన్ని జీవోల కోసం ఉద్యోగుల ఎదురుచూపు బకాయిల చెల్లింపుపై ఇంకా నిర్ణయించని వైనం పెన్షనర్ల వేతన సవరణపైనా స్పష్టత కరువు సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించిన మార్గదర్శకాలను రాష్ర్ట ప్రభుత్వం విడుదల చేసింది. గత నెల 18న పదో పీఆర్సీకి సంబంధించిన ఉత్తర్వులు వెలువడ్డాయి. వీటి ప్రకారం పెరిగిన జీతాలను మార్చి నుంచే చెల్లించాల్సి ఉంది. అంటే ఏప్రిల్ ఒకటో తేదీన రాష్ర్ట ప్రభుత్వోద్యోగులు కొత్త వేతనాలు అందుకోవాల్సి ఉంది. కానీ మార్గదర్శకాల జారీలో జాప్యం వల్ల ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఎట్టకేలకు పీఆర్సీ మార్గదర్శకాలను సోమవారం రాష్ట్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది. వేతన స్థిరీకరణకు సంబంధించి డ్రాయింగ్ అండ్ డిస్బర్స్మెంట్ ఆఫీసర్లు(డీడీవో) పాటించాల్సిన నిబంధనలను అందులో పేర్కొన్నారు. అలాగే ఉద్యోగులు, బకాయిల వివరాలను నమోదు చేసేందుకు ప్రత్యేక నమూనాలను పొందుపరిచారు. తాజా మార్గదర్శకాల ప్రకారం.. వేతన స్థిరీకరణ కోసం డీడీవోలు మూడు భాగాలుగా ప్రొసీడింగ్స్ రూపొందించాలి. 2013 జూలై 1 నుంచి 2014 జూన్ 1వరకు వేతన స్థిరీకరణ బకాయిలను నోషనల్‌గా చూపాలి. ఆ తర్వాతి నుంచి 2015 ఫిబ్రవరి 28 వరకు బకాయిలను ప్రత్యేకంగా ప్రస్తావించాలి. బకాయిలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాకే వీటిని పంపించాలి. మార్చి నుంచి నగదు బిల్లులు తయారు చేయాలి. ఈ సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయులతోపాటు సెలవుపై, సస్పెన్షన్‌పై, శిక్షణకు, డిప్యుటేషన్‌పై, ఫారిన్ సర్వీస్‌లో వెళ్లిన వారు, అనుమతి లేకుండా విధులకు గైర్హాజరయ్యే వారు, విధుల నుంచి తప్పించుకు తిరుగుతున్న వారి జాబితాలను కూడా పొందుపరచాలి. టీ ఇంక్రిమెంట్ యథాతథం గత ఏడాది ఆగస్టులో ఉద్యోగులకు ప్రకటించిన తెలంగాణ ఇంక్రిమెంట్‌ను యథాతథంగా కొనసాగించాలని తాజా మార్గదర్శకాల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. 2015 పీఆర్సీ స్కేళ్లకు అనుగుణంగా తెలంగాణ ఇంక్రిమెంట్ మొత్తాన్ని సవరించకూడదని డీడీవోలు, వెరిఫికేషన్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. 2013 జూలై నుంచి పీఆర్సీని అమలు చేస్తున్నప్పటికీ 2014 జూన్ నుంచి నగదు ప్రయోజనాలను కల్పిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఆ తర్వాత ప్రకటించిన తెలంగాణ ఇంక్రిమెంట్.. కొత్త ఉత్తర్వుల ప్రకారం దాదాపు రెండింతలు అవుతుందని ఉద్యోగులు ఆశపడ్డారు. తాజా నిబంధనతో నిరాశకు గురయ్యారు. తెలంగాణ ఇంక్రిమెంట్‌ను మూల వేతనంలోనే కలిపి ఇస్తారని ఉద్యోగులు భావించినప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఇప్పటికీ అసమగ్రమే కాగా, గత నెలలో జారీ చేసిన ఉత్తర్వులతోపాటు, తాజా మార్గదర్శకాలు కూడా అసమగ్రంగా ఉండటం గందరగోళానికి దారి తీస్తోంది. ఇప్పటికీ పెన్షనర్లకు సంబంధించిన వేతన సవరణ ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేయలేదు. శాఖల వారీగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు వర్తించే సమగ్ర స్కేళ్ల వివరాల జీవో కూడా జారీ కాలేదు. ప్రధానమైన ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కేల్స్ జీవో, ప్రత్యేక అలవెన్సులకు సంబంధించిన ఉత్తర్వులూ విడుదలకాలేదు. వీటితో పాటు బకాయిల జీవోతో ఇంక్రిమెంట్లు ముడిపడి ఉంటాయని... ఇవన్నీ విడుదలైతే తప్ప వేతన స్థిరీకరణ ప్రక్రియ ప్రారంభంకాదని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. ఇక తాజా మార్గదర్శకాల్లోని తొమ్మిదో పేజీలో 12 (సి) కాలమ్‌లో ‘ఆంధ్రప్రదేశ్ రివె జ్డ్ స్కేల్స్ ఆఫ్ పే’ అని తప్పు దొర్లింది. దీన్ని ‘తెలంగాణ రాష్ట్ర రివైజ్డ్ స్కేల్స్ ఆఫ్ పే’ అని సవరించాల్సి ఉంది. బకాయిలపై మళ్లీ దాటవేత ఉద్యోగుల పీఆర్సీ బకాయిలను చెల్లించే విధానంపై ప్రభుత్వానికి ఇప్పటికీ స్పష్టత రాలేదు. 2014 జూన్ 2 నుంచి 2015 ఫిబ్రవరి వరకు ఉన్న బకాయిలకు సంబంధించి తదుపరి ప్రత్యేక ఉత్తర్వులు విడుదలవుతాయని మరోసారి దాటవేసింది. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల మొత్తం దాదాపు రూ. 5 వేల కోట్లకు చేరుతుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది. వీటిని బాండ్ల రూపంలో ఇవ్వడమా లేక జీపీఎఫ్‌లో జమ చేయాలా లేదంటే విడతలవారీగా నగదు రూపంలో ఇవ్వాలా అనేది ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంది. ఆర్థికంగా చిక్కుల్లేకుండా బాండ్లు జారీ చేయడమే శ్రేయస్కరమని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు నివేదించారు. కానీ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలన్నీ బాండ్ల జారీని తీవ్రంగా వ్యతిరేకించడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. దీంతో ఆర్థిక శాఖ తలపట్టుకుంది. ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితి పరిధిలోకి రాకుండా జీపీఎఫ్‌లో జమ చేసే మార్గాలేమైనా ఉన్నాయా.. ప్రజా పద్దులను ఎక్కువ చూపించి రుణ పరిమితి ఆంక్షలు తప్పించుకునే అవకాశాలేమైనా ఉన్నాయా అని అధికారులు ప్రత్యామ్నాయాలపై కసరత్తు చేస్తున్నారు. -
హరిత తెలంగాణే లక్ష్యం: కేసీఆర్
ఆ దిశగా పని చేయండి.. తెలంగాణలో అడవుల శాతం పెంచండి అటవీ అభివృద్ధికి ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తాం కాంట్రాక్టు ఉద్యోగులను, విలేజ్ ఫారెస్ట్ వర్కర్లను క్రమబద్ధీకరిస్తాం అటవీశాఖ అధికారులతో భేటీలో ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చే లక్ష్యంతో పనిచేయాలని అటవీ శాఖ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం 25 శాతంగా ఉన్న అడవులను 33 శాతానికి పెంచి.. దేశంలోనే రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలపాలన్నారు. అటవీ శాఖలోని ఖాళీలను భర్తీ చేస్తామని.. వేతన సవరణ, వాహన సదుపాయంతో పాటు భద్రతను కూడా కల్పిస్తామని అధికారులకు హామీ ఇచ్చారు. హైదరాబాద్ శివార్లలోని దూలపల్లి ఫారెస్ట్ అకాడమీని సీఎం కేసీఆర్ శనివారం సందర్శించారు. ముందుగా అకాడమీలో మొక్కలు నాటి, ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. అనంతరం తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ లోగోను ఆవిష్కరించారు. తర్వాత అటవీ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. స్మగ్లర్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం.. అట వీ భూముల ఆక్రమణలు, కలప స్మగ్లర్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతమున్న అటవీ చట్టాలను అధ్యయనం చేసి, అవసరమైతే కొత్త చట్టాలను తీసుకురావాలని ఉన్నతాధికారులకు సూచించారు. అటవీ సిబ్బందికి సాయుధ పోలీసుల సాయం ఉండేలా చూస్తామన్నారు. అటవీ సంబంధమైన కేసుల పరిష్కారానికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని, అటవీశాఖలో ప్రత్యేక న్యాయ విభాగాన్ని నెలకొల్పుతామని తెలిపారు. అటవీ అభివృద్ధి సెస్‌తో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. స్మగ్లర్ల నుంచి ముప్పున్న వారందరికీ భద్రత కల్పించాలని పోలీసుశాఖను ఆదేశించారు. అటవీ భూములకు హద్దులు.. కలెక్టర్లు, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించి అటవీ భూముల సరిహద్దులను నిర్ణయించాలని సీఎం కేసీఆర్ సూచించారు. భూ అసైన్మెంట్ కమిటీల్లో అటవీ శాఖ అధికారులను సభ్యులుగా నియమించాలన్నారు. హైదరాబాద్‌లో పచ్చదనం కోసం జీహెచ్ఎంసీ నుంచి రూ. 25 కోట్లు కేటాయిస్తామని, ఒక అటవీశాఖాధికారిని జీహెచ్ఎంసీలో నియమిస్తామని తెలిపారు. అటవీశాఖలో కాంట్రాక్టు ఉద్యోగులను, విలేజ్ ఫారెస్ట్ వర్కర్లను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు. అడవుల్లో ప్రవహించే నదులు, ఉపనదులపై చెక్‌డ్యాంలు నిర్మించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల సంఘం డైరీని కేసీఆర్ ఆవిష్కరించారు. సమావేశంలో అటవీ శాఖ మంత్రి జోగు రామన్న, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్రావ్, మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ప్రభుత్వ సీఎస్ రాజీవ్ శర్మ, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, ఫారెస్ట్ అకాడమీ డెరైక్టర్ రఘువీర్ తదితరులు పాల్గొన్నారు. పేరు మారలేదు.. తీరు మారలేదు ఏ సంస్థ భవనానికైనా పేరు ఓ గుర్తింపు.. కానీ తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ మాత్రం పేరుకు ‘ఫ్లెక్సీ’ ముసుగేసుకుంది. తెలంగాణ ఏర్పడి ఏడు నెలలైనా.. ఇక్కడ మాత్రం ‘ఆంధ్రప్రదేశ్’ పేరు మీదే కొనసాగుతోంది. దూలపల్లిలో ఉన్న ఈ అకాడమీకి శనివారం సీఎం వచ్చారు. ఈ సందర్భంగా ఆ పేరు కనిపించకుండా అధికారులు ఇలా ఏర్పాటు చేశారు. -
నేడు బ్యాంకు ఉద్యోగుల సమ్మె లేదు...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వేతన సవరణ కోరుతూ బ్యాంకు ఉద్యోగ సంఘాలు చేపట్టిన బుధవారం నాటి సమ్మె (జనవరి 7 ) వాయిదా పడింది. ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్(ఐబీఏ)తో జరుపుతున్న చర్చల్లో పురోగతి ఉండటంతో సమ్మెను వాయిదా వేసినట్లు యునెటైడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ప్రకటించింది. వేతన పెంపుపై గతంలో ప్రతిపాదించిన 11 శాతం నుంచి 12.5 శాతానికి రావడంతో చర్చలు జరపడానికి సమ్మెను వాయిదా వేసినట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యదర్శి బి.ఎస్.రాంబాబు తెలిపారు. దీనికి తగ్గట్లుగా బ్యాంకు యూనియన్లు కూడా 23 శాతం నుంచి 19.5 శాతానికి దిగొచ్చినట్లు ఆయన తెలిపారు. బుధవారం కూడా చర్చలు జరుగుతాయి. మధ్యే మార్గంగా 14.5- 15 శాతం వద్ద చర్చలు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. వేతనాల గురించి ఇప్పటికే నాలుగు సార్లు సమ్మె చేసిన నేపథ్యంలో ఇదే అంశంపై ఎక్కువసార్లు సమ్మె చేస్తే ప్రభుత్వానికి ప్రతికూల సంకేతాలు వెళ్తాయన్న ఉద్దేశంతో ఉద్యోగ సంఘాలు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఐఎన్జీ వైశ్యాఉద్యోగుల సమ్మె యధాతథం కాగా, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో విలీనమవుతున్న ఐఎన్జీ వైశ్యా బ్యాంక్ .. ఉద్యోగులు బుధవారం తమ సమ్మెను యధాప్రకారం కొనసాగించాలని నిర్ణయించారు. అఖిల భారత ఐఎన్జీ వైశ్యా బ్యాంక్ ఉద్యోగుల సంఘం జనరల్ సెక్రటరీ కేజే రామకృష్ణ రెడ్డి ఈ విషయాన్ని తెలిపారు -
నేడు దక్షిణాదిలో బ్యాంకులు బంద్
వేతన సవరణపై ఉద్యోగుల సమ్మె జోన్ల వారీగా నాలుగు రోజులపాటు.. బ్యాంకింగ్ కార్యకలాపాలపై ప్రభావం ముంబై: వేతన సవరణ డిమాండ్‌తో ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగుతుండటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో మంగళవారం(నేడు) బ్యాంకులు పనిచేయవు. ఇరు రాష్ట్రాల్లోని 5,000 శాఖలకు చెందిన దాదాపు 80 వేల పైచిలుకు ఉద్యోగులు, అధికారులు ఇందులో పాల్గొంటున్నారని యునెటైడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్‌బీయూ) ప్రాంతీయ శాఖ తెలిపింది. వేతన సవరణపై సోమవారం ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్‌తో (ఐబీఏ) జరిపిన చర్చలు విఫలం కావడంతో యూఎఫ్‌బీయూ ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. దీని ప్రకారం ఉద్యోగులు జోన్లవారీగా మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు రిలే సమ్మెకు దిగుతున్నారు. ముందుగా దక్షిణాదిన నేడు (డిసెంబర్ 2), ఉత్తరాది జోన్లో 3న, తూర్పు జోన్లో 4న, పశ్చిమ జోన్లో 5న స్ట్రయిక్ చేస్తున్నారు. దీంతో బ్యాంకింగ్ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడనుంది. ఐబీఏ, యూఎఫ్‌బీయూ మధ్య సయోధ్య కుదిర్చేందుకు ముంబైలోని డిప్యుటీ చీఫ్లేబర్ కమిషనర్ చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో సమ్మె అనివార్యమైంది. ఇటు ప్రభుత్వం, అటు ఐబీఏ సమ్మె ప్రతిపాదన విరమించుకుని చర్చల్లో పాల్గొనాలని సూచించినట్లు యూఎఫ్‌బీయూ మహారాష్ట్ర కన్వీనర్ విశ్వాస్ ఉతాగి తెలిపారు. అయితే, తాము మాత్రం సమ్మె యోచన అమలుకే నిర్ణయించుకున్నట్లు ఆయన వివరించారు. వేతన సవరణ, వారానికి అయిదు రోజులకు పనిదినాల కుదింపు తదితర డిమాండ్లతో బ్యాంకు ఉద్యోగుల యూనియన్లు గత నెల 12న దేశవ్యాప్తంగా సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. మరోవైపు, బ్యాంకు యూనియన్లు తలపెట్టిన సమ్మె అనైతికమని.. సమ్మె యోచన విరమించుకోవాలని ఐబీఏ విజ్ఞప్తి చేసింది. సిబ్బంది వ్యయాలు పెరిగి, లాభాలు క్షీణిస్తున్నందున ఉద్యోగులు కోరుతున్నట్లుగా 23% మేర జీతభత్యాలు పెంచే పరిస్థితి లేదని పేర్కొంది. ఉద్యోగులు 23% డిమాండ్‌ను తగ్గించుకుంటే చర్చలకు తాము సిద్ధమని తెలిపింది. -
ఎన్డీఎస్ఎల్లో సమ్మెకు సిద్ధం
బోధన్ : కార్మికుల వేతన సవరణ మూడేళ్లకొకసారి జరుగుతోంది. ఎన్డీఎస్ఎల్లో 2010లో వేతన సవరణ జరుగగా, 2013 సెప్టెంబర్ 30తో ముగిసింది. 2013 అక్టోబర్1 నుంచి కొత్త వేతన సవరణ జరుగాల్సి ఉండగా, ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉంది. 2013-14 క్రషింగ్ సీజన్ ప్రారంభంలో కార్మిక సంఘాలు 2013 నవంబర్18న ఫ్యాక్టరీ అధికారులకు వేతన సవరణ చేపట్టాలని సమ్మె నోటీసు ఇచ్చాయి. అయితే ఫ్యాక్టరీ యాజమాన్యం స్పందించక పోవడంతో అప్పట్లో చర్చలు సఫలం కాలేదు. సమ్మె వల్ల తాము ఇబ్బందులు ఎదుర్కొంటామని రైతులు కోరగా కార్మిక సంఘాలు వెనక్కు తగ్గాయి. ఈ సందర్భంగా ఫ్యాక్టరీ యాజమాన్యం క్రషింగ్ సీజన్ ముగియగానే వేతన సవరణ పై చర్చలు జరుపుతామని, వేతన సవరణకు చర్యలు తీసుకుంటామని రాత పూర్వకంగా హామీ ఇచ్చిందని కార్మిక సంఘాల ప్రతినిధులు అంటున్నారు. కాగా ఆ తర్వాత వేతన సవరణ అంశం మూలపడింది. ఫ్యాక్టరీ యాజమాన్యం పట్టించుకోలేదు. కార్మిక సంఘాలు కార్మిక శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం దక్కలేదు. ఎన్డీఎస్ఎల్లో 125 మంది వరకు పర్మినెంట్ కార్మికులు, సీజనల్ పర్మినెంట్ కార్మికులు 60 మంది వరకు ఉంటారు. పర్మినెంట్ కార్మికులకు నెలకు రూ. 15 వేల నుంచి రూ. 16 వేల వరకు వేతనం ఉంటుంది. దీనిపై 50 శాతం పెంచాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వీరి డిమాండ్‌ను ఫ్యాక్టరీ యాజమాన్యం అంగీకరించే స్థితిలో లేదు. ప్రస్తుతం ఫ్యాక్టరీ యాజమాన్యం వేతన సవరణకు సానుకూలతతో లేదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. గత్యంతరం లేని పరిస్థితిలో సమ్మె నోటీసు ఇచ్చామంటున్నారు. వేతన సవరణతో పాటు 15 శాతం హెచ్ఆర్ఏ పెంచాలని, ఇంక్రిమెంట్‌ను కనీసం రూ. 500 చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. వేతన సవరణ ఒప్పందం ముగిసి ఏడాది పైగా కావస్తున్నా ఫ్యాక్టరీ యాజమాన్యం స్పందించడం లేదని కార్మిక సంఘాలు మండి పడుతున్నాయి. 2014-15 క్రషింగ్ ప్రారంభానికి ఫ్యాక్టరీ యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంలో యాజమాన్యంపై ఒత్తిడి పెంచి వేతన సవరణ సాధించుకోవాలని కార్మిక సంఘాలు సమ్మె యోచనలో ఉన్నాయి. ఈ మేరకు ఎన్డీఎస్ఎల్ కార్మిక సంఘాలు శుక్రవారం యాజమాన్యానికి సమ్మె నోటీసు అందించాయి. వేతన సవరణతో పాటు మరో 40 డిమాండ్ల పరిష్కరించాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. ఎన్డీఎస్ఎల్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ),ఎన్డీఎస్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్(బీఎంఎస్) సుగర్‌ఫ్యాక్టరీ మజ్దూర్ సభ ప్రతినిధులు ఫ్యాక్టరీ వైస్ ప్రెసిడెంట్ జానకీ మనోహర్‌కు సమ్మె నోటీసు అందించారు. డిసెంబర్ 5 లోపు వేతన సవరణతో పాటు ఇతర డిమాండ్లను పరిష్కరించక పోతే సమ్మె చేపడుతామని హెచ్చరించారు. ఫ్యాక్టరీ యాజమాన్యం మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. కార్మికుల బతుకులు దయనీయం ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీని 2002 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 51 శాతం ప్రైవేట్, 49 శాతం ప్రభుత్వ వాటాలతో ప్రైవేటీకరించారు. రూ. 350 కోట్ల నిజాంషుగర్స్‌ను ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. ఫ్యాక్టరీ ప్రైవేట్ సంస్థ గుప్పెట్లోకి వెళ్లిన తర్వాత వీఆర్ఎస్ పేరుతో వందలాది మంది కార్మికులు తొలగించబడ్డారు. ప్రస్తుతం పని చేస్తున్న కార్మికుల బతుకులు దయనీయంగా మారాయి. ఇటు కార్మికులు,అటు రైతులు ఇబ్బందుల పాలైయ్యారు. ఫ్యాక్టరీ యాజమాన్యం సానుకూలంగా స్పందించాలి ఫ్యాక్టరీ యాజమాన్యం వేతన సవరణ, ఇతర డిమాండల పై సానుకూలంగా స్పందించాలని సీఐటీయూ అనుబంధ ఎన్డీఎస్ఎల్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కుమార్ స్వామి డిమాండ్ చేశారు. కార్మికుల సంక్షేమం యాజమాన్యం బాధ్యతని అన్నారు. యాజమాన్యం దిగిరాకపోతే సమ్మెకు చేపడుతామని తెలిపారు. మీడియాను అనుమతించని ఫ్యాక్టరీ అధికారులు. కార్మిక సంఘాల ప్రతినిధులు సమ్మెనోటీసు ఇచ్చేందుకు ఫ్యాక్టరీ లోపలికి వెళ్లగా, ఈవిషయం తెలుసుకుని మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్లారు. ఫ్యాక్టరీ లోపలికి మీడియాను అనుమతించ లేదు. -
వేతన సవరణ చేపట్టాలి
బ్యాంకు ఉద్యోగుల ధ్వజం కర్నూలు(జిల్లా పరిషత్): తమకు వెంటనే వేతన సవరణ చేపట్టాలని బ్యాంకు ఉద్యోగులు ధ్వజమెత్తారు. బుధవారం జిల్లాలోని అన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల ఉద్యోగులు సమ్మె చేశారు. స్థానిక ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ వద్ద నిర్వహించిన ధర్నాలో యునెటైడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్స్ జిల్లా కన్వీనర్ వెంకటేశ్వర్లు, ఆలిండియా బ్యాంక్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇ. నాగరాజు మాట్లాడారు. బ్యాంకు ఉద్యోగులతో యాజమాన్యాలు 14 సార్లు చర్చలు జరిపినా విఫలం కావడంతో సమ్మె చేశామన్నారు. యాజమాన్యం 11 శాతం మాత్రమే పెంచుతానంటోందని, తాము 25 శాతం పెంచాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. మంగళవారం నాటి చర్చల్లోనూ తాము ఒక మెట్టు కిందకు దిగి 23 శాతానికి వచ్చామని, కానీ యాజమాన్యం మాత్రం 11 శాతానికి మించి పైకి రావడం లేదన్నారు. దీంతో చర్చలు విఫలమై సమ్మె చేయాల్సి వచ్చిందన్నారు. ధర్నాకు ఎల్ఐసీ యూనియన్ నాయకుడు సునయకుమార్, జీఐసీయూ నాయకుడు రఘుబాబు, సీఐటీయూ నాయకుడు అంజిబాబు, పుల్లారెడ్డి, మెడికల్ రెప్స్ యూనియన్ నాయకులు ప్రసాదశర్మ మద్దతు తెలిపారు. ఏఐబీఏ మహిళా విభాగం నాయకులు రోజారమణి, ఎంపీబీఈ నాయకులు విద్యాసాగర్, ఏఐబీఓసీ నాయకుడు రాధాకృష్ణారెడ్డి, ఏఐబీఓఏ నాయకుడు శ్రీనివాసరావు, గ్రామీణ బ్యాంకు ఉద్యోగుల సంఘం నాయకులు సురేష్, మహమ్మద్మియ్య తదితరులు పాల్గొన్నారు. -
బ్యాంకు ఉద్యోగుల సమ్మె
వినియోగదారులకు తప్పని తిప్పలు వేతన సవరణలను అమలు చేయడంతో పాటు వివిధ డిమాండ్ల పరిష్కారానికి గాను బ్యాంకు ఉద్యోగులు బుధవారం సమ్మెకు దిగడంతో రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకులన్నింటి లావాదేవీలు పూర్తిగా స్తంభించాయి. ఇండియన్ నేషనల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కర్ణాటకతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగారు. ఇక ఇందులో భాగంగా కర్ణాటక రాజధాని బెంగళూరుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ బ్యాంకు లావాదేవీలు స్తంభించాయి. దీంతో నగరంలోని పలు ఏటీఎంల వద్ద బుధవారం ఉదయం నుంచే నగర వాసులు బారులు తీరి కనిపించారు. మరికొన్ని చోట్ల బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో ఉన్న కారణంగా ఏటీఎంలలో డబ్బులు నింపకపోవడంతో అనేక మంది వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. ఇక నగరంలో నిర్వహించిన సమ్మెలో భాగంగా బ్యాంకు ఉద్యోగులు బుధవారం ఉదయం టౌన్‌హాల్ నుంచి మైసూరు బ్యాంకు వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడే ధర్నా చేపట్టారు. -
బ్యాంకుల సమ్మె విజయవంతం
కదం తొక్కిన బ్యాంకు సిబ్బంది జిల్లా వ్యాప్తంగామూతపడిన బ్యాంకులు విజయవాడ : వేతన సవరణ కోసం దశలవారీ పోరాటం చేస్తున్న బ్యాంకు ఉద్యోగులు, అధికారులు జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ఒకరోజు సమ్మె విజయవంతమైంది. వేతన సవరణ చే యాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా బ్యాంకు యూనియన్ల ఐక్య వేదిక ఇచ్చిన పిలుపు మేరకు ఈ ఆందోళన చేపట్టారు. బుధవారం విజయవాడ సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా బెంజి సర్కిల్ కార్యాలయం వద్ద వందలాది మంది బ్యాంకు సిబ్బంది ఆందోళనలో పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా అన్ని బ్యాంకుల్లో అధికారులు, సిబ్బంది విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. జిల్లాలో వివిధ బ్యాంకులకు చెందిన దాదాపు 600 బ్రాంచిలు మూతపడ్డాయి. ఫలితంగా కోట్లాది రూపాయల లావాదేవీలు నిలిచిపోయాయి. తమ డిమాండ్ల సాధన కోసం దేశవ్యాప్తంగా తొమ్మిది ప్రధాన యూనియన్లు సంఘటిత పోరాటం చేస్తున్నాయి. ఈ ఆందోళనకు నాయకత్వం వహించిన విజయవాడ బ్యాంకు ఉద్యోగులు సమన్వయ కమిటీ కార్యదర్శి కె.నగేష్ కుమార్ మాట్లాడుతూ వేతన సవరణను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎంతోకాలంగా 11 శాతం కంటే అధికంగా వేతనాలు సవరించేదిలేదని మొండిపట్టు పడుతోందన్నారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల నేపథ్యంలో తాము డిమాండ్ చేస్తున్న విధంగా వేతనాలు 23 శాతం పెంచాలని కోరారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే భవిష్యత్‌లో నిరవధిక సమ్మెకు సిద్ధం కావాలని ఆయన బ్యాంకు అధికారులు, ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు సీహెచ్ హనుమంతరావు, కేఎస్ రావు, వివిధ బ్యాంకు అసోసియేషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు. -
సమ్మె షాక్
జిల్లాలో విద్యుత్ ఉద్యోగుల సమ్మె తీవ్రతరం విధులకు సిబ్బంది దూరం అత్యవసర సేవలకూ ససేమిరా ఈదురుగాలులతో వందలాది గ్రామాల్లో అంధకారం వినియోగదారులకు నరకం సాక్షి, విశాఖపట్నం: విద్యుత్ ఉద్యోగులు సమ్మెబాట పట్టడంతో జిల్లాలో ఆందోళన నెలకొంది. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం పే రివిజన్ అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఉద్యోగులు ఆదివారం ఉదయం నుంచి సమ్మెలోకి దిగుతున్నట్టు ప్రకటించారు. జిల్లా విద్యుత్‌శాఖలో పనిచేస్తున్న 1600 మంది ట్రాన్స్‌కో ఉద్యోగులు సమ్మెలో కొనసాగుతున్నారు. లైన్మన్లు, అటెండర్లు, ఎల్డీసీలు, క్లరికర్, ఇంజినీరింగ్ క్యాడర్నుంచి చీఫ్ ఇంజినీర్ వరకు ఆందోళన బాట పట్టారు. అటు తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్)లో 300 మంది ఉద్యోగులు సమ్మెలో ఉన్నారు. వీరంతా పీఆర్సీ అమలు చేయనందుకు నిరసనగా ఆందోళన చేపట్టడంతోపాటు అత్యవసర సేవలు కూడా అందించడానికి ససేమిరా అంటున్నారు. జిల్లాలో రెండురోజుల నుంచీ వర్షాలతోపాటు భారీస్థాయిలో ఈదురు గాలులు వీస్తున్నాయి. దీంతో జిల్లాలో అనేక మండలాల్లో పెద్దపెద్ద చెట్లు విరిగి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలపై పడడంతో అవన్నీ నేలకొరిగాయి. అనేక లైన్లు ధ్వంసమయ్యాయి. ఫలితంగా ప్రస్తుతం వందలాది గ్రామాల్లో అంధకారం నెలకొంది. కొన్నిచోట్ల విద్యుత్ 30 గంటల నుంచి లేదు. అటు విశాఖ నగరంలోని బీచ్‌రోడ్డులో అంధకారం నెలకొంది. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. సిబ్బంది సమ్మెలో ఉండడంతో పనులు జరగలేదు. అనకాపల్లి, చోడవరం, మాడుగుల, పాయకరావుపేట, యలమంచిలి, నర్సీపట్నం, పాడేరు, పరవాడ, పెందుర్తి తదితర ప్రాంతాల్లో అనేక గ్రామాలకు విద్యుత్ లేదు. వినియోగదారులు ఫోన్ చేస్తున్నా సిబ్బంది స్పందించడం లేదు. అల్పపీడనం కాస్తా ఆదివారం రాత్రి నుంచి తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఈ నేపథ్యంలో బలమైన గాలులు వీయనున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని వల్ల విద్యుత్‌శాఖకు మరింత నష్టం వాటిల్లనుంది. ఒకవేళ ఎక్కడైనా ట్రాన్స్ఫార్మర్లు, లైన్లు ధ్వంసం అయినా పట్టించుకునే పరిస్థితి లేదు. విద్యుత్ ఉద్యోగుల సమ్మె, మరోపక్క వర్షం, ఈదురుగాలులు పొంచి ఉండడంతో విద్యుత్ కష్టాలు మరింత తీవ్రతరం కానున్నాయి. -
విద్యుత్ ఉద్యోగుల సమ్మె యథాతథం
హైదరాబాద్:విద్యుత్ ఉద్యోగులు సమ్మెను మరింత ఉధృతం చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ప్రభుత్వంతో సంప్రదింపులు సఫలీకృతం కాకపోవడంతో విద్యుత్ ఉద్యోగులు సమ్మెను మరింత తీవ్రతరం చేసేందుకు నడుంబిగించారు. ప్రభుత్వ ప్రతిపాదనలకు అంగీకరించని విద్యుత్ జేఏసీ సమ్మెతోనే తగిన సమాధానం చెప్పాలని భావిస్తోంది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా ఐఆర్(మధ్యంతర భృతి) చెల్లిస్తేనే సమ్మె విరమణపై ఆలోచిస్తామన్నారు. అంతకుముందు కొత్త ప్రభుత్వాలు ఏర్పడేంత వరకూ విద్యుత్ ఉద్యోగులు కాస్త ఓపిక పట్టాలని చీఫ్ సెక్రటరీ మహంతి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వాల ఏర్పాటుకు కొంత సమయం పట్టే ఆస్కారం ఉన్నందున అప్పటి వరకూ ఉద్యోగస్తులు ఆగాల్సి న అవశ్యం ఉందన్నారు. దీనికి సంబంధించి ఈరోజు మీడియాతో మాట్లాడిన మహంతి..కొత్త ముఖ్యమంత్రిల వద్దకు ఫైళ్లను పంపించనున్నట్లు తెలిపారు. ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వాలు ఏర్పడే తరుణంలో తాము ఎటువంటి నిర్ణయం తీసుకోలేమని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఏప్రిల్ నెల నుంచే ఏరియర్స్ అందుతాయన్నారు. కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాకే పే రివిజన్ కార్యక్రమం ఉంటుందన్నారు. పే రివిజన్ తో రూ. 1250 కోట్ల మేర అదనపు భారం పడుతుందన్నారు. ఒకవేళ సమ్మె చేస్తే ఆస్పత్రులు, రైల్వేలకు, తాగునీటికి పలు ఇబ్బందులు ఎదురవుతాయని మహంతి తెలిపారు. -
కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాకే పే రివిజన్
-
కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాకే పే రివిజన్
హైదరాబాద్:కొత్త ప్రభుత్వాలు ఏర్పడేంత వరకూ విద్యుత్ ఉద్యోగులు కాస్త ఓపిక పట్టాలని చీఫ్ సెక్రటరీ మహంతి స్పష్టం చేశారు. ప్రభుత్వాల ఏర్పాటుకు కొంత సమయం పట్టే ఆస్కారం ఉన్నందున అప్పటి వరకూ ఉద్యోగస్తులు ఆగాల్సి న అవశ్యం ఉందన్నారు. దీనికి సంబంధించి ఈరోజు మీడియాతో మాట్లాడిన మహంతి..కొత్త ముఖ్యమంత్రిల వద్దకు ఫైళ్లను పంపించనున్నట్లు తెలిపారు. ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వాలు ఏర్పడే తరుణంలో తాము ఎటువంటి నిర్ణయం తీసుకోలేమని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఏప్రిల్ నెల నుంచే ఏరియర్స్ అందుతాయన్నారు. కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాకే పే రివిజన్ కార్యక్రమం ఉంటుందన్నారు. పే రివిజన్ తో రూ. 1250 కోట్ల మేర అదనపు భారం పడుతుందన్నారు. ఒకవేళ సమ్మె చేస్తే ఆస్పత్రులు, రైల్వేలకు, తాగునీటికి పలు ఇబ్బందులు ఎదురవుతాయని మహంతి తెలిపారు.