కదం తొక్కిన బ్యాంకు సిబ్బంది
జిల్లా వ్యాప్తంగామూతపడిన బ్యాంకులు
విజయవాడ : వేతన సవరణ కోసం దశలవారీ పోరాటం చేస్తున్న బ్యాంకు ఉద్యోగులు, అధికారులు జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ఒకరోజు సమ్మె విజయవంతమైంది. వేతన సవరణ చే యాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా బ్యాంకు యూనియన్ల ఐక్య వేదిక ఇచ్చిన పిలుపు మేరకు ఈ ఆందోళన చేపట్టారు. బుధవారం విజయవాడ సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా బెంజి సర్కిల్ కార్యాలయం వద్ద వందలాది మంది బ్యాంకు సిబ్బంది ఆందోళనలో పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా అన్ని బ్యాంకుల్లో అధికారులు, సిబ్బంది విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. జిల్లాలో వివిధ బ్యాంకులకు చెందిన దాదాపు 600 బ్రాంచిలు మూతపడ్డాయి. ఫలితంగా కోట్లాది రూపాయల లావాదేవీలు నిలిచిపోయాయి. తమ డిమాండ్ల సాధన కోసం దేశవ్యాప్తంగా తొమ్మిది ప్రధాన యూనియన్లు సంఘటిత పోరాటం చేస్తున్నాయి. ఈ ఆందోళనకు నాయకత్వం వహించిన విజయవాడ బ్యాంకు ఉద్యోగులు సమన్వయ కమిటీ కార్యదర్శి కె.నగేష్ కుమార్ మాట్లాడుతూ వేతన సవరణను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎంతోకాలంగా 11 శాతం కంటే అధికంగా వేతనాలు సవరించేదిలేదని మొండిపట్టు పడుతోందన్నారు.
పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల నేపథ్యంలో తాము డిమాండ్ చేస్తున్న విధంగా వేతనాలు 23 శాతం పెంచాలని కోరారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే భవిష్యత్‌లో నిరవధిక సమ్మెకు సిద్ధం కావాలని ఆయన బ్యాంకు అధికారులు, ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు సీహెచ్ హనుమంతరావు, కేఎస్ రావు, వివిధ బ్యాంకు అసోసియేషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు.
బ్యాంకుల సమ్మె విజయవంతం
Published Thu, Nov 13 2014 1:28 AM | Last Updated on Sat, Sep 2 2017 4:20 PM
Advertisement