బ్యాంకు ఉద్యోగుల సమ్మె
వినియోగదారులకు తప్పని తిప్పలు
వేతన సవరణలను అమలు చేయడంతో పాటు వివిధ డిమాండ్ల పరిష్కారానికి గాను బ్యాంకు ఉద్యోగులు బుధవారం సమ్మెకు దిగడంతో రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకులన్నింటి లావాదేవీలు పూర్తిగా స్తంభించాయి. ఇండియన్ నేషనల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కర్ణాటకతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగారు. ఇక ఇందులో భాగంగా కర్ణాటక రాజధాని బెంగళూరుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ బ్యాంకు లావాదేవీలు స్తంభించాయి. దీంతో నగరంలోని పలు ఏటీఎంల వద్ద బుధవారం ఉదయం నుంచే నగర వాసులు బారులు తీరి కనిపించారు.
మరికొన్ని చోట్ల బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో ఉన్న కారణంగా ఏటీఎంలలో డబ్బులు నింపకపోవడంతో అనేక మంది వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. ఇక నగరంలో నిర్వహించిన సమ్మెలో భాగంగా బ్యాంకు ఉద్యోగులు బుధవారం ఉదయం టౌన్‌హాల్ నుంచి మైసూరు బ్యాంకు వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడే ధర్నా చేపట్టారు.