ఈ నెల 26, 27న సమ్మెచేస్తాం | Bank Officers Union Notice on Strike | Sakshi
Sakshi News home page

ఈ నెల 26, 27న సమ్మెచేస్తాం

Published Fri, Sep 13 2019 10:40 AM | Last Updated on Fri, Sep 13 2019 10:40 AM

Bank Officers Union Notice on Strike - Sakshi

న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌లో విలీనాలను వ్యతిరేకిస్తూ సెపె్టంబర్‌ 26, 27 తేదీల్లో రెండు రోజులు సమ్మె చేస్తామని నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఆఫీసర్ల యూనియన్లు హెచ్చరించాయి. పది ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగుగా మార్చుతూ  విలీన పర్వానికి ఆగస్టు 30వ తేదీన  కేంద్రం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో తాజా సమ్మె హెచ్చరిక వెలువడింది. ఇండియన్‌ బ్యాంక్‌ ఆఫీసర్ల యూనియన్లు  ఒక సంయుక్త సమ్మె నోటీసు ఇస్తూ విలీనాలకు నిరసనగా సమ్మె ప్రతిపాదన తలపెట్టినట్లు పేర్కొన్నారు. తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ, నవంబర్‌ రెండవ వారం నుంచి నిరవధిక సమ్మెనూ నిర్వహించడం జరుగుతుందని ఒక యూనియన్‌ నాయకుడు పేర్కొన్నారు. ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ కాన్ఫెడరేషన్‌ (ఏఐబీఓసీ), ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ (ఏఐబీఓఏ), ఇండియన్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఆఫీసర్స్‌ కాంగ్రెస్‌ (ఐఎన్‌బీఓసీ), నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ బ్యాంక్‌ ఆఫీసర్స్‌ (ఎన్‌ఓబీఓ) సంయుక్త సమ్మె నోటీసు ఇచి్చన వాటిలో ఉన్నాయి. ఐదు రోజుల పనిదినాలను పూర్తి స్థాయిలో అమలు, నగదు లావాదేవీల సమయం తగ్గించడం, పనిగంటల హేతుబద్ధీకరణ వంటి పలు డిమాండ్లనూ యూనియన్లు చేస్తున్నాయి. 

విలీన ప్రక్రియలో బ్యాంకులు బిజీబిజీ...
ఇదిలావుండగా, విలీన ప్రక్రియ వేగవంతం దిశలో సంబంధిత బ్యాంకులు క్రియాశీలంగా పనిచేస్తున్నాయి. ఇండియన్‌ బ్యాంక్‌తో తన విలీన అంశాలను పరిశీలించడానికి సెపె్టంబర్‌ 13న తమ డైరెక్టర్ల బోర్డ్‌ సమావేశం కానుందని అలహాబాద్‌ బ్యాంక్‌ తెలిపింది. మరోవైపు ఇదే అంశానికి సంబంధించి సెపె్టంబర్‌ 13న ఆంధ్రాబ్యాంక్‌ బోర్డ్‌ సమావేశం కానుంది. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో ఆంధ్రాబ్యాంక్‌తో పాటు కార్పొరేషన్‌ బ్యాంక్‌ విలీనానికి కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వీటితోపాటు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో ఓబీసీ, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా; కెనరా బ్యాంక్‌లో సిండికేట్‌ బ్యాంక్‌ విలీనానికి కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.  ఇలా 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను 4 బ్యాంకులకు కుదించడంతో దేశంలో మొత్తం ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 12కు పరిమితం కానుంది. మరోవైపు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఒక ప్రకటన చేస్తూ తాజా విలీనానికి సంబంధించి అంశాల పరిశీలనకు విలీన రెండు బ్యాంకులతో కలిసి (యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఓబీసీ) 23 కార్యాచరణ గ్రూప్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

విలీనం మంచిదే:  ఇన్ఫోసిస్‌ ఫినాకిల్‌
కేంద్రం ప్రకటించిన బ్యాంకింగ్‌ విలీనాల ప్రక్రియ పూర్తి సానుకూల అంశమని ఇన్ఫోసిస్‌ ఫినాకిల్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ గ్లోబల్‌ చీఫ్‌ (విక్రయాలు) వెంకటరమణ గోసావి పేర్కొన్నారు. బ్యాంకింగ్‌ బిజినెస్‌ వృద్ధికి కూడా ఈ చర్య దోహదపడుతుందని బ్యాంకింగ్‌ సొల్యూషన్స్‌ ప్రొవైడర్‌ అయిన ఇన్ఫోసిస్‌ ఫినాకిల్‌ పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement