హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ బ్యాంకు ఉద్యోగులు, అధికారులు ఫిబ్రవరి 28వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మెకు దిగనున్నారు. అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ఆంధ్రప్రదేశ్-తెలంగాణా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి వీవీఎస్‌ఆర్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈనెల 28న జాతీయ స్థాయిలో సమ్మె జరుపనున్నామని, ఇందులో నాలుగు ఆఫీసర్ల అసోషియేషన్లతోపాటు మరో అయిదు ఉద్యోగుల సంఘాల ఏకగ్రీవ ఆమోదంతో ఈ సమ్మె చేపట్టనున్నట్టు తెలిపారు. గత రెండు దశాబ్దాలుగాపైగా సామాన్య ప్రజానీకానికి వ్యతిరేకంగా చేపడుతున్న సంస్కరణలపై తాము పోరాడుతున్నామన్నారు.
వివిధ పబ్లిక్ రంగ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు, సహకార బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, విదేశీ బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగులు, అధికారులు పది లక్షల మందికి పైగా పాల్గొననున్నట్లు తెలిపారు . కొత్త ఆర్థిక విధానాల పేరిట బ్యాంకులను ప్రైవేటుపరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఈ బడ్జెట్‌లోనూ బ్యాంకులకు అవసరమైన మూలధనాన్ని కేంద్ర ప్రభుత్వం అందజేయలేదని, దీంతో బ్యాంకులు ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉందని అన్నారు. సుమారు రూ.110 లక్షల కోట్ల చలామణి కలిగిన బ్యాంకింగ్ రంగాన్ని పరిరక్షించే ఉద్దేశంతో ఈ ఆందోళన జరుపనున్నట్లు తెలిపారు. 500, వెయ్యి రూపాయల నోట్ల రద్దు తర్వాత ప్రజల్లో భారీ స్థాయిలో నగదు కొరత ఏర్పడిందని పేర్కొన్నారు. తమ ఒకరోజు సందర‍్భంగా గౌరవనీయులైన ఖాతాదారులు, సామాన్య ప్రజానీకానికి జరుగనున్న అసౌకర్యంపై చింతిస్తున్నామనీ, తమ పోరాటానికి నైతిక మద్దతును అందించాల్సిందిగా శర్మ విజ్ఞప్తి చేశారు.
బీ అలర్ట్: ఈ నెలాఖరున బ్యాంకు ఉద్యోగుల సమ్మె
Published Mon, Feb 13 2017 7:07 PM | Last Updated on Mon, Oct 1 2018 5:24 PM
Advertisement