
సంఘటిత రంగానిదే సింహభాగం
అవినీతికి ఆస్కారం లేకుండా వేగంగా పనులు జరిగేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలను సూచించకుండానే 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 23.55 శాతం జీతాలు పెంచాలంటూ సిఫార్సు చేసి 7వ వేతన సంఘం చేతులు దులుపుకున్నది. నిజానికి, వేతన సంఘం చేయవలసింది కేవలం వేతనాల పెంపుదలకు సంబంధించిన సిఫార్సులు చేయడమే కాదు.
నరేంద్రమోదీకి 2014 కలలు సాకారమైన సంవత్సరమైతే 2015 ఎదురు దెబ్బలు తగిలిన ఏడాది. ఢిల్లీ, బిహార్ శాసనసభ ఎన్నికలలో పరాజయం మోదీ ప్రభంజనానికి అడ్డుకట్ట వేసింది. మొదటి దెబ్బ ఢిల్లీలో తగలడానికి పరిశీలకులు పేర్కొన్న అనేక కారణాలలో కేంద్ర ప్రభుత్వోద్యోగులను కట్టడి చేయడానికి మోదీ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఒకటి. ఉదయం తొమ్మిదింటికి ఉద్యోగి ఆఫీసులో తన సీటులో కూర్చోకపోతే ఆ సంగతి ప్రధానమంత్రి కార్యాలయానికి తెలిసిపోయే విధంగా సాఫ్ట్‌వేర్ తయారు చేసి ఉపయోగిస్తున్నారనీ, ఇటువంటి ఆంక్షలు అలవాటు లేని ప్రభుత్వోగులు ఆగ్రహించి భారతీయ జనతా పార్టీని ఓడించడంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు సంపూర్ణంగా సహకరించారనీ ఢిల్లీ రాజకీయ వర్గాలలో అప్పట్లో వినిపించేది.
ప్రభుత్వోద్యోగులను ప్రసన్నం చేసుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయని పని లేదు. వారిని ఉపేక్షించే సాహసం ఏ ప్రభుత్వమూ చేయదు. జీవన వ్యయం పెరుగుతున్నకొద్దీ వారి జీతభత్యాలు పెంచడం ఆనవాయితీ. ఏడవ వేతన సంఘం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చేసిన సిఫార్సులు ఈ కోవలోకే వస్తాయి. కొత్త వేతన ప్రమాణాలను అమలు చేస్తే కేంద్ర ప్రభుత్వంపైన రూ.73,650 కోట్లూ, రైల్వేలపైన రూ.28,450 కోట్లూ, వెరసి రూ.1,02,100 కోట్ల అదనపు వ్యయభారం పడుతుందని అంచనా. దీనికి తోడుగా ఉద్యోగ విరమణ చేసిన సైనికులకు ఓఆర్‌ఓపీ (వన్ ర్యాంక్ వన్ పెన్షన్) విధానం అమలు చేయడం వల్ల పెరిగే వ్యయం. పెరిగిన మొత్తం భారం స్థూల జాతీయ ఉత్పత్తిలో నాలుగు శాతం కంటే అధికం. ఈ వరుస ఇంతటితో ఆగదు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలతో సమానంగా తమ వేతనాలు పెంచాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులూ, స్థానికి సంస్థల ఉద్యోగులూ ఉద్యమాలు చేస్తారు. వచ్చే రెండు సంవత్సరాలలో వారి జీతాలు కూడా పెంచక తప్పదు. దీని వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బ తింటుందనీ, ద్రవ్యలోటు తగ్గకపోగా పెరుగుతుందనీ కొందరు ఆర్థికవేత్తలు హెచ్చరిస్తుంటే వేతనాలు పెరగడం వల్ల ఖర్చు పెరుగుతుందనీ, పరోక్షంగా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందనీ, స్తబ్దుగా ఉన్న విపణిలో చలనం వస్తుందనీ మరికొందరు వాదిస్తున్నారు.
ప్రభుత్వ వ్యయం పెరిగితేనే నయం?
రెండో వాదనను ముందుగా పరిశీలిద్దాం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉంది. ఉత్పత్తుల ధరలు పడిపోతున్నాయి. తగ్గిపోయిన వస్తు వినియోగం వేగంగా పెరగడం లేదు. ద్రవ్యోల్బణం అదుపు తప్పకుండా బుద్ధిగానే ఉంటోంది. పరిశ్రమలు శక్తికి తగిన స్థాయిలో ఉత్పత్తి చేయడం లేదు. కార్పొరేట్ రంగంలో పెట్టుబడులు పెరగడం లేదు. ఈ పరిస్థితులలో మార్కెట్‌ను ఉత్తేజపరచాలంటే ప్రభుత్వ వ్యయం పెంచడం ఒక్కటే మార్గం. ఏడవ వేతన సంఘం సిఫార్సులను అమలు చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వోద్యోగుల ఆదాయం పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతాలలో సగటున 20 శాతం ఆదాయం పన్ను కింద చెల్లిస్తారు. వేతనాల పెంపు వల్ల పెరిగిన వ్యయభారంలో అయిదో వంతు అదనపు ఆదాయం పన్ను రూపంలో ప్రభుత్వ ఖజానాకు వాపసు వస్తుంది. ఇది కాకుండా, కేంద్ర ఉద్యోగి వినిమయ వస్తువులు కొనుగోలు చేసినా, ఇల్లు కట్టుకున్నా, విహారయాత్రలకు వెళ్లినా, ఇతరత్రా ఎటువంటి ఖర్చులు చేసినా పరోక్ష పన్నుల రూపంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పెరుగుతుంది. కనుక యూపీఏ సర్కార్‌లో నాటి ఆర్థికమంత్రి చిదంబరం ద్రవ్యలోటుకు బెదిరి ప్రభుత్వ వ్యయంపైన కోత విధించినట్టు ఎన్‌డీఏ ప్రభుత్వంలో అరుణ్ జైట్లీ సర్కారు వ్యయాన్ని తగ్గించే ఆలోచన చేయరాదనీ, ప్రభుత్వ వ్యయాన్ని పెంచాలనీ ఈ వర్గం ప్రవీణులు నొక్కి చెబుతున్నారు.
వినిమయం, పెట్టుబడి, ఉత్పత్తి పెరుగుదల, లాభాలు, ఇతర అంశాలతో కూడిన విపణి చోదక ఆర్థికచక్రం అగకుండా తిరుగుతూ ఉండాలంటే వేతనాలు పెంచడం అవసరం. కాకపోతే, 2014లో, 2015లో సమర్పించిన చచ్చు బడ్జెట్ కాకుండా 2016లో భారీ సంస్కరణలకు ఊతం ఇచ్చే వైవిధ్య భరితమైన బడ్జెట్‌ను జైట్లీ ప్రతిపాదించాలని ఆర్థిక సంస్కరణలు అత్యవసరమని భావించే ఆర్థికవేత్తలు స్పష్టం చేస్తున్నారు. పన్నులు తగ్గించా లనీ, ప్రభుత్వ రంగంలో ఉన్న పరిశ్రమలను ప్రైవేటు రంగానికి అప్పగించాలనీ, ప్రభుత్వ రంగంలోని భారీ (నవరత్న) సంస్థలలో వాటాలను ప్రైవేటు సంస్థలకు అమ్మివేయాలనీ సంస్కరణవాదుల అభిలాష. వచ్చే బడ్జెట్ ప్రతి పాదనలలో సైతం జైట్లీ విఫలమైతే పుణ్యకాలం కాస్తా గడిచిపోతుందనీ, ఎన్‌డీఏకి 2019 ఎన్నికలలో ఎదురుగాలి అనివార్యం అవుతుందనీ హెచ్చ రిస్తున్నారు. వాజపేయి నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వ హయాంలో 2001-02 నుంచి దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ 2003-04లో కోలుకున్నదనీ, కానీ అప్పటికే సమయం మించిపోయిందనీ, ఎన్‌డీఏ ఓటమి పాలయిందనీ ప్రవీణులు గుర్తు చేస్తున్నారు.
ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం
వేతనాలు పెంచడాన్ని వ్యతిరేకిస్తున్నవారి వాదనలో సైతం బలం లేకపోలేదు. ప్రస్తుతం ద్రవ్యలోటు 3.4 శాతం ఉన్నది. ఈ లోటును పూడ్చడానికి ప్రయత్నించవలసిన ప్రభుత్వం వ్యయం పెంచుకుంటూ పోతే ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుందంటూ సిటీ గ్రూప్, ఇండియా రేటింగ్స్ వంటి సంస్థలు ప్రమాద సూచికలు ఎగురవేస్తున్నాయి. ఇప్పుడున్న ద్రవ్యలోటు పూడాలంటే ప్రభుత్వ ఆదాయం రూ.80,000 కోట్లు పెరగాలి. ప్రభుత్వ రంగ సంస్థలలో వాటాలు విక్రయించి రూ.70,000 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సమీకరించాలని ప్రణాళిక వేసుకున్న ప్రభుత్వం ఇంతవరకూ సేకరించగలిగిన మొత్తం కేవలం రూ.12,700 కోట్లు. అంతర్జాతీయ చమురు ధరలు బాగా తగ్గి ఉన్న కారణంగా ఆర్థిక వ్యవస్థలో అంతగా ఒడిదుడుకులు రాలేదు. ముడి చమురు ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఖజానాపైన భారం మరింత పెరుగుతుంది.
ఇవన్నీ ప్రభుత్వ ఉద్యోగులకు అవసరం. పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా తమ ఆదాయం పెరగాలనుకోవడం సహజం. అందుకు వారిని తప్పు పట్టడం భావ్యం కాదు. సంఘటిత రంగంలో ఉన్న ఉద్యోగులు ప్రభుత్వం మెడలు వంచి జీతాలు పెంచుకోగలరు. అసంఘటిత రంగంలో ఉన్న రైతులు బతకలేక ఆత్మహత్యలకు ఒడికడుతున్నారు. గ్రామాలలో రోజుకు రూ.32లు, పట్టణాలలో రూ.47లు ఖర్చు చేసేవారు పేదవారి జాబితాలోకి రారంటూ రంగరాజన్ కమిటీ నిర్ణయించింది. హైదరాబాద్‌లో రూ.47లకు రెండు పూటలా తిండి దొరుకుతుందా? ఈ లెక్కన చూసుకున్నా దేశ జనాభాలో 29.5 శాతం మంది దారిద్య్ర రేఖ దిగువన ఉన్నారని అర్థం. అటువంటి కటిక పేదల సంగతి కానీ, వ్యవసాయం గిట్టుబాటు కాక ప్రాణాలు తీసుకుంటున్న రైతుల గురించి కానీ, కోట్లాది మంది నిరుద్యోగుల గురించి కానీ వేతన సంఘంలో ఉన్న ప్రవీణులూ, సంఘం అధ్యక్షుడు జస్టిస్ మాథుర్ ఒక్క క్షణం కూడా ఆలోచించి ఉండరు. కోటి ఉద్యోగాలు సృష్టిస్తానన్న మోదీ ఎన్నికల హామీ అమలు అయ్యే అవకాశాలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. సమష్టి భావం లోపించడం వల్ల, ఎవరి ప్రయోజనాలు వారు సాధించుకో వాలనే ధోరణి కారణంగా సంఘటితరంగంలోని ఉద్యోగులు ప్రధానుల, ముఖ్యమంత్రుల ముక్కుపిండి జీతనాతాలు వసూలు చేసుకుంటున్నారు. పెంచిన జీతాలకు న్యాయం చేస్తున్నారా అంటే అదీ అనుమానమే. జీతాలతో పాటు గీతాలూ పెరుగుతున్నాయి. పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంటున్నాయి.
ఉత్పత్తికీ, వేతనాలకూ ప్రైవేటు రంగంలో సంబంధం ఉన్నది. ఒక ఉద్యోగి వల్ల సంస్థకు ప్రయోజనం కలిగితేనే అతనికి లేదా ఆమెకు పదోన్నతి కానీ, వేతనం పెరుగుదల కానీ ఉంటుంది. పనికీ, జీతాల పెరుగుదలకీ సంబంధం ఉండాలనే వాదనకు ఏడవ వేతన సంఘం 880 పేజీల నివేదికలో కొన్నింటిని కేటాయించింది. కానీ చివరికి ఏమని సిఫార్సు చేసింది? పని చేయనివారిని గుర్తించి ఇరవై సంవత్సరాలలో ఉద్యోగాల నుంచి తొలగించాలని చెప్పింది (అదే ప్రైవేటురంగంలో ఉద్యోగి పనితీరుపై ప్రతి మూడు మాసాలకూ ఒకసారి మదింపు ఉంటుంది). వేతనసంఘం ప్రతిభకు పట్టం కట్టినట్టా, గోరీ కట్టినట్టా? పని చేయనివారికి ఇరవై సంవత్సరాల వెసులుబాటు కల్పిస్తూ, పని తీరును సమీక్షించేందుకూ, పనిచేయనివారిని ఉద్యోగాల నుంచి తొలగించేందుకూ ఎటువంటి విధానం అనుసరించాలో చెప్పకుండా నివేదికను ముగించడం వేతన సంఘం బాధ్యతారాహిత్యానికి నిదర్శనం.
కొసమెరుపు
ఈ నివేదికలో కొస మెరుపు ఏమిటంటే ఐఏఎస్ అధికారుల ఆధిక్యాన్ని తగ్గిస్తూ ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌లను ఐఎస్‌ఎస్ అధికారులతో సమానంగా పరిగణించాలనే ప్రయత్నం. ఈ అధికారులతో పని చేయించుకునే ముఖ్యమంత్రులను కానీ పనిచేయించే రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులను కానీ సంప్రదించకుండా ఐఏఎస్‌ల తోక కోసి సున్నం పెట్టాలంటూ వేతన సంఘం సిఫార్సు చేయడం అర్థరహితం. ఐఏఎస్‌లు జిల్లా కలెక్టర్లుగా, జిల్లా మెజిస్ట్రేట్లుగా సంక్లిష్టమైన బాధ్యతలు నిర్వహిస్తారు. ప్రభుత్వ ప్రతినిధులుగా వారు దాదాపు అన్ని రంగాలలోనూ జోక్యం చేసుకుంటారు. సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్ని స్తుంటారు. వారిపైన పని ఒత్తిడి ఎక్కువ. వారితో సమానంగా తమ తమ శాఖలకు పరిమితమై పనిచేసే పోలీసు ఉన్నతాధికారులనూ, అటవీశాఖ ఉన్నతాధికారులనూ పరిగణించాలనడం సరికాదని ఇదివరకటి వేతన సంఘాలూ, సుప్రీంకోర్టూ స్పష్టం చేశాయి. ఈ స్పూర్తికి భిన్నమైన సిఫార్సును తాజా వేతన సంఘం చేయడం విడ్డూరం. ఐఏఎస్, ఐపీఎస్‌ల మధ్య ఆధిక్య పోరు చాలాకాలంగా చూస్తున్నాం. ఐఎఫ్‌ఎస్‌లను కూడా ఈ పోరాటంలో భాగస్వాములను చేయడం ఎందుకు? వేతనం కానీ హోదా కానీ పని స్వభావంపైనా, సంక్లిష్టతపైనా ఆధారపడి ఉండాలి.
ప్రతిభావంతులను ప్రభుత్వ ఉద్యోగాలలో నియమించేందుకు వీలుగా, సామర్థ్యానికి పెద్దపీట వేసే విధంగా, జవాబుదారీతనాన్నీ, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించే మనస్తత్వాన్నీ ప్రోత్సహించే పని సంస్కృతిని పెంపొందించే విధంగా సిఫార్సులు చేయాలంటూ ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకొని బృహత్ సంకల్పం చెప్పుకున్న వేతన సంఘం లక్ష్య సాధనలో విఫలమైనట్టే. ఉద్యోగవర్గం (బురాక్రసీ) పనితీరు మెరుగుపరిచేందుకు చేపట్టవలసిన చర్యలను కానీ, అవినీతికి ఆస్కారం లేకుండా వేగంగా పనులు జరిగేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలను కానీ సూచించకుండానే 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 23.55 శాతం జీతాలు పెంచాలంటూ సిఫార్సు చేసి చేతులు దులుపుకున్నది. నిజానికి, వేతన సంఘం చేయవలసింది కేవలం వేతనాల పెంపుదలకు సంబంధించిన సిఫార్సులు చేయడమే కాదు. బురాక్రసీని సంస్కరించడానికీ, దాని సామర్థ్యం పెంచడానికీ, పనితీరులో పారదర్శకతను పెంపొందించడానికీ, తాము ప్రజాసేవకులమని గుర్తెరిగి జనహితంకోసం పని చేయడానికీ ఏమేమి సంస్కరణలు అమలు చేయాలో సిఫార్సు చేయాలి. ఈ దిశగా జస్టిస్ మాథుర్, ఇతర సభ్యులు కృషి చేసిన దాఖలా వేతన సంఘం నివేదికలో పెద్దగా కనిపించదు.
వేతన సంఘం చేసిన సిఫార్సులను అమలు చేయడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించే విధంగా ఉద్యోగులు తమ బాధ్యతలను నిర్వర్తించేట్టు చేయడం కూడా కేంద్ర ప్రభుత్వ కర్తవ్యం. క్రమశిక్షణతో, నిబద్ధతతో, సృజనాత్మకంగా, ప్రయోజనకరంగా పని చేసే ఉద్యోగులకు ప్రోత్సహకాలు ఉండాలి. గుర్రాన్నీ, గాడిదనూ ఒకే గాట కట్టే సంస్కృతికి ఇప్పటికైనా స్వస్తి చెప్పకే పోతే భావి తరాలు క్షమించవు.