ramachandra murthy
-
ఘనవిజయాలు, గుణపాఠాలు
త్రికాలమ్ సుమారు దశాబ్దకాలం దేశంలో మరే ఇతర రాజకీయ నాయకుడూ ఎరగని వేధింపులూ, వ్యక్తిత్వహననం, ఆర్థిక విధ్వంసం, భౌతిక దాడులూ ఎదుర్కొన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి సకల ప్రతికూల పరిస్థితులనూ అధిగమించి ఎన్నికలలో అఖండ విజయం సాధించి అధి కార పగ్గాలు చేపట్టబోతున్నారు. మొత్తం 175 స్థానాలు కలిగిన అసెం బ్లీలో 151 స్థానాలు గెలుచుకోవడం, మొత్తం 25 లోక్‌సభ స్థానాలలో 22 కైవసం చేసుకోవడం, 50 శాతానికిపైగా ఓట్లు సంపాదించడం మునుపెన్నడూ ఎరగని అసాధారణ పరిణామం. 1971లో ఇందిరా గాంధీ కానీ, 1983, 1994లో ఎన్‌టి రామారావు కానీ, 1984లో రాజీవ్ గాంధీ కానీ ఇంతటి ఘనవిజయం సాధించలేదు. అధికారం నిలబెట్టు కునేందుకు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత చంద్రబాబునాయుడు చేయని ప్రయత్నం లేదు. వేయని ఎత్తుగడ లేదు. పన్నని పన్నాగం లేదు. నాలుగు సంవత్సరాల తొమ్మిది మాసాలు ప్రజలనూ, వారి యోగక్షేమాలనూ పట్టించుకోకుండా ఎన్నికల ముందు పసుపూ– కుంకుమా అంటూ ప్రజాధనాన్ని మహిళలకు చెల్లించడం ద్వారా ఓట్లు దండుకోవచ్చునన్న తంత్రం ఫలించలేదు. పోలింగ్‌కు వారం రోజుల ముందుగా మహిళలకూ, రైతులకూ నగదు చేతిలో పడే విధంగా ప్రణాళిక రచించినా ఫలితం లేకపోయింది. తాను ఒక్క పిలుపు ఇస్తే మహిళలందరూ కదిలి పోలింగ్ కేంద్రా లకు వెళ్ళి తెల్లవారుజాముదాకా క్యూలలో నిలబడి తన పార్టీకి ఓటు వేశారంటూ ఢిల్లీలో, అమరావతిలో చంద్రబాబు పదేపదే చెప్పిన విషయం కేవలం భ్రమాజ నిత, స్వానురాగపూరిత కాల్పనిక కథనమేనని ఓట్ల లెక్కింపులో తేటతెల్లమై పోయింది. ప్రజాసామ్య వ్యవస్థకు ప్రజలే రక్షకులనే మాట అక్షర సత్యమని నిరూపించిన అరుదైన సందర్భం ఇది. అందరికీ గుణపాఠాలు ఎన్నికలలో విజేతలకూ, పరాజితులకూ గుణపాఠాలు ఉంటాయి. పరాజ యాన్ని అర్థం చేసుకోవడం ఎంత అవసరమో విజయంపై అవగాహనా అంతే ప్రధానం. ఓటమి కారణాలను విశ్లేషించుకొని, తప్పులు దిద్దుకొని, ముందడుగు వేసేవారికి రాజకీయాలలో మనుగడ ఉంటుంది. విజయాలకు తోడ్పడిన కార ణాలు గ్రహించి, ప్రత్యర్థుల పరాజయానికి దారి తీసిన అంశాలనూ అధ్యయనం చేసి అవగాహన చేసుకున్న నాయకులకు వచ్చే అయిదేళ్ళలో మందుపాతరల పైన కాలు పెట్టకుండా సురక్షితంగా, లాఘవంగా ఎట్లా నడవాలో బోధపడు తుంది. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్సీపీ ఘనవిజయం సాధిస్తుందని చెప్పడానికి సర్వేలు అక్కర లేదు. ఎగ్జిట్‌పోల్స్ అంతకన్నా అవసరం లేదు. పద్నాలుగు మాసాలు 3,648 కిలోమీటర్ల పొడవునా సాగిన సుదీర్ఘ పాదయాత్ర సందర్భంగా జగన్ ప్రసంగించిన లెక్కకు మించిన సభలకు హాజరైన లక్షలాది జనం ఆత్మ ఘోష ఆలకించినవారికీ, వారి మొహాలలో కనిపించిన ఆవేదననూ, ఉద్వేగాన్నీ, ఆశనూ, ఉత్సాహాన్నీ గమనించినవారికీ ఎన్నికల ఫలితాలు ఊహించుకోవడం కష్టం కానేకాదు. ఆంధ్రప్రదేశ్‌లో 33 లోక్‌సభ సభ్యులను గెలిపించి ఢిల్లీకి పంపించి యూపీఏ–2కి వెన్నుదన్నుగా నిలిచిన వైఎస్ కుటుంబాన్ని అవమా నించాలని స్వార్థరాజకీయుల చాడీలు విని నిర్ణయించుకున్న సోనియాగాం«ధీకీ, రాహుల్‌గాంధీకీ నిష్కృతి ఉండదని 2014, 2019 ఎన్నికలు నిరూపించాయి. వారు తమ తప్పు తెలుసుకున్న దాఖలా లేదు. వారితో కలసి కుట్ర చేసినవారికీ, దానిని అమలు చేసినవారికీ ప్రజలు తగిన పాఠం చెప్పారు. జాతీయ స్థాయిలో వెలువడిన ఎన్నికల ఫలితాల కంటే ఆంధ్రప్రదేశ్‌లో ఫలి తాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికీ, జనసామాన్య మనోగతానికీ నిదర్శనమై నిలి చాయి. 2014లో ఐదు లక్షల ఓట్ల వ్యత్యాసంతో విజయం సాధించి, అధికార పగ్గాలు చేతపట్టిన చంద్రబాబు గెలుపును అపార్థం చేసుకున్నారు. సమాజంలోని సకల వర్గాలకు లెక్క లేనన్ని వాగ్దానాలు చేసిన ఎన్నికల ప్రణాళికను పక్కన పెట్టారు. తన సొంత అజెండాను భుజానికి ఎత్తుకున్నారు. కొత్త రాజధాని అమరావతిని అక్రమ వ్యాపారానికి అందివచ్చిన అవకాశంగా పరిగణించారు. సింగపూర్ అన్నారు. అస్థానా అన్నారు. ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన అయిదు నగరాలలో ఒకటిగా అమరావతిని నిర్మిస్తామన్నారు. ఈ మాటలు చెబుతూనే ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా అస్మదీయుల చేత రాజధాని ప్రాంతంలో వందల ఎకరాల భూములు కొనిపించారు. డిజైన్ల పేరుమీద వందల కోట్ల రూపాయలు వెచ్చించారు. పదవీకాలం ముగిసే నాటికి అమరావతిలో శాశ్వత ప్రాతిపదికపైన ఒక్క ఇటుక కూడా పేర్చలేదు. తాత్కాలిక సచివాలయ, శాసన సభ భవనాలకు భూమి ఉచితంగా ఇచ్చి చదరపుటడుగుకు రూ. 11 వేలు కాంట్రాక్టర్లకు చెల్లించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం బాధ్యతను కేంద్రం నుంచి అడిగి తీసుకొని మరీ తలకెత్తుకున్నారు. వ్యయం అంచనాను 16 వేల కోట్ల నుంచి 64 వేల కోట్లకు పెంచివేసి, కాంట్రాక్టర్లతో లాలూచీ పడి, అవినీతికి లాకులు ఎత్తేశారనే ఆరో పణలకు అవకాశం ఇచ్చారు. ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ సందర్శించినప్పుడు పోలవరం టీడీపీకి ఏటీఎంలాగా పని చేస్తోందంటూ చమత్కరించే వరకూ వ్యవహారం వెళ్ళింది. ఎర్త్ అండ్ రాక్ డామ్ నిర్మాణం ఆరంభం కాలేదు. కాఫర్ డ్యాం సైతం నత్తనడక నడుస్తోంది. ఈ మహా నిర్మాణం ప్రజలకు చూపించడంకోసం వందల కోట్ల ప్రజాధనం తగలేశారు. అనవసరమైన పట్టిసీమ వంటి ఎత్తిపోతల పథ కాల ఖర్చు అదనం. ఎత్తిపోతల పథకంతో గోదావరి, కృష్ణా నదులను అను సంధానం చేసినట్టూ, కృష్ణా డెల్టాకు గోదావరి నీరు పారించినట్టూ సంబరాలు చేసుకున్నారు. బెడిసికొట్టిన వ్యూహాలు ప్రతిపక్ష నాయకుడిని పరాభవించడం, లక్ష కోట్లు కాజేశారంటూ అదే పనిగా అసత్యారోపణలు చేయడం, అసెంబ్లీని అపహాస్యం చేయడం వంటి అకృ త్యాలతో ప్రతిపక్షం అసెంబ్లీకి రాకుండా ప్రజల మధ్యకు వెళ్ళాలని నిర్ణయిం చుకునే వరకూ వేధించారు. ఎన్నికల తంత్రం బెడిసికొట్టింది. మోదీతో, కేసీఆర్‌తో తాగాదా పెట్టుకోవడం, కేంద్రంలో ప్రతిపక్షాలను ఒక తాటిపైకి తెచ్చేందుకు లక్నో, కోల్‌కతా, బెంగళూరు నగరాలకు పిలవని పేరంటం వెళ్ళి నానాయాతనా పడటం వికటించింది. నేలవిడిచి సాము చేయడాన్ని ప్రజలు మెచ్చలేదు. తమను వంచించడం, తక్కువగా అంచనా వేయడం, డబ్బుకు అమ్ముడుపోయేవాళ్ళుగా పరిగణించడం ప్రజలకు నచ్చలేదు. కడచిన పదేళ్ళుగా జగన్ ప్రజలలోనే, ప్రజలతోనే ఉన్నారు. ఓదార్పు యాత్ర, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించేందుకు ఉద్యమంలో భాగంగా సభలూ, సమావేశాలూ, పాదయాత్ర, రెండు సార్వత్రిక ఎన్నికలలో విస్తృత ప్రచారంతో ప్రజల సమక్షంలోనే ఎక్కువ కాలం గడిచిపోయింది. పాదయాత్రలో దాదాపు కోటి మందిని కలుసుకొని వారి బాధలు విన్నారు. ఇచ్చిన మాట తప్పరనీ, నవ రత్నాలను నిజాయితీగా అమలు చేస్తారనే విశ్వాసంతో ప్రజలు ఓట్లు కుమ్మ రించారు. దేశంలో ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని త్రికరణశుద్ధిగా ఆచరించిన రాజకీయ నాయకుడు జగన్ ఒక్కరే. తన పార్టీ గుర్తుపైన గెలిచిన 23 మంది ఎంఎల్‌ఏలనూ, ముగ్గురు ఎంపీలనూ చంద్రబాబు కొనుగోలు చేసినప్పటికీ తన పార్టీలో చేరదలచినవారి చేత ఉన్న పదవులకు రాజీనామా చేయించిన నైతికత జగన్‌ది. శనివారం లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఏక గ్రీవంగా ఎన్నికైన తర్వాత హైదరాబాద్‌లో గవర్నర్‌ని కలిసిన జగన్ రాజ్‌భవన్ నుంచి నేరుగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) నివాసం ప్రగతిభవన్‌కు వెళ్ళారు. జగన్‌ను కేసీఆర్ ఆలింగనం చేసుకొని కుటుంబ సమేతంగా స్వాగతం చెప్పారు. ఎన్నికల ముందు వాతావరణం, ఎన్నికల ప్రచారంలో ధోరణి తాజా పరిస్థితికి పూర్తి భిన్నం. మోదీనీ, కేసీఆర్నీ నిశితంగా విమర్శించడం,వారిని జగన్‌తో జతకట్టడం, ముగ్గురూ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి కుట్రపన్నుతున్నా రంటూ అర్థంలేని ఆరోపణలతో ధ్వజమెత్తడం ద్వారా చంద్రబాబు విధ్వం సకరమైన పాత్ర పోషించారు. కేంద్రంతో తగవు పెట్టుకోవడం విజ్ఞత కాదని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ చెబుతూ ఉండే వారు. తన బాధ్యత తమిళనాడు ప్రయోజనాలు సాధించడం మాత్రమే కానీ దేశాన్ని ఉద్ధరించడం కాదని అంటూ ఉండేవారు. ఇందుకు భిన్నంగా చంద్రబాబు నరేంద్ర మోదీని వ్యతిరేకిస్తున్న నాయకులలో ప్రథముడని పేరు తెచ్చుకునేందుకు అవసరానికి మించి గర్జించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటూ తెలుగువారి అభ్యున్నతికి సమష్టిగా కృషి చేయడం కంటే కావలసింది ఏముంటుంది? అదే విధంగా ఈ రోజు జగన్ ఢిల్లీ వెళ్ళి మధ్యాహ్నం మర్యాదపూర్వకంగా మోదీని కలుసుకోనున్నారు. చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నమైంది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి కేంద్ర సహాయం అత్యవసరం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలన్నా కేంద్రంతో సయోధ్య అనివార్యం. ఇది నిర్మాణాత్మకమైన ధోరణి. విజయాన్ని సవ్యంగా అర్థం చేసుకొని, జనరంజకమైన, పరిశుభ్రమైన పరిపాలన అందిస్తే, సంక్షేమం, అభివృద్ధి రెండు చక్రాలుగా ప్రగతిరథాన్ని వేగంగా నడిపిస్తే జగన్ ఆపేక్షిస్తున్న విధంగానే మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకొని ప్రజల ప్రశంసలు అందుకుంటారు. టీఆర్ఎస్ వెనకంజ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఆశించినన్ని లోక్‌సభ స్థానాలు గెలుచు కోలేకపోయింది. మొత్తం 17 స్థానాలలో తొమ్మిదింటిని మాత్రమే టీఆర్ఎస్ గెలుచుకున్నది. నాలుగు బీజేపీకీ, మూడు కాంగ్రెస్‌కూ దక్కాయి. చేవెళ్ళలో కాంగ్రెస్ స్వల్ప వ్యత్యాసంతో ఓడిపోయింది. 2018లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో టీఆర్ఎస్ ఘనవిజయాన్ని కేసీఆర్ అర్థం చేసుకోవడంలో పొరబడి ఉంటారు. చంద్రబాబు పాదమహిమను పరిగణనలోకి తీసుకున్నట్టు లేరు. ఆయన ఖమ్మంలో, హైదరాబాద్‌లో అడుగుపెట్టకపోతే టీఆర్ఎస్కి అన్ని అసెంబ్లీ సీట్లు దక్కేవి కావు. కాంగ్రెస్ అంతగా దెబ్బతినేది కాదు. మాజీ మంత్రి హరీష్‌రావును పక్కన పెట్టారనే అభిప్రాయం కూడా కార్యకర్తలకు ఒకింత నిరుత్సాహం కలిగించి ఉండవచ్చు. ఫలితంగా బీజేపీ, కాంగ్రెస్‌లు అనూహ్య విజయాలు సాధించాయి. అసెంబ్లీ ఎన్నికలనాటి పరాజయ పరాభవం నుంచి కాంగ్రెస్, బీజేపీలు కొంతమేరకు కోలుకున్నాయి. అదీ ఒకందుకు మంచిదే అని చెప్పే వేలుగాడి కథ చిన్నతనంలో విన్నాం. కిషన్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికలలో అంబర్‌పేటలో గెలిచి ఉంటే శాసనసభ్యుడిగానే ఉండేవారు. అప్పుడు ఓడి పోయారు కనుక ఇప్పుడు సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీ చేసే అవకాశం వచ్చింది. మోదీ మంత్రిమండలిలో ఆయనకు స్థానం లభించినా ఆశ్చర్యం లేదు. రేవంత్‌రెడ్డి కూడా అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయి లోక్‌సభ ఎన్నికలలో గెలిచారు. కరీంనగర్ సంజయ్, ఖమ్మం నామా నాగేశ్వరరావూ, ఆది లాబాద్ సోయం బాబూరావు కూడా అదే బాపతు. రాజకీయ దురంధరుడైన కేసీఆర్‌కు పరిస్థితులను సమీక్షించుకొని సకాలంలో సరైన చర్యలు సత్వరంగా తీసుకునే వివేకం, సామర్థ్యం ఉన్నాయి. ప్రభంజనమంతా వింధ్యకు ఆవలే మోదీ–అమిత్‌షా యుద్ధకౌశలం తిరుగులేనిది. కులసమీకరణాలూ, మత రాజ కీయాలూ సమపాళ్ళలో మేళవించి ఎన్నికల విజయాలు సాధించడంలో వారు ఉద్దండులు. అయినప్పటికీ, వింధ్యకు ఆవలే అశ్వం ఆగిపోయింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు మోదీ సమ్మోహనాస్త్రాన్ని వమ్ము చేశాయి. ఉత్తరాదిలో విజయభేరి మరోసారి మోగించడానికి రెండు కారణాలు దోహదం చేశాయి. ఒకటి, మతం ప్రాతిపదికగా హిందువులను ఏకం చేసి తమ పక్షాన నిలుపుకోవడంలో బీజేపీ సఫలమైంది. మోదీని మహానాయకుడిగా అభివర్ణిస్తూ ఆయనకు దేశంలో ప్రత్యామ్నాయం లేదనే అభిప్రాయం ప్రోదిచేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల తరహాలో భారత పార్లమెంటరీ వ్యవస్థలో ఎన్నికలు జరిగాయి. వ్యవసాయ సంక్షోభాన్నీ, నిరుద్యోగాన్నీ ఇతివృత్తాలుగా వినియోగించుకొని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కానీ ఇతర ప్రతిపక్షాలు కానీ ఉద్యమం నిర్మించి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. ప్రతిపక్షాలన్నీ ఏదో ఒక నాయకుడు లేదా నాయకురాలిని ప్రధాని అభ్యర్థిగా ఎన్నుకొని ఉంటే, ప్రతిపక్ష కూటమి తరఫున ఒక నియోజకవర్గంలో ఒకేఒక అభ్యర్థి నిలబడి ఉంటే ఫలితాలు ఎట్లా ఉండేవో తెలియదు. ఇప్పుడు ఏమని అనుకున్నా ఏమి లాభం? మరో ఐదేళ్ళు మోదీ పాలన సాగుతుంది. మతసామరస్యానికీ, దేశ సమగ్రతకు విఘాతం కలగ కుండా ఆర్థికాభివృద్ధికి దోహదం చేసే విధంగా ఎన్డీఏ పరిపాలన కొత్త పుంతలు తొక్కుతుందని ఆశిద్దాం. కె. రామచంద్రమూర్తి -
ఇంతలా దిగజారాలా?!
మరణ వార్త చెవిన పడినప్పుడు మనస్సు చివుక్కుమంటుంది. తెలిసిన వ్యక్తి ఈ లోకం వీడినట్టు వర్తమానం రాగానే అయ్యో అంటూ మనసు మూలుగు తుంది. మరణం సహజమైనది కానప్పుడు, జరిగింది రాజకీయ హత్య అయి నప్పుడు గుండె బరువెక్కుతుంది. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి తమ్ముడు వైఎస్ వివేకానందరెడ్డి మరణవార్త అనేకమంది లాగానే నాకూ అశనిపాతంలాగా తాకింది. కలలో కూడా ఎవ్వరికీ అపకారం తలపెట్టని మనిషి, ప్రత్యర్థులతో సైతం స్నేహంగా, ప్రేమగా, మృదువుగా మాట్లాడే స్వభావం కలిగిన వ్యక్తి, తనకంటే వయస్సులో చిన్నవారినైనా విధిగా ‘మీరు’ అంటూ సంబోధించే సంస్కారం కలిగిన రుజువర్తనుడు, నిగర్వి, నిరాడంబరుడైన వివేకానందరెడ్డిని ఎవరైనా హత్య చేస్తారని ఊహించడం కూడా కష్టమే. వివేకానందరెడ్డి ఎన్నడూ తనకు ప్రాణహాని ఉన్నదని భావించలేదు. అందుకే ఎక్కడికైనా అంగరక్షకులు లేకుండా ఒంటరిగానే వెళ్ళడం, కార్యక్రమాలలో పాల్గొనడం. గురువారంనాడు కూడా జమ్మలమడుగులో పర్యటించి, వైఎస్ఆర్సీపీ తరఫున ప్రచారం చేసి, దొంగ ఓట్లు చేర్చడాన్ని నిరసిస్తూ ధర్నా చేసి, పొద్దుపోయిన తర్వాత పులి వెందులలో స్వగృహానికి వెళ్ళి నిద్రపోయారు. అర్ధరాత్రికీ, ఉదయం 5 గంట లకూ మధ్య హంతకులు ఆయనపైన పదునైన ఆయుధాలతో దాడి చేసి ప్రాణాలు తీశారని కడప జిల్లా ఎస్పి రాహుల్‌దేవ్‌శర్మ ధ్రువీకరించారు. ఆ తర్వాత రాజకీయ దుమారం మొదలు. అధికారపార్టీ నాయకులపైన, ప్రధా నంగా జమ్మలమడుగు శాసనసభ్యుడు, మంత్రి ఆదినారాయణరెడ్డిపైన వైఎస్సా ర్సీపీ నాయకులు ఆరోపణలు చేశారు. టీడీపీ ఎంఎల్సీ బుద్ధా వెంకన్న ప్రత్యారో పణలు చేస్తూ అనేక ప్రశ్నలు సంధించారు. అంతలో పులివెందులకు వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి చేరుకున్నారు. ఆయనకు ఎస్పీ శర్మ ఒక లేఖ చూపించారు. తొందరగా రమ్మన్నందుకు తనను తన డ్రైవర్ చావకొట్టాడనీ, అతడిని వదలవద్దనీ చెబుతూ వివేకానందరెడ్డి రాసినట్టు చెబుతున్న లేఖ వివా దాస్పదమైనది. ఒకవైపు గొడ్డలితో దాడి జరుగుతుంటే ఉత్తరం ఎట్లా రాస్తా రంటూ జగన్మోహన్రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం లేదు. సార్వత్రిక ఎన్ని కలలో పోలింగ్ మరి 25 రోజులకు ముందు ఈ హత్య జరిగింది కనుక రాజకీయ వాతావరణం అకస్మాత్తుగా వేడెక్కడం సహజం. విరుద్ధమైన వార్తలు ముందు గుండెపోటు అన్నారనీ, తర్వాత హత్య అన్నారనీ వార్తాకథనాలు న్యూస్ చానళ్ళలో, పత్రికలలో వెలువడినాయి. వివేకానందరెడ్డిని ఎవరైనా హత్య చేస్తా రని ఎన్నడూ ఊహించలేదు కనుక గుండెపోటు వచ్చి, కళ్ళు తిరిగి, మరుగుదొ డ్డిలో కమోడ్‌పైన పడి దెబ్బతగిలి మరణించారని ఆ సమయంలో అక్కడ ఉన్న వారు భావించారేమో. అదే ప్రాథమికంగా ప్రచారంలోకి వచ్చింది. ఆ తర్వాత పోలీసుల పరిశీలనలో అది హత్య అని తెలిసింది. హత్య జరగడానికీ, పోలీసులు హత్య అని నిర్ధారించడానికీ మధ్య ఏమి జరిగిందో, ఎందుకు జరిగిందో పరిశోధనలో వెల్లడి కావాలి. హంతకులు ఎవరో, సాక్ష్యాధారాలు మార్చింది ఎవరో, వివేకానందరెడ్డి రాసినట్టు చెబుతున్న లేఖ నిజంగా రాసింది ఎవరో నిర్ధారించవలసింది దర్యాప్తు చేసే అధికారులే. వివేకానందరెడ్డి సమీప బంధు వులు అందరూ హైదరాబాద్‌లో ఉన్నారు. బాబాయి హత్య జరిగినట్టు తెలిసినా పదకొండు గంటల వరకూ లోటస్‌పాండ్ నివాసంలో జగన్ రాజకీయాలు చేస్తూ కూర్చున్నారని ఒక టీడీపీ నాయకుడు శుక్రవారం ఉదయమే వ్యాఖ్యానించారు. ఆ రోజు ఉదయం కోర్టులో హాజరు కావలసి ఉండటంతో న్యాయమూర్తి అను మతి తీసుకొని బయలుదేరేవరకు అంత సమయం పట్టిందని పార్టీకి సంబం ధించినవారిని ఎవరిని అడిగినా చెప్పేవారు. వాస్తవాలు తెలుసుకోవాలనే అభి లాష ఉంటే అటువంటి ప్రయత్నం జరిగేది. ఆరోపించాలనే ఆత్రంలో ఉన్న వారికి వాస్తవం తెలుసుకోవాలన్న ఆలోచన రాదు. బుద్ధా వెంకన్న, కనకమేడల రవీంద్రకుమార్ వంటి టీడీపీ నాయకులు ఒక మాట ఎక్కువ మాట్లాడినా పర్వాలేదు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్ర బాబునాయుడు ప్రతి అక్షరం ఆచితూచి మాట్లాడాలి. జగన్‌పైన విశాఖపట్టణం విమానాశ్రయం విఐపీ లాంజ్‌లో శ్రీనివాసరావు అనే యువకుడు దాడి చేసి నప్పుడూ ఇదే వరుస. జగన్ తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల దాడి చేయించారంటూ టీడీపీ శాసనమండలి సభ్యుడు రాజేంద్ర ప్రసాద్ ఆరోపిం చారు. అటువంటి అన్యాయమైన, అమానవీయమైన ఆరోపణ చేసినందుకు ఆయనను ముఖ్యమంత్రి మందలించిన దాఖలా లేదు. లోగడ ప్రచారంలో పెట్టిన వదంతులను మరోసారి ప్రచారం చేసి ఆనందించే పనిలో కొంతమంది ఉన్నారు. వారు మాట్లాడిన స్థాయికీ చంద్రబాబు మాట్లాడిన స్థాయికీ పెద్దగా భేదం లేదు. ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి మాట్లాడవలసినంత ఉదాత్తంగా లేదు. రాజకీయ ప్రయోజనాలకోసం ఇంత నైచ్యం అవసరమా? చంద్రబాబు ఆవేశంతోనే ప్రశ్నించాలంటే, ‘వేర్ ఆర్ వుయ్ గోయింగ్ (ఎక్కడికి పోతున్నాం)?’ రాజకీయరంధి చంద్రబాబు ఇరవై నాలుగు గంటల రాజకీయనాయకుడు. వేరే రంగాల పట్ల, అంశాల పట్ల ఆయనకు ఆసక్తి లేదు. పూర్తి సమయాన్ని రాజకీయాలకు వినియోగించడం తప్పుకాదు. ప్రతి విషయంలోనూ రాజకీయ ప్రయోజనం ఆశించడం, అందుకోసం అడ్డదారులు తొక్కడం, మానవీయ విలువలను తుంగలో తొక్కడం మాత్రం అభ్యంతరకరం. ఇటువంటి సందర్భాలలో ముఖ్య మంత్రి వ్యవహరించే తీరు విచిత్రమైనది. ఘటన జరిగిన తర్వాత కొన్ని గంటలు మౌనంగా ఉంటారు. ఆ సమయంలో పోలీసుల ద్వారా సమాచారం తెప్పిం చుకుంటారు. ఏ విధంగా ముందుకు పోవాలో పక్కా ప్రణాళికతో సిద్ధంగా ఉంటారు. ఎదురుదాడికోసం ఒక కథనం అల్లి పెట్టుకుంటారు. ఆ తర్వాత తాపీగా తనకు విధేయంగా ఉండే మీడియా ప్రతినిధులను పిలిపించుకుంటారు. గంట నుంచి రెండు గంటల సేపు మాట్లాడతారు. నోటికి వచ్చిన ఆరోపణలు చేస్తారు. బాధితులే దోషులని నిరూపించే ప్రయత్నం చేస్తారు. టీవీ చానళ్ళు వాణిజ్య కార్యక్రమాలూ, ప్రకటనలూ రద్దు చేసుకొని విధిగా సకల ఆరోపణలూ ఆసాంతం ప్రసారం చేస్తాయి. విశాఖ విమానాశ్రయంలో జగన్‌పైన దాడి జరిగినప్పుడు జరిగింది అదే. ఆయనే కావాలని శ్రీనివాస్‌తో దాడి చేయించుకొని ప్రజల సానుభూతి సంపాదించాలని ప్రయత్నించినట్టు పదేపదే ఆరోపిస్తూ దబాయించడం, ప్రశ్నించడం, కోపగించడం చూశాం. ఇప్పుడూ అదే దృశ్యం. ఒక ముఖ్యమైన రాజకీయ కుటుంబం పెద్ద హత్య జరిగితే కొన్ని గంటల పాటు సంతాపం ప్రకటించలేదు. దిగ్భ్రాంతి వెల్లడించలేదు. రాత్రి పొద్దుపోయిన తర్వాత మీడియా సమావేశం నిర్వహించి ముసిముసి నవ్వులు నవ్వుతూ, కళ్ళు ఎగరేస్తూ, చేతులు ఆడిస్తూ నాటకీయంగా మాట్లాడారు. ఆరంభంలో మాట వరుసకు వివేకానందరెడ్డి హత్య పట్ల బాధ వెలిబుచ్చారు. ఆ వాక్యం తర్వాత అంతా జగన్‌పైన దాడే. అన్నీ భయంకరమైన ఆరోపణలే. తన వాదన బలంగా ఉన్నదనీ, తనకు లభించిన సాక్ష్యాధారాలను సమర్థంగా వినియోగించుకొని తిరుగులేని విధంగా దాడి చేస్తున్నాననీ, రాజకీయంగా ప్రయోజనం పొందే విధంగా వ్యవహరిస్తున్నాననే ఆనందం ముఖ్యమంత్రి కళ్ళలో కనిపించిందే కానీ ఒక సీనియర్ రాజకీయ నాయకుడూ, ఒక సౌమ్యుడూ, ఒక అజాతశత్రువూ నిష్కారణంగా హతుడయ్యాడనే బాధ రవ్వంతైనా కనిపించలేదు. ముఖ్యమంత్రి చేసిన సవాళ్ళు అన్నీ ఆ రోజు ఉదయం బుద్దా వెంకన్న, మధ్యాహ్నం కనకమేడల చేసినవే. విశాఖ విమానాశ్రయం ఉదంతంలో వెనువెంటనే డీజీపీ ఆర్పీ ఠాకూర్ మొబైల్లో వచ్చిన మెసేజ్‌లు చూసుకుంటూ దాడి చేసిన వ్యక్తి జగన్ అభిమాని అనీ, సానుభూతి కోసం చేశాడనీ చెప్పడం ప్రజలందరికీ తెలుసు. అటువంటి డీజీపీ నాయకత్వంలోని పోలీసు వ్యవస్థపైన విశ్వాసం ఎట్లా ఉంటుంది? ఆంధ్రప్రదేశ్ పోలీసులపైన నమ్మకం లేదని జగన్ అంటే అది అపరాథం. తనపైన కానీ తన కుమారుడిపైన కానీ ఎటువంటి చర్యలకూ ఉపక్రమించని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)నీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్ (ఈడీ)నీ, ఆదాయపన్ను శాఖ అధికారులనూ రాష్ట్రంలో అడుగుపెట్టనీయమని హుంక రించడం మాత్రం సమాఖ్య స్పూర్తి. అక్రమార్కులైన తస్మదీయుల కంపెనీలను సోదా చేయడం ఈ సంస్థలు చేసిన నేరం. వారిని నాలుగేళ్ళు ఎన్డీఏ భాగస్వామిగా ఉండి కాపాడారు. టీడీపీ ఎంఎల్ఏల ఫిరాయింపులను తెలం గాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) ప్రోత్సహిస్తే అది ఘోరం. చంద్రబాబు 23 మంది వైఎస్ఆర్సీపీ ఎంఎల్ఏలకు కోట్లు ముట్టజెప్పి టీడీపీ తీర్థం ఇవ్వడమే కాకుండా వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇవ్వడం మాత్రం రాజకీయపుటెత్తుగడ. బాలకృష్ణ ఇంట్లో జరిగిన కాల్పులలో సెక్యూరిటీ గార్డు చనిపోయిన కేసును రాజకీయంగా వినియోగించుకోవాలని వైఎస్ రాజ శేఖరరెడ్డి భావించి ఉంటే ఏమయ్యేది? పరిటాల రవి హత్య జరిగినప్పుడు చంద్రబాబు అసెంబ్లీలో రాజశేఖరరెడ్డి తనయుడు జగన్‌పైన ఆరోపణలు చేసినప్పుడు అప్పటికప్పుడే సీబీఐ దర్యాప్తునకు అంగీకరించారు. ఇప్పుడు వివే కానందరెడ్డి హత్యపైన సీబీఐ దర్యాప్తు చేయించేందుకు చంద్రబాబుకి అభ్యం తరం ఎందుకు ఉండాలి? అప్పుడు చంద్రబాబు శాసనసభలో వేసిన వీరం గంతో పోల్చితే ఇప్పుడు జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేసిన విధం చాలా సౌమ్యంగా ఉంది. ‘సిట్’ సాధించింది పూజ్యం ఇక చంద్రబాబు వేసే ప్రత్యేక దర్యాప్తు బృందాల(సిట్) నిర్వాకం ప్రజలకు తెలియదా? అధికారంలోకి వచ్చిన కొత్తల్లో శేషాచలం అడవులలో ఎర్రచందనం అపహరిస్తున్నారనే ఆరోపణపైన ఒకానొక దుందుడుకు ఉన్నతాధికారి ఆదేశాల మేరకు పోలీసులు జరిపిన కాల్పులలో 20 మంది నిరుపేద కూలీలు దర్మరణం పాలైనారు. దానిపైన సీనియర్ ఐపీఎస్ అధికారి రవిశంకర్ అయ్యన్నార్ నాయ కత్వంలో ‘సిట్’ను నియమించారు. ఫలితం శూన్యం. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలోనూ చక్రం తిప్పాలనే దురాశతో టీడీపీ శాసనసభ్యుడు రేవంత్‌రెడ్డిని రూ. 50 లక్షలతో టీఆర్ఎస్ శాసనసభ్యుడు స్టీవెన్సన్ దగ్గరికి పంపించి, పట్టుబడి, హైదరాబాద్ నుంచి విజయవాడకు పలాయనం చిత్తగించి, ఆ కేసులో రాజీ చేసుకొని ఊరట పొందారు. ఓటుకు కోట్ల కేసు కొనసాగింపుగా ‘యూ హేవ్ పోలీస్. ఐ హేవ్ పోలీస్. యూ హేవ్ ఏసీబీ. ఐ హేవ్ ఏసీబీ’ అంటూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపైన నియమించిన ‘సిట్’ సైతం ఒరగబెట్టింది ఏమీ లేదు. గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమహేంద్రవరంలో తాను షూటింగ్లో పాల్గొన్న సమయంలో విధించిన నిబంధనల ఫలితంగా తొక్కిసలాట జరిగి 29 మంది దుర్మరణం పాలైతే దాని విచారణకు పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి సోమయాజులును నియమిస్తే మీడియాదీ, భక్తులదే అపరాధమంటూ ఆయన తేల్చారు. చంద్రబాబుకి ‘క్లీన్చిట్’ ఇచ్చారు. నాటి దృశ్యాలను టీవీ చానళ్ళలో చూసిన ప్రజలు మాత్రం ముఖ్యమంత్రిని దోషిగా నిలబెట్టారు. విశాఖ భూకుం భకోణంపైనా, కాల్‌మనీ సెక్స్రాకెట్పైనా, విజయవాడలో టీడీపీ శాసనస భ్యుడు బోండా ఉమామహేశ్వరరావుపైన వచ్చిన భూకబ్జా ఆరోపణలపైనా, విశాఖ మన్యంలో పోలీసులు చేసిన జంట హత్యలపైనా దర్యాప్తునకు నియ మించిన ‘సిట్’లు సాధించిన ఫలితం ఏమిటి? వివేకానందరెడ్డి హత్యపైన దర్యాప్తు చేసేందుకు వేసిన ‘సిట్’ ఏమి చేస్తుందో, ఏమని నిర్ణయిస్తుందో ఊహిం చడం కష్టమా? ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రికీ, డీజీపీకీ జవాబుదారీ కాని కేంద్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరడం అసమంజసం ఎట్లా అవుతుంది? సీబీఐ దర్యాప్తునకు అంగీకరించకపోగా, ‘సొంత చిన్నాన్న హత్య జరిగితే సాక్ష్యాధారాలు మార్చివేశారు,’ అంటూ జగన్మోహన్రెడ్డి స్వయంగా సాక్ష్యాధారాలు మార్చినట్టు శనివారం సాయంత్రం ఎన్నికల శంఖారావం సభలో చంద్రబాబునాయుడు నిస్సంకోచంగా ఆరోపించడం దిగజారుడు రాజకీయాలకి ప్రబల నిదర్శనం. ‘సిట్’ దర్యాప్తులో ఏమి తేల్చాలో అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడే చెప్పారు. వారి నిర్ణయం భిన్నంగా ఎందుకు ఉంటుంది? నాలుగు దశాబ్దాలకుపైగా రాజకీయం చేసి, పద్నాలుగు సంవత్సరాలు ముఖ్య మంత్రిగా పని చేసి తెలుగు రాష్ట్రాలలో రికార్డు సృష్టించిన సీనియర్ నాయకుడికి కాస్త మనసు కూడా ఉండాలనీ, యంత్రంలాగా స్పందించరాదనీ ఆశించడం అత్యాశ కాదు కదా! కె. రామచంద్రమూర్తి -
పాత పొత్తులు–కొత్త ఎత్తులు
త్రికాలమ్ ఉత్తరాదిలో చలి ఎముకలు కొరుకుతున్నప్పటికీ రాజకీయాలు మాత్రం వేడెక్కుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకున్నాయి. గెలు పోటములపైన దేశ ప్రజలలో ఇప్పటికే చర్చ జరుగుతున్నది. ప్రధానిగా నరేంద్రమోదీ మరోసారి ప్రమాణం చేస్తారా? కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి దేశాన్ని నడిపించగల శక్తిసామర్థ్యాలు ఉన్నాయా? ఒక వేళ బీజేపీకి సీట్లు బాగా తగ్గితే, లోగడ సోనియాగాంధీకి ఇచ్చిన గౌరవం కాకలు తీరిన ప్రాంతీ యపార్టీల నాయకులు ఇప్పుడు రాహుల్‌గాంధీకి ఇస్తారా? ఉత్తరప్రదేశ్ (యూపీ) రాజకీయాలు ఎట్లా ఉంటాయి? బిహార్‌లో లాలూప్రసాద్ పట్ల సానుభూతి పవనాలు వీస్తున్నాయా? యూపీ, బిహార్‌ల ఫలితాలæ ప్రభావం జాతీయ రాజకీయాలపై ఎట్లా ఉంటుంది? ఎక్కడ విన్నా ఇదే చర్చ. మలుపు తిప్పే రోజు శనివారం దేశ రాజకీయ చరిత్రలో అత్యంత ప్రాముఖ్యం సంతరించుకున్న రోజు. యూపీ రాజకీయాలను మలుపు తిప్పే విధంగా సమాజ్‌వాదీపార్టీ (ఎస్పీ), బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)లు ఎన్నికల పొత్తు కుదుర్చుకు న్నాయి. బీఎస్పీ అధినేత మాయావతి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్‌యాదవ్‌లు సంయుక్తంగా మీడియా సమావేశంలో ఈ విషయం ప్రకటించారు. యూపీలో ఉన్న 80 లోక్ సభ స్థానాలలోనూ చెరి 38 స్థానాలకు పోటీ చేస్తామనీ, రెండు కాంగ్రెస్‌పార్టీకి వదులుతామనీ చెప్పారు. మిగిలిన రెండు అజిత్‌సింగ్ నాయ కత్వంలోని రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆరెల్డీ)కి కేటాయించాలని నిర్ణయం. కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉండదని తెగేసి చెప్పారు. బీఎస్పీ–కాంగ్రెస్ కూటమి 1996లో ఓడిపోయింది. 2017లో ఎస్పీ–కాంగ్రెస్ కూటమి పరాజయం చెందింది. అందుకే కాంగ్రెస్‌తో పొత్తు నష్టదాయకమని మాయావతి, అఖిలేష్ తీర్మా నించుకున్నారు. నిన్ననే ఢిల్లీలోని రాంలీలా మైదానంలో బీజేపీ జాతీయ మండలి విస్తృత సమావేశంలో ప్రధాని నరేంద్రమోదీ కాంగ్రెస్‌పైనా, సోని యాగాంధీ కుటుంబంపైనా ధ్వజమెత్తారు. సుదీర్ఘమైన, ప్రభావవంతమైన ప్రసంగంతో రాబోయే పార్లమెంటు ఎన్నికలలో బీజేపీ ప్రచారానికి తెరదీశారు. అగ్రవర్ణాలకు పది శాతం రిజర్వేషన్లనూ, సర్జికల్దాడులనూ, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సీ)నీ, గుడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ)నీ, రామ మందిరం నిర్మాణాన్నీ ఎన్నికల ప్రచారాంశాలుగా చేయబోతున్నట్టు సంకేతం ఇచ్చారు. మచ్చలేని ప్రభుత్వం భారతదేశ చరిత్రలో తనదేనంటూ ప్రకటిం చుకున్నారు. రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు విషయంలో అవినీతి లవ లేశమైనా లేదంటూ ఈ దేశంలో పసిబాలలను అడిగినా చెబుతారని అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ని ఆంధ్రప్రదేశ్లోకీ, పశ్చిమబెంగాల్లోకీ, ఛత్తీస్ గఢ్లోకీ ప్రవేశించనీయబోమని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయిం చడం చట్టవిరుద్ధమంటూ విమర్శించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో సీబీఐ తననూ, అమిత్‌షానూ వేటాడినప్పటికీ (అమిత్‌షా జైలులో కూడా ఉన్నారు) ఆ సంస్థను గౌరవించామే కానీ ఎన్నడూ గుజరాత్‌లోకి ప్రవేశం నిషేధించలేదని గుర్తు చేశారు. రాజ్యాంగం సర్వోన్నతమైనదనీ, అంద రికీ శిరోధార్యమనీ చెప్పారు. మాయావతి–అఖిలేష్ ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ, కూటములు ఏర్పాటు చేసుకొని దేశాన్ని కొల్లగొట్టాలని ప్రయత్నించేవారు. తమ సహాయసహకారాలపైన ఆధారపడే ‘మజ్బూర్ సర్కార్’ కావాలని కోరుకుం టారనీ, దేశ ప్రగతిని ఆకాంక్షించేవారు పటిష్టమైన, స్థిరమైన ‘మజ్బూత్ సర్కార్’ ఉండాలని ఆశిస్తారనీ మోదీ ఉద్ఘాటించారు. రామమందిరం నిర్మా ణానికి న్యాయస్థానాలలో అవరోధాలు సృష్టించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయ త్నిస్తున్నదని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్, హిందూమహాసభ వంటి సంస్థలు ప్రభుత్వంపైన మందిర నిర్మాణం విషయంలో ఒత్తిడి తెస్తున్నాయి. ‘అభీ నహీ తో కభీ నహీ (ఇప్పుడు కాకపోతే ఎప్పటికీ కాదు)’ అంటూ నినాదాలు చేస్తు న్నాయి. సుప్రీంకోర్టు నిర్ణయం కోసం ఎదురు చూడకుండా సుగ్రీవాజ్ఞ (ఆర్డి నెన్స్) ద్వారా రామాలయం నిర్మించాలని కోరుతున్నాయి. సర్వోన్నత న్యాయ స్థానం తీర్పు వెలువడిన తర్వాతనే మందిరం విషయంలో ముందడుగు వేస్తా మని మోదీ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌పైన నిందమోప డానికి ఈ అంశాన్ని మోదీ సంపూర్ణంగా వినియోగించుకోబోతున్నారు. హిందూత్వ ప్రభావం ఒక్కటే గెలిపించదు హిందూత్వ ప్రచారం ముమ్మరం చేసినప్పటికీ మెజారిటీ స్థానాలు గెలుచుకునే అవకాశం నేషనల్ డెమొక్రాటిక్ అలయెన్స్ (ఎన్టీఏ)కి లేదని బీజేపీ నాయ కత్వం గ్రహించింది. 2014లో యూపీఏ పదేళ్ళ పాలన పట్ల వ్యతిరేకత ఉండేది. ఇప్పుడు ఎన్డీఏ పాలనపైన కూడా ఎంతోకొంత వ్యతిరేకత ఉంది. అందుకే కొత్త మిత్రులకోసం అన్వేషణ. తమిళనాడులో డిఎంకె, ఏఐఏడి ఎంకెలతో, రజనీకాంత్ పార్టీతో ఒప్పందానికి సిద్ధంగా ఉన్నామంటూ స్వయంగా మోదీ అన్నారు. తాము బీజేపీతో పొత్తుకు సుముఖంగా లేమంటూ డిఎంకే, ఏఐఏడిఎంకేలు స్పష్టం చేశాయి. రజనీకాంత్ ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఈ నేపథ్యంలో యూపీలో పరిస్థితులు తారుమారైతే ఎన్టీఏ మనుగడ కష్టం. యూపీలో ఇదివరకటి కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తామనీ, 74 స్థానాలు గెలిచి చూపిస్తామనీ బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా డాంబికం ప్రదర్శించినా క్షేత్రవాస్తవికత ఇందుకు భిన్నం. 2018 మార్చిలో గోర ఖ్‌పూర్, ఫుల్పూర్ లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉపఎన్నికలలో ఎస్పీ అభ్యర్థులు బీఎస్పీ మద్దతుతో బీజేపీ అభ్యర్థులను ఓడించారు. నిరుడు మేలో కైరానా లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఆరెల్డీ అభ్యర్థి ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీల సమష్టి మద్దతుతో బీజేపీ అభ్యర్థిని ఓడగొట్టారు. ఎస్పీ, బీఎస్పీ భుజం కలిపితే బీజేపీకి నష్టం జరుగుతుందనే అవగాహన మోదీకి లేకపోలేదు. విధానాలూ, సూత్రాలూ ప్రాతిపదిక కాకుండా కేవలం ఒకేఒక వ్యక్తిని ఓడించేందుకు కూట ములు ఏర్పడుతున్నాయంటూ మోదీ విమర్శించడం అందుకే. ఈ కూటము లకు ‘ఒక నేత లేడు. ఒక నీతి లేదు’ అంటూ, రాబోయేది మూడో పానిపట్టు యుద్ధమంటూ అమిత్‌షా చేసిన వ్యాఖ్యలు పొంతన లేనివే అయినా జరగబోయే ఎన్నికలు దేశానికి దిశానిర్దేశం చేస్తాయని మాత్రం నిశ్చయంగా చెప్పవచ్చు. బీహార్, యూపీలు ఎన్టీఏ పతనానికి బాట వేస్తాయని లాలూ ప్రసాద్ తనయుడు, ఆర్జేడీ అధినేత తేజశ్వియాదవ్ వ్యాఖ్యానించారు. దీనిని ఉత్తరకుమారుడి ప్రేలాపన అంటూ కొట్టివేస్తే గోడమీది రాతను చదవడానికి నిరాకరించినట్టే. ఉత్తరప్రదేశ్ ఒక ప్రయోగశాల. అక్కడ అన్ని రకాల ప్రయోగాలూ జరిగాయి. బిహార్‌లో లాలూప్రసాద్ యాదవ్ లాగానే యూపీలో సోషలిస్టు నాయకుడు ములాయంసింగ్ యాదవ్ ఎస్పీని నెలకొల్పారు. యాదవులనూ, ఇతర వెనుకబడిన కులాలవారినీ, ముస్లింలనూ ఒక తాటిపైకి తెచ్చారు. దళిత మేధావి, దార్శనికుడు కాన్షీరాం దళితులకోసం ప్రత్యేకంగా బీఎస్పీని ఆవి ష్కరించారు. 1989లో ములాయం మొదటిసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. 1991లో గద్దె దిగారు. బీజేపీ నాయకుడు కల్యాణ్‌సింగ్ పగ్గాలు చేపట్టారు. అయోధ్య ఉద్యమం, రథయాత్ర, బాబరీ మసీదు విధ్వంసం ఫలితంగా బలం పుంజుకొని బీజేపీ జోరుమీదున్నది. బాబరీ మసీదు కూల్చి వేసిన వెంటనే నాటి ప్రధాని పీవీ నరసింహారావు నాలుగు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలను బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించారు. అనంతరం 1993లో జరిగిన ఎన్నికలలో బీజేపీని నిలువరించడం కోసం కాన్షీరాం ములాయం సింగ్‌లు పొత్తు పెట్టుకున్నారు. ఒక పార్టీ ఓట్లు మరో పార్టీకి బదిలీ అయ్యాయి. ఎన్నికలు పోటాపోటీగా జరిగాయి. బీజేపీకి 177 స్థానాలు లభిస్తే ఎస్పీ–బీఎస్పీ కూటమికి 176 స్థానాలు దక్కాయి. కాంగ్రెస్ మద్దతుతో ములాయంసింగ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1995లో ములాయంసింగ్ ప్రభు త్వానికి బీఎస్పీ మద్దతు ఉపసం హరించుకున్నది. అప్పటికే మాయావతి చేతు ల్లోకి బీఎస్పీ పూర్తిగా వచ్చింది. మద్దతు ఉపసంహరించుకున్నందుకు నిరసనగా మాయావతి బసచేసిన అతిథిగృహాన్ని ఎస్పీ కార్యకర్తలు ముట్టడించారు. మాయావతి గదిలో తలు పులు వేసుకొని ఉన్నారు. అప్పుడు బీజేపీ శాసనసభ్యుడు బ్రహ్మదత్ ద్వివేదీ మాయావతిని కాపాడి గవర్నర్ బంగ్లాకు తీసుకొని వెళ్ళారు. అక్కడి నుంచే అటల్‌బిహారీ వాజపేయితో మాట్లాడి మాయావతికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. బీజేపీ మద్దతుతో తొలివిడత ముఖ్యమంత్రిగా మాయావతి ప్రమాణం చేశారు. దేశంలో ఒక దళిత మహిళ ఒక (అతిపెద్ద) రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం అదే ప్రథమం. ప్రజాస్వామ్యంలో జరిగే అద్భుతం ఇది (ఐ్ట జీట్చ ఝజీట్చఛిl్ఛ జీn ఛ్ఛీఝౌఛిట్చఛిy) అని నాటి ప్రధాని పీవీ వ్యాఖ్యానించారు. 1997, 2002లో కూడా మాయావతి బీజేపీ మద్దతుతో ముఖ్యమంత్రి కాగలిగారు. 2003లో బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవ డంతో ఆమె రాజీనామా చేశారు. 2003 నుంచి 2007 వరకూ తిరిగి ములా యంసింగ్ యాదవ్ ముఖ్యమంత్రి. మళ్ళీ మాయావతి 2007 నుంచి 2012 వరకూ పూర్తి కాలం ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. 2012లో అఖిలేష్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2017లో ఎస్పీ–కాంగ్రెస్ కూట మిని మట్టికరిపించి బీజేపీ అఖండ విజయం సాధించింది. 25 ఏళ్ళ తర్వాత ఎస్పీ–బీఎస్పీ కూటమి 2018లో మరో అరుదైన పరిణామం సంభవించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాజీనామా ఫలితంగా ఖాళీ అయిన గోరఖ్‌పూర్ లోక్‌సభ స్థానా నికీ, ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ప్రసాద్ ఖాళీ చేసిన ఫుల్పూర్ స్థానానికీ ఉపఎన్నికలు వచ్చాయి. రెండు స్థానాలలోనూ ఎస్పీ అభ్యర్థులను బీఎస్పీ బలపరిచింది. ఎస్పీ అభ్యర్థులు గెలుపొందారు. ఆ సందర్భంలో అఖిలేష్ లక్నోలో మాయావతి నివాసానికి వెళ్ళి కృతజ్ఞతలు చెప్పారు. అంటే, అతిథిగృహాన్ని ఎస్పీ కార్యకర్తలు ముట్టడించిన తర్వాత 24 సంవత్సరాలకు తిరిగి ఎస్పీ, బీఎస్పీ నాయకులు స్నేహపూర్వకంగా కలుసుకున్నారు. ఎస్పీ–బీఎస్పీ కూటమిని ఎదుర్కొనేందుకు ప్రధాని మోదీ అగ్రవర్ణాలకు పది శాతం రిజర్వేషన్లు తెచ్చారు. ఇది బీజేపీ యూపీ, ఉత్తరాఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాలలో బీజేపీకి ప్రయోజనం కలిగిస్తుందని భావిస్తున్నారు. ఈ రిజర్వేషన్ కారణంగా అగ్రవర్ణాల పట్ల దళితులకూ, వెనుకబడినవర్గాలకూ వ్యతిరేకత పెరుగుతుంది. సరిగ్గా పాతికేళ్ళ కిందట ఎస్పీ, బీఎస్పీ మొదటి దఫా పొత్తు పెట్టుకున్నప్పుడు ఎటువంటి పరిస్థితి ఉన్నదో ఇప్పుడూ అదే వాతావరణం ఉండటం యాదృచ్ఛికం. యోగి పాలనలో ఠాకూర్లదీ, ఇతర అగ్రవర్ణాలదే పెత్తనం. దళితులపైనా, ముస్లిం లపైనా దాడులు పెరిగిపోయాయి. అయినప్పటికీ, బీజేపీని తక్కువగా అంచనా వేయకూడదు. దళితులలో జాతవ్ కులానికి మాయావతి తిరుగులేని నాయకురాలు. తక్కిన దళితులను బీజేపీ 2014లో, 2017లో సమీకరించి మాయావతిని ఓడించింది. వెనుకబడిన కులాలలో యాదవులు అఖిలేష్‌కి విధేయులు. తక్కిన వెనుకబడిన కులాలను ఎస్పీకి దూరం చేసి ఎస్పీ–కాంగ్రెస్ కూటమిని బీజేపీ 2017లో ఓడించింది. అదే ప్రయత్నం ఇప్పుడూ చేస్తారు. దళితుల ఓట్లు ఎస్పీ అభ్యర్థులకు పడే విధంగా మాయావతి కట్టడి చేయగలరు. కానీ యాద వులందరూ బీఎస్పీ అభ్యర్థులకు ఓట్లు వేస్తారని పూచీ లేదు. 2014లో బీజేపీ స్వయంగా 71 స్థానాలు గెలుచుకున్నది. ఎస్పీకి అయిదూ, కాంగ్రెస్‌కు రెండూ దక్కాయి. బీఎస్పీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. బీజేపీ మిత్ర పక్షమైన అప్నాదళ్ రెండు స్థానాలు కైవసం చేసుకున్నది. అయిదేళ్ళ కిందట జరిగిన పోలింగ్ సరళిని గమనంలోకి తీసుకొని ఆరెల్డీని కూడా కూటమిలో కలిపితే ఎస్పీ–బీఎస్పీకి ఆధిక్యం ఉండే సీట్ల సంఖ్య 42. కాంగ్రెస్‌ని సైతం ఈ కూటమిలో చేర్చుకుంటే దాదాపు 58 స్థానాలలో కూటమికి పైచేయి ఉంటుందని అంచనా. ముఖ్యంగా ముస్లిం ఓట్లు చీలకుండా సంఘటితంగా ఉంటాయి. ఎస్పీ–బీఎస్పీ వదిలే రెండు సీట్లు కాంగ్రెస్ ఎట్లాగయినా గెలు చుకుంటుంది. 2009 లోక్‌సభ ఎన్నికలలో యూపీలో కాంగ్రెస్ 22 నియో జకవర్గాలలో విజయం సాధించింది. 2014లో పదేళ్ళ ప్రభుత్వ వ్యతిరేకత, మోదీ ప్రభంజనం ఫలితంగా రెండు స్థానాలే దక్కాయి. కాంగ్రెస్‌ను కలు పుకోకపోతే ముక్కోణపు పోటీ జరుగుతుంది. బీజేపీకి లాభం. ఎన్నికలు ఇంకా మూడు మాసాలు ఉన్నాయి. బీజేపీ చేతులు కట్టుకొని కూర్చోదు. రాహు ల్‌గాంధీ ప్రయాగలో అర్ధకుంభమేళాకు వెళ్ళకుండా ఉండరు. ఇంకా అనేక పరిణామాలు సంభవిస్తాయి. ఇప్పుడే ఒక అంచనాకు రావడం తొందరపాటు అవుతుంది. కె. రామచంద్ర మూర్తి -
జన మనోరథయాత్ర
త్రికాలమ్ ఒకానొక చారిత్రక ఘట్టం ఈ నెల తొమ్మిదో తేదీన ముగుస్తుంది. ఆంధ్రప్రదేశ్ విపక్ష నాయకుడు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి 2017 నవంబర్ 6న ఆరంభించిన ‘ప్రజాసంకల్పయాత్ర’ ఇచ్ఛాపురంలో పెద్ద బహిరంగసభతో ముగియనున్నది. కన్యాకుమారి నుంచి కశ్మీరం వరకూ జరిగిన ఆదిశంకరుడి పాదయాత్ర వివరాలు మనకు అందుబాటులో లేవు. పాదయాత్రను ఒక సాధనంగా వినియోగించి విజయాలు సాధించిన తొలి ప్రజానాయకుడు మహాత్మాగాంధీ. దక్షిణాఫ్రికాలో బొగ్గుగని కార్మికులను సమీకరించి పోరుబాటలో నడిపించడానికి గాంధీజీ చేసిన ప్రయోగం భారత స్వాతంత్య్ర సమరంలో ఒక విధానంగా స్థిరపడింది. 1930లో ఆయన ఆధ్వర్యంలో సాగిన దండి సత్యాగ్రహం దేశప్రజల్లో ఐకమత్యానికీ, స్వాతంత్య్ర పోరాటం తీవ్రతరం కావడానికీ దోహదం చేసింది. అదే మంత్రాన్ని వినోబా భావే 1950 దశకంలో భూదానోద్యమం ప్రచారానికి జయప్రదంగా ఉపయోగించారు. జనతా పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ కన్యాకుమారి నుంచి ఢిల్లీ వరకూ జరిపిన పాదయాత్ర నడివయస్సులో ఉన్నవారికి గుర్తు ఉంటుంది. ఉత్తరాఖండ్‌లో హరిత విప్లవ సారథి సుందర్‌లాల్ బహుగుణ ప్రజలలో అవగాహన పెంపొందించే కార్యక్రమానికి పాదయాత్రను వినియోగించుకున్నారు. ఏక్తాపరిషత్, స్వరాజ్ అభియాన్ వంటి సంస్థలు హక్కుల సాధనకోసం ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకొని రావడానికి పాదయాత్రలు చేసిన సందర్భాలు ఉన్నాయి. చంద్రశేఖర్ భారత్‌యాత్ర రాజకీయ లక్ష్యంతో, ఎన్నికలకు ముందు ప్రజలను ప్రభావితం చేయడానికి ఉద్దేశించిన పాదయాత్ర చేసిన తొలి నాయకుడు జనతాపార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్. జయప్రకాశ్‌నారాయణ్ ఆశీస్సులతో ఆవిర్భవించిన జనతా పార్టీ 1977లో ప్రభుత్వం ఏర్పాటు చేసి, 1980 ఎన్నికలలో పరాజయం చెందిన తర్వాత కొన్ని మాసాలకే విచ్ఛిన్నమైపోయింది. అటల్‌బిహారీ వాజపేయి, లాల్‌కృష్ణ అడ్వాణీలు భారతీయ జనతా పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. చరణ్‌సింగ్, దేవీలాల్, లాలూ ప్రసాద్‌యాదవ్, ములాయంసింగ్‌యాదవ్, దేవెగౌడ వంటి నాయకులు వేరు వేరు కుంపట్లు పెట్టుకున్నారు. చంద్రశేఖర్ ఒంటరి. ఆ నేపథ్యంలో ప్రత్యా మ్నాయ రాజకీయాలకు అంకురార్పణ చేయాలన్న సంకల్పంతో ఆయన ‘భారత్ యాత్ర’ను ప్రారంభించారు. కన్యాకుమారి నుంచి 4,260 కిలోమీటర్లు ఆరు మాసాలలో (జనవరి6–జూన్ 25, 1983) నడిచి రాజ్‌ఘాట్‌లో గాంధీజీకి శ్రద్ధాంజలి ఘటించడంతో యాత్ర ముగిసింది. కానీ చంద్రశేఖర్‌కు రాజకీయ ప్రయో జనం ఏదీ ఆ సందర్భంలో కలగలేదు. 1967 నుంచి ఎంపీగా ఉండిన చంద్ర శేఖర్ భారత్‌యాత్ర అనంతరం 1984లో జరిగిన ఎన్నికలలో ఇందిరాగాంధీ హత్య కారణంగా వీచిన సానుభూతి పవనాల ఫలితంగా ఓటమి చవిచూశారు. అనంతరం 1990 నవంబర్‌లో ప్రధాని పదవి చేపట్టి 1991 జూన్ వరకూ కొనసాగారు కానీ దానికీ, పాదయాత్రకూ సంబంధం లేదు. ప్రధాని పదవిలో రాణించడానికి అవసరమైన వ్యవధి కూడా లభించలేదు. పాదయాత్రలో తెలుసుకున్న సమస్యలకు పరిష్కారాలు ఆలోచించడానికి కానీ అమలు చేయడానికి కానీ అవకాశం లేకపోయింది. 1990లో బీజేపీ నాయకుడు అడ్వాణీ చేసిన 36 రోజుల రథయాత్ర దేశాన్ని కుదిపివేసింది. ఇది రాజకీయాల కోసం మతాన్ని ఉపయోగించే ప్రయత్నం. హిందువులను మతప్రాతిపదికపైన, బాబరీమసీదును తొలగించి రామాలయ నిర్మాణం జరిపించాలనే నినాదంపైన సంఘటితం చేసే ఉద్దేశంతో సాగిన యాత్ర. మహాభారత యుద్ధంలో అర్జునుడు ఉపయోగించిన రథాన్ని పోలిన వాహనంలో చేసిన యాత్రను బిహార్ ముఖ్యమంత్రి లాలూ అడ్డుకున్నారు. అడ్వాణీని అరెస్టు చేయించారు. అయినా ఆ యాత్ర బీజేపీకి లబ్ధి చేకూర్చింది. 1984లో రెండు లోక్‌సభ స్థానాలను మాత్రమే గెలుచుకున్న బీజేపీ 1998 నాటికి అధికారంలోకి వచ్చింది. రాజీవ్ హత్య జరిగి ఉండకపోతే 1991 ఎన్నికలలో బీజేపీ ఎక్కువ స్థానాలు సాధించి ఉండేది. హత్య కారణంగా ఎన్నికల రెండో ఘట్టంలో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు కలిగిన పార్టీగా అవతరించింది. 1996 ఎన్నికల అనంతరం 13 రోజుల స్వల్పకాలం వాజపేయి నేతృత్వంలో బీజేపీ అధికారంలో ఉంది. ఆ తర్వాత యునైటెడ్ ఫ్రంట్ అల్పాయుష్షు ప్రభు త్వాలకు దేవెగౌడ, గుజ్రాల్ సారథ్యం వహించారు. 1998 ఎన్నికలలో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించి వాజపేయి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మొత్తంమీద రథయాత్ర ఫలితంగా బీజేపీ బలం పుంజుకొని అధికారంలోకి వచ్చిందని భావించవచ్చు. పూర్తిగా రాజకీయ, సామాజిక అంశాలను మాత్రమే ప్రస్తావిస్తూ, ప్రజలను కలుసుకొని వారి కంట నీరు తుడిచే ఉద్దేశంతో సాగిన పాదయాత్ర వైఎస్ రాజ శేఖరరెడ్డి 2003లో చేసిన ‘ప్రజాప్రస్థానం.’ రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ నుంచి ఆరంభించి ఇచ్ఛాపురం వరకూ 64 రోజులపాటు 1,470 కిలోమీటర్లు సాగిన యాత్రలో అన్ని వర్గాల, కులాల, మతాల ప్రజలనూ కలుసుకొని వారి వెతలు వినే అవకాశం నాటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ఆర్కి దక్కింది. పేదప్రజలూ, నిరుద్యోగులూ, మైనారిటీలూ, దళితులూ, ఆదివాసులూ చెప్పిన అనేక సమస్యలను అవగాహన చేసుకొని వాటికి పరిష్కారాలు ఆలోచించి నిర్దిష్టమైన రూపం ఇచ్చే సావకాశం ఆయనకు లభించింది. 2004 ఎన్నికలలో విజయం సాధించాక ఆయన ప్రభుత్వం ఏర్పడి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసింది. జలయజ్ఞం వంటి బృహత్తరమైన కార్యక్రమాన్ని తలకెత్తుకున్నది. విద్య, ఆరోగ్య రంగాలలో వినూత్నమైన పథకాలు తెచ్చింది. పార్టీలకూ, ప్రాంతాలకూ అతీతంగా ప్రజలందరికీ పథకాల ఫలాలు అందే విధంగా అమలు చేయడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నించింది. ఆ పథకాల ఫలితంగానే 2009లో మహాకూటమిని ఒంటరిగా ఎదుర్కొని వైఎస్ఆర్ నాయకత్వంలోని కాంగ్రెస్ విజయం సాధించింది. 2009 సెప్టెంబర్ 2న ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన తర్వాత రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా మారిపోయినాయి. వైఎస్ఆర్ స్థానంలో రోశయ్య, ఆ తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రులుగా పని చేశారు. 2012 అక్టోబర్ 2న టీడీపీ అధినేత చంద్రబాబు హిందూపురం నుంచి విశాఖపట్టణం వరకూ పాదయాత్ర ప్రారంభించారు. 208 రోజులపాటు సుమారు 2,800 కిలోమీటర్లు నడిచి 2013 ఏప్రిల్ 27న యాత్ర ముగించారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగింది. సార్వత్రిక ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. టీడీపీ గెలిచింది. ఇంతవరకూ ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నాయకులు జరిపిన పాదయాత్రలు ఫలించాయి. చంద్రబాబు పాదయాత్ర ప్రారంభించిన తర్వాత పక్షం రోజులకు, 2012 అక్టోబర్ 18న వైఎస్ఆర్ కుమార్తె షర్మిల ఇడు పులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ పాదయాత్ర మొదలు పెట్టారు. 2013 జులై 29 వరకూ 230 రోజుల పాటు 3112 కిలోమీటర్ల దూరం నడిచి కొత్త రికార్డు నెలకొల్పారు. జగన్ జైలులో ఉన్న కారణంగా ఆయన చెల్లెలు అన్నకు సంఘీభావ సూచనగా ‘మరోప్రజాప్రస్థానం’ పేరుతో ఈ పాదయాత్ర చేశారు. వైఎస్ఆర్సీపీ విజయావకాశాలు పెంపొందించడమే తప్ప తనకు వ్యక్తిగతంగా రాజకీయ ప్రయోజనం ఆశించలేదు కనుక షర్మిల పాదయాత్రకు నిర్దిష్టమైన ఫలితం అంటూ ఉండదు. ఈ పాదయాత్ర ప్రత్యేకతలు ఏమిటి? బుధవారం ముగియనున్న జగన్ పాదయాత్ర ఇంతకు మునుపు జరిగిన పాద యాత్రల కంటే పలు విధాల భిన్నమైనది. తెలుగునాట ఇంతకు పూర్వం పాద యాత్రలో నెలకొల్పిన రికార్డులన్నంటినీ ఇది అధిగమించింది. ఆయన ఇంత వరకూ 338 రోజులపాటు 3,600 కిలోమీటర్ల పైచిలుకు నడిచారు. కాలమూ, దూరంలోనే కాదు ప్రత్యేకత. వైఎస్ పాదయాత్ర చేసిన రోజులలో రాష్ట్రంలో కరువు తాండవించింది. వ్యవసాయదారుల సమస్యలను అధికంగా ప్రస్తావించే వారు. రైతుల రుణమాఫీ, ఉచిత కరెంటు ఇవ్వడం వంటి కార్యక్రమాలు ఆ యాత్ర ఫలితమే. చంద్రబాబు చేసిన ‘వస్తున్నా మీ కోసం’ యాత్రలో రైతుల సమస్యలనూ, ఇతర వర్గాల సమస్యలనూ ప్రస్తావించారు. కానీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోగానే రైతులనూ, పేదలనూ విస్మరించి సింగపూర్ స్వప్నంలో మునిగారు. ఇప్పటికీ తేలలేదు. ఏడు మాసాల పాదయాత్రలో ఆలకించిన విన్నపాల ఆధారంగా ప్రజల ఎజెండా రూపొందించుకొని అమలు పరచవలసిన ముఖ్యమంత్రి సొంత ఎజెండాను తలకెత్తుకున్నారు. బహుశా ప్రజల ఆశలనూ, ఆకాంక్షలనూ చంద్రబాబు పట్టించుకోని ఫలితంగానే జగన్ పాదయాత్రకు జనం తండోపతండాలుగా వస్తున్నారు. ఇదివరకు జరగనట్టు ఈ పాదయాత్రలో భాగంగా ప్రతి రెండు రోజులకూ ఒక బహిరంగసభ జరుగుతోంది. ఇదివరకు ఎరగనట్టు ప్రతి సభకూ ప్రజలు వేల సంఖ్యలో హాజరవుతున్నారు. ఒక పాద యాత్రకు ఇంతమంది ప్రజలు హాజరుకావడం చరిత్ర. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రాష్ట్రం పొడవునా పాదయాత్ర చేయడం ప్రపంచ రికార్డు. బహిరంగ సభలతో పాటు వివిధ కులాలవారూ, వృత్తులవారూ ఆత్మీయసభ లలో జగన్‌ను కలుసుకొని తమ కష్టాలూ, సమస్యలూ చెప్పుకుంటున్నారు. ప్రతి పక్ష నాయకుడు అందరు చెప్పినవీ శ్రద్ధగా ఆలకించి పరిష్కారం సూచిస్తున్నారు. అందరి ఆశీస్సులతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడితే ఈ సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలని అనుకుంటున్నారో చెబుతున్నారు. ఇసుకవేస్తే రాలని జనం ఎందుకు వస్తున్నారు? టీడీపీ ఎన్నికల వాగ్దానాలు సక్రమంగా అమలు జరగడం లేదని ప్రజలు ఆవే శంగా, ఆవేదనతో చెబుతున్న మాటలు స్పష్టం చేస్తున్నాయి. అవే అంశాలు జగన్ ఉపన్యాసాలలో విమర్శనాస్త్రాలుగా వెలువడుతున్నాయి. విమర్శ సూటిగానే, ఘాటుగానే ఉంటున్నది. ప్రత్యర్థిని చులకన చేసి మాట్లాడటం లేదు. ‘ఈ పెద్దమనిషి, చంద్రబాబునాయుడుగారు...’ అంటూనే వాక్యం ప్రారంభం అవు తున్నది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలనూ, ప్రభుత్వ వైఫల్యాలనూ పేర్కొంటూనే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే ఏమి చేయాలని అను కుంటున్నదో కూడా స్పష్టంగా చెబుతున్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం, వైఎస్ఆర్ ఆసరా పథకం కింద డ్వాక్రా మహిళలకు ఉన్న రుణాల మొత్తాన్ని నాలుగు దఫాలుగా వారికే చెల్లించడం, వృద్ధాప్య పింఛన్నూ, వికలాంగులకు ఇచ్చే పింఛన్నూ వెయ్యి నుంచి రెండు వేల రూపాయలకు పెంచడం, పిల్లలను చదివించే తల్లులకు ప్రోత్సాహకాలు అందించే అమ్మఒడి పథకం, పేదలందరికీ ఇళ్ళు, ఆరోగ్యశ్రీకి పూర్వవైభవం, ఫీజు రీయింబర్స్మెంట్, జలయజ్ఞం, దశలవా రీగా మద్యనిషేధం అంటూ నవరత్నాల పేరుమీద తొమ్మిది పథకాలను ప్రధాన ఎజెండాగా ప్రకటించారు. ప్రతిపథకం గురించి వివరంగా చెబుతున్నారు. ఇలా ప్రజల మధ్య నిత్యం ఉండటం,వారి మాటలు వినడం, మాట్లాడటం కంటే ముఖ్యమైన కార్యక్రమం రాజకీయ నాయకులకు ఉండదు. ప్రజల సంక్షేమమే పరమావధి అని భావించే నాయకులకు ఇది మహోపకారం చేస్తుంది. 2009లో తండ్రి ఆకస్మిక మరణం నుంచి నేటి వరకూ ఆయన పట్టుమని వారం రోజులు ఇంటి దగ్గర భార్యాపిల్లలతో కలసి ఉండలేదు. మొదట్లో ఓదార్పు యాత్ర, అనంతరం జైలు జీవితం, ఆ తర్వాత ప్రత్యేకహోదా సాధనకోసం రాష్ట్ర వ్యాప్తంగా సభలు, అటుపిమ్మట పాదయాత్ర. 2018 పూర్తిగా పాదయాత్రలోనే గడిచిపోయింది. వాస్తవానికి ఇది 2017లో ఆరంభమై 2019లో పూర్తవుతున్న చరిత్రాత్మకమైన పాదయాత్ర. ‘ప్రజల సంక్షేమం కోసం నాన్నగారు ఒక అడుగు ముందుకేస్తే మీ జగన్ రెండడుగులు ముందుకేస్తాడు’ అంటూ అడుగడుగునా చెబుతున్న జగన్ 2019లో అద్భుతమైన విజయం సాధిస్తారనడంలో సందేహం ఏ మాత్రం లేదు. ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారు. ప్రజలు ఒకసారి సంకల్పం చెప్పుకున్న తర్వాత ప్రత్యర్థుల ఎత్తుగడలూ, కూడికలూ, తీసివేతలూ, వ్యూహాలూ, ప్రలోభాలూ, కుట్రలూ, ధనప్రవాహాలూ, విషప్రచారాలూ పని చేయవు. 2004లో, 2009లో పని చేయలేదు. ఈసారీ పని చేయవు. గెలిచిన తర్వాత జగన్ ఎట్లా వ్యవహరిస్తారో ప్రజలు పరిశీలిస్తారు. శాసనసభ్యుల చేత రాజీనామా చేయించిన తర్వాతనే పార్టీలో చేర్చుకున్నట్టు, ఆచరణసాధ్యమైన వాగ్దానాలనే ప్రజలకు చేసినట్టు, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నట్టు... ఇదే రక మైన విలువలను అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొనసాగిస్తే, పాద యాత్రలో చేసిన బాసలన్నీ నిలబెట్టుకునే ప్రయత్నం నిజాయితీగా చేయగలిగితే ‘ప్రజాసంకల్పయాత్ర’ పూర్తిగా సార్థకం అవుతుంది. జగన్మోహన్రెడ్డి జన్మ ధన్యమౌతుంది. కె. రామచంద్రమూర్తి -
విజయవాడలో పుస్తక మహోత్సవం
సాక్షి, విజయవాడ: వచ్చే జనవరి 1 నుంచి 11వ తేదీ వరకు నగరంలోని స్వరాజ్ మైదానంలో 30వ పుస్తక మహోత్సం ప్రారంభమవుతుందని, నవ్యాంధ్ర పుస్తక సంబరాల కన్వీనర్ ఎమ్మెస్కో విజయ్ కుమార్ తెలిపారు. పుస్తక మహోత్సవాలకు సంబంధిచి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన చెప్పారు. ఈ ఉత్సవాలను నవ్యాంధ్ర పుస్తక సంబరాలు 2019 పేరుతో నిర్వహిస్తున్నాం. పుస్తక ఉత్సవాలను విజయవాడ బుక్ ఫెస్టివల్, ఎన్టీఆర్ ట్రస్ట్, ఏపీ భాషా సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో నిర్వహిసున్నామని అన్నారు. ఈ పుస్తక ఉత్సవాలను ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు ఆచార్య రాజమోహన్ గాంధీ, ఉషాగాంధీ, ఆచార్య కొలకలూరి నవీన్, ఆచార్య రఘురాజులు ప్రారంభ సభకి హాజరవుతారు. ప్రారంభ సభలో ఆచార్య రాజమోహన్ గాంధీ, ఉషాగాంధీల కీలక ఉపన్యాసాలు ఉంటాయని తెలిపారు. జనవరి 4వ తేదీన పుస్తక ప్రియుల నడక కార్యక్రమంలో సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్ర మూర్తి, ఆంధ్ర జ్యోతి సంపాదకులు, కె.శ్రీనివాస్, ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ లు పాల్గొంటారు. 5వ తేదీన జరిగే సాహితీ సభకు విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ హాజరవుతారని కన్వీనర్ ఎమ్మెస్కో విజయ్ కుమార్ తెలిపారు. -
ఈ పురస్కారం నాకు గర్వకారణం..
సాక్షి, హైదరాబాద్: ‘‘గత శనివారం సైరా షూటింగ్ చాలా ముమ్మరంగా జరుగుతుండటం వల్ల నేను అవార్డ్ ఫంక్షన్‌కు హాజరుకాలేకపోయాను. కానీ నా మీద ఎంతో అభిమానంతో ‘సాక్షి’ చైర్పర్సన్ భారతీగారు అవార్డుని నాకు అందజేయాలనుకోవడం ఆనందంగా ఉంది. ఈ అవార్డును అందజేయటానికి ‘సాక్షి’ సంస్థ ప్రతినిధులు పెద్దలు శ్రీ రామచంద్రమూర్తిగారు, సోదరుడు రామ్‌గారు వచ్చి కలవటం సంతోషంగా ఉంది’’అని నటుడు చిరంజీవి అన్నారు. ‘సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్–2017’కు సంబంధించి బెస్ట్ హీరో అవార్డును చిరంజీవి స్వగృహంలో ఆయనకు బుధవారం అందజేసింది ‘సాక్షి’ మీడియా. ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి, సాక్షి ఫీచర్స్ ఎడిటర్ ప్రియదర్శిని రామ్‌ను చిరంజీవి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ..‘‘భారతీ గారు నాకు సోదరి లాంటి వారు. నా మీద ఎంతో అభిమానంతో అవార్డుతోపాటు ఓ చాక్లెట్ బాక్స్ పంపారు. ఇది ఆమె తియ్యని మనసుకు నిదర్శనం. ‘సాక్షి’ గ్రూప్ వారు గత నాలుగేళ్లుగా ఈ ఎక్స్‌లెన్స్ అవార్డులు ఇస్తున్నారు. గతంలో నేను కూడా ఈ అవార్డు వేడుకల్లో పాల్గొన్నాను. ఆయా రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చిన వాళ్లందరినీ గుర్తించి వారిని ఇలా ప్రోత్సహించటం చాలా గొప్ప విషయం. అవార్డు గ్రహీతలందరికీ నా అభినందనలు. అలాగే జీవిత సాఫల్య పురస్కారాన్ని స్వీకరించిన కృష్ణ, విజయనిర్మల గార్లకు, ఇదే అవార్డును స్వీకరించిన చుక్కా రామయ్య గారికి నా అభినందనలు. ఇదే విధంగా ‘సాక్షి’ ఎల్లప్పుడూ ఔత్సాహికులను ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. నా విషయానికొస్తే అవార్డు నాకు రావటానికి దోహదపడింది ‘ఖైదీ నంబర్ 150’ సినిమా. 9 ఏళ్ల తర్వాత వచ్చిన నా కమ్ బ్యాక్ చిత్రాన్ని ప్రేక్షకులు అద్భుతంగా ఆదరించారు. ఆ విధంగా ప్రజల్లో నా స్థానం సుస్థిరం అని మరోసారి రుజువైంది. వాళ్ల ప్రేమను నిజం చేస్తూ వచ్చిన ఈ అవార్డును అందుకోవటం నాకు గర్వంగా, ఆనందంగా ఉంది’’అన్నారు. సైరా చిత్రం గురించి మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ..‘‘ఇది చాలా మంచి రోజు. నాకు ఈ అవార్డును అందించిన రోజు ఆగస్టు 15. ఈ సందర్భంగా నేను చేస్తున్నది దేశభక్తిని తెలియజేసే సినిమా కావడం చాలా ఆనందంగా ఉంది. స్వాతంత్య్ర సమర యోధుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ జీవితగాధ ఆధారంగా తీస్తున్న సినిమా సైరా. దేశం యావత్తూ గర్వించే గొప్ప సినిమా చరిత్రలో నిలిచిపోతుంది..జైహింద్’’ అంటూ ముగించారు. అవార్డు స్వీకరించిన ఆనందాన్ని మనవరాళ్లు సమార, సంహిత, నివృతితో పంచుకుంటున్న చిరంజీవి -
ఆదివాసీ హక్కులను పరిరక్షించడం అందరి బాధ్యత
-
అరుదైన దార్శనికుడు
దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి 69వ జయంతి ఈ రోజు. రాజకీయవాదులలో, అధికారులలో, జర్నలిస్టులలో, సాధారణ ప్రజలలో అనేకమందికి వైఎస్‌తో ఎవరి అను భవం వారికి ఉన్నది. ఒక్కసారి కలుసుకున్న వ్యక్తి తనకు ఆయనతో ప్రత్యేకమైన అనుబంధం ఉన్నట్టు భావిస్తాడు. అది వైఎస్ వ్యక్తిత్వంలోని విశిష్టత. చిరుమందహాసం, స్నేహశీలత, ఆపన్నులను ఆదుకునే గుణం, పేద ప్రజలకు మేలు చేయాలన్న తపన, మాటకు కట్టుబడే మనస్తత్వం, నమ్ముకున్నవారికి అండగా నిలిచేందుకు ఏ త్యాగానికైనా సిద్ధపడే తెగింపు, మతాలకూ, కులాలకూ అతీతంగా వ్యవ హరించే లౌకిక స్వభావం, నేలవిడిచి సాము చేయని ఆచర ణవాదం, ప్రేమనూ, ఆప్యాయతనూ పంచిపెట్టే ధోరణి వైఎస్‌ను ప్రజానాయకుడిగా నిలబెట్టిన లక్షణాలు. ఈ లక్ష ణాలలో కొన్ని కానీ, అన్నీ కానీ అనుభవంలోకి వచ్చినవారు ఎందరో ఉంటారు. వారంతా వైఎస్ జ్ఞాపకాలను గుండెల్లో పదిలంగా దాచుకుంటారు. ‘ఎంత కాలం బతికామన్నది ముఖ్యం కాదు ఎట్లా బతికామన్నది ప్రధానం’ అని అనేవారు వైఎస్. ఆయన కంటే ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పని చేసినవారు దేశంలో చాలామంది ఉన్నారు. కానీ వైఎస్ అంత వేగంగా, ముమ్మరంగా, ఏకాగ్రచిత్తంతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్ర మాలు అమలు చేసినవారు లేరు. ఒకే ఒక్క పదవీకాలం (5 ఏళ్ళు)లో వైద్యం, విద్య, అభివృద్ధి, సంక్షేమరంగాలలో అనేక కార్యక్రమాలు రూపొందించి, అమలు చేసిన ముఖ్య మంత్రి మరొకరు కనిపించరు. కాసు బ్రహ్మానందరెడ్డి, జలగం వెంగళరావు పరిపాలనాదక్షులుగా పేరు తెచ్చుకు న్నారు. కానీ ప్రజల సంక్షేమానికి వైఎస్ ఇచ్చినంత ప్రాధా న్యం వారు ఇవ్వలేదు. వైఎస్‌లో నాయకత్వ లక్షణాలు జన్మతః వచ్చినవి. గుల్బర్గాలో వైద్యవిద్య అభ్యసిస్తున్న రోజు ల్లోనే విద్యార్థి నాయకుడుగా పేరు. కాంగ్రెస్‌లో స్వయంప్ర కాశం గల నాయకుడిగా, కాంగ్రెస్ ముఖ్యమంత్రుల ప్రత్య ర్థిగా పాతికేళ్లపాటు మనగలగడం సామాన్యమైన విషయం కాదు. 1978 నుంచి 2009 వరకూ 31 ఏళ్ల పాటు అన్ని ఎన్ని కలలోనూ విజయం సాధించిన నాయకుడు. కాంగ్రెస్‌లో నాయకుడిగా నిలదొక్కుకోవాలంటే సాటి నాయకులతో పోటీ పడటమే కాకుండా అధిష్ఠాన దేవతలను ప్రసన్నం చేసుకోవాలి. అసమ్మతి నాయకులను కాచుకోవాలి. తన ఆర్థిక మూలాలను విధ్వంసం చేయడానికి ప్రయత్నించే సొంత పార్టీ ముఖ్యమంత్రులను ఎదుర్కొని నిలబడటానికి ఎంతో గుండెధైర్యం కావాలి. చాడీలు చెప్పేవారికి చెవి ఒగ్గే అధిష్ఠానం ఎప్పుడు ఆగ్రహిస్తుందో, ఎప్పుడు అనుగ్రహి స్తుందో తెలియని వాతావరణంలో మంచి రోజులకోసం, అనుకూల వాతావరణం కోసం ఏళ్ళ తరబడి ఎదురు చూడ టానికి ఎంతో ఓర్పూ, నేర్పూ అవసరం. ‘తెలుగుదేశం’ లాగానే ప్రాంతీయపార్టీ పెట్టాలని కొందరు సన్నిహితులు సలహా చెప్పినా కాంగ్రెస్‌ని వీడటానికి వైఎస్ అంగీకరించ లేదు. ముప్పయ్ అయిదేళ్ళకే పీసీసీ అధ్యక్ష పదవి వరిస్తే పార్టీలో ప్రత్యర్థులు ఈర్ష్యపడ్డారు. చిన్నతనంలోనే ముఖ్య మంత్రి అయిపోతారేమోనని కంగారు పడ్డారు. చొక్కారావు, ద్రోణంరాజు సత్యనారాయణ వంటి సీనియర్లు వైఎస్‌కు అండగా ఉండేవారు. పీవీ, కోట్ల విజయభాస్కరరెడ్డి వంటి వారు ఆయనను ఆణచివేయడానికి ప్రయత్నం చేశారు. 2003లో పాదయాత్ర చేసినప్పుడు కూడా పార్టీలో ప్రత్య ర్థులు ఆయనతో సహకరించలేదు. ఉడుక్కున్నారు. మండు టెండను లెక్కపెట్టకుండా నడుచుకుంటూ వచ్చి తమ యోగ క్షేమాలను విచారిస్తున్న వైఎస్‌ను ప్రజలు ఆదరించారు. పశ్చిమగోదావరి నుంచి రైల్–రోడ్డు బ్రిడ్జి దాటి తూర్పు గోదావరిలో ప్రవేశించే సరికి వైఎస్‌కి అనుకూలంగా ప్రభం జనం ఆరంభమైంది. పాదయాత్ర వైఎస్‌ను పూర్తిగా మార్చి వేసింది. పేదరికాన్నీ, పేద ప్రజల కష్టాలనూ స్వయంగా చూసి తెలుసుకున్నారు. పగలకూ, పంతాలకూ స్వస్తి చెప్పి ప్రజలకు హృదయపూర్వకంగా సేవ చేసి తరించాలని తీర్మా నించుకున్నారు. తన కోపం నరం తెగిపోయిందంటూ చెప్పే వారు. 2004 ఎన్నికలలో ఘనవిజయం సాధించారు. ఎన్నో సంవత్సరాలు ఎంతో ఓపికతో వేచి చూసిన అవకాశం వచ్చిన వెంటనే విజృంభించి ఆరేళ్ళ కంటే తక్కువ వ్యవ ధిలో ఇరవై ఏళ్లలో చేయగలిగిన మేలు చేయడానికి విశ్వ ప్రయత్నం చేశారు. ఎవరో తరుముతున్నట్టు పథకాలు ప్రక టించి అమలు చేశారు. వంట గ్యాస్‌పై సబ్సిడీ ఇచ్చారు. ప్రతి కుటుంబంలో అందరికీ ఏదో ఒక విధమైన లబ్ధి చేకూ రింది. అయిదుగురు మహిళలకు కేబినెట్లో స్థానం కల్పిం చడమే కాకుండా మంచిశాఖలు అప్పగించారు. వారు కూడా సమర్థంగా నిర్వహించారు. మహిళలు మనసు పెట్టి పని చేస్తారనీ, వారిలో నిర్వహణ సామర్థ్యం ఉంటుందనీ ఆయన నమ్మకం. రాజకీయంగా ఎంత చతురతతో వ్యవహరిం చారో పరిపాలనా ర థాన్ని అంతే వేగంగా నడిపించారు. నాయకత్వ లక్షణాలు నిజమైన ప్రజానాయకుడికి ఉండవలసిన లక్షణాలేమిటి? ‘మీకు అండగా నేనున్నాను’ అన్న భరోసా ప్రజలకివ్వడం. సహచరులూ, అనుచరులూ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేనికీ వెనకాడకుండా లేకుండా ఆదుకోవడం. వాగ్దానాలను అమ లుచేయడానికి మనస్పూర్తిగా, నిజాయతీగా, నిబద్ధతతో కృషి చేయడం. ప్రజల ప్రగతి పట్ల, వారి అవసరాల పట్ల సంపూర్ణమైన అవగాహన కలిగి ఉండటం. దృఢమైన నిర్ణ యాలు తీసుకోవడం, వాటికి కట్టుబడి ఉండటం. ప్రజా సంక్షేమం కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధపడటం. సంక్షేమ, ప్రగతి లక్ష్యాలను నిర్దేశించుకోవడంలో, వాటిని సాధించడంలో క్షేత్రవాస్తవికతను దృష్టిలో పెట్టుకొని, సాహ సోపేతమైన, సృజనాత్మకమైన కార్యక్రమాలు రూపొందిం చుకొని భవిష్యత్ చిత్రపటాన్ని నిర్ణయించుకోవడం. దూర దృష్టితో అభివృద్ధికి ప్రణాళికా రచన చేసిన రాజకీయవాదే రాజనీతిజ్ఞుడిగా చరిత్రలో నిలిచిపోతారు. కొత్తబాటలో మేలు చేయాలని ప్రయత్నించిన నాయకులను చరిత్రకా రులు నిశ్చయంగా గుర్తిస్తారు. వైఎస్ ప్రభావం ఆయన కుటుంబం మొత్తంపైన ఉన్నది. ఆయన కుటుంబంలోని నలుగురు సభ్యులలో ముగ్గురు (ఆయనా, కుమార్తె షర్మిల, కుమారుడు జగన్మోహన్రెడ్డి) వేల కిలోమీటర్లు పాద యాత్ర చేయడం, ప్రజలతో మమేకం కావడం ప్రపంచం లోనే అపూర్వమైన విషయం. దళితులకూ, వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేయడానికి ఇందిరాగాంధీ, ఎన్టిఆర్, పీవీ చేసిన ప్రయత్నాన్ని ఎవ్వరూ కాదనలేరు. దళితులలో ఆత్మవిశ్వాసం ప్రోదిచేయడానికి ఇందిరాగాంధీ చేసిన చట్టాలూ, చేపట్టిన కార్యక్రమాలూ చరిత్రాత్మకమైనవి. వెను కబడిన కులాలకు ఎన్‌టి రామారావు విశేషంగా రాజకీ యంగా గుర్తింపు ఇచ్చారు. భూసంస్కరణల అమలుకూ, 1972 ఎన్నికలలో బీసీలకు అత్యధికంగా కాంగ్రెస్ టిక్కెట్లు కేటాయించేందుకూ, ప్రధానిగా ఆర్థిక సంస్కరణలు అమలు చేసేందుకూ పీవీ ప్రదర్శించిన తెగువను వర్తమాన రాజకీ యవాదులు పరిగణనలోకి తీసుకోకపోవచ్చును. కానీ చరిత్ర ఎప్పటికైనా నమోదు చేస్తుంది. అలాగే ఈ దేశంలో నక్సలైట్లతో చర్చలు జరిపిన ఒకే ఒక రాష్ట్రప్రభుత్వంగా వైఎస్ నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిలుస్తుంది. సాచ్యురేషన్ విధానం అందరికీ వైద్య హామీ ఇచ్చే ఉద్దేశంతో ‘ఆరోగ్యశ్రీ’, విద్యా వకాశాలు కల్పించేందుకు ఫీజు చెల్లింపు పథకం (ఫీజు రీయింబర్స్మెంట్), పేదలకూ, దళితులకూ భూపంపిణీ వంటి కార్యక్రమాలను పార్టీలకూ, ప్రాంతాలకూ, కులా లకూ, మతాలకూ అతీతంగా అమలు చేసిన ఘనత వైఎస్‌ది. ఎవరికి సంక్షేమ పథకం వర్తింపజేయాలో, ఎవరికి చేయకూడదో నిర్ణయించే జన్మభూమి కమిటీల వంటి దుర్మా ర్గపు వ్యవస్థ వైఎస్ హయాంలో లేదు. అన్ని సంక్షేమపథకాల అమలులో ‘సాచ్యురేషన్’ (అవసరం ఉన్న అందరికీ నూటికి నూరుపాళ్ళూ అనుభవంలోకి రావాలి) అనేది వైఎస్ అమలు చేసిన విధానం. నిరుపేద ముస్లిం యువతకు విద్యా ఉద్యోగావకాశాల్లో 4 శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఈ దేశానికి వ్యవసాయం వెన్నెముక అనే స్పష్టమైన అవగాహన ఉన్న నాయకుడు కనుకనే వ్యవసాయానికి సాగునీరు ప్రధా నమని గుర్తించి జలయజ్ఞం ఆరంభించారు. పదవీ కాలాన్ని మృత్యువు కాటేసిన కారణంగా వైఎస్ తలపెట్టిన పెద్ద ప్రాజెక్టులు పూర్తి కాలేదు. ఈ రంగంలో ఏ ప్రభుత్వం ఏమి చేసినా వైఎస్ స్వప్నం కొనసాగింపే. ఆంధ్రప్రదేశ్‌లో పోల వరం బహుళార్థసాధక ప్రాజెక్టు అయినా, తెలంగాణలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయినా వైఎస్ సంకల్పిం చిన జలయజ్ఞంలో భాగమే. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రీఇంజనీరింగ్ ద్వారా ప్రాజెక్టు పరిణామాన్నీ, విస్తృతినీ పెంచారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ పాటికి పూర్తి కావలసిన పోలవరం ప్రాజెక్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో ఊపిరాడక చాలా కాలం అచేతనంగా ఉంది. ఈ మధ్యనే పనులు జరుగుతున్నాయి. వైఎస్ అకాల మరణం చెందకుండా ఉంటే 2014 నాటికే జలయజ్ఞంలో సింహభాగం పూర్తి అయ్యేది. వైఎస్ మొట్టమొదట ముఖ్య మంత్రిగా ప్రమాణం స్వీకరించిన వెంటనే సంతకం చేసిన ఫైలు ఉచిత విద్యుత్ రైతులకు సంబంధించింది కావడం విశేషం. అలాగే రైతు రుణమాఫీ అమలుచేశారు. ఆహారధా న్యాలకు కేంద్రం నిర్ణయించిన సబ్సిడీకి మరికొంత జోడిం చారు. దళితులకు సబ్‌ప్లాన్ ఉండాలనే ప్రతిపాదనను మన స్ఫూర్తిగా ప్రోత్సహించారు. నేను సంపాదకుడిగా ఉండగా ‘వార్త’ లో 2001లో మల్లెపల్లి లక్ష్మయ్య సబ్‌ప్లాన్‌పై రాసిన వ్యాసాన్ని ప్రతిపక్ష నేత హోదాలో శాసనసభలో పూర్తిగా చదివి వినిపించారు. బిట్స్ పిలానీ, ఐఐటీ వంటి ప్రతి ష్ఠాత్మకమైన విద్యా సంస్థలను తీసుకురావడంలో వైఎస్ పాత్ర అద్వితీయమైనది. వైఎస్ హయాంలో వర్షాలు దండిగా కురిసేవి. సమాచార సాంకేతిక (ఐటీ) రంగం వృద్ధితో ఆర్థిక వ్యవస్థ బలపడింది. కాంగ్రెస్‌కు తీరని లోటు వైఎస్ అస్తమయం తెలుగువారి రాజకీయాలలో పెనుమా ర్పులు సృష్టించింది. వైఎస్ ముఖ్యమంత్రిగా కొనసాగి ఉంటే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం బలహీనమై ఉండేదని ఇప్పటికీ కొందరు వాదిస్తారు. అక్కడ కూడా అభివృద్ధికి బాటలు వేస్తే ప్రత్యేకవాదం బలహీనపడుతుందని ఆయన భావించేవారు. రాజకీయ ఎత్తుగడలతో పాటు ప్రగతి పథ కాల ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని ఎదుర్కోవాలని ప్రయ త్నించారు. వైఎస్ సజీవంగా ఉంటే కాంగ్రెస్ ఇంతటి దీనా వస్థలో ఉండేది కాదు. ముగ్గురు మిత్రులు–వైఎస్, రాజేశ్ పైలెట్, మాధవరావ్ సింధియా– ఈ రోజున మన మధ్య ఉంటే కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాకు సైతం నోచుకోని దుస్థితి దాపురించేది కాదు. దురదృష్టవశాత్తు ముగ్గురూ ప్రమాదా లలో మృతి చెందారు. 2000 జూన్ 11న దౌసా నుంచి జైపూ ర్కు వస్తూ తాను నడుపుతున్న జీపు ఆర్టీసీ బస్సును ఢీకొ నడంతో పైలట్ మరణించారు. 2001 సెప్టెంబర్ 30న కాన్పూర్ వెడుతున్న ప్రత్యేక విమానం ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి దగ్గర కూలి సింధియా దుర్మరణం పాలైనారు. 2009 సెప్టెంబర్ రెండున హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ చనిపోయారు. ముగ్గురూ జనబలం ఉన్న నేతలే. సోని యాకు అండదండలు సమకూర్చగల చేవ ఉన్న నాయకులే. అటువంటి శక్తిమంతులు ఇప్పుడు కాంగ్రెస్‌లో లేరు. దేశం అంతటా వెతికితే వారితో ఎంతోకొంత పోల్చదగిన నాయ కుడు పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్‌సింగ్ ఒక్కరే కనిపిస్తారు. కాంగ్రెస్ అధిష్ఠానం అభీష్టానికి భిన్నంగా 2009 నాటి ఎన్నికలలో టీఆర్ఎస్తో పొత్తుపెట్టుకోకుండా ఒంటరిగా పోరాడి 33 మంది లోక్‌సభ సభ్యులను గెలిపించిన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తన వాదనలో నిజంగానే పస ఉన్నట్టు నిరూపించారు. సమాజం, పేద ప్రజలు, రైతులు, గ్రామ సీమలు, రచ్చబండ గురించి మనసు పెట్టి ఆలోచించే పాత తరానికి చెందిన కాంగ్రెస్ నాయకుల పరంపరలో వైఎస్ చిట్టచివరి నేత. అటువంటి దార్శనికుడూ, జనరంజకుడూ, సమర్థుడెన రాజకీయ నాయకుడూ, పరిపాలనాదక్షుడూ, సిసలైన ప్రజానాయకుడూ చరిత్రలో అత్యంత అరుదుగా మాత్రమే కనిపిస్తారు. కె. రామచంద్రమూర్తి -
అటో, ఇటో, ఎటో...!
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ కుమార్ ముఖర్జీకి ప్రధాని కావాలనే ఆకాంక్ష ఉన్నదా? కుమార్తె శర్మిష్ఠను బీజేపీలో చేర్చి, 2019 ఎన్నికలలో ఢిల్లీ నుంచి లోక్‌సభకు పోటీ చేయించి, ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రిగా నియమిస్తామని ఆయనకు బీజేపీ అధినాయకత్వం హామీ ఇచ్చిందా? రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అధినేత మోహన్ భాగవత్ ఆహ్వానం మన్నించి గురువారం నాగపూర్‌లో సుదీర్ఘకాలం ప్రచారక్ శిక్షణ పొందినవారిని ఉద్దేశించి ప్రసంగించడానికి ప్రణబ్‌దా వెళ్ళడం కొందరికి సంతోషం కలిగించింది. మరికొందరికి ఖేదం కలిగించింది. అందరికీ ఆశ్చర్యం కలిగించింది. సీనియర్ కాంగ్రెస్ నేతలు ఆనందశర్మ, మనీష్ తివారీ నాగపూర్ వెళ్ళడానికి మాజీ రాష్ట్రపతి అంగీకరించడాన్ని తప్పుపట్టారు. వెళ్లినా వారి తప్పులను ఎత్తిచూపండని చిదంబరం చెప్పారు. పార్టీ అధిష్ఠానం మాత్రం వేచి చూసే ధోరణిని ఆశ్రయించింది. కాకలు తీరిన కాంగ్రెస్‌వాది దాదాపు అర్ధశతాబ్ది కాంగ్రెస్‌తో మమేకమైన ప్రణబ్ ముఖర్జీ నాగపూర్ వెళ్ళడమే విశేషం. పండిట్ నెహ్రూ భావ జాలాన్ని గుండె నిండా నింపుకున్న ప్రణబ్ అందుకు విరు ద్ధమైన ఆదర్శాలను ఆరాధించే ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాల యాన్ని సందర్శించడం అంటే దానికి గౌరవం ఆపాదించడమే. ఆ సంస్థను ప్రధాన స్రవంతికి చేరువ చేయడమే. ఆర్ఎస్ఎస్ను నిషేధించిన 1975 నాటి ఇందిరాగాంధీ మంత్రివర్గంలోనూ, 1992 నాటి పీవీ నరసింహారావు ప్రభుత్వంలోనూ ప్రణబ్ సభ్యుడుగా ఉన్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ఖండిస్తూ ఏఐసీసీ ఆమోదించిన అనేక తీర్మానాల దస్తూరీ ఆయనదే. దైవభక్తి కలిగిన హిందువు అయినా లౌకికవాదంతో ఎన్నడూ రాజీపడని రాజకీయ వేత్త. ఆమధ్య దాద్రీలో మహమ్మద్ అఖ్లాక్ హత్యనూ, దేశంలో పెచ్చరిల్లుతున్న అసహన ధోరణులనూ నిర్ద్వంద్వంగా ఖండించిన నాయకుడు. ఆర్ఎస్ఎస్ పట్ల తన వ్యతిరేకతను దాచుకోవడానికి ఎన్నడూ ప్రయత్నించని నూటికి నూరు పాళ్ళు కాంగ్రెస్‌వాది ఆయన. అటువంటి వ్యక్తి ఆర్ఎస్ఎస్ వేదికను సర్సంఘ్చాలక్ మోహన్ భాగవత్‌తో పంచుకోవడం, వారి కార్యకర్తల కవాతు తిలకించడం, సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ కేశవ్ బలిరాం హెడ్గేవార్ను భరతమాత వరిష్ఠ పుత్రుడంటూ అభివర్ణించడం కాంగ్రెస్‌వాదులను ఆందోళనకు గురి చేసింది. మహాత్మా గాంధీని హత్య చేసింది ఆర్ఎస్ఎస్ కార్యకర్తేనంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పదేపదే ఆరోపిస్తున్న సమయంలో కాంగ్రెస్‌కి చెందిన అతి పెద్ద రాజనీతిజ్ఞుడు నాగపూర్ సందర్శించడం సంచలనాత్మకమైన ఘట్టమే. ప్రధాని నరేంద్రమోదీ కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రతిసారీ ప్రతివిమర్శ చేస్తూ వస్తున్న రాహుల్ ఇటీవలి కాలంలో స్వరం పెంచడం, ఆరోపణలలోని తీవ్రతను హెచ్చించడం, బీజేపీ నాయకులు అంతకంటే బిగ్గరగా, కటువుగా తిరుగు దాడి చేయడం, ఫలితంగా రాజకీయ వాతావరణమే వేడెక్కిపోవడం వల్ల ప్రత్యర్థులు కలుసుకొని మాట్లాడుకోవడం అన్నది అసంభవంగా కనిపిస్తున్న రోజులలో ప్రణబ్‌ను భాగవత్ నాగపూర్‌కు ఆహ్వానించడం శుభపరిణామం. ఆర్ఎస్ఎస్ను ఎంత వ్యతిరేకించినా ఆ సంస్థ ప్రతినిధు లతో మాట్లాడటానికి కాంగ్రెస్ నాయకులు ఎవ్వరూ నిరా కరించేవారు కాదు. 22 రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బీజేపీకి మార్గదర్శనం చేస్తున్న ఆర్ఎస్ఎస్ ఉనికిని గుర్తిం చకపోవడం, ఆ సంస్థ ప్రతినిధులతో సమాలోచనలు జరపడానికి నిరాకరించడం పరిణతి లేని రాజకీయం. గాంధీ–నెహ్రూ వంశం వ్యతిరేకత ఒక అధ్యాపకుడుగా జీవితం ప్రారంభించి, రాజకీయాలలో ప్రవేశించి, కేంద్రంలో మంత్రి పదవులు అనేకం నిర్వహించి, అత్యున్నత రాజ్యాంగ పదవిని అధిష్ఠించిన ప్రణబ్ ముఖర్జీ కేవలం కాంగ్రెస్ నాయకుడు కాదు. పార్టీలకు అతీతంగా అన్ని పక్షాలనూ కలుపుకొని పోతూ సమాజ హితం కోసం పరిశ్రమించే రాజనీతిజ్ఞుడు. కొడుకూ, కూతురూ విభేదించినా లెక్క చేయకుండా ప్రణబ్‌దా నాగపూర్ సందర్శించడం సరైన నిర్ణయం. నాగపూర్ సందర్శన వెనుక రాజకీయ లక్ష్యం ఉన్నదంటూ మీడియాలో, రాజకీయవర్గాలలో ఊహాగానాలు ప్రచారం కావడానికి నేపథ్యం ఉంది. 1984లో సిక్కు అంగరక్షకులు నాటి ప్రధాని ఇందిరాగాంధీని హత్య చేసినప్పుడు తనకు ప్రధాని పదవి ఇస్తారని ప్రణబ్ ముఖర్జీ ఆశించారు. అటువంటి ఆలోచన చేయడమే నేరంగా గాంధీ–నెహ్రూ కుటుంబం భావించింది. ప్రణబ్దాను పక్కన పెట్టింది. ఆయన కాంగ్రెస్ నుంచి నిష్క్రమించి కొత్తపార్టీ పెట్టి చేయి కాల్చుకున్నారు. 1991లో పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్‌లో ప్రణబ్ ముఖర్జీ పునరావాసం సంపూర్ణంగా జరిగింది. 2004లో కాంగ్రెస్ నాయకత్వంలో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ (యూపీఏ) ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం వచ్చింది. ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలపైన చర్చించడానికి రావలసిందిగా సోనియాగాంధీని రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆహ్వానించారు. అంతలోనే డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి పితలాటకం కారణంగా ఆమెతో ప్రమాణం చేయించడానికి కలాం సంకోచించారు. ఆ విషయం సోనియాకు ఒక లేఖ ద్వారా కలాం తెలియజేశారని సుబ్రహ్మణ్యస్వామి అంటారు. మొత్తంమీద తాను ప్రధాని పదవీ బాధ్యతలు స్వీకరించరాదని సోనియా నిర్ణయించారు. పదవీత్యాగం పేరుతో నాటకీయ సన్నివేశాలు కాంగ్రెస్ హృదయాలను పిండివేసిన అనంతరం యూపీఏ ప్రధానిగా మన్మోహన్సింగ్ను సోనియాగాంధీ నియమించారు. ఆర్థికమంత్రి హోదాలో మన్మోహన్‌ను రిజర్వుబ్యాంకు గవర్నర్‌గా నియమించిన ప్రణబ్‌కు మరోసారి ఆశాభంగం తప్పలేదు. 2007లోనే సోనియా సమ్మతిస్తే ఆయన రాష్ట్రపతి అయ్యేవారు. ఆమె ససేమిరా అన్నారు. 2011–12లో యూపీఏ సర్కారుపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తినప్పుడు మన్మోహన్‌ను తప్పించి ప్రణబ్‌కు బాధ్యతలు అప్పగించాలనే సూచనలు బలంగా వచ్చాయి. కానీ సోనియా ఒప్పుకోలేదు. ఆ తర్వాత రాష్ట్రపతి చేయడానికి సోనియా సమ్మతించక తప్ప లేదు. సోనియా తన పట్ల సుముఖంగా లేరనే అవగాహన తోనే 1998 నుంచి రాష్ట్రపతిగా ఎన్నికయ్యేవరకూ ఆమె నాయకత్వంలోని కాంగ్రెస్‌లో ప్రణబ్ కొనసాగారు. ఈ నేపథ్యంలో ప్రణబ్ ప్రధాని కావడానికి అవకాశం అంటూ ఉంటేగింటే అది బీజేపీ సహకారంతోనే సాధ్యం. ప్రణబ్‌కూ, మోదీకీ మంచి సంబంధాలు ఉన్నాయి. ఉప రాష్ట్రపతిగా పదవీవిరమణ చేసిన సందర్భంలో హమీద్ అన్సారీని మోదీ సూటిపోటి మాటలు అన్నారు కానీ ప్రణబ్‌ను పల్లెత్తు మాట అనకపోగా చాలా గౌరవంగా చూసేవారు. ఆయనను ‘గార్డియన్’గా అభివర్ణించారు. మోదీ అయినా, మరొకరైనా ఆర్ఎస్ఎస్ ఆశీస్సులు ఉంటేనే ప్రధాని పదవిలో ఉంటారనే వాస్తవం ప్రణబ్‌కూ తెలుసు. వచ్చే సంవత్సరం జరిగే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీకి మెజారిటీ లభించపోతే, 200లకు సమీపంలో లోక్‌సభ స్థానాలు దక్కితే ఎన్డీఏ–3 ఏర్పాటు చేయడానికి అత్యధిక ప్రాంతీయ పార్టీలకు ఆమోదయోగ్యుడైన నాయకుడు అవ సరం. మోదీని చాలామంది ప్రాంతీయ నాయకులు వ్యతిరే కిస్తారు. సంకీర్ణధర్మాన్ని నెరవేర్చడానికి అవసరమైన ఓర్పూ, నేర్పూ మోదీకి లేవనే అభిప్రాయం సర్వత్రా ఉంది. అటువంటి ప్రత్యేక సందర్భం ఏదైనా తారసిల్లితే ఎన్డీ ఏ–3 ప్రధాని అభ్యర్థిగా ప్రణబ్‌దా పేరును పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ప్రతిపాదిస్తే, ఆర్ఎస్ఎస్ ఆమోదించవచ్చు. ఆ విధంగా ప్రణబ్ చిరకాలవాంఛ తీరవచ్చు. అనేక పరిస్థితులు కలసివస్తేనే అటువంటి అవకాశం లభిస్తుంది. రాజకీయాలలో ఏదైనా సంభవమే. మలేసియా ప్రధానిగా 92 సంవత్సరాల మహతీర్ మహమ్మద్ బాధ్య తలు స్వీకరించగా లేనిది 82 ఏళ్ళ ప్రణబ్ ప్రధాని కావాలని కోరుకోవడంలో తప్పేముంది? ప్రణబ్ అంతరంగం ఏమిటో తెలియదు కానీ ఒక వాదనగా ఇది సమంజంగానే వినిపిస్తుంది. అందరికీ ఆనందం ప్రణబ్ చేసిన ప్రసంగంలో ఆర్ఎస్ఎస్కు దగ్గరైనట్టు కనిపించే ధోరణులు ఏమైనా ఉన్నాయా? దీనికి స్పష్టమైన సమాచారం చెప్పడం కష్టం. ఇరు పక్షాలనూ సంతోష పెట్టారని చెప్పవచ్చు. అస్పష్ట రాజకీయ విన్యాసాలు చేయడంలో ప్రణబ్ బహునేర్పరి. గాంధీ–నెహ్రూ వంశం వ్యతిరేకత సహా అనేక అవాంతరాలను అధిగమిస్తూ రాజకీయ ప్రస్థానం చేసిన వ్యక్తికి ఎంత సహనం, ఎంత ప్రావీణ్యం, ఎంత గడుసుదనం, ఎంత పట్టుదల ఉండాలో ఊహించుకోవచ్చు. నాగపూర్ ప్రయాణానికి ముందు ప్రణబ్‌ని విమర్శించిన సీనియర్ కాంగ్రెస్ నేతలు ఆ తర్వాత ప్రశంసించడం మొదలు పెట్టారు–ఒక్క మనీష్ తివారీ తప్ప. లౌకికవాదాన్నీ, భిన్నత్వంలో ఏకత్వాన్నీ, బహుళత్వాన్నీ, సహనాన్నీ పరిపాలనలో అనివార్యమైన అంశాలుగా స్పష్టంగా చెప్పినందుకు కాంగ్రెస్‌వాదులు సంతోషించారు. సంఘ్ పరివారం తరచుగా విమర్శించే నెహ్రూ దార్శనికత గురించి మాట్లాడినందుకు ఆనందించారు. ప్రత్యర్థులతో సమాలోచన జరపడం, చర్చాగోష్ఠులు నిర్వహించడం (ఎంగేజ్మెంట్, డైలాగ్, డిబేట్) అత్యవసరమని ఉద్ఘాటించడం వారికి నచ్చింది. పేదరికాన్ని, అనారోగ్యాన్నీ, లేమినీ పారదోలాలనీ, ప్రగతినీ, సామరస్యాన్నీ, సంతోషాన్నీ పెంపొందించాలనీ ఎన్డీఏ ప్రభుత్వానికి పరోక్షంగా ప్రబోధించారు. ఇవన్నీ కాంగ్రెస్ నాయకత్వానికి సంతృప్తి కలి గించాయి. భాగవత్ ప్రణబ్‌కి స్వాగతం చెప్పిన తీరునూ, హెడ్గేవార్ను మాజీ రాష్ట్రపతి కీర్తించడాన్నీ, జాతి, జాతీయత, దేశభక్తి (నేషన్, నేషనలిజం, పేట్రియాటిజం) అనే మాటలకు ప్రణబ్ చెప్పిన నిర్వచనాలు భాగవత్ నిర్వచనాలను పోలి ఉండటాన్నీ తమకు సానుకూలమైన అంశాలుగా నందకుమార్ వంటి సీనియర్ సంఘపరివారం నాయకులు భావిస్తున్నారు. అయిదు వేల సంవత్సరాల చరిత్రను రేఖామాత్రంగా చెబుతూ, బౌద్ధం పరిఢవిల్లిన కాలాన్ని ప్రస్తావించారు. చంద్రగుప్త మౌర్యుడూ, అశోకుడి వరకూ నెహ్రూ చెప్పిన చరిత్రను అనుసరించారు. ఆ తర్వాత ఆ దృక్కోణం మరుగున పడింది. మహమ్మదీ యుల దండయాత్రలను క్లుప్తంగా చెప్పారు. నెహ్రూ విశేషంగా వివరించిన అక్బర్ మతసహనం గురించి ప్రణబ్ మాట్లాడలేదు. రాజ్యాంగాన్ని ప్రశంసించారు కానీ అంబేడ్కర్‌ను ప్రస్తావించలేదు. ఇప్పుడు అంబేడ్కర్‌ని ప్రస్తుతించినా ఎవ్వరికీ అభ్యంతరం లేదు. అది వేరే విషయం. గాంధీని గాడ్సే హత్య చేసిన ఉదంతాన్ని దాటవేశారు. బాబరీ మసీదు విధ్వంసాన్నీ, అనంతరం దేశవ్యాప్తంగా జరిగిన మతకలహాలనూ, హింసాకాండనూ ప్రస్తావించ లేదు. అందువల్ల సంఘపరివారం సైతం సంతోషంగా ఉంది. ఇటీవలి చరిత్రలో ప్రణబ్‌దా పోషించినటువంటి పాత్రనే బీజేపీ అగ్రనేత లాల్‌కృష్ణ అడ్వాణీ నిర్వహించి మూల్యం చెల్లించిన సంగతి ఈ సందర్భంగా గుర్తురాక మానదు. 2005లో అడ్వాణీ పాకిస్తాన్ సందర్శించి కరాచీలో మహమ్మదలీ జిన్నా సమాధిని చూసిన తర్వాత జిన్నాను లౌకికవాది అంటూ ప్రశంసించారు. పాకిస్తాన్ నిర్మాత జిన్నా లౌకికవాదిగా ఉండేవారనీ, ఇరుకు మనస్తత్వం కలిగిన మతవాది కారనీ అప్పుడు పాకిస్తాన్లో ఇస్లామిక్ ప్రభుత్వం నడుపుతున్న జనరల్ ముషారఫ్‌కు చెప్పాలని అడ్వాణీ ఉద్దేశం. కానీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు అపార్థం చేసుకొని, ఆయనను దేశద్రోహి అంటూ నిందించి పక్కన పెట్టారు. అటువంటి ప్రమాదాన్ని ప్రణబ్‌దా తప్పించుకున్నారు. అటు బీజేపీకీ, ఇటు కాంగ్రెస్కీ ఆనందం కలిగించే విధంగా ప్రసంగించారు. ఆర్ఎస్ఎస్కు చెప్పవలసిన పాఠాలు చెప్పారు. అభ్యంతరకరమైన అంశాలను ప్రస్తావించకుండా దాటవేశారు. నెహ్రూ నుంచి గోల్వాల్కర్ వైపు కొన్ని అడుగులు వేశారు. కానీ నెహ్రూ భావజాల పరిధిని పూర్తిగా దాటలేదు. నెహ్రూ, హెడ్గేవార్ వంటి పరస్పర విరుద్ధమైన వ్యక్తిత్వాల మధ్య సమన్వయం అసాధ్యం. ఆ ప్రయత్నం చేయకుండానే ఇద్దరి అభిమానులనూ మెప్పించే విధంగా ప్రసంగించారు. భవిష్యత్తులో అవసరమైతే, అవకాశం దొరికితే పదవీరాజకీయ విన్యాసాలకు కావలసిన వెసులుబాటు మిగుల్చుకున్నారు. అందుకే ఆయనను ఎవ్వరికీ అందని మేధావి అంటారు. - కె. రామచంద్రమూర్తి -
రామచంద్రమూర్తికి ఆత్మీయ సమ్మేళనం
-
‘ప్రజల మనిషి రామచంద్రమూర్తి’
సాక్షి, హైదరాబాద్: సుమారు ఐదు దశాబ్దాల పాటు ప్రజల పక్షాన నిలిచి పాలకులకు వాస్తవాలను తెలియజెప్పిన మహోన్నత వ్యక్తి ‘సాక్షి’ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి అని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ కొనియాడారు. రామచంద్రమూర్తి 70వ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని సీనియర్ పాత్రికేయులు, బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి మల్లెపల్లి లక్ష్మయ్య, ఎమెస్కో విజయ్ కుమార్ల ఆధ్వర్యంలో ఆదివారం పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. మూర్తికి సామాజిక బాధ్యత ఎక్కువ అని, తెలంగాణ ఉద్యమం సమయంలో రెండు ప్రాంతాల మధ్య విద్వేషాలు తలెత్తకుండా నిర్వహించిన ‘దశ దిశ’కార్యక్రమం అత్యున్నతమైందని పేర్కొన్నారు. మారుతున్న సమాజంలో నిజాయితీతో పనిచేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జర్నలిజాన్ని వృత్తిగానే కాకుండా ప్రవృత్తిగా మార్చుకున్న గొప్ప వ్యక్తి రామచంద్రమూర్తి అని, ఆయన ఓ విశ్వవిద్యాలయం లాంటివారని అన్నారు. ముక్కుసూటిగా చెప్పడం, నిరాడంబరత నైజమని పేర్కొన్నారు. గంభీర పరిస్థితుల్లోనూ తొణకని మనస్తత్వం ఆయనదని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. సమస్యలను పరిష్కరించే కోణంలో అన్ని రకాల భావజాలం కలిగిన వ్యక్తులతో సయోధ్య, చర్చకు వీలు కల్పించిన నేర్పు, ఓర్పు రామచంద్రమూర్తి సొంతమని కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి ప్రశంసించారు. అనేక సంక్లిష్ట పరిస్థితులను నిబ్బరంగా ఎదుర్కొన్న విశిష్ట వ్యక్తిత్వం ఆయనదని టీఎస్పీఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణి అన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ఏర్పాటుకు ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఎనలేనిదని అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో రామచంద్రమూర్తి ‘సాక్షి’లో రాసిన త్రికాలం ఎడిట్ పేజీ వ్యాసాల సంకలనాన్ని మాజీ ఐఏఎస్ అధికారి కేఆర్ వేణుగోపాల్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. తొలికాపీని జైపాల్‌రెడ్డికి అందజేశారు. అంతకుముందు 50 ఏళ్ల జర్నలిజం ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సీనియర్ పాత్రికేయులు ఎస్.వెంకటనారాయణ్‌ను రామచంద్రమూర్తి సన్మానించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, రక్షణ మంత్రి సలహాదారు సతీశ్‌రెడ్డి, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, సీనియర్ పాత్రికేయుడు ఏబీకే ప్రసాద్, ప్రొఫెసర్ హరగోపాల్, రాఘవాచారి, పాశం యాదగిరి, జ్వాలా నరసింహారావు, కె.శ్రీనివాస్‌రెడ్డి, దేవులపల్లి అమర్, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్, నవ తెలంగాణ ఎడిటర్ వీరయ్య, నమస్తే తెలంగాణ ఎడిటర్ కట్టా శేఖర్‌రెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారులు కాకి మాధవరావు, ఐవైఆర్ కృష్ణారావు, ఎమ్మెల్యే రామలింగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ, ప్రకాశ్, దేశపతి శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు. -
ఘనంగా సాక్షి ఈడీ రామచంద్రమూర్తి జన్మదిన వేడుకలు
-
అస్పష్ట కర్ణాటకం!
కర్ణాటకలో శనివారంనాడు పోలింగ్ ముగిసిన తర్వాత వెల్లడైన ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు ఒక తీరుగా లేవు. అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించబోతోందని టైమ్స్‌నౌ, ఇండియాటుడేల సర్వేలు నిర్ధారిస్తే, బీజేపీకే అత్యధిక స్థానాలు దక్కుతాయని రిపబ్లిక్ టీవీ, న్యూస్ఎక్స్, మరి కొన్ని ఇతర చానళ్ళు తీర్మానించాయి. పోలింగ్ ముందు జరిగే ఒపీనియన్ పోల్స్ వాస్తవానికి కాస్త దూరంగా ఉంటాయనీ, ఎగ్జిట్‌పోల్స్ కొంత దగ్గరగా ఉంటాయనీ అందరూ అంగీకరించే విషయం. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒక్క చానల్ కూడా ఫలితాన్ని కచ్చి తంగా అంచనా వేయలేకపోయింది. గుజరాత్ ఎన్నికలలో కొంత నయం. కానీ కర్ణాటకలో పోలింగ్ జరుగుతున్న సమయంలో పలు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌పోల్స్‌లో పూర్తి విరుద్ధమైన ఫలితాలు రావడం విడ్డూరం. టైమ్స్‌నౌ, ఇండియాటుడేలు కాంగ్రెస్‌కి దాదాపు వంద స్థానాలూ, బీజేపీ 70 స్థానాలు ఇస్తే, రిపబ్లిక్‌టీవీ, న్యూస్ఎక్స్లు బీజేపీకి వందకు పైగా స్థానాలతో ప్రథమ స్థానం ఇచ్చాయి. కర్ణాటకలో రాబోయేది హంగ్ అసెంబ్లీ అని అన్ని సర్వేలూ స్పష్టం చేశాయి. కాంగ్రెస్‌కు పూర్తి మెజారిటీ రాని పక్షంలో బీజేపీ, జేడీ (ఎస్)లు కలసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని ఒక వాదన. జేడీ(ఎస్)కు 30–35 స్థానాలు రావ చ్చునని కొన్ని ఎగ్జిట్‌పోల్స్ సూచించాయి. ఎన్నికల తర్వాత తన కుమారుడు (మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి) కనుక బీజేపీతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అతడితో తన సంబంధాలు తెగిపోతాయని జెడీ(ఎస్) అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ్ సీనియర్ జర్నలిస్టు బర్ఖాదత్‌తో చెప్పారు. కానీ ఇటువంటి ప్రకటనే 2006లో కూడా దేవె గౌడ చేశారు. అయినప్పటికీ, బీజేపీ మద్దతుతో కుమార స్వామి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. కుమార స్వామితో దేవెగౌడ సంబంధాలు రవ్వంతైనా చెడిపోలేదు. హంగ్ అసెంబ్లీ ఏర్పడితే ప్రభుత్వ నిర్మాణంలో జేడీ (ఎస్)దే కీలక పాత్ర. ఈ సారి దేవెగౌడ, కుమారస్వామి ఏమి చేస్తారు? వారి ప్రయోజనాలకూ, వారి ఆకాంక్షలకూ అనుగుణంగా ఏమి చేయవలసి వస్తే అదే చేస్తారు. బీజేపీ, కాంగ్రెస్‌లతో సంబంధం లేకుండా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి అధికారం హస్తగతం చేసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) చేసిన ప్రతిపాదన దేవెగౌడకు నచ్చినట్టుంది. కాంగ్రెస్ భాగస్వామ్యం లేకుండా బీజేపీని గద్దెదించడం సాధ్యం కాదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కుండ బద్దలు కొట్టారు. జాతీయ స్థాయిలో నిర్ణా యక పాత్ర పోషించాలనే ఆకాంక్ష దేవెగౌడకు ఉన్నట్లయితే ఆయన కాంగ్రెస్‌తో జేడీ (ఎస్) పొత్తు పెట్టుకోవాలని కోరు కుంటారు. కాంగ్రెస్, జేడీ (ఎస్)లు ఏర్పాటు చేసే ప్రభు త్వానికి ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య కొనసాగుతారు. తానే ముఖ్యమంత్రి కావాలని కుమారస్వామి అనుకుంటే ఆయన బీజేపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు కోసం ప్రయత్నిస్తారు. అప్పుడు బీజేపీ తరఫున ఉపముఖ్య మంత్రిగా సదానందగౌడ కానీ శ్రీరాములు కానీ ఉంటారు. ఇవన్నీ ఊహగానాలు. వాస్తవ చిత్రం ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం కల్లా తెలిసిపోతుంది. ఏమున్నది గర్వకారణం? ఈ ఎన్నికలలో విశేషంగా చెప్పుకోవలసిన అంశం విలువల పతనం. ప్రచారంలో నాయకులు ప్రయోగించిన భాష అవాంఛనీయమైనది. వ్యవసాయ సంక్షోభం నివారించ డంలో సిద్ధరామయ్య ప్రభుత్వం విఫలమైందని ప్రధాని నరేంద్రమోదీ ధ్వజమెత్తారు. మూడువేలమందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కూడా విమర్శించారు. ఒక్క సిద్ధరామయ్యే కాదు ఈ దేశంలోని రాజకీయ నేత లందరూ, పౌరులందరూ సిగ్గుతో తలవంచుకోవలసిన విషాదం ఇది. మోదీ ప్రచార శైలిలో మార్పు లేదు. అదే ఆత్మ విశ్వాసం. అదే శక్తి. కాంగ్రెస్‌కి ఢోకా లేదనీ, మళ్ళీ కాంగ్రెస్ గెలుస్తుందనీ మోదీ రంగ ప్రవేశం చేసే వరకూ ధీమాగా చెప్పినవారు మోదీ ప్రచారంతో వాతావరణం మారి పోయిందనీ, బీజేపీకి అత్యధిక సంఖ్యలో స్థానాలు లభించ వచ్చుననీ చెప్పడం ఆరంభించారు. మోదీ వాక్ప టిమ గురించి దేశ పౌరులకు ఈ రోజు కొత్తగా చెప్పనక్కర లేదు. నాలుగేళ్ళుగా ప్రజలు ఆస్వాదిస్తూనే ఉన్నారు. కర్ణా టక ప్రచారంలో మోదీ ఉపన్యాసాలలో కొన్ని అవాస్తవాలు దొర్లాయి. జనరల్ కరియప్పకూ, జనరల్ తిమ్మప్పకూ తేడా తెలియకుండా మాట్లాడటం, భగత్‌సింగ్‌ను నెహ్రూ లాహోర్ జైలులో కలుసుకున్న విషయం, భగత్‌సింగ్ బలి దానం తర్వాత ఆయన త్యాగాన్ని ప్రశంసిస్తూ కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేయడం వెనుక నెహ్రూ ఉన్నాడనే అంశాన్ని గ్రహించకుండా కేవలం నెహ్రూను బదనాం చేయాలనే సంకల్పంతో మోదీ చరిత్రను వక్రీకరించడం శోచనీయం. అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడవలసిన పద్ధతి అది కాదు. కర్ణాటకలో ప్రత్యేక పరిస్థితి ఏమంటే మోదీ మాటల వెనుక నిజాయితీ లోపించడం. ఉదాహరణకు, ముఖ్య మంత్రి సిద్ధరామయ్యది పది శాతం (లంచాలు తీసుకునే) ప్రభుత్వం అంటూ మోదీ ధ్వజమెత్తారు.సిద్ధరామయ్యను ‘సిద్ధరూపయ్యా’ అని సంబోధించారు. ఆ సమయంలో అవినీతి ఆరోపణల కారణంగా బీజేపీ అధిష్ఠానవర్గం సూచన మేరకు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన యడ్యూరప్ప వేదికపైన ప్రధాని పక్కనే కూర్చొని ఉన్నారు. అవినీతికి ఆస్కారం లేని ప్రభుత్వాన్ని యడ్యూరప్ప నాయ కత్వంలో బీజేపీ అందిస్తుందంటూ మోదీ నమ్మకంగా చెబితే ప్రజలకు నమ్మకం కుదురుతుందా? మూడు వేలకు పైగా రైతన్నలు ఆత్మహత్య చేసుకో వడానికి కారణం సిద్ధరామయ్య విధానాలే అంటూ మోదీ నిందించారు. అది నిజమే. రైతుల బలవన్మరణాలకు సిద్ధ రామయ్యే జవాబు దారీ. సందేహం లేదు. కానీ పక్కనే బీజేపీ ఏలుబడిలో ఉన్న మహారాష్ట్ర సంగతి ఏమిటి? మహా రాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో రైతులు వ్యవసాయం గిట్టుబాటు కానందువల్ల జీవితాలు అర్ధంత రంగా చాలిస్తున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ చేయలేని అద్భుతం సిద్ధరామయ్య ఎట్లా చేస్తారు? ప్రధా నిగా నాలుగు సంవత్సరాలు పని చేసిన వ్యక్తి ఒక్క సారైనా వ్యవసాయరంగం సంక్షోభం గురించి పార్లమెంటులో సుదీర్ఘ చర్చ నిర్వహించే ప్రయత్నం చేయకపోవడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? కర్ణాటకలోని మొత్తం 224 శాస నసభ స్థానాలలోనూ 40 మాత్రమే పట్టణ ప్రాంతాలలో ఉన్నాయి. మరో 32 నియోజకవర్గాలు పట్టణాలుగా మారు తున్న గ్రామీణ ప్రాంతాలు. తక్కిన 150 నియోజక వర్గాలూ వ్యవసాయమే ప్రధానం. 2013 ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల రుణాలు మాఫీ చేసింది. ఈ సారి సైతం కాంగ్రెస్ అదే వాగ్దానం చేసింది. లక్ష రూపా యల వరకూ వ్యవసాయ రుణాలను ప్రభుత్వమే చెల్లి స్తుందనీ, వ్యవసాయ ఉత్ప త్తులకు కనీస మద్దతు ధర నిర్ణయించే విషయంలో ఎంఎస్ స్వామినాధన్ సిఫార్సు లను పరిగణనలోకి తీసుకుంటామనీ బీజేపీ ఎన్నికల ప్రణాళిక హామీ ఇచ్చింది. రుణమాఫీ విషయంలో ఈ రెండు జాతీయ పార్టీల కంటే ఉదారంగా ఉంటామనీ, ఎక్కువ మొత్తంలో తీసుకున్న అప్పులను కూడా సర్కార్ చెల్లిస్తుందని జేడీ (ఎస్) మాట ఇచ్చింది. అంతే కానీ సంక్షోభంలో చిక్కుకొని విలవిలలాడుతున్న రైతులను ఏ విధంగా ఆదుకోవాలన్న స్పష్టమైన అవగాహన మూడు పార్టీలలో దేనికీ లేకపోవడం గమనించాలి. డబ్బు, కులం, మతం ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గంలో రూ. 25కోట్ల తక్కువ కాకుండా ఒక్కొక్క పార్టీ ఖర్చు చేసిందనే సమాచారం ఆందోళన, ఖేదం కలిగిస్తున్నాయి. డబ్బు, కులం, మతం ప్రభావం ఎన్నికలపైన విపరీతంగా పడిందని పరిశీలకుల అభిప్రాయం. కులాల పేరుమీదా, మతాల పేరు మీదా కాంగ్రెస్ సమాజాన్ని చీల్చుతున్నదని మోదీ ఆరోపించడం మరో విశేషం. నిజానికి ఈ ఆరోపణ ఇంతకాలం బీజేపీపైన కాంగ్రెస్, వామపక్షాలూ చేసేవి. ఇప్పుడు అదే ఆరోపణతో కాంగ్రెస్‌పై బీజేపీ ఎదురుదాడి చేయడం గమనార్హం. మోదీ వ్యూహం తెలిసిన సిద్ధరామయ్య మతంపేరుతో తానూ రాజకీయం చేయడానికి ప్రయత్నించిన మాట ఎవ్వరూ కాదనలేని వాస్తవం. బీజేపీకీ, ముఖ్యంగా ఆ పార్టీ ముఖ్య మంత్రి అభ్యర్థి యడ్యూరప్పకు, అండగా నిలుస్తూ వచ్చిన లింగాయతులను మైనారిటీ మతస్థులుగా గుర్తించాలంటూ కేంద్రానికి సిఫార్సు చేయడం వెనుక రాజకీయం ఉంది. ఈ ఎత్తుగడ ఫలించిందా లేక బెడిసికొట్టిందా అన్నది ఓట్ల లెక్కింపు తర్వాత కానీ తెలియదు. బీజేపీ హిందూత్వ వాదాన్ని ఎదుర్కోవడానికి రాజీవ్‌గాంధీ అయోధ్యలో శిలాన్యాస్ని అనుమతించడం, గుజరాత్ ఎన్నికల ప్రచారం లోనూ, ఆ తర్వాతా రాహుల్‌గాంధీ దేవాలయాలు సంద ర్శించడం రాజకీయ వ్యూహంలో భాగమే. తమ పార్టీని ముస్లిం పార్టీగా ముద్రవేసిన కారణం గానే 2014 ఎన్నికలలో దారుణంగా ఓడిపోయామని సోనియాగాంధీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అన్నారు. ఈ అభిప్రాయాన్ని మార్చడానికి ప్రయత్నం జరుగుతోంది. లోగడ ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా సిద్ధరా మయ్య కొంత చొరవ తీసుకున్నారు. మోదీని ఎదుర్కొ నేందుకు తానే స్వయంగా ఒక ప్రణాళిక వేసుకున్నారు. బీజేపీ జాతీయ వాదానికి విరుగుడుగా కాంగ్రెస్ ప్రాంతీయ వాదం వినిపించింది. కన్నడిగుల ఆత్మగౌరవ నినాదం విని పించింది. కర్ణాటకకు ఒక ప్రత్యేక పతాకాన్ని ఆవిష్కరిం చారు. ‘వజ్రం వజ్రేన భిద్యతే’ అన్న సూత్రం పాటించినట్టు కనిపించింది. ప్రధాని పదవికి సిద్ధం : రాహుల్ ఈ ఎన్నికల ప్రచారాన్ని మోదీకీ, సిద్ధరామయ్యకూ మధ్య సాగిన పోరాటంగా ప్రజలు పరిగణించి ఉంటే ఫలితం కాంగ్రెస్‌కు అనుకూలంగా రావచ్చు. లోగడ ఢిల్లీలో, బిహా ర్లో బీజేపీ తరఫున ప్రధాన ప్రచారసారధి నరేంద్రమోదీ. ఢిల్లీలో ప్రచారం మోదీ, అరవింద్ కేజ్రీవాల్ మధ్య వాగ్యుద్ధం సాగింది. కేజ్రీవాల్ గెలుపొందారు. బిహార్ ప్రచారయుద్ధం మోదీ, నితీశ్‌కుమార్ మధ్య జరిగింది. నితీశ్ కుమార్ విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన ఎన్నికల భాగస్వామి లాలూ ప్రసాద్‌కు జల్లకొట్టి మోదీ పరిష్వంగంలో వొదిగిపోయారు. అది వేరే విషయం. పంజాబ్‌లో కెప్టెన్ అమరేంద్రసింగ్ కాంగ్రెస్ ప్రచారానికి సారథ్యం వహిస్తే బీజేపీ–అకాలీదళ్ కూటమికి మోదీ నాయకత్వం వహించారు. అక్కడ కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి అమరేంద్రసింగ్ను విజయం వరించింది. కర్ణాటకలో కూడా అటువంటి ఫలితమే వచ్చినా ఆశ్చర్యం లేదు. కానీ ప్రచారం చివరి భాగంలో రాహుల్ గాంధీ ఒక చమత్కారం చేశారు. 2019లో కాంగ్రెస్‌కు ఇతర పార్టీల కంటే ఎక్కువ లోక్‌సభ స్థానాలు లభిస్తే ప్రధాన మంత్రి పదవి చేపట్టడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దాంతో ఈ పోరాటం మోదీకీ, రాహుల్కీ మధ్య జరుగుతోందనే అభి ప్రాయం కొద్దిసేపు కలిగింది. దాన్ని కర్ణాటక ఓటర్లు మనసుకు పట్టించుకుంటే ఫలితం ఎట్లా ఉంటుందో ఊహించుకోవచ్చు. రాహుల్ వ్యాఖ్య వల్ల కాంగ్రెస్‌కి లాభం చేకూరిందో, నష్టం కలిగించిందో అంతిమ ఫలితాలు వెల్ల డైన తర్వాతే తెలుస్తుంది. ఈ ఎన్నికలలో బీజేపీ విజయం సాధిస్తే దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణుల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ ఏడాది చివరలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్ని కలతో పాటు లోక్ సభ ఎన్నికలు జరిపించాలని మోదీ ప్రతి పాదించినా ఆశ్చర్యం లేదు. ప్రతిపక్షాలు సంఘటితమై పోరాటానికి సిద్ధమయ్యేలోగానే ఎన్నికలకు వెళ్ళడం లాభ దాయకంగా మోదీ భావించవచ్చు. ఒక వేళ కాంగ్రెస్ విజయం సాధిస్తే మోదీ రథానికి అవరోధం ఏర్పడినట్టే. మోదీ జనాకర్షణశక్తి తగ్గిపోయినట్టే. సిద్ధరామయ్య ప్రతిష్ఠ, రాహుల్‌కి జనామోదం పెరిగినట్టు గుర్తించాలి. అందుకే ఈ ఎన్నికల ప్రభావం కేవలం కర్ణాటకపైనే కాకుండా దేశం మొత్తం మీద పడుతుంది. కె. రామచంద్రమూర్తి -
జర్నలిస్టు ఏబీకే ప్రసాద్‌కు సన్మానం
సాక్షి, విశాఖపట్టణం : పత్రికా రంగానికి అందించిన సేవలకుగాను సీనియర్ జర్నలిస్టు ఏబీకే ప్రసాద్‌కు విశాఖపట్టణంలో శనివారం ఘన సన్మానం జరిగింది. రైటర్స్ అకాడమీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సభకు హాజరైన సుప్రీం కోర్టు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏబీకేతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వ్యవసాయ కుటుంబం నుంచి పత్రికా రంగంలోకి వచ్చిన ఏబీకేకు ఆయన నేపథ్యమే ప్రశ్నించడాన్ని అలవర్చిందని అన్నారు. -
నాటి కవులు నేటి తరానికి మార్గదర్శకులు
విశాఖ సిటీ: పాతతరం కవులు రచించిన పద్యాలు నేటితరం కవులకు మార్గదర్శకాలుగా నిలుస్తున్నాయని ఆదివారమిక్కడ జరిగిన కొప్పరపు కవుల జయంతి సభలో మాట్లాడిన వక్తలు అభిప్రాయపడ్డారు. కొప్పరపు కవుల జయంతిని పురస్కరించుకుని 120 ఏళ్ల కొప్పరపు కవుల కవితా ప్రస్థాన సభను విశాఖలోని పౌరగ్రంథాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కొప్పరపు కవుల పీఠం వ్యవస్థాపకుడు మాశర్మ సేకరించి ముద్రించిన కొప్పరపు కవుల సాహిత్య సర్వస్వం గ్రంథాన్ని ఆవిష్కరించారు. సభాధ్యక్షత వహించిన సాక్షి మీడియా గ్రూప్ ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. ఆరురోజుల వ్యవధిలో వందేళ్ల కథకు వందనాలు, కొప్పరపు కవుల సాహిత్య సర్వస్వం అనే రెండు బృహత్ గ్రంథాల విడుదలలో భాగస్వాముడినవడాన్ని అదృష్టంగా భావిస్తున్నానన్నారు. తెలుగును పాఠశాలలు, కళాశాలల్లో తప్పనిసరి చేయాలనే ఉద్యమం ప్రస్తుతం నడుస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం దీన్ని అమలు చేస్తోందని, ఏపీలోనూ తెలుగును తప్పనిసరి చేయాల్సిన అవసరముందని చెప్పారు. ప్రెస్ అకాడెమీ పూర్వ అధ్యక్షుడు పొత్తూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తెలుగువారి సొత్తయిన అవధాన విద్యను సుసంపన్నం చేసిన పథ నిర్దేశకులు కొప్పరపు కవులని కొనియాడారు. ప్రముఖ కవి, గేయరచయిత సుద్దాల అశోక్‌తేజ మాట్లాడుతూ.. పాతతరం కవులు సూర్యుడి లాంటివారని, వారు వేసిన వెలుగుల దారుల్లో నేటితరం కవులు పయనిస్తున్నారన్నారు. -
శాశ్వతంగా నిలిచేది అక్షరమే
హైదరాబాద్: అక్షరం ఎప్పుడూ శాశ్వతంగా నిలుస్తుందని ప్రముఖ సినీ నేపథ్య్గ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అన్నారు. గోకుల్చంద్ర, రాహుల్‌చంద్ర మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గొల్లపూడి మారుతీరావు సంపాదకత్వంలో రూపుదిద్దుకున్న 116 మంది ప్రముఖ కథా రచయితల వైభవ దీపిక ‘వందేళ్ల కథకు వందనాలు’ గ్రంథావిష్కరణ సభ సోమవారం రాత్రి నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నందమూరి తారక రామారావు కళామందిరంలో జరిగింది. సాక్షి దినపత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం హాజరై గ్రంథాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. తొలిప్రతిని కొండూరి రామ్మూర్తికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్, ప్రముఖ రచయిత్రి చాగంటి తులసి, విజయ్ నిర్మాణ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ డాక్టర్ సూరపనేని విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రచయితలను ఘనంగా సత్కరించారు. -
జనహృదయ దర్శనం
♦ త్రికాలమ్ తమ దగ్గరికి నడుచుకుంటూ వచ్చి యోగక్షేమాలు విచారించిన నాయకులను ప్రజలు అక్కున చేర్చుకుంటారు. పాదయాత్ర వల్ల లభించిన అనుభవాన్నీ, క్షేత్రజ్ఞానాన్నీ, అధికారాన్నీ ఏ విధంగా సద్వినియోగం చేసుకొని ప్రజలకు మేలు చేస్తారనే విషయం ఆయా రాజకీయ నాయకుల సంస్కారంపైన ఆధారపడి ఉంటుంది. ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రసాదించిన నిచ్చెన ఎక్కి అందలంపైన కూర్చోగానే అదే నిచ్చెనను తన్ని తగలేయడం, నిరంకుశంగా, నిర్దయగా వ్యవహరించడం చూస్తున్నాం. నిజంతో నిమిత్తం లేకుండా అసత్య ప్రచారంతో, దబాయింపు రాజకీయంతో వర్థిల్లుతున్నవారినీ, ఎన్నికల వాగ్దానాలను అటకెక్కించి సొంత ఎజెండాను పట్టాలపై ఎక్కించినవారినీ ప్రజలు గమనిస్తున్నారు. అటువంటి ప్రభుత్వాలపైనా, ప్రభువులపైనా ప్రజలకు షికాయతులు ఉంటాయి. ప్రధానమంత్రులూ, ముఖ్యమంత్రులూ పాదయాత్రలు చేయలేరు. వారు పరి పాలనలో నిర్విరామంగా ఉంటారు. ప్రతిపక్షంలో ఉన్న నాయకులకే ప్రజలతో వివరంగా సంభాషించే సావకాశం ఉంటుంది. చంద్రశేఖర్, వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబునాయుడు ప్రతిపక్ష నేతలుగా ఉన్నప్పుడే పాదయాత్ర చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడూ, వైఎస్ఆర్సీపీ అధినేతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు ఉదయం ఇడుపులపాయ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. షర్మిల 2012లో ఎక్కడి నుంచి నడక ప్రారంభించారో అక్కడి నుంచే అన్న పాదయాత్ర మొదలుపెడుతున్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరు లేదా ముగ్గురు అధికారంలో ఉండటం చూస్తున్నాం కానీ ప్రజలను కలుసుకునేందుకు ముగ్గురు కుటుంబ సభ్యులు వేల కిలోమీటర్లు నడవడం ప్రపంచంలో ఎక్కడా లేదు. ప్రజల దగ్గరికి వెళ్ళడం, కష్టసుఖాలు తెలుసుకోవడం, వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం అన్నది అత్యంత ఉత్కృష్టమైన రాజకీయం. పాదయాత్రల ప్రశస్తి భారతీయ సంస్కృతిలో పాదయాత్రకు విశిష్టమైన స్థానం ఉంది. బుద్ధుడు, మహావీరుడు, ఆదిశంకరుడు వంటి మహానుభావులు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ పాదయాత్ర చేసి తమ భావజాలాన్ని ప్రచారం చేస్తూ ప్రజలను ప్రభావితం చేశారు. పాదయాత్రలో ప్రధాన లక్ష్యాలు నాలుగు. 1) ప్రజల మనసుల్లో ఏమున్నదో తెలుసుకోవడం 2) క్షేత్ర వాస్తవికతను గమనించడం 3) నడిచే నాయకుడి శారీరక, మానసిక దారుఢ్యాన్ని పరీక్షించుకోవడం 4) మీడియా ప్రాథ మ్యాలతో నిమిత్తం లేకుండా ప్రజలకు అర్థం కావడం, ప్రజలను అర్థం చేసుకోవడం. అహింసాత్మకంగా నిరసన ప్రకటించడం కూడా పాదయాత్ర లక్ష్యాలలో ఒకటి. సత్యాగ్రహ ప్రయోగాలను గాంధీ దక్షిణాఫ్రికాలో 1906లోనే ప్రారంభిం చారు. అక్కడి ప్రభుత్వం ఆయన కదలికలపై ఆంక్షలు విధించలేదు. 1930లో నిర్వహించిన ఉప్పు సత్యాగ్రహంలో గాంధీజీ 388 కిలోమీటర్లు నడిచి సముద్రపు ఒడ్డున దండికి చేరి వలస ప్రభుత్వాన్ని ధిక్కరించారు. కొమ్మారెడ్డి సత్యనారాయణ ఇచ్ఛాపురం నుంచి చెన్నై వరకు రైతుయాత్రకు నాయకత్వం వహించారు. 1935–36లో జరిగిన ఈ బృహత్తర యాత్రను కర్షక నాయకుడు ఆచార్య రంగా పచ్చజెండా ఊపి ప్రారంభించారు. వలస ప్రభుత్వం అభ్యంతరం చెప్పలేదు. భూదానోద్యమంలో భాగంగా వినోబాభావే తెలంగాణ నుంచి 1951లో ఆరంభించి బుద్ధగయ వరకూ నడిచారు. 1980–81లో డిఎంకె నాయకుడు కరుణానిధి ‘నీదికేట్టు నెడుంపయనం’(న్యాయంకోసం సుదీర్ఘ పాదయాత్ర)పేరుతో ఎంజీఆర్ సర్కార్ పట్ల వ్యతిరేకత ప్రకటిస్తూ చాలా దూరం నడిచారు. జనతాపార్టీ మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్ కన్యాకుమారి నుంచి ఢిల్లీలో గాంధీజీ సమాధి వరకూ ఆరు మాసాలపాటు 4,260 కిలోమీటర్ల పొడవునా పాదయాత్ర సాగిం చారు. 1983 జనవరి 6న ప్రారంభమైన యాత్ర జూన్ 25న ముగిసింది. భారత్‌యాత్రలో భాగంగా ఆయన విజయవాడ వచ్చినప్పుడు నేను ‘ఆంధ్రప్రభ’ కోసం ఆయనను ఇంటర్వ్యూ చేశాను. పాదయాత్ర తర్వాత ఏడేళ్లకు చంద్రశేఖర్ దేశానికి ఎనిమిదవ ప్రధాని అయ్యారు. ఆ పదవిలో ఏడుమాసాలే (నవంబరు 10, 1990 నుంచి 21 జూన్ 1991 వరకు)ఉన్నారు. అది వేరే విషయం. వైఎస్, బాబు, షర్మిల 2003లో వైఎస్ రాజశేఖరరెడ్డి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకూ 1500 కిలోమీటర్లు 68 రోజుల్లో ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర చేశారు. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు అభ్యంతరం చెప్పలేదు. పాదయాత్రలో అపశ్రుతులు లేవు. ప్రజాసంక్షేమానికి అంకితమైన నేతగా, ప్రజలపట్ల అపారమైన ప్రేమ కలిగిన నాయకుడిగా ఆయన ప్రజలకు అర్థమైనారు. 2004 ఎన్నికలలో ఘనవిజయం సాధించారు. 2012–13లో నాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు అనంతపురం జిల్లా హిందూపురం నుంచి అక్టోబర్ 2న బయలుదేరి 2,340 కిలోమీటర్లు ‘వస్తున్నా మీకోసం’ పేరుతో 117 రోజులు నడిచారు. నడక మొదలు పెట్టే ముందు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, ‘సంక్షోభంలో విలవిలలాడుతున్న ప్రజలను కలుసుకోవడం నా బా«ధ్యత. రాష్ట్రంలో పరిపాలనంటూ బొత్తిగా లేదు. నిరంతరం పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో, విద్యుచ్ఛక్తి కోతలతో, కరువుతో ప్రజలు అల్లాడుతున్నారు. ప్రజలను కలుసుకొని వారి సమస్యలు తెలుసుకొని వారిలో ఆత్మవిశ్వాసం నింపుతాను’ అన్నారు. ఇవే మాటలు కొద్ది మార్పులతో నేటి ప్రతిపక్ష నాయకుడికీ వర్తిస్తాయన్న విషయం చంద్రబాబు విస్మరిస్తున్నారు. నాటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడికి పూర్తి భద్రతా ఏర్పాట్లు చేయడమే కాకుండా యాత్రలో ఆయనను నిలదీసేందుకు ప్రయత్నించిన లగడపాటి రాజగోపాల్ బృందాన్ని అరెస్టు చేయించారు. 2013 ఆగస్టు 28న యాత్ర ముగిసే వరకూ ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ జరగలేదు. దాదాపు అదే సమయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల అసాధారణమైన పాదయాత్ర చేసి చరిత్ర సృష్టించారు. 2012 అక్టోబర్ 18న ఇడుపులపాయలో వైఎస్ సమాధి దగ్గర ప్రారంభమైన యాత్ర 14 జిల్లాలు, 107 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా సాగింది. ‘జగనన్న విడిచిన బాణాన్ని’ అంటూ ఆమె సాగించిన యాత్ర సంచలనాత్మకమైనది. ఒక మహిళ 3,112 కిలోమీటర్ల దూరం 230 రోజులు నడవడం తిరుగులేని రికార్డు. తొలి అంకంలోనే ఆమె 250 కిలోమీటర్ల నడక పూర్తి చేసిన రోజు (2012 నవంబర్ 12) అప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉండిన వరిష్ఠ నాయకుడు మైసూరారెడ్డి షర్మిలకు కితాబు ఇచ్చారు. పశ్చిమ బెంగాల్ నేత మమతాబెనర్జీ ‘మా, మాతి, మనీష’ (మాతృమూర్తి, మాతృభూమి, ప్రజలు) అనే నినాదంతో 2009 సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ, 2011 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ పాదయాత్ర చేశారు. ఆమె రికార్డును అధిగమించి షర్మిల చరిత్రను తిరగరాశారని ఆయన అభినందించారు. యాత్రలో ఆమె మోకాలికి గాయం కావడం మినహా ఎటువంటి అవాంఛనీయ ఘటనా ఎదురు కాలేదు. ఈ మధ్య స్వల్పకాలిక పాదయాత్రలు జోరందుకున్నాయి. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఉత్తర ప్రదేశ్‌లో రైతుల సమస్యలు తెలుసుకునే ఉద్దేశంతో నెలరోజులపాటు మహాపాదయాత్ర చేశారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కేరళలో బీజేపీ, ఆరెస్సెస్ కార్యకర్తల హత్యల పట్ల నిరసన ప్రకటించేందుకు కణ్ణూర్‌లో నడిచారు. వామపక్ష సంఘటన ప్రభుత్వం ఆయనను రాజకీయంగా విమర్శించిందే కానీ ఎటువంటి ఆటంకాలూ కల్పించలేదు. ఇటీవల మార్క్సిస్టు పార్టీ నాయకుడు తమ్మినేని వీరభద్రం తెలంగాణలో మహాజన పాదయాత్ర జరిపి 2,150 కిలోమీటర్ల దూరం 82 రోజులలో నడిచారు. తుని ఆరోపణ వెనుక వ్యూహం కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం అనేక విడతల ‘చలో అమరావతి’ పిలుపునిచ్చి ఇంటి నుంచి పది గజాలు కూడా పోలీసు వలయంలో నడవలేకపోయారు. వర్షించని మేఘంలాగా, నడవని పథికుడిగా మిగిలిపోయారు. ప్రభుత్వంపైన నిరసన ప్రకటించేందుకు అదే ప్రభుత్వం అనుమతి కావాలనడం నిస్సందేహంగా అప్రజాస్వామికం, నిరంకుశం. జగన్మోహన్రెడ్డి పాదయాత్ర చేయాలన్న ప్రతిపాదన వచ్చిన వెంటనే ప్రభుత్వ అనుమతి తీసుకోవలసిన ఆవశ్యకత గురించి ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి చినరాజప్ప సూక్తులు చెప్పారు. డీజీపీ సాంబశివరావు ఉద్ఘోషలు సరేసరి. తుని వంటి ఘటనలు జరిగే ప్రమాదం ఉన్నదంటూ పార్టీ నాయకులను చంద్రబాబు హెచ్చరించడం వెనుక మైండ్‌గేమ్ ఉంది. చేయని నేరం చేసినట్టు పదేపదే మాట్లాడటం, ప్రచురించడం, ప్రచారం చేయడం వెనక బాబుకొక వ్యూహం ఉన్నదని స్పష్టంగా కనిపిస్తోంది. తునిలో రైలు దగ్ధం అవుతున్న సమయంలోనే మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక దళాన్ని పంపకుండా మీడియా గోష్ఠి పెట్టి రాయలసీమ రౌడీలు ఆ పని చేశారంటూ చంద్రబాబు నిందించారు. గతంలో ఏ ముఖ్యమంత్రి ఈ విధంగా నేరం జరిగిన క్షణాలలోనే నిందారోపణ చేయలేదు. ఆ కేసు నిందితులుగా గోదావరి జిల్లాల కాపులను చూపారు తప్ప అందులో రాయలసీమవారు ఎవ్వరూ లేరు. తుని వంటి ఘటన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడి పాదయాత్రలో జరిగే అవకాశం ఉన్నదని మాట్లాడటం ద్వారా తుని రైలు దగ్థం వెనుక వైఎస్ఆర్సీపీ ఉన్నదనే ఆరోపణ అన్యాపదేశంగా చేస్తున్నారు. ఇందులో వీసమెత్తు నిజం లేదని చంద్రబాబుకు తెలుసు. పోలీసులు నేరస్థులు ఎవరో గుర్తించి నిర్ధారించినప్పటికీ ఆ విషయం వెల్లడించరు. ఎందుకంటే, నేరస్తులు ఎవరో తెలిస్తే జగన్మోహన్రెడ్డిపైన విమర్శ చేయడానికి ఆస్కారం ఉండదు. ఆత్మస్తుతి, పరనిందకు అవధులు దాటడం ఆయన ప్రవర్తనలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇదివరకూ స్వోత్కర్ష ఉండేది కానీ ఇంత ఎబ్బెట్టుగా కాదు. వయస్సు ప్రభావం కావచ్చు. ఇవీ నేటి రాజకీయ విలువలు సోనియాగాంధీతో విభేదించి కాంగ్రెస్ నుంచి నిష్క్రమించారన్న ఏకైక కారణంతో జగన్మోహన్రెడ్డిపైన సీబీఐ పెట్టిన కేసులలో ఒక్కటీ కొలిక్కి రాలేదు. ఒక్క ఆరోపణా రుజువు కాలేదు. రుజువు కాదనే న్యాయశాస్త్రంలో తలపండినవారి అభిప్రాయం. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన జగన్మోహన్రెడ్డి సొంత పార్టీ పెట్టుకున్నారు. తనతో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన ఎంఎల్ఏలు అందరి చేతా శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయించి ఉప ఎన్నికలలో పోటీ చేయించి గెలిపించుకున్నారు. ఇటీవల నంద్యాల ఉపఎన్నిక సందర్భంలో సైతం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి సోదరుడు శిల్పా చక్రపాణిరెడ్డి టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి మారాలని అనుకున్నప్పుడు శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేయాలని షరతు పెట్టారు. కొన్ని మాసాల కిందటే సర్వ శక్తులూ వినియోగించి గెలుచుకున్న సభ్యత్వాన్ని పరిత్యజించి చక్రపాణి వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ రాజ్యాంగబద్ధమైన, విలువలతో కూడిన రాజకీయాన్ని మీడియా పెద్దలు కానీ, మేధావులు కానీ తగినంతగా గుర్తించలేదు. ఆరోపణలపైన విచారణ కూడా ప్రారంభం కాకుండా 16 మాసాలు జైలు జీవితం గడిపినప్పటికీ గుండె దిటవు చెదరకుండా 2014 ఎన్నికలలో పోరాడి కేవలం 1.83 శాతం ఓట్ల తేడాతో ఓడిపోయిన జగన్మోహన్రెడ్డిని ప్రజానాయకుడుగా కాకుండా వేరే తీరున చిత్రించడానికి చంద్రబాబూ, ఆయన మిత్రులూ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీకి చెందిన 21 మంది ఎంఎల్‌ఏలనూ, ముగ్గురు ఎంపీలనూ ప్రలోభపెట్టి పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించి, వారి చేత రాజీనామాలు చేయించ కుండా, వారిలో కొందరికి మంత్రి పదవులు కూడా ఇచ్చిన అనైతిక రాజకీయాన్ని న్యాయస్థానాలు ప్రశ్నించవు. ఎన్నికల కమిషన్ ఆక్షేపించదు. దేశంలో ప్రస్తుతం అమలులో ఉన్న రాజకీయ విలువలకు ఈ పరిస్థితి అద్దం పడుతోంది. కల్లబొల్లి మాటలతో కొందరిని కొంతకాలం నమ్మించవచ్చు. కానీ అందరినీ ఎల్లకాలం నమ్మించజాలరు. ప్రజాస్వామ్యవాదులకు అదే భరోసా. జగన్మోహన్రెడ్డి తల పెట్టిన ఈ సుదీర్ఘ ప్రజా సంకల్పయాత్ర అయిదున్నర కోట్ల జనహృదయాలను స్పృశిస్తూ నిర్విఘ్నంగా సాగిపోవాలని, వారి ఆవేదనలనూ, ఆకాంక్షలనూ బలంగా వినిపించాలని, రాష్ట్ర రాజకీయాలకు ఇదొక మేలి మలుపు కావాలని ఆశిద్దాం. కె. రామచంద్రమూర్తి -
ప్రతి జర్నలిస్టు సైనికుడే
-
మూడేళ్లు–మూడు దారులు
త్రికాలమ్ సార్వత్రిక ఎన్నికల అనంతరం అన్నిచోట్లా ప్రభుత్వాలు ఏర్పడి మూడేళ్ళు పూర్తవుతున్న సందర్భంలో ఒక వైపు ఆనందం, మరో వైపు ఆందోళన కలగడం శోచనీయం. ఢిల్లీలో నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ సర్కార్ అప్రతిహ తంగా దూసుకుపోతున్నది. మోదీ తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పని నల్లేరు మీద బండి చందం. చివ రిగా ప్రమాణం చేసిన నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా పన్నెండు సంవత్సరాలు పూర్తి చేసి రికార్డు నెలకొల్పబోతున్నారు. ముగ్గురి పరిపాలననూ సమీక్షించవలసిన సమయం. గురువారం నాడు రామనాథ్ గోయెంకా స్మారకోపన్యాసంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రెండు ముఖ్యమైన అంశాలు ప్రస్తావించారు. ప్రశ్నించడం ప్రజా స్వామ్యానికి మూలాధారం అన్నది ఒకటి. ప్రధాని మోదీలో నెహ్రూ, ఇందిరా గాంధీ కనిపిస్తున్నారనేది రెండోది. ఈ రెండు అంశాలకూ సంబంధం ఉంది. రెండో అంశం ముందు పరిశీలిద్దాం. మోదీ నిస్సందేహంగా ఒక విలక్షణమైన ప్రధాని. మాటల మాంత్రికుడు. ప్రగతిపథ నిర్దేశకుడు. ధైర్యశాలి. నెహ్రూ వలె మంచి వాగ్ధాటి కలిగిన నాయకుడు. ఇందిరాగాంధీ లాగా రాజకీయ ప్రత్య ర్థులపైన పూర్తి ఆధిక్యం సంపాదించే శక్తి దండిగా ఉంది. ఆర్థికాభివృద్ధి 2013–14 కంటే ఇప్పుడు ఎక్కువ వేగం పుంజుకుంది. జీడీపీ వృద్ధి రేటు అప్పుడు 6.5 శాతం ఉండగా ఇప్పుడు 7 శాతం ఉంది. 7.5 శాతం వరకూ పెరిగే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం అప్పటి కంటే బాగా తగ్గింది. ప్రపం చంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం మనది. మోదీ సమ ర్థుడైన ప్రధాని అనడంలోనూ, ఇంతవరకూ ఒక్క అవినీతి ఆరోపణ రాకుండా మచ్చలేని ప్రభుత్వానికి ఆయన సారథ్యం వహిస్తున్నారనడంలోనూ ఏ మాత్రం సందేహం లేదు. ప్రతిపక్షం బలహీనంగా ఉండటం కూడా మోదీకి కలసి వచ్చిన అంశం. ప్రభుత్వాన్ని సక్రమంగా నడిపించడంలో, ప్రత్యర్థి దేశా లకు తగ్గకుండా వాటికి దీటుగా వ్యవహరించడంలో మోదీ తనదైన శైలిని అల వరచుకున్నారు. మోదీ హయాంలో చైనాతో, పాకిస్తాన్‌తో సంబంధాలు దెబ్బ తిన్నాయి. కశ్మీర్లో పరిస్థితి దిగజారింది. అయినా సరే, మోదీ మూడేళ్ళ పాలన ప్రశంసనీయంగానే సాగింది. మున్ముందు కూడా ఇదే విధంగా సాగుతుంది. ఇందుకు ఆనందం. ప్రశ్నించే స్వేచ్ఛ ప్రణబ్ ముఖర్జీ ప్రస్తావించిన మొదటి అంశం ప్రశ్నించే స్వేచ్ఛ. ప్రశ్న లేకపోతే ప్రజాస్వామ్యం లేదు. (The need to ask questions of those in power is fundamental for the preservation of our nation and of a truly democratic society-Pranab). ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి ప్రకటిం చిన తర్వాత కూడా ప్రశ్నించేవాళ్ళం. ముఖ్యంగా రామనాథ్ గోయెంకా ఆధ్వ ర్యంలోని ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఆంధ్రప్రభ, ఇతర అనుబంధ పత్రికలలో ప్రభు త్వాన్ని ప్రశ్నించడం కోసం తెగువ ప్రదర్శించేవాళ్ళం. గోయెంకా స్మారకోపన్యా సంలో రాష్ట్రపతి ప్రశ్నించడం గురించి నొక్కిచెప్పడం సందర్భోచితంగా ఉంది. రాజకీయ ప్రత్యర్థుల ప్రశ్నలు సహించలేక వాజపేయి, అడ్వాణీ, ఫెర్నాండెస్ వంటి అనేకమంది ప్రతిపక్ష నాయకులను ఇందిరాగాంధీ కటకటాల వెనుక పెట్ట వలసి వచ్చింది. మోదీకి అటువంటి అగత్యం లేదు. ఆత్యయిక పరిస్థితి ప్రకటిం చకుండానే ప్రత్యర్థులను నోరు మూయించేందుకు మోదీకి తోడుగా మీడియా నిలబడింది. మోదీ ఢిల్లీ రాకముందు అంతా శూన్యమనే అభిప్రాయం మీడియా సమర్పకులలో స్పష్టంగా కనిపిస్తోంది. బీజేపీ నాయకులు సరేసరి. మోదీ దేవుడిచ్చిన వరం అంటూ వెంకయ్యనాయుడు ప్రకటించారు. మొన్న అమిత్ షా హైదరాబాద్, విజయవాడలలో చేసిన ప్రసంగాలలో కూడా ఇతరులు డెభ్బై ఏళ్ళలో చేయలేని పని మోదీ మూడేళ్ళలో చేశారని చెప్పారు. కడచిన డెభ్బై ఏళ్ళలో వాజపేయి అయిదేళ్ళ పైచిలుకు పాలన కూడా ఉన్నదనే స్పృహ లేకుండా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. వాజపేయిని కూడా కాంగ్రెస్ ప్రధానుల గాటనే కట్టివేస్తున్నారు. మోదీ నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నా, సర్జికల్ స్ట్రయిక్స్ అన్నా, లాహోర్ వెళ్ళి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను పలకరించి వచ్చినా, బలూచిస్తాన్‌లో మానవహక్కుల గురించి ప్రస్తావించినా మీడియా సమర్థిస్తుంది. ఇంత అనుకూలమైన మీడియా, ఇంత శక్తిమంతమైన మీడియా సహకారం ఇందిరకు లేదు. 1975–77లో టీవీ చానళ్ళు లేవు. పత్రికలు ఒక స్థాయికి మించి ప్రభుత్వాన్ని మోసేవి కావు. పాఠకులు ఏమనుకుంటారో నన్న బెరకు ఉండేది. జాతీయతా భావాన్ని ఇందిర ఉద్దీపనం చేసిన విధంగానే మోదీ కూడా చేయగలిగారు. మోదీకి ఇది వెన్నతో పెట్టిన విద్య. అండగా ఆర్ఎస్ఎస్ శ్రేణులు ఉండనే ఉన్నాయి. హిందూత్వ భావజాలాన్ని గుండెల నిండా నింపుకున్న మధ్యతరగతి మేధావుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ‘టైమ్స్‌నౌ’ చానల్ ‘ది వోన్లీ నేషనలిస్ట్ చానల్’ అంటూ చాటుకుంటోంది. పాకిస్తాన్‌ను తిట్టడం, భారత సైన్యాన్ని పొగడడం విధిగా జరగాలి. లేకపోతే యాంకర్లు క్షమించరు. పొరపాటున కశ్మీర్లో పరిస్థితి క్షీణిస్తోందని అంటే జాతికి క్షమాపణ చెప్పాలంటూ యాంకర్లు గుడ్లురుముతున్నారు. పాకిస్తాన్‌ని తిట్టని వాడు దేశద్రోహి. కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్ కశ్మీర్ వెళ్ళి వేర్పాటువాది గిలానీనీ, షబ్బీర్షానీ, ఇతర హురియత్ నాయకులనూ కలుసుకున్న వీడియో చిత్రాలు చూపిస్తూ, మణిశంకర్ దేశద్రోహులతో కరచాలనం చేస్తున్నాడనీ, తనను తాను శాంతికాముడిగా భావించుకుంటూ దేశానికి తీరని అపకారం చేస్తున్నాడనీ పరుష పదజాలంతో నిందలు మోపుతూ ఈ పీస్నిక్లను (శాంతి కాముకులుగా చెప్పుకునేవారిని) ఏమి చేయాలంటూ యాంకర్ అడుగుతుంది. అదే చానల్లో కేరళకు చెందిన సీపీఎం నాయకుడిని యాంకర్ చివాట్లు పెడు తుంది. మరో యాంకర్ ఫోన్లైన్లో అందుబాటులోకి వచ్చిన వ్యక్తిపై గావు కేకలు పెడతాడు. మన కేకలు మరొకరి భిన్నమైన అభిప్రాయం వినిపించకుండా చేయకూడదని (loudest noise should not drown those who disagree) రాష్ట్రపతి చెప్పింది అందుకే. మన జాతీయ (ఇంగ్లీషు) చానళ్ళు చేస్తు న్నది సరిగ్గా అదే. ఇవన్నీ ఒకే రోజు జరిగినవే. రోజూ జరుగుతున్నవే. మూడేళ్ళ కిందట చానళ్లు ఇంత అహంకార పూరితంగా, ఇంత ధ్వని ప్రధానంగా, ఇంత నిరంకుశంగా, ఇంత ఏకపక్షంగా, ఇంత అసహనంగా ఉండేవి కావు. అందుకే ఆందోళన. సమ్మతి సృష్టి మీడియా మద్దతుతో మోదీ ప్రభుత్వం నామ్ చామ్స్కీ చెప్పినట్టు సమ్మతి సృష్టిని (manufacture of consent) తేలికగా చేయగలుగుతున్నది. ఉదాహర ణకు పాకిస్తాన్‌పై ఆధిక్య ప్రదర్శన. పాకిస్తాన్‌కు గుణపాఠం చెప్పడానికి ఇందిరా గాంధీ అన్ని దేశాలూ తిరిగి దౌత్యం చేయడమే కాకుండా క్షేత్రంలో యుద్ధం చేయవలసి వచ్చింది. ముక్తిబాహిణిని నిర్మించవలసి వచ్చింది. ఒక ఇస్లామిక్ దేశాన్ని ముక్కలు చేసిన ఒక హిందూ యోధగా ఆమెను హిందూత్వవాదులు సైతం కీర్తించారు. దుర్గగా వాజపేయి అభివర్ణించారు. మోదీకి యుద్ధం చేయ వలసిన అవసరం లేదు. సర్జికల్ స్ట్రయిక్స్ ద్వారా ఉగ్రవాద స్థావరాలు విధ్వంసం చేయించగలరు. యుద్ధంలో పాకిస్తాన్‌ను చిత్తు చేశామనే అనుభూతిని ప్రజలకు కలిగించే పని మన టీవీ చానళ్ళు అత్యంత శక్తిమంతంగా చేయగలవు. టాక్‌షోలలో మన మాజీ సైనికాధికారులతో పాటు పాకిస్తాన్‌కు చెందిన ఇద్దరు ముగ్గురు మాజీ జనరల్స్‌ను కూడా కూర్చోబెట్టుకొని మాటల ఈటెలతో పాక్ జనరల్స్‌ని పొడిచి, వేధించి, ఓడించి మన గుండెలలో భారత పతాకను రెపరెప లాడించే యాంకర్లకు ప్రేక్షకాదరణ విపరీతంగా పెరిగిపోతోంది. కులభూషణ్ జాధవ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం పదకొండుమంది న్యాయమూర్తుల పీఠం తీర్పు వాయిదా వేసినా సరే ఒకటి, రెండు సానుకూలమైన వ్యాఖ్యలను పట్టుకొని మనమే గెలిచినట్టు ఢంకా బజాయించి చెప్పేందుకు సమర్పకులు పోటీపడటం విశేషం. సెక్యులరిస్టు అన్నా, వామపక్షవాది అన్నా, మానవ హక్కుల కార్యకర్త అన్నా, ప్రశ్నించేవారన్నా మీడియా ప్రతినిధులలో అసహనం పెరిగిపోతున్నది. ఆత్యయిక పరిస్థితి విధించకుండా, ప్రతిపక్ష నేతలను జైళ్ళలో కుక్కకుండా, సెన్సార్షిప్ లేకుండా ఆత్యయిక పరిస్థితి నాటి ఫలితాలు సాధించ గలగడం విశేషం. ఏది నిజమో తెలియక, నిజం కాదేమోనన్న అనుమానం వెలి బుచ్చే సాహసం చేయలేక మౌనంగా సమ్మతి ప్రకటిస్తున్నవారు దేశంలో అత్యధి కులు. ఇవన్నీ ఒక పథకం ప్రకారం మోదీ పర్యవేక్షణలో జరుగుతున్నాయని చెప్పడం లేదు. మోదీ తన పని తాను ఏకోన్ముఖ దీక్షతో చేసుకొని పోతున్నారు. జాతీయ మీడియా తన పని తాను చేసుకొని పోతున్నది. సమ్మతి సృష్టి కోసం అహరహం శ్రమిస్తున్నది. ఊపిరి సలపకుండా ఒక సంచలనం తర్వాత మరో సంచలనం సంభవించడంతో ప్రజలకు వెనక్కు తిరిగి చూసుకునే అవకాశం లేదు. ప్రగతిపథంలో పరుగులు తీయవలసిందే. ఇదే ధోరణి కొనసాగితే 2019లో కూడా బీజేపీదే విజయం. మోదీదే పీఠం. తెలుగు రాష్ట్రాలలో అప్రజాస్వామిక ధోరణి ఆంధ్రప్రదేశ్‌లో అరాచకం, అవినీతి అట్టహాసం చేస్తున్నాయి. చంద్రబాబు 1995–2004లో రెండు విడతల ముఖ్యమంత్రిగా చేసినప్పుడు కొన్ని ఒప్పులూ, కొన్ని తప్పులూ ఉండేవి. ఏ ముఖ్యమంత్రికైనా అది సహజం. ఈసారి తప్పుల సంఖ్య పెరిగిపోవడానికి కారణం ఆయన పెట్టుకున్న లక్ష్యాలే. ఎన్నికలు పూర్తయి అధికారంలోకి వచ్చిన వెంటనే అయిదేళ్ళ తర్వాత జరిగే ఎన్నికల కోసం ప్రణాళిక వేసుకోవడం, డబ్బు సంపాదించే అవకాశం పార్టీ నాయకు లకూ, కార్యకర్తలకూ ఇవ్వాలని నిర్ణయించుకోవడంతో మూడేళ్ళూ అవినీతి కార్యకలాపాలతోనే గడిచిపోయాయి. మోదీ లాగానే చంద్రబాబుకు కూడా జాతీయ మీడియా సహకారం ఉంది. పాతికమంది కూలీలను శేషాచలం అడవులలో కాల్చి చంపినా, గోదావరి పుష్కరాలలో షూటింగ్ సంరంభంలో ఇరవై మంది చనిపోయినా, ఏర్పేడులో ఇసుక మాఫియా దురాగతం వల్ల చాలామంది అమాయక పౌరులు మరణించినా జాతీయ మీడియా పట్టించు కోదు. స్థానిక మీడియా కొమ్ముకాస్తుంది. పట్టిసీమ నదుల అనుసంధానం అని కొన్ని పత్రికలు రాయవచ్చును. కానీ పట్టిసీమ నిరర్థకమైన ప్రాజెక్టు అన్నది ప్రవీణుల అభిప్రాయం. అమరావతిలో ఎక్కడ వేసిన రాయి అక్కడే ఉంది. తాత్కాలిక నిర్మాణాలే కానీ శాశ్వత నిర్మాణాలు ప్రారంభం కాలేదు. అభివృద్ధి క్రమంలో జాప్యం జరగవచ్చు. అభివృద్ధి అద్భుతంగా ఉన్నప్పటికీ ప్రజలకు ప్రశ్నించే హక్కు లేకపోతే పాలకులకు ఆదరణ ఉండదు. వ్యంగ్య వ్యాఖ్యలు చేసినవారిని జైలులో పెట్టే సంస్కృతికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. తెలంగాణలోనూ ప్రశ్నిస్తే సహించే స్వభావం కనిపించడం లేదు. ఆంధ్ర ప్రదేశ్‌తో పొల్చితే తెలంగాణలో చెప్పుకోదగిన ప్రాజెక్టులు ఉన్నాయి. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ మంచి ప్రాజెక్టులు. సంక్షేమ కార్యక్రమాలలో కూడా కొంత విస్తృతి పెరిగింది. కానీ ప్రశ్నిస్తున్న కోదండరామ్‌ని శత్రువుగానే చూస్తు న్నారు. ప్రశ్నించే స్వభావం ఉన్నవారిని దూరంగానే పెడుతున్నారు. ప్రజాస్వా మ్యాన్ని అపహాస్యం చేసే ఫిరాయింపులు వగైరాలు రెండు రాష్ట్రాలలోనూ నిస్సంకోచంగా జరిగాయి. మొత్తంమీద ధోరణి ప్రజాస్వామ్య వ్యవస్థను బలో పేతం చేసే విధంగా లేదు. తెలంగాణలో అభివృద్ధి జరగడం లేదని అనడం లేదు. కానీ అభివృద్ధి నమూనాను ప్రశ్నించే స్వేచ్ఛ లేదు. అందుకే ఆందోళన. కె. రామచంద్రమూర్తి -
కేసీఆర్‌కు ‘షా’ చెప్పగలరా?
త్రికాలమ్ వర్తమాన రాజకీయాలలో ఘటనాఘటన సమర్థుడిగా నిరూపించుకున్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా రేపు తెలంగాణలో అడుగుపెడుతున్నారు. షా మూడు రోజుల పర్యటనపైన బీజేపీ తెలంగాణ నాయకులు కోటి ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడి రాజకీయాలను షా పర్యటన మార్చివేస్తుందంటూ ప్రకటించారు. తెలం గాణలో ఉన్న రాజకీయ శూన్యాన్ని పూరించేందుకు షా పకడ్బందీ వ్యూహంతో వస్తున్నారంటూ నమ్మకంగా చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో పాటించిన రణనీతినే ఇక్కడా అమలు చేయబోతున్నారంటూ ఉత్సాహం ప్రద ర్శిస్తున్నారు. తెలంగాణలో రాజకీయ శూన్యం ఉన్నదా? ఒక వేళ ఉన్నా సదరు శూన్యాన్ని భర్తీ చేసే శక్తి బీజేపీకి ఉన్నదా? యూపీలో ఫలితాలు ఇచ్చిన వ్యూహం తెలంగాణలో పనిచేస్తుందా? ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ సాధించిన అనూహ్యమైన, అసాధారణమైన విజ యం సహజంగానే ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాల ప్రతిష్ఠ ఆకాశం ఎత్తు పెంచింది. బీజేపీని మొట్టమొదటిసారి కేంద్రంలో అధికారంలోకి తెచ్చిన వాజ పేయి–అడ్వాణీ జోడీ కంటే మోదీ–షా జోడీ అత్యంత శక్తిమంతమైనదనీ, గెలుపే ధ్యేయంగా పోరాడే మనస్తత్వం ఉన్న జంట అనీ దేశ ప్రజలంతా గుర్తిం చారు. విజయం సాధించడమే పరమావధి అనే లక్ష్యంతో రూపొందించిన వ్యూహాన్ని మోదీ–షా ఈశాన్య రాష్ట్రాలలో, గోవాలో, ఉత్తరాఖండ్‌లో, యూపీలో సమర్థంగా అమలు చేసి చూపించారు. బీజేపీ సునామీ బీజేపీ 2014 ఎన్నికలలో 282 లోక్‌సభ స్థానాలు గెలుచుకుంది. 1985లో ఇందిరాగాంధి హత్య అనంతరం జరిగిన లోక్‌సభ ఎన్నికలలో రాజీవ్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ అద్భుత విజయం సాధించిన తర్వాత, అంటే మూడు దశాబ్దాల తర్వాత, ఒక పార్టీ లోక్‌సభలో మెజారిటీ స్థానాలు గెలుచు కోవడం అదే ప్రథమం. మోదీ ప్రాభవం అద్వితీయంగా ఉన్నప్పటికీ పార్టీ ఓడిపోయిన 130 స్థానాలను గుర్తించి ఆ నియోజకవర్గాలలో పార్టీని బలో పేతం చేయడానికి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక రూపొందించారు. దేశవ్యాప్తంగా బీజేపీ బలహీనంగా ఉన్న రాష్ట్రాలలో 95 రోజులపాటు పర్యటించి పార్టీని క్షేత్రస్థాయిలో నిర్మించేందుకు అమిత్‌షా కంకణం కట్టుకున్నారు. దేశంలోని 29 రాష్ట్రాలనూ, ఏడు కేంద్రపాలిత రాష్ట్రాలనూ ఏ, బీ, సీ లుగా వర్గీకరించి ఏ కూట మికి చెందిన రాష్ట్రాలలో ఒక్కొక్క రాష్ట్రంలో మూడురోజుల పాటు, బీ రాష్ట్రాలలో రెండురోజుల పాటు, సీ రాష్ట్రాలలో ఒక్కొక్క రోజు పర్యటించి నాయకులనూ, కార్యకర్తలనూ, సాధారణ ప్రజలనూ, మేధావులనూ, అనేక రంగాలకు చెందిన వారినీ కలుసుకోవాలని షా ప్రయత్నం. ఎన్నికలలో ప్రాముఖ్యం ఆధారంగా ఈ వర్గీకరణ జరిగింది. 14 రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉంది. నాలుగు రాష్ట్రా లలో అధికారం పంచుకుంటోంది. బలహీనంగా ఉన్న రాష్ట్రాలలో పార్టీని నిర్మిం చడానికి మహాప్రయత్నాన్ని షా జమ్మూతో ఏప్రిల్ 29న ప్రారంభించారు. చార్ప్రదేశ్ ఇది వరకు బీజేపీ నినాదం: ఆజ్ చార్ ప్రదేశ్, కల్ సారా దేశ్. ఇప్పటి సరికొత్త నినాదం: అబ్ చార్ ప్రదేశ్. ముఖ్యంగా నాలుగు రాష్ట్రాలపైన దృష్టి కేంద్రీ కరించాలని షా బీజేపీ నాయకులకు చెప్పారు. అవి: తెలంగాణ, ఒడిశా, కేరళ, పశ్చిమ బెంగాల్. ఈ నాలుగు రాష్ట్రాలలో కలిపి 102 లోక్‌సభ స్థానాలు ఉంటే వాటిలో 2014లో బీజేపీ గెలిచింది నాలుగు మాత్రమే. ఇప్పుడు ఒడిశాలో వాతా వరణం బీజేపీకి ఆశావహంగా మారింది. ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ లోగడ కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ స్థానాలు గెలుచుకున్నది. మొత్తం పోలైన ఓట్లలో 34 శాతం బీజేపీకి దక్కాయి. నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని బిజూ జనతాదళ్ (బీజేడీ) ఇప్పటికీ మొదటి స్థానంలోనే ఉంది. జిల్లా పరిషత్ స్థానాలలో సగానికి పైగా బీజేడీ కైవసం చేసుకున్నది. ఇతర రాష్ట్రాలలో మాదిరి ఒడిశాలో కూడా కాంగ్రెస్ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా ఉంది. పశ్చిమ బెంగా ల్లో తృణమూల్ కాంగ్రెస్‌నీ, కేరళలో వామపక్ష సంఘటననూ, కాంగ్రెస్‌నూ అధిగమించడం అంత తేలికకాదు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో బీజే పీకి 10.2 శాతం ఓట్లు వచ్చాయి. కేరళలో బీజేపీ వాటా 10.6 శాతం. పార్టీ దృష్టి పెట్టవలసిన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ లేకపోవడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీతో బీజేపీ అధికారం పంచుకుంటున్నది. రెండు, అక్కడ బలమైన ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ ఉంది. ఏపీలో అన్ని స్థానాలకూ పోటీ చేసే బలం తనకు లేదనే అంచనా బీజేపీకి ఉంది. ఈ నెల 25న తెలంగాణ పర్యటన ముగించుకొని విజయవాడకు వెళ్ళనున్న అమిత్ షా ఆంధ్రప్రదేశ్‌లో కూడా మూడురోజులు పర్యటించబోతున్నారు. అంటే ఏపీ కూడా ఏ కేటగరీలోనే ఉంది. ఈ రెండు రాష్ట్రాలలో కలిపి 42 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి–ఆంధ్రప్రదేశ్‌లో 25, తెలంగాణలో 17. ఒడిశా లాగానే ఆంధ్రప్రదేశ్‌లో కూడా కాంగ్రెస్ నామమాత్రమే. తెలంగాణలో అన్ని లోక్‌సభ స్థానాలకూ, అన్ని శాసనసభ స్థానాలకూ పోటీ చేయవచ్చుననే విశ్వాసం బీజేపీ నాయకులు వెలిబుచ్చుతున్నారు. వారి విశ్వాసానికి తెలంగాణ నేపథ్యం కార ణం. వామపక్ష భావజాలం ప్రభావం బలంగా ఉన్న కారణంగా బీజేపీని తెలం గాణ ప్రజలు ఆమోదించబోరనే వాదన ఒకటి ఉన్నది. తెలంగాణ చరిత్రలో బీజేపీకి ఉపకరించే రెండు అంశాలను ఆ పార్టీ నాయకత్వం గుర్తించింది. అందుకు అనుగుణంగానే అమిత్ షా పర్యటనలో నల్లగొండ జిల్లాలోని కార్యక్ర మాలను రూపొందించారు. ఒకటి: రజాకార్ల దురాగతాలు. రెండు: నక్సలైట్ల హింస. నల్లగొండ మకాంలో మొదటి రోజున షా తెరాట్‌పల్లిలో ప్రజలను కలు సుకుంటారు. ఈ గ్రామంలో 1999లో నేత పనివారి సంక్షేమం కోసం పని చేస్తున్న బీజేపీ ప్రధాన కార్యదర్శి జి. మైసయ్యను నక్సలైట్లు కాల్చిచంపారు. తమ పార్టీ వామపక్ష తీవ్రవాదానికి బద్ధ వ్యతిరేకి అని చాటడం ఒక ఉద్దేశం. మర్నాడు చినమాదారం గ్రామం సందర్శిస్తారు. అక్కడ బీజేపీకి చెందిన మహిళా సర్పంచ్ సాధించిన ఘనవిజయాలను ప్రస్తుతిస్తారు. ఆ గ్రామంలో జన్‌ధన్, సురక్ష బీమా వంటి కేంద్ర పథకాలు జయప్రదంగా అమలు జరుగుతున్నాయి. అన్ని ఇళ్ళలో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయింది. మోదీ కార్యక్రమాలను త్రికర ణశుద్ధితో అమలు చేస్తున్న సర్పంచ్‌ను ప్రశంసించడం ఈ కార్యక్రమం లక్ష్యం. మూడోరోజు చిట్యాల మండలంలోని గుండ్రాంపల్లిని సందర్శిస్తారు. ఈ గ్రామంలో ఒకే రోజున రజాకార్లు 160మందిని ఊచకోత కోశారు. రజాకార్ల దురాగతాల పట్ల వ్యతిరేకత తెలియజేయడానికి ఈ కార్యక్రమం పెట్టుకున్నారు. ఒంటరిగా పోటీ తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. 2014లో ఉమ్మడి ఆంధ్రప్ర దేశ్‌లో జరిగిన రెండు రాష్ట్రాల ఎన్నికలలో బీజేపీ టీడీపీతోనే కలసి పోటీ చేసింది. ఇప్పుడు తెలంగాణలో టీడీపీ బలహీన పడింది కనుక ఒంటరిగానే అన్ని స్థానా లకూ పోటీ చేయాలని సంకల్పం. పార్టీని క్షేత్రస్థాయిలో బలంగా విస్తరించేందుకు విస్తారక్‌లను నియమిస్తున్నారు. ఇది కూడా అమిత్ షా జాతీయ ప్రణాళిక. దేశం మొత్తం మీద 3.5 లక్షల మంది వలంటీర్లను నియమించారు. వీరిలో కొందరు పదిహేను రోజులు మాత్రమే పనిచేస్తారు. తక్కినవారు సంవత్సరమంతా పనిచేస్తారు. వీరు కాకుండా 600మంది పూర్తికాలం పనిచేసే శక్తిమంతులను నియమిస్తారు. వీరిలో ఒక్కొక్కరు ఒక్కొక్క లోక్‌సభ నియోజవర్గంలో పనిచేస్తారు. వీరితో పాటు ఎన్నికలలో విజయం సాధించడమే పరమావధిగా పనిచేసే ప్రత్యేక బృందాలు ఉంటాయి. ఒక బృందానికి నాలుగు లేదా అయిదు ప్రతికూల నియోజకవర్గా లను అప్పజెబుతారు. స్థానిక పరిస్థితులను బట్టి, కార్యకర్తల సూచనలను బట్టి అక్కడ బీజేపీ పరిస్థితి మెరుగుపరచడానికి ఈ బృందాలు ప్రయత్నిస్తాయి. తెలంగాణకు యూపీ నుంచి 150 బైకులు తెప్పించారు. విస్తారక్ యోజ నలో వీటిని వినియోగిస్తారు. మే 29 నుంచి జూన్ 12 వరకూ జరిగే ఈ విస్తారక్ యోజనలో పదివేల మంది పార్టీ కార్యకర్తలు 50 లక్షల కుటుంబాలను పల కరిస్తారు. జనసంఘ్ వ్యవస్థాపకుడు దీన్‌దయాళ్ ఉపాధ్యాయ శతజయంతి వేడుకల సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దశాబ్దాలుగా ఒవైసీల చేతుల్లోనే ఉన్న హైదరాబాద్ లోక్‌సభ స్థానాన్ని గెలుచుకోవడానికి బీజేపీ విశ్వ ప్రయత్నం చేస్తుందనీ, అవసరమైతే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సేవలు సైతం వినియోగించుకుంటామనీ స్థానిక నాయకులు చెబుతున్నారు. యూపీ వ్యూహం ఏమిటి? యూపీ వ్యూహం అమలు చేస్తామంటూ బీజేపీ నాయకులు పదే పదే చెబు తున్నారు. ఇంతకీ ఏమిటా వ్యూహం? యూపీ అసెంబ్లీ బరిలో బీజేపీ దిగిన ప్పుడు ఆ పార్టీ మూడో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో సమాజ్‌వాదీ, రెండో స్థానంలో బహుజన సమాజ్‌వాదీ పార్టీ ఉన్నాయి. అటువంటిది బీజేపీ అగ్ర స్థానంలోకి ఎట్లా వచ్చిందంటే అందరూ చెప్పే సమాధానం అమిత్‌షా మాయా జాలం అని. యూపీలో అమిత్‌షా ఏమి చేశారు? బూత్ కమిటీలను నియమిం చారు. బూత్ కమిటీ సభ్యులతో సమావేశం అయినారు. వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. కార్యోన్ముఖుల్ని చేశారు. బీఎస్పీ, కాంగ్రెస్‌ల నుంచి పలుకు బడిగల నాయకులను బీజేపీలోకి లాక్కున్నారు. అది అస్సాంలో, ఉత్తరాఖండ్‌లో జయప్రదంగా అమలు చేసిన సూత్రమే. దీనికి తోడు యూపీలో వెనుకబడిన వర్గాలలో యాదవ్‌లపైన ఉన్న ఆగ్రహాన్ని సొమ్ము చేసుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకున్నారు. ఒక్క టిక్కెట్టు కూడా ముస్లిం అభ్యర్థికి ఇవ్వకుండా హిందువులను సంఘటితం చేయడానికి ప్రయత్నం చేశారు. దాదాపు 200 సమా వేశాలను ఉద్దేశించి అమిత్‌షా ప్రసంగించారు. క్షేత్రస్థాయిలో సమీకరణాలను బీజేపీకి అనుకూలంగా మార్చడానికి ఈ సమావేశాలు విశేషంగా దోహదం చేశాయి. యూపీలో అంతటి ఘనవిజయాన్ని మోదీ, షా కూడా ఊహించలేదు. ఊహిస్తే మోదీ చివరి మూడురోజులూ ఒక్క వారణాసిలోనే గడిపేవారు కాదు. అంత తీవ్రంగా ప్రచారం చేసేవారు కాదు. తెలంగాణలో ఇప్పుడే బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ నాయ కులు సైతం చెప్పలేరు. కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ను ప్రతిఘటించి నిలబడే శక్తి ఆ పార్టీకి కానీ, కాంగ్రెస్‌కి కానీ ఉన్నట్టు ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే అనిపించదు. కాంగ్రెస్ బహునాయకత్వంతో కొట్టుమిట్టాడుతోంది. ఆ పార్టీ సంఘటితంగా పోరాడి టీఆర్ఎస్కు గట్టి పోటీ ఇస్తుందని అనుకోవడానికి ఆధారాలు లేవు. ప్రొఫెసర్ కోదండరాం భవిష్యత్ ప్రణాళిక ఏమిటో తెలియదు. ఈ నేపథ్యంలో బీజేపీకి వాతావరణం అనుకూలంగా మారవచ్చు. ముస్లింలను ఆకట్టుకోవాలన్న ప్రయత్నంలో వారికి 12 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని కోరుతూ కేసీఆర్ శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి తీర్మానం చేయించారు. దీని వల్ల ముస్లిం ప్రజానీకానికి తక్షణ ప్రయోజనం ఏమీ లేదు. కానీ ఇదే కారణంపైన వెనకబడిన కులాలవారిలో టీఆర్ఎస్ పట్ల ప్రతికూల భావం ఏర్పడింది. దాన్ని బీజేపీ రాజేసి వినియోగించుకునే అవకాశం ఉంది. మైనారిటీలను సుముఖం చేసుకునేందుకు కేసీఆర్ అమితోత్సాహం ప్రదర్శించి బీజేపీకి వెనుకబడిన కులాలలో ప్రాబల్యం పెంచుకునే అవకాశం అప్పనంగా ఇచ్చారు. కొంతకాలంగా బీజేపీ నాయకులు ఈ అంశాన్ని అదే పనిగా ప్రస్తావి స్తున్నారు. పాకిస్తాన్‌పైనా, ఇస్లామిక్ ఉగ్రవాదులపైనా, ఒవైసీలపైనా విమర్శనాస్త్రాలు సంధించడం స్థానిక బీజేపీ రాజకీయంలో ప్రధానమైన అంశం. హైదరాబాద్‌లో ఘోషామహల్ శాసనసభ్యుడు రాజాసింగ్ లోధా పాతబస్తీని మినీ పాకి స్తాన్గా అభివర్ణించడం కూడా మతరాజకీయంలో భాగమే. ముందస్తు ఎన్ని కలకు కేసీఆర్ వెడతారని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీజేపీని తెలంగాణ ప్రజలు స్వాగతిస్తారా? కె. రామచంద్రమూర్తి -
చంద్రబాబు శీర్షాసనం!
త్రికాలమ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నీ తలకిందులుగా ఆలోచిస్తున్నారనడానికి ఈ వారంలో జరిగిన రెండు ఉదంతాలను పరామర్శించాలి. మొదటిది–చిత్తూరు జిల్లాలో జరిగిన ఒక ఉదంతం కాగా, రెండోది సోషల్ మీడియా వలంటీర్ ఇంటూరి రవికిరణ్ అరెస్టు. చిత్తూరు జిల్లాలో మునగాల పాలెం, గోవిందాపురం ఇరుగుపొరుగు గ్రామాలు. ఈ రెండు గ్రామాల మధ్యలో స్వర్ణముఖి నదికి దారి. ఇసుక దోపిడీకి అదే మార్గం. గోవిందాపురం గ్రామానికి చెందిన ధనుంజయనాయుడు, మనగాల పాలెం నివాసి రాధాపతినాయుడు రెండేళ్ళుగా య«థేచ్ఛగా ఇసుక దోపిడీ చేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా అరి కట్టడానికి ప్రభుత్వం మండల స్థాయిలో ఆరుగురు సభ్యులతో కమిటీ వేసింది. తహసీల్దారు, సీఐ, ఎండివో, మైనింగ్ ఆఫీసర్ తదితరులు ఈ కమిటీ సభ్యులు. వీరందరిపైనా కలెక్టర్. ఇసుక రవాణా చేస్తున్న లారీలు గ్రామాలలోకి ప్రవేశించ కుండా ప్రజలు కంచె నిర్మించారు. ఇసుక దొంగలు జేసీబీతో కంచెను తొలగిం చడం, గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేయడం, అధికారులు మిన్నకుండటం రెండేళ్ళుగా సాగుతున్న తంతు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి సన్నిహి తుడైన మనోహర్ అండదండలు ధనుంజయనాయుడికి దండిగా ఉన్నాయి. మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డితో పరిచయం ఉంది. కమిటీ సభ్యులను సుము ఖులను చేసుకొని వారి నోరు మూయించడం ఇసుక దొంగలకు పెద్ద పని కాదు. మొన్నటి వరకూ జిల్లా కలెక్టర్‌గా పని చేసిన సిద్దార్థజైన్ ఒక ఐఏఎస్ అధికారిగా, ప్రజాసేవకుడుగా వ్యవహరించకుండా అధికారపార్టీ నాయకుల ప్రతినిధిగా వ్యవ హరించారు. ఈ రెండు గ్రామాల ప్రజలు ఎన్ని సార్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. వీరిలో ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినవారే. సాధారణ రైతులు. ఇసుక దందాను నిరోధించేందుకు వారంతా సమష్టిగా ఉద్య మించారు. వారు చేయని ప్రయత్నం లేదు. కలుసుకోని అధికారి లేరు. చేయని విన్నపం లేదు. కానీ అధికారపార్టీ అండ దండలున్న ఇసుక దొంగలు చెలరేగి పోతున్నారు. వందల లారీల ఇసుకను చిత్తూరు, తిరుపతి, చెన్నైలకు రవాణా చేస్తున్నారు. నిరాటంకంగా ఇసుకదోపిడీ 2014లో టీడీపీ అధికారంలో వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక దోపిడీ ఊపందుకుంది. అధికారపార్టీ నాయకులూ, కార్యకర్తలూ విజృంభించారు. ముఖ్య మంత్రి ఆశీర్వదించారు. అడ్డువచ్చిన వనజాక్షి వంటి నిబద్ధత కలిగిన తహసీ ల్దారును మందలించారు. ఆమె జుట్టుపట్టి ఈడ్చిన శాసనసభ్యుడు చింత మనేని ప్రభాకర్‌కు మద్దతు పలికారు. అడ్డగోలుగా సంపాదించడం ఒక్కటే రాజకీ యంగా, పరిపాలనగా చెలామణి అవుతున్న కాలంలో ఇసుకదోపిడీని నిలువ రించడానికీ, తమ గ్రామాలను రక్షించుకోవడానికీ సాధారణ పౌరులే నడుం బిగించారు. నెల రోజుల కిందట తహసీల్దారు కార్యాలయానికి తాళం వేశారు. కొత్తగా నిర్మించిన కంచెను ఇసుకదొంగలు తిరిగి జేసీబీతో తొలగించడంతో తహ సీల్దారుకు మరోసారి ఫిర్యాదు చేయడానికి నలభై, యాభై మంది కలిసి ఏర్పేడు వెళ్ళారు. తహసీల్దారు లేరని తెలిసి పోలీసు అధికారులను కలుసుకునేందుకు వెళ్ళారు. రోడ్డు పక్కనే పోలీసు స్టేషన్. వారు తమ గోడు సీఐకి వినిపిస్తున్న తరు ణంలో అక్కడికి చిత్తూరు అర్బన్ ఎస్పీ జయలక్ష్మి వెళ్ళారు. రైతులను దాటుకొని హుటాహుటిన స్టేషన్లోకి వెళ్ళారు. గంట తర్వాత బయటికి వచ్చి రైతులు చెప్పింది అయిదు నిమిషాలు ఆలకించి ఇసుక తన పరిధిలోకి రాదనీ, ఇది మైనింగ్, రెవెన్యూ శాఖలకు చెందిన వ్యవహారమనీ, అయినా సరే కనుక్కుంటా ననీ చెప్పి వెళ్ళిపోయారు. ఆమె వెళ్ళిన తర్వాత మీడియా ప్రతినిధులతో రైతులు మాట్లాడు తున్న సమయంలో అదుపు తప్పిన పన్నెండు టైర్ల లారీ రూపంలో భయంకరమైన మృత్యువు వారి మీదికి దూసుకువచ్చింది. అక్కడే ఉన్న రెండు ఆటోలను ఢీకొన్న తర్వాత విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్నది. ఆటోలు ధ్వంసమై పెట్రోలు కారింది. రాపిడికి నిప్పులు లేచి మంటలు వ్యాపించాయి. విద్యుత్ స్తంభం విరిగి కరెంటు షాక్ తగిలింది. టైర్ల కింద పడి, మంటలలో కాలి, విద్యు దాఘాతం తగిలి మొత్తం 15 మంది అక్కడికక్కడే నిమిషాలలో చనిపోయారు. 24 మంది గాయపడ్డారు. తిరుపతిలోని స్విమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మొత్తం విషాదంలో మృతి చెందిన రైతుల తప్పేమిటి? వారి చావుకు కారకులు ఎవరు? ప్రభుత్వం ప్రజల పక్షాన ఉన్నదా, ఇసుక దోపిడీ దారుల పక్షాన ఉన్నదా? తప్ప తాగి మృత్యుశకటాన్ని రైతుల మీదికి దూకించిన డ్రైవర్ గురవయ్యను శుక్రవారమే అరెస్టు చేశారు. లారీ యజమాని నెల్లూరుకు చెందిన రమేష్‌ను శని వారంనాడు అదుపులోకి తీసుకున్నారు. ఇసుకదొంగలు క్షేమం. వారికి అక్రమంగా తోడ్పడిన అధికారులూ, వారికి అండగా నిలిచిన అధికార పార్టీ ప్రముఖులూ, కలెక్టర్ సిద్దార్థ జైన్ సుఖంగా ఉన్నారు. నలభై కుటుంబాలలో విషాదం నింపిన ఈ ఉదంతం ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న అరాచక వ్యవస్థకి సంకేతం. అక్కడ పాలకుల వైఖరికీ, పై నుంచి కింది వరకూ అంతా అక్రమ సంపాదనలో, నేరస్థులకు కొమ్ముకాయడంలో తలమునకలైన దౌర్భాగ్యస్థితికీ నిదర్శనం. శనివారంనాడు ముగ్గురు మంత్రులతో కలిసి ఏర్పేడు వెళ్ళిన ఐటీ మంత్రి నారా లోకేశ్ అసలు ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక మాఫీయా లేనేలేదంటూ బుకాయించారు. కొత్త కలెక్టర్‌గా చేరిన ప్రద్యుమ్నకు మొదటి రోజే చేదు అనుభవం. ఆయన బాధ్యతలు స్వీకరించిన అరగంట వ్యవధిలోనే పెనువిషాదం సంభవించింది. కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్య మంత్రిగా ఉండగా జాయింట్ కలెక్టర్ హోదాలో రాజ కీయ ఒత్తిళ్ళకు లొంగకుండా చట్టబద్ధంగా, నియమబద్ధంగా వ్యవహరించి మంచి అధికారిగా పేరు తెచ్చుకున్న ప్రద్యుమ్న ఇసుకదోపిడీని అరికట్టగలరో లేదో చూడాలి. అటువంటి ప్రయత్నం చేస్తే అధికారపార్టీ ఆగ్రహానికి గురి కాకుండా, స్థానభ్రంశం లేకుండా తప్పించు కోగలరా అన్నది ప్రశ్న. రవాణాశాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంపై విజయవాడ లోక్‌సభ సభ్యుడు నానీ, శాసనసభ్యుడు బోండా ఉమ, ఎంఎల్సీ బుద్ధా వెంకన్న, మేయర్ కోనేరు శ్రీధర్, పోలీసు హౌసింగ్ బోర్డు చైర్మన్ నాగూర్ మీరాలు దౌర్జన్యం చేసి నట్టు సాక్షి పత్రికలో వచ్చిన వార్తను ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)గా పరి గణించాలని ఉమ్మడి హైకోర్టు నిర్ణయించడం చట్టపాలన కోరుకునేవారికి ఊరట. శేషాచలం అడవులలో కూలీలపైన కాల్పులు, గోదావరి పుష్కరాలలో ముఖ్య మంత్రి సమ క్షంలోనే తొక్కిసలాట జరిగి 29 మంది మృతి, ఇప్పుడు ఈ ఘోరం. దర్యాప్తు సాగదు. దోషనిర్ధారణ జరగదు. ఇవి ప్రాణనష్టానికి సంబంధించిన ఘటనలు. అవినీతి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సోషల్‌మీడియా ప్రతాపం విధియుక్త ధర్మం నిర్వహించడంలో ఘోరంగా విఫలం అవుతున్న ప్రభుత్వం వ్యక్తిగత ఎజెండాకోసం పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేయడంలో మాత్రం అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది. ఇందుకు తాజా నిదర్శనం సోషల్ మీడియా వలం టీర్, పొలిటికల్ పంచ్ వెబ్సైట్ నిర్వాహకుడు ఇంటూరి రవికిరణ్‌ను పోలీసులు శుక్రవారం తెల్లవారుజామునే అరెస్టు చేసి కృష్ణాజిల్లా తీసుకొని వెళ్ళి రోజంతా తిప్పి మర్నాడు తెలవారుతుండగా శంషాబాద్‌లో ఇంటి దగ్గర దింపి వేసిన ఉదంతం. కోర్టులో హాజరుపరచకుండా రోజంతా కారులో తిప్పడమే కాకుండా శనివారం ఉదయం వైఎస్ఆర్సీపీ సోషల్‌మీడియా కార్యాలయానికి పోలీసులు వెళ్ళడం అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠ. సామాజిక మాధ్య మంలో వస్తున్న వ్యంగ్యాస్త్రాలను తట్టుకోలేక అసహనానికి గురి అవుతున్న చంద్రబాబు, లోకేశ్ పోలీసులను ప్రయోగించడం వల్ల జాతీయ స్థాయిలో అపకీర్తి మూటగట్టు కున్నారు. చంద్రబాబు రాజకీయ శైలి 1995లో ఏ విధంగా ఉన్నదో ఇప్పుడూ అదే విధంగా ఉన్నది. కానీ మీడియా చాలా మారిపోయింది. సోషల్ మీడియా విశ్వరూపం ప్రదర్శిస్తున్న కాలంలో అన్ని పత్రికల, న్యూస్ చానళ్ళ నోళ్ళు మూయించినా సోషల్ మీడియా కోడై కూస్తుంది. నోమ్ చోమ్స్కీ చెప్పినట్టు సమ్మతి, అసమ్మతి సృష్టిలో ప్రావీణ్యం సంపాదించి తమకు ఇష్టమైన ప్రభుత్వాన్ని గుడ్డిగా సమర్థించడం, ఇష్టంలేని ప్రభుత్వాన్ని అంతే గుడ్డిగా వ్యతిరేకించడంలో ఆరితేరిన పత్రికలూ, చానళ్ళ శక్తిని సవాలు చేస్తున్నది సోషల్ మీడియా. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ముఖ్యమంత్రిగా ఎవరున్నా సోషల్ మీడియాలో విమర్శలకు తావు ఇవ్వకుండా నడుచుకోవలసిందే. ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడంలో సోషల్ మీడియా శక్తి క్రమంగా పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణ కేసు వేయడానికి ప్రాతి పదికగా చూపుతున్న కార్టూన్ని సమర్థించేవారు ఉంటారు. తప్పుపట్టేవారూ ఉంటారు. ఎవరు ఎటువైపు ఉన్నారనేదానిపైన తప్పా, ఒప్పా అన్నది ఆధారపడి ఉంటుంది. అపరిపక్వమైన లోకేశ్ మానసిక స్థితికి అద్దం పట్టడమే తన ఉద్దేశమని రవికిరణ్ వివరించినప్పటికీ ఆ కార్టూన్‌ను మరో విధంగా అన్వయించే అవకాశం ఉంది. వ్యంగ్యాస్త్రాలు సంధించే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒక వేళ రవికిరణ్ చేసింది తప్పు అని శాసనసభ కార్యదర్శికి అనిపించినా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసి శాసనమండలి ఔన్నత్యానికి భంగం కలిగించారు. అసెంబ్లీ కార్యదర్శి తనకు అభ్యంతరంగా కనిపించిన కార్టూన్‌ను శాసనమండలి అధ్యక్షుడి దృష్టికి తీసుకువెళ్ళవలసింది. అసెంబ్లీ కార్యదర్శి కేవలం ఒక ఉద్యోగి. శాసనసభ్యులకూ, శాసనమండలి సభ్యులకూ ఉండే రాజ్యాంగపరమైన హక్కులూ, అధికారాలూ ఉద్యోగికి ఉండవు. కార్టూన్‌పైన చర్చ జరిపించి కార్టూన్ గీయడం తప్పనిపిస్తే రవికిరణ్‌ని మందలించే అధికారం, అభిశంసించే హక్కు శాసనమండలికి ఉంది. అవసరమైతే సభాహక్కుల సంఘాన్ని శాసన మండలి అధ్యక్షుడు నియమించవచ్చు. విచారణ జరిపించవచ్చు. తాము చేస్తే ఒప్పు, ఇతరులు చేస్తే తప్పు ఈ కార్టూన్‌కే ఇంతగా విలవిలలాడిపోయి పోలీసులను ప్రయోగిస్తే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్రెడ్డి మీదా, ఆయన కుటుంబ సభ్యులమీదా సోషల్ మీడియాలోనూ, తెలుగుదేశం పార్టీ అధికార వెబ్సైట్లోనూ, చట్టసభలలోనూ చేస్తున్న వికృతమైన విమర్శలకూ, అర్ధం లేని అభియోగాలకూ ఏ రకమైన శిక్ష ఎవరు విధించాలి? సోషల్ మీడియా ద్వారానే 2014 ఎన్నికల సమయంలో దుష్ప్రచారం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు అదే సోషల్ మీడియా ఇప్పుడు తమపైన విమర్శనాస్త్రాలు సంధిస్తుంటే తట్టుకోలేక అప్రకటిత ఎమర్జెన్సీని తల పింపజేస్తున్నారు. తమ చేతిలో ఉన్న ప్రసార, ప్రచార సాధనాల ద్వారా పని గట్టుకొని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నవారే సోషల్ మీడియా మీద నిప్పులు చెరుగుతున్నారు. తెలుగు రాష్ట్రాలలోనే కాదు, దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ పాలకులపైన సోషల్ మీడియా కొరడా ఝళిపిస్తున్నది. ఇది ప్రత్యామ్నాయ మీడియా. ప్రధానస్రవంతిగా చలామణి అవుతున్న పత్రికలూ, న్యూస్ చానళ్ళూ వాస్తవాలను దాచినా దాగవు. వాటిని అదుపు చేయవచ్చునేమో కానీ సోషల్ మీడియాను అదుపు చేయడం సాధ్యం కాదు. అధికారంలో ఉన్నవారు పోలీసులను ప్రయోగిస్తారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనపైన వచ్చిన వ్యంగ్య చిత్రాన్ని మరొకరికి పంపించిన నేరానికి జాధవ్‌పూర్ యూని వర్శిటీ ప్రొఫెసర్ అభికేశ్ మహాపాత్రను అరెస్టు చేయించారు. పదకొండో తరగతి విద్యార్థి తనపైన విమర్శనాత్మకమైన వ్యాఖ్యను ఫేస్బుక్లో పోస్ట్ చేశాడనే ఆగ్రహంతో అప్పటి ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజంఖాన్ రాంపూర్‌కు చెందిన యువకుడిని అరెస్టు చేయించారు. బాల్‌ఠాక్రే మరణించినప్పుడు బంద్ నిర్వహించడాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు ఇద్దరు యువతులను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. శ్రేయాసింఘాల్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసులో ఐటీ యాక్ట్ సెక్షన్ 66ఎ కింద అరెస్టులు చేయడం తప్పని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ చలమేశ్వర్, ఆర్ఎఫ్ నారిమన్ చారిత్రక తీర్పు ఇస్తూ ఈ సెక్షన్ రాజ్యాంగ విరుద్ధమనీ, చెల్ల నేరదనీ స్పష్టం చేశారు. పార్లమెంటును ఎద్దేవా చేస్తూ కార్టూన్ గీసినందుకు దేశద్రోహం నేరారోపణ చేసి అసీమ్ త్రివేదీని 2012లో అరెస్టు చేసింది కూడా ఈ సెక్షన్ కిందే. భావప్రకటనా స్వేచ్ఛకు రాజ్యాంగం ఎంతటి ప్రాధాన్యం ఇచ్చిందో, 19(2) అధికరణను ఎంత పకడ్బందీగా రూపొందించారో తెలియజెప్పడానికి ఈ తీర్పును ఉదహరించవచ్చు. భావప్రకటనాస్వేచ్ఛ వినియోగంలో పొరపాట్లు జరగ వచ్చు. వాటిని సవరించే విధానం ఉన్నది. అంతే కానీ, అధికారం చేతిలో ఉన్నది కదా అని పోలీసులను వినియోగించడం, అరెస్టులు చేయించడం, వ్యక్తులను భయ భ్రాంతులను చేయడం రాజ్యాంగవిరుద్ధం. కె.రామచంద్రమూర్తి -
ఎస్పీ,కాంగ్రెస్ పొత్తుకు దెబ్బ పడుతుందా ?
-
జల్లికట్టు కనికట్టు
త్రికాలమ్ తమిళనాడు గవర్నర్ చెన్నమనేని విద్యాసాగరరావు జల్లికట్టు సుగ్రీవాజ్ఞ (ఆర్డినెన్స్) ముసాయిదాను ఆమోదించడంతో సముద్రతీరంలో అలజడి సద్దుమణిగింది. చెన్నై మెరీనా బీచ్ నిరసనధ్వనులతో హోరెత్తడానికీ, యువజనంతో పోటెత్తడానికీ కారణం ఏమిటి? ఈ తిరుగుబాటుకు కారకులు ఎవరు? తప్పు ఎవరిది? అమలు సాధ్యం కాని తీర్పు ఇచ్చిన సర్వోన్నత న్యాయస్థానానిదా? వాటిని అమలు చేయడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వానిదా? కోర్టు ఆదేశాలను ధిక్కరించిన ప్రజలదా? ఈ ఉదంతం నుంచి నేర్చుకోవలసిన గుణపాఠాలు ఏమిటి? సముద్రతీరంలో ఉద్యమించిన వారిలో అత్యధికులు జల్లికట్టు క్రీడను చూసి ఉండరు. ఎడ్లను తాకి ఉండరు. సోషల్ మీడియా విశ్వరూపం ఉద్యమకారులలో రైతులు తక్కువ. కళాశాలల్లో విద్యాభ్యాసం చేస్తున్న యువతీ యువకులు ఎక్కువ. సాఫ్ట్వేర్ ఉద్యోగులూ ఉన్నారు. నినాదాలు చేయడం, ధిక్కారస్వరం వినిపించడం కనిపిస్తుంది కానీ పెద్ద పెద్ద ప్రదర్శనలు లేవు. మెరీనాలో యువతరం సంబరం చేసుకున్నట్టు దృశ్యాలు సూచించాయి. యువ శక్తి కొట్టవచ్చినట్టు కనిపించింది. రాజకీయ నాయకులను దగ్గరికి రానీయ లేదు. సినీ తారలనూ దూరంగానే పెట్టారు. ఆత్మగౌరవం కోసం ఉద్యమిస్తు న్నామంటూ యువతీయువకులు ఎవ్వరి నుంచీ సహాయం స్వీకరించలేదు. మదురై నుంచీ, కోయంబత్తూరు నుంచీ, ఇతర దూరప్రాంతాలనుంచీ వచ్చిన వారి కోసం భోజన ఏర్పాట్లు చేయడానికి కొందరు ముందుకు వచ్చారు. ఆత్మ గౌరవం ఉద్యమం చేస్తున్నవాళ్ళం ఇతరుల సాయం స్వీకరించలేమంటూ వారు తేల్చి చెప్పారు. ఇది సోషల్ మీడియా శక్తిని చాటిన ఉద్యమం. కేవలం సోషల్ మీడియా సందేశాలతో, పురమాయింపులతో ప్రేరణ పొంది చదువు లకూ, వ్యాపారాలకూ విరామం ప్రకటించి, ఉద్యోగాలకు సెలవు పెట్టి వేలాది మంది ఉద్యమంలో చేరారు. శాంతియుతంగా ప్రదర్శనలు జరిపారు. ఇది కేవలం జల్లికట్టు ఆటమీద మోజుతోనో, సంస్కృతీ సంప్రదాయాలపట్ల మక్కువతోనో జరిగిన పోరాటం మాత్రమే కాదు. తమ సంస్కృతినీ, సంప్ర దాయాలనూ, ప్రయోజనాలనూ, ఆత్మగౌరవాన్నీ దెబ్బతీసే చర్యలను సహించేది లేదంటూ తమిళులు మరోసారి తెగేసి చెప్పిన సందర్భం. 1930ల నుంచి 1960ల వరకూ సాగిన హిందీ వ్యతిరేక ఉద్యమంతో దీన్ని పోల్చవచ్చు. తమి ళులు హిందీ భాషకి వ్యతిరేకం కాదు. హిందీని తమపైన రుద్దడానికి వ్యతిరేకం. దక్షిణ భారత హిందీ ప్రచారసభ కేంద్ర కార్యాలయం చైన్నైలోనే ఉంది. చాలా మంది తమిళులు హిందీ నేర్చుకున్నారు. హిందీని విధిగా నేర్చుకోవాలని 1940 లలో రాజగోపాలాచారి నిర్ణయించినప్పుడూ, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు అదే విధానాన్ని అమలు చేయడానికి ప్రయత్నించినప్పుడూ ప్రజలు వ్యతిరేకిం చారు. 1964లో హిందీని అధికార భాషగా ప్రకటించినప్పుడు తిరుగుబాటు తారస్థాయికి చేరింది. హిందీని రుద్దడాన్ని చాలా రాష్ట్రాలు వ్యతిరేకించినప్పటికీ అత్యంత ఉధృతంగా, హింసాత్మకంగా ఉద్యమం జరిగింది మద్రాసు రాష్ట్రం లోనే. ఇద్దరు విద్యార్థులు ఆత్మాహుతి చేసుకుంటే చలించిన నాటి ప్రధాని లాల్ బహద్దూర్ శాస్త్రి ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. తమిళ రాజ కీయాలలో తిరుగుబాటు స్వభావం ఆద్యంతం కనిపిస్తుంది. నాయకులకు పాద నమస్కారాలు చేసే దృశ్యాలూ ఆ రాష్ట్రంలోనే కనిపిస్తాయి. ఇది విచిత్రం. జస్టిస్ పార్టీ పుట్టుక, ఆత్మగౌరవ, అస్తిత్వ ఉద్యమాలు, ద్రవిడ ఉద్యమం, హిందీ పట్ల వ్యతిరేకత, ఉత్తరాది పట్ల అసమ్మతి, కేంద్రం ఆధిపత్యాన్ని సహించని నైజం, బ్రాహ్మణ వ్యతిరేక భావజాలం–అన్నీ ఉద్వేగభరితంగా, ఉధృతంగా సాగినవే. గుండెల్లో గుబులు ఇప్పుడు తమిళనాడులో ఒకటిన్నర శతాబ్దంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని కరవు కరాళనృత్యం చేస్తోంది. కావేరీ జలాలు విడుదల చేయడానికి కర్ణాటక పేచీ పెట్టడం, ముళ్ళపెరియార్ డ్యాంను నియంత్రిస్తామంటూ కేరళ ప్రభుత్వం హెచ్చరించడం, శ్రీలంకలో తమిళులు వేల సంఖ్యలో బలైన అనంతరం కూడా వివక్షకు గురి అవుతుంటే సింహళీయుల పార్టీతో కేంద్ర ప్రభుత్వాలు స్నేహం చేయడం తమ ఆత్మగౌరవానికి భంగం కలిగినట్టు తమిళులు భావిస్తున్నారు. 1991లో రాజీవ్ హంతకులకు తమిళనాడులో మద్దతు లభించడానికి కారణం కూడా ఈ భావనే. తమిళ ప్రయోజనాల విషయంలో, స్వయం నిర్ణయాధికారాల విషయంలో ఏ మాత్రం రాజీపడని జయలలిత మరణించడం, కరుణానిధి వయోభారంతో పగ్గాలు కుమారుడు స్టాలిన్‌కు అప్పగించడంతో తమిళులలో ఒక రకమైన అభద్రతాభావం ఏర్పడినట్టుంది. గుండెల్లో గుబులు పుట్టింది. తమిళుల ఆవేశాన్ని ప్రధాని నరేంద్రమోదీ అర్థం చేసుకున్నారు. మతం పేరుతో జాతీయతాభావాన్ని ఉద్దీపింపజేయడంలో సిద్ధహస్తులైనవారికి సాంస్కృతిక ఉద్యమస్ఫూర్తి అత్యంత శక్తిమంతమైనదని తెలుసు. అందుకే తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం వినతిని మోదీ వెంటనే ఆమోదించారు. తీర్పును పునఃపరిశీలించవలసిందిగా సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం అభ్యర్థించింది. సుప్రీంకోర్టు సైతం భేషజాలకి పోకుండా వారం రోజులు గడువు మంజూరు చేసింది. జల్లికట్టు క్రీడను కొనసాగించడానికి అనుమతిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో కేంద్రం ఏకీభవించింది. ఈ అంశం ఉమ్మడి జాబితాలో ఉన్న కారణంగా కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరం. అన్ని ఆమోదాలూ, అనుమతులూ చకచకా రావడానికి కారణం తమిళ పౌరుషంపైన బాధ్యులందరిలోనూ ఉన్న అవగాహన. స్వయంనిర్ణయాధికారాల కోసం సాగిన ద్రవిడ ఉద్యమం సమసిపోయినప్పటికీ సాంస్కృతిక అస్తిత్వ భావనలు బలం గానే ఉన్నాయి. తమిళ ప్రజలు దేశంపట్ల జాతీయభావన కంటే తమ ప్రాంతం పట్ల నిబద్ధతను ఎక్కువగా ప్రదర్శిస్తారని ఆదం జీగ్‌ఫెల్డ్ 2004 సార్వత్రిక ఎన్ని కల తీరుతెన్నులను పరిశోధించి రాసిన ‘హ్యాండ్‌బుక్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్’ తీర్మానించింది. ఈ రచయిత నిర్వహించిన సర్వేలో ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తమిళులలో 90 శాతంమంది దేశం కంటే తమిళనాడు పట్లనే ప్రథమ విధేయత కలిగి ఉంటామని స్పష్టం చేశారు. తమ ప్రాంతం తర్వాతనే దేశం అన్నది వారి వాదన. అమెరికా ఫస్ట్ అంటూ శుక్రవారం 45వ అధ్యక్షుడుగా ప్రమాణం స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినప్పటికీ అమెరికా కంటే కాలి ఫోర్నియా ప్రధానం అనే ప్రజలు ఉన్నారు. సమాఖ్య స్ఫూర్తికి అది విరుద్ధం కాదు. 1950 దశకం ఆరంభంలో అవిభక్త మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోవా లంటూ ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం కోసం తెలుగువారు చేసిన ఉద్యమం ఉధృతికి జవహర్లాల్ నెహ్రూ దిగివచ్చారు. ప్రాంతీయభావన ఎంత బలీయమైనదో ఇటీవల ప్రత్యేక తెలంగాణ కోసం సాగిన ఉద్యమం నిరూపించింది. తమిళులు కానీ ఆంధ్రులు కానీ తెలంగాణ ప్రజలు కానీ దేశాన్ని వ్యతిరేకించడం లేదు. తాము భారతీయులమని సగర్వంగా చెప్పుకుంటారు. కానీ వారి ప్రాంతీయ అస్తిత్వానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. తమ ప్రాంతాన్ని పరాయి పాలకులు ఎన్ని వందల సంవత్సరాలు పరిపాలించినా అయిదు వేల సంవత్సరాలుగా వారి సంస్కృతీసంప్రదాయాలు అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ వచ్చాయని తమిళులు గర్వంగా చెప్పుకుంటారు. దేశంలోని అన్ని ప్రాంతాల, అన్ని జాతుల, అన్ని భాషల సంగతీ అంతే. అదే భారతీయత. హింసాత్మక క్రీడ ప్రతి ఏటా జనవరి మాసంలో నాలుగు రోజులు జరుపుకునే సంక్రాంతి వేడుక లలో భాగం జల్లికట్టు. ఇది ప్రధానంగా మదురై, కోయంబత్తూరులో జరుపుకునే క్రీడ. ముందు వ్యవసాయం ఫలప్రదం కావడానికి దోహదం చేసిన ఎడ్లకు కృత జ్ఞతలు చెబుతూ వాటిని ఆలింగనం చేసుకునే వేడుకగా మొదలై, ఎడ్ల మధ్య పోటీగా మారి, అనంతరం పశువుకీ, మనిషికీ మధ్య పోటీగా రూపాంతరం చెందింది. పాత రోజులలో ఎద్దు కొమ్ములకు బంగారు తొడుగులు తొడిగి ఎద్దును ధైర్యంగా ఎదిరించి కొమ్ములు వంచి వాటిని తీసుకున్నవారిని ధీరులుగా గుర్తించేవారు. ఎద్దును ఓడించి ఆధిక్యం చాటుకోవడంగా మారింది. 1960లలో శివాజీగణేశన్ ఎద్దును లొంగదీసుకునే గ్రామీణ యువకుడుగా నటించిన సినిమా ఈ క్రీడపైన మోజు పెంచింది. ఎద్దును రెచ్చగొట్టడం, హింసించడం ఎక్కువైంది. జంతువులనూ, పశువులనూ ప్రేమించేవారు హింసాత్మకమైన ఈ క్రీడను నిషేధించాలంటూ కోర్టుకు వెళ్ళారు. 2014 మే 7న జల్లికట్టును సుప్రీం కోర్టు నిషేధించింది. ఆ తర్వాత రెండేళ్లు కొన్ని మార్పులతో జల్లికట్టు వంటి క్రీడను అనుమతిస్తూ కేంద్ర అడవులూ, పర్యావరణ శాఖలు ప్రకటన జారీ చేశాయి. దీన్ని పశుసంక్షేమ మండలి, పశువులనూ, జంతువులనూ మానవీ యంగా చూసుకోవాలని కోరుకునే సంస్థ–పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ (పెటా) వ్యతిరేకించాయి. 2016 జనవరి 16న సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ శాఖల ప్రకటనపైన ‘స్టే' ఇచ్చింది. ‘కావాలంటే కంప్యూటర్లో ఎద్దు లతో కుస్తీ పట్టే ఆటలు ఆడుకోండి. ఎద్దులను హింసించడం ఎందుకు?’ అంటూ కేసు విచారణ దశలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రశ్నించారు. కేంద్రంపై పోరాటం సుప్రీంకోర్టు వైఖరికి నిరసనగా విద్యార్థులు ఉద్యమం ప్రారంభించారు. కళాశా లల నుంచి నేరుగా మెరీనా బీచ్‌కు చేరుకున్నారు. జల్లికట్టును అనుమతించాల న్నది ఒక్కటే వారి డిమాండ్. భూసేకరణ ఆర్డినెన్స్‌ను ఐదుసార్లు జారీ చేయిం చిన ప్రధాని మోదీకి జల్లికట్టును అనుమతిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయడానికి అభ్యంతరం ఏమిటంటూ ప్రశ్నించారు. ఒక రోజు పోలీసులు హడావిడి చేశారు. స్టాలిన్ నాయకత్వంలో డిఎంకె కార్యకర్తలు వీధులలో ప్రదర్శనలు నిర్వహిం చారు. రైల్‌రోకో చేశారు. బంద్ పాటించారు. కాంగ్రెస్ సైతం సంఘీభావం ప్రక టించింది. కమల్‌హాసన్, రజనీకాంత్, ధనుష్, రెహ్మాన్, ఖుష్బూ వంటి సినీ ప్రముఖులు, దాదాపు అన్ని రాజకీయ పార్టీలూ సంఘీభావం ప్రకటించడంతో ఉద్యమం ఊపందుకున్నది. ప్రభుత్వ ప్రోత్సాహం ఉంది. ప్రైవేటు విద్యాసంస్థల విద్యార్థులకు క్లాసులకు ఎగనామం పెట్టి మెరీనా బీచ్‌కు వెళ్ళడానికి అనుమతులు ఉన్నాయి. ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం వ్యతిరేకులు ఈ ఉద్యమం వెనక ఉన్నారంటూ కొందరు విశ్లేషిస్తున్నారు. మోదీని వ్యతిరేకించేవారి మద్దతు ఉన్న దని చెప్పేవారు కొందరు. జల్లికట్టుకు దళితులు దూరం ఈ క్రీడలో పాల్గొనడానికి దళితులు ప్రయత్నించిన ప్రాంతాలలో ఆటనే ఆపి వేసిన వైనాన్ని దళిత నాయకులు గుర్తు చేస్తున్నారు. దళితులు పెంచిన ఎద్దులను ఈ క్రీడలో పాల్గొనడానికి సంపన్న, ఆధిక్య కులాలు అనుమతించవు. ఫేస్బుక్ పోస్టింగ్‌లలోనూ దళిత వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది. కానీ జల్లికట్టు కావా లని కోరుకునేవారికి సంఖ్యాబలం ఉంది. ప్రజలను సమీకరించే వ్యవస్థ ఉంది. జల్లికట్టు వ్యవహారంలో లబ్ధిపొందాలని కోరుకునే రాజకీయ పార్టీలు ఉన్నాయి. పన్నీర్‌సెల్వం సమయజ్ఞత ప్రదర్శించి ఢిల్లీ వెళ్ళి పరిస్థితి వివరించి ప్రధాని మద్దతు సంపాదించగలిగారు. శశికళ ముఖ్యమంత్రి కావడం మోదీకి ఇష్టం లేదనే అభిప్రాయం ఉంది. పన్నీర్‌సెల్వం బలహీనపడకుండా ప్రధాని చర్యలు తీసుకున్నారు. రాష్ట్రపతిని, సర్వోన్నత న్యాయస్థానాన్ని ఒప్పించి రాష్ట్ర ప్రభుత్వం చేత ఆర్డినెన్స్ జారీ చేయించడానికి రంగం సిద్ధం చేశారు. ఇందులో న్యాయస్థానాలను తప్పుపట్టడానికి లేదు. చట్టం ప్రకారం నిర్ణ యాలు ప్రకటించడం వాటి వి«ధ్యుక్తధర్మం. సవ్యంగా అమలు కానీ వరకట్న నిషేధం చట్టాన్నీ, అవినీతి నిరోధక చట్టాన్నీ అమలు చేయాలని కోరినట్టే తమిళ నాడులో జల్లికట్లు, ఆంధ్రప్రదేశ్‌లో కోళ్ళపందాలూ, మహారాష్ట్రలో ఎడ్ల బండ్ల పందాలూ నిషేధించడం నాగరిక సమాజంలో అవసరమని కోర్టు భావించింది. జల్లికట్టు ఆడాలనుకునేవారు ఎడ్లను హింసించకుండా, దేశవాళీ పశుసంపద వృద్ధి కావడానికి వీలుగా ఈ క్రీడను మలచుకోవాలి. ఇందులోని పాశవికతను పరిహరించాలి. పశువులను హింసించడం అమానవీయమంటూ ప్రచారం చేయడం ద్వారా ఇటువంటి క్రీడలను సంస్కరించే ప్రయత్నం జంతు పేమికులు చేయాలి. సంప్రదాయలనూ, ఆచారాలనూ రక్షించుకుంటూనే మారుతున్న నాగ రికతకు అనుగుణంగా మార్పులు చేసుకోవాలి. దేశంలో వర్థిల్లుతున్న వైవి ధ్యాన్ని గౌరవించడం దేశ సమైక్యతకీ, సమగ్రతకీ దోహదం చేస్తుంది. ఎవరు తెగే వరకూ లాగినా అందరూ నష్టపోతారు. బాధ్యతాయుతమైన స్థానాలలో ఉన్న వారు ఈ విషయంలో విజ్ఞత ప్రదర్శించడం అభినందనీయం. కె. రామచంద్రమూర్తి -
పవర్ (లేని) స్టార్!
త్రికాలమ్ ‘మా సమస్య ఫలానా తేదీలోగా పరిష్కరించాలంటూ గడువు పెట్టి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తారని ఆశించాం. హైకోర్టు కమిటీ వేయాలట, బీజేపీ నాయ కులకు విజ్ఞప్తి చేస్తారట. ప్రభుత్వానికి విన్నపం చేస్తారట. మేము న్యాయ స్థానా లలో పోరాడితే జనసేన న్యాయసహాయం చేస్తుందట. కలిసొచ్చే పార్టీలను కలుపుకొని శాంతియుతంగా పోరాటం చేస్తారట’ అంటూ నిష్ఠూరంగా, కించిత్ వ్యంగ్యంగా మాట్లాడారు పశ్చిమ గోదావరి నుంచి హైదరాబాద్ వచ్చి పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో తమ గోడు వెళ్ళబోసుకున్న ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీ బాధి తులలో ఒకరు. పవన్ కల్యాణ్ నుంచి ఎంతో ఆశించి వచ్చినవారికి ఆయన స్పందన ఆశాభంగం కలిగించడంలో ఆశ్చర్యం లేదు. అమరావతి సమీపంలో ఉండవల్లి, పెనుమాక గ్రామాల ప్రజల అనుభవం కూడా ఇదే. గర్జించవలసిన కథానాయకుడు మౌనంగా ఉండటం, మెత్తగా మాట్లాడటం, నీళ్ళు నమలడం ఎందుకో అభిమానులకు అర్థం కావడం లేదు. పవర్ స్టార్ రాజకీయం ఏమిటో రాజకీయ పరిశీలకులకు అంతుచిక్కడం లేదు. సినిమా వేరు, రాజకీయం వేరు సినిమాకూ, రాజకీయానికీ ఉన్న వ్యత్యాసం ఏమిటో ఈ పాటికి పవన్ కల్యాణ్‌కు తెలిసే ఉంటుంది. రెండు రంగాలలో శ్రమించినవారే రాణిస్తారు. సినిమా రంగంలో నటుడిగా నిలదొక్కుకొని హీరోగా వెలగాలంటే చాలా కష్టపడాలి. చిరంజీవి వంటి మెగాస్టార్ ఆశీస్సులు ఉన్నప్పటికీ పవన్‌కి స్వయంప్రకాశం లేకపోతే, కష్టపడి పనిచేసే మనస్తత్వం లేకపోతే ఈ స్థాయికి ఎదిగి ఇంత మంది అభిమానులను సంపాదించగలిగేవారు కాదు. సినిమా షూటింగ్లో షెడ్యూళ్ళు ఉంటాయి. ఒక షెడ్యూలుకూ, మరో షెడ్యూలుకూ మధ్య విరామం ఉంటుంది. ఎంత విరామం తీసుకోవాలో, ఎప్పుడు తీసుకోవాలో నిర్ణయించడంలో హీరో ప్రమేయం ఉంటుంది. సినిమాలో వ్యవహారం అంతా డెరైక్టర్, హీరోల అదుపులో ఉంటుంది. రాజకీయాలు వేరు. ఎప్పుడు ఏ సమస్య ఉత్పన్నం అవుతుందో, ప్రత్యర్థులు ఎటువంటి ఎత్తులు వేస్తారో ముందుగా తెలియదు. ఎప్పటికప్పుడు పరిస్థితికి తగినట్టు స్పందించాలి. నిర్విరామంగా పనిచేయాలి. అటు సినిమాలోనూ, ఇటు రాజకీయాలలోనూ అంతిమంగా విజేతలను నిర్ణయించేది ప్రజలే. సినీ నటుడి కంటే రాజకీయ నాయకుడి నుంచి ప్రజలు ఎక్కువ ఆశిస్తారు. నటుడి నుంచి వినోదం కోరు కుంటే రాజకీయ నాయకుడు తమ సమస్యలన్నింటినీ పరిష్కరించాలంటారు. నిరంతరం తమ మధ్యనే ఉండాలని అభిలషిస్తారు. పిలవంగానే పలకాలనీ, రమ్మనగానే రావాలనీ, కష్టాలలో ఆదుకోవాలనీ అనుకుంటారు. జంటనగరా లకు చెందిన బీజేపీ నాయకుడు, కేంద్రమంత్రి దత్తాత్రేయకు సంబంధించి అందరూ చెప్పుకునే మాట ఏమిటంటే, ఎవరైనా ‘దత్తన్నా’ అని కేకవేస్తే ‘అత్తన్నా’ అంటూ వెంటనే బయలుదేరతారట. అందుకే ఆయనకు ప్రజల మనిషి అని పేరు. ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండటం చాలా కష్టం. ఇంతగా శ్రమించినా వారికి మప్పిదాల కంటే తప్పిదాలపైన విమర్శనాస్త్రాలే ఎక్కువ. పవన్‌కల్యాణ్ సందిగ్ధావస్థను అర్థం చేసుకోవాలంటే ఆయన సమస్యను సానుభూతితో పరిశీలించాలి. ఎన్.టి. రామారావు రాజకీయాలలో ప్రవేశించే ముందు సినిమాలన్నీ పూర్తి చేసుకొని పూర్తి సమయం కేటాయించాలని నిర్ణయిం చుకున్నారు. పార్టీ నెలకొల్పిన తొమ్మిది మాసాలకే ఎన్నికలలో అద్భుతమైన విజయం సాధించి అధికారంలోకి అట్టహాసంగా వచ్చారు. ఆ తర్వాత ఇరవై ఆరు సంవత్సరాలకు మెగాస్టార్ చిరంజీవి రాజకీయ రంగప్రవేశం చేశారు. సినిమా లకు స్వస్తి చెప్పి, సొంతంగా ప్రజారాజ్యం పార్టీని నెలకొల్పి, రాష్ట్రం అంతటా ప్రచారం చేసి అదృష్టం పరిశీలించుకున్నారు. మెజారిటీ సాధించడానికి సరిపడి నంతగా ప్రజల మద్దతు కూడగట్టలేకపోయారు. పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. రాజ్యసభ సభ్యత్వాన్నీ, కేంద్ర సహాయమంత్రి పదవినీ పుచ్చుకున్నారు. తన శక్తిమీదా, పరిస్థితులమీదా ఎన్టీఆర్‌కీ, చిరంజీవికీ స్పష్టమైన అవగాహన ఉంది. రంగంలోకి దిగిన తర్వాత శక్తినంతా కూడగట్టుకొని పోరాటం చేశారు. రామారావుకు ఉన్నంత ప్రజాదరణ చిరంజీవికి లేదు. చిరంజీవికి ఉన్న జనా కర్షణ పవన్ కల్యాణ్‌కి లేదు. తెలుగు యువతలో పవన్ పట్ల విశేషమైన అభి మానం ఉన్న మాట నిజం. అతనితో పాటు ఇతర హీరోలకు కూడా అభి మానులు ఉన్నారు. రామారావు నటుడుగా రంగంలో ఉన్నంత వరకూ ఆయనదే అగ్రస్థానం. సాటి హీరోలతో పోల్చితే చిరంజీవిదే పైచేయి. అంత స్పష్టమైన ఆధిక్యం సినిమాలలో పవన్ కల్యాణ్‌కి లేదు. రాజకీయాలలోనూ రాదు. నాటకీయంగా రంగప్రవేశం 2014 ఎన్నికలకు పూర్వం బీజేపీ నాయకుడు సోము వీర్రాజు వెంట గాంధీనగర్ వెళ్ళి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీని కలుసుకోవడం, హైదరాబాద్‌కి తిరిగి వచ్చిన అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని ఇంటికి రప్పించుకోవడం, ఎన్నికల ప్రచార సభలలో మోదీతో, నాయుడితో వేదిక పంచుకోవడం. మోదీ పవనాలూ, పవన్ ప్రభావం ఫలితంగా టీడీపీ ఒక్క శాతం ఆధిక్యంతో అధికారం హస్తగతం చేసుకోవడం చరిత్ర. ‘మీరు చెబితే టీడీపీకి ఓటు వేశాం. అందుకే మా బాధలు చెప్పుకోవడానికి వచ్చాం’ అంటూ శనివారం నాడు పవన్‌కల్యాణ్‌ని కలుసుకున్న బాధితులు సూటిగా చెప్పారు. టీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచిన తర్వాత 2015 మార్చి 5న పవన్‌కల్యాణ్ అమరావతి ప్రాంతంలో పరిస్థితులు అధ్యయనం చేసేందుకు పర్యటించారు. ఉండవల్లి, బేతపూడి, తుళ్ళూరు గ్రామాల ప్రజలతో మాట్లాడారు. భూసేకరణ చట్టం తెచ్చి భూములను బలవంతంగా తీసుకుంటామంటూ కొందరు మంత్రులు ప్రకటనలు జారీ చేయడంతో ఆగస్టు 23న రెండోసారి రాజధాని ప్రాంతాన్ని సందర్శించారు. ఆ సందర్భంగా పెనుమాక సభలో మాట్లాడుతూ, బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తున్నాననీ, ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడితో మాట్లాడతాననీ, అవసరమైతే నిరాహారదీక్ష చేస్తాననీ ప్రక టించారు. కొద్ది రోజుల తర్వాత కామినేని శ్రీనివాస్‌తో ప్రత్యేక విమానంలో విజయవాడ వెళ్ళి ముఖ్యమంత్రిని కలుసుకున్నారు. అప్పుడే స్వరం మారింది. భూసేకరణ అవసరమేననీ, ప్రజలను ఒప్పించి భూమి సేకరించాలని ముఖ్య మంత్రికి చెప్పాననీ మీడియా ప్రతినిధులతో అన్నారు. అప్పటి నుంచి ఇంత వరకూ అమరావతి భూముల ప్రస్తావన లేదు. బందరు రేవు కోసం లక్ష ఎక రాలు సేకరిస్తామంటూ ప్రభుత్వం ప్రకటించినా స్పందన లేదు. ప్రత్యేక హోదా రాదని తెలిసి ప్రజలు నిరసన ప్రకటించినప్పుడు తిరుపతిలో, కాకినాడలో సభలు నిర్వహించి బీజేపీకి వ్యతిరేకంగా వాగ్బాణాలు వదిలి ముఖ్యమంత్రిని మాత్రం ఉపేక్షించారు. అన్ని జిల్లాలలో సమావేశాలు పెడతానని తిరుపతిలో చెప్పిన పవన్ కాకినాడతో ప్రత్యేక హోదా ఉద్యమానికి స్వస్తి చెప్పారు. ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నవారిని కలుసుకొని మద్దతు ప్రకటించడం తన కనీస కర్తవ్యమని ఆయన భావించి ఉంటారు. తీరా కలిసిన తర్వాత గట్టి హామీలు ఇవ్వలేకపోయారు. ఆ ఫ్యాక్టరీని ప్రభుత్వం ఎందుకు ప్రోత్సహిస్తున్నదో అర్థం కావడంలేదని అన్నారు. ఆ ప్రాంతంలోని పార్లమెంటు సభ్యులూ, శాసనసభ్యులూ ఎందుకు పట్టించుకోవడంలేదో తెలి యదు అంటూ ఆవేదన వెలిబుచ్చారు. నాయకుల ప్రమేయం పెద్దగా లేకుండా ప్రజలే పోరాడుతున్నారు. ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం మహిళలే ఆందోళన కొనసాగిస్తున్నారు. 35 రోజులుగా గ్రామాలలో పురుషులు లేరు. వారు పోలీ సులకు భయపడి ఎక్కడో తలదాచుకున్నారు. 144 సెక్షన్ అమలులో ఉంది. పురుషులతో పాటు మహిళలపైన కూడా బైండింగ్వోవర్ కేసులూ, 307 కేసులూ పెడుతున్నారనీ, పోలీసు జులుం విపరీతంగా పెరిగిందనీ, బెయిలు రాకుండా కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారనీ, ఉద్యమాన్ని ఉక్కుపాదం అణచాలని చూస్తున్నారనీ ఆందోళనకారులు చెబుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని లోక్‌సభ, శాసనసభ నియోజక వర్గాల లోనూ తెలుగుదేశం-బీజేపీ కూటమి అభ్యర్థులే గెలిచారు. రైతుల రుణాలూ, డ్వాక్రా మహిళల రుణాలూ మాఫ్ చేస్తానంటూ చంద్రబాబునాయుడు చేసిన వాగ్దానాన్ని ప్రజలు విశ్వసించారు. ఈ కూటమికి ఓటు వేయాలనీ, ప్రజల కష్టనష్టాలను తాను కాచుకుంటాననీ పవన్ కల్యాణ్ చెప్పిన మాట నమ్మారు. అందరూ అధికార పార్టీ ప్రతినిధులే కనుక ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించ లేకపోతున్నారు. ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళన చందుర్రు, కె. బేత పూడి, జొన్నలగరువు గ్రామాలలో రాజుకొని మొత్తం 30 గ్రామాలకు విస్తరిం చింది. ఇవన్నీ నరసాపురం, భీమవరం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోనివి. నరసాపురం శాసనసభ్యుడు మాధవనాయుడూ, భీమవరం ఎంఎల్ఏ అంజి బాబూ ప్రభుత్వానికీ, ప్రజలకూ మధ్య నలిగిపోతూ కుమిలిపోతున్నారు. ముఖ్య మంత్రికి వాస్తవాలు చెప్పే ధైర్యం లేదు. ప్రజలకు నచ్చజెప్పే సామర్థ్యం లేదు. సీపీఎం నాయకుడు మధుని భీమవరంలో ఈడ్చుకుంటూ తీసుకొని వెళ్ళి పోలీసు స్టేషన్లో పెట్టినప్పుడు వేడి పెరిగింది. వైఎస్ఆర్సీపీ శాసనమండలి సభ్యుడు మేకా శేషుబాబు బృందాకరత్‌తో కలిసి భీమవరం వె ళ్ళి బహిరంగ సభలో పాల్గొన్నారు. అంతకు ముందు వైఎస్ఆర్సీపీ నాయకులు పార్థసారథి, మోపిదేవి వెంకటరమణ ఆ ప్రాంతంలో పర్యటించారు. పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్‌రెడ్డి ఈ నెల 19వ తేదీన ఆందోళన జరుగుతున్న ప్రాంతాలను సందర్శి స్తారని ఆళ్ళ నానీ ప్రకటించారు. సిద్ధూ, పవన్‌లది ఒకే బాట టీడీపీ అభ్యర్థులను గెలిపించడానికి ప్రేరేపించిన వ్యక్తిగా, ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పవన్‌కల్యాణ్ నిరుడు లాఠీచార్జి జరిగినప్పుడే అక్కడికి వెళ్ళవలసింది. ఇప్పుడు కూడా ఒక స్వచ్ఛంద సంస్థకు చెందిన సురేష్ అనే వ్యక్తి కొంత మంది బాధితులను హైదరాబాద్ తీసుకువచ్చి పవన్‌తో కలిపించారు. తాను స్వయంగా వెడితే ఆ ప్రాంతంలో ఆవేశాలు పెరిగి, కులాల మధ్య గొడవలు జరిగే ప్రమాదం ఉన్నదనీ, శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందనీ భావించి అక్కడికి వెళ్ళాలన్న సంకల్పం విరమించుకున్నాననీ సంజాయిషీ చెప్పారు. అమరావతి ప్రాంతంలో రెండుసార్లు చేసిన పర్యటనకు ఈ వాదన వర్తించదా? పంజాబ్‌కు చెందిన క్రికెట్ క్రీడాకారుడూ, వ్యాఖ్యాత, పార్లమెంటు మాజీ సభ్యుడూ నవజ్యోత్ సిద్ధూకు ఉన్నట్టే పవన్ కల్యాణ్‌కు సైతం ప్రాప్తకాలజ్ఞత ఉన్నదేమో. వాస్తవిక దృష్టి ఉన్నవాడు కనుకనే బీజేపీ నుంచి వైదొలగి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌తో పొత్తు పొసగక కొత్త వేదిక ‘ఆవాజ్-ఇ-పంజాబ్’ను నెలకొల్పిన తర్వాత మరో అడుగు ముందుకు వేయ డానికి ధైర్యం చాలలేదు. కాంగ్రెస్ నాయకులతో సమాలోచనలు జరుపుతున్నారు. కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసే అవకాశం ఉన్నదని పరిశీలకులు అంటున్నారు. సిద్ధూ సహకారం లేకుండానే కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా కొత్త శాసనసభలో అవతరించే అవకాశం ఉన్నట్టు ఇండియా టుడే - ఒపీనియన్ పోల్ సర్వే సూచించింది. సిద్ధూ భుజం కలిపితే మెజారిటీ సాధించవచ్చు. ఏదైనా ఒక పార్టీ తరఫున ప్రచారం చేసి దాని విజయానికి దోహదం చేయగలను కానీ సొంత పార్టీని విజయపథంలో నడిపించలేననే అవగాహన సిద్ధూకు ఉంది. అదేరకమైన జ్ఞానం పవన్‌కల్యాణ్‌కూ ఉన్నట్టు భావించాలి. కాంగ్రెస్‌కూ, సిద్ధూకూ మధ్య ఎటువంటి ఒప్పందం జరుగుతోందో ఇతరులకు తెలియనట్టే చంద్రబాబునాయుడికీ, పవన్ కల్యాణ్‌కీ మధ్య ఎటువంటి రహస్య అవగాహన ఉన్నదో, ముఖ్యమంత్రిపైన ఇసుమంత విమర్శ చేయడానికి కూడా పవర్ స్టార్ ఎందుకు సంకోచిస్తున్నారో మనకు తెలియదు. ఒకటి మాత్రం తెలుసు. రాజ కీయాలలో రాణించడానికి అవసరమైన తెగువ, శక్తి పవన్ కల్యాణ్‌కు లేవు. కె. రామచంద్రమూర్తి -
పాఠశాలల సమస్యలను ప్రభ్యత్వం దృష్టికి తీసుకెళ్తాం
-
సాక్షి ప్రసారాల నిలుపుదలపై కౌంటర్ కు ఆదేశం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతపై దాఖలైన కేసు విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా పడింది. దీనిపై ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. సాక్షి టీవీ ప్రసారాల విషయంలో ఎంఎస్‌వోలకు ఏ రకమైన ఆటంకాలు కలిగించకుండా ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీలను నియంత్రించాలని కోరుతూ సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. కేబుల్ టీవీ చట్టం సెక్షన్ 19 ప్రకారం ఉత్తర్వులు ఇవ్వకుండా కేబుల్ టీవీ ప్రసారాల్లో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఈ పిటిషన్ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి అర్హమైన కేసుగా ఆయన స్పష్టం చేశారు. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేశారు. కాగా తమ టీవీ చానల్ ప్రసారాల నిలుపుదల విషయంలో న్యాయపోరాటానికి దిగిన సాక్షి టెలివిజన్ ... ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శి, టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) చైర్మన్, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎంఎస్‌వోల ఫెడరేషన్లను ప్రతివాదులుగా పేర్కొంది. అన్ని జిల్లాల్లోనూ సాక్షి టీవీ ప్రసారాలు ప్రజలకు అందుబాటులో ఉండేందుకు చర్యలు తీసుకునేలా జిల్లా కలెక్టర్లను ఆదేశించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. సాక్షి ప్రసారాలను నిలిపేయాలని ఎంఎస్‌వోలకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీలు ఇచ్చిన ఆదేశాలను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరింది. -
ఏపీలో ప్రసారాల నిలుపుదలపై ‘సాక్షి’ న్యాయపోరాటం
- ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీలను నియంత్రించండి - సాక్షి టీవీ ప్రసారాలకు ఆటంకం కలిగించకుండా చూడండి - ప్రసారాలు వచ్చేలా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలివ్వండి - రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ప్రసారాల నిలుపుదల - రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనను అడ్డుకోండి - హైకోర్టులో సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ రామచంద్రమూర్తి పిటిషన్ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో తమ టీవీ చానల్ ప్రసారాల నిలుపుదల విషయంలో సాక్షి టెలివిజన్ న్యాయపోరాటం చేపట్టింది. సాక్షి టీవీ ప్రసారాల విషయంలో ఎంఎస్‌వోలకు ఏ రకమైన ఆటంకాలు కలిగించకుండా ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీలను నియంత్రించాలని కోరుతూ సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి హైకోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంలో ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శి, టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) చైర్మన్, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎంఎస్‌వోల ఫెడరేషన్లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లోనూ సాక్షి టీవీ ప్రసారాలు ప్రజలకు అందుబాటులో ఉండేం దుకు చర్యలు తీసుకునేలా జిల్లా కలెక్టర్లను ఆదేశించాలని తన పిటిషన్లో ఆయన న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. సాక్షి ప్రసారాలను నిలిపేయాలని ఎంఎస్‌వోలకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీలు ఇచ్చిన ఆదేశాలను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరారు. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీల చర్యలు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని రామచంద్రమూర్తి తన పిటిషన్లో పేర్కొన్నారు. అంతేగాక ఇది రాజ్యాంగ హక్కులనూ ఉల్లంఘించడమేనన్నారు. ట్రాయ్ నిబంధనల ప్రకారం ఏదైనా టీవీ ప్రసారాల్ని నిలిపేయాలంటే మూడు వారాలముందు నోటీసులు జారీ చేసి, తగిన కారణాలను వివరించాల్సి ఉందన్నారు. అంతేగాక ప్రసారాలు నిలిపివేస్తున్న విషయాన్ని పత్రికాముఖంగా ప్రజలందరికీ తెలియచేయాల్సి ఉందన్నారు. అయితే తమ టీవీ ప్రసారాల నిలిపివేత విషయంలో ఎటువంటి నోటీసులు జారీ చేయలేదని తెలిపారు. ప్రసారాల నిలిపివేత అధికారం ట్రాయ్‌కు మాత్రమే ఉందన్నారు. అయితే ఇక్కడ మాత్రం హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీల ఆదేశాల మేరకు ఎంఎస్‌వోలు తమ చానల్ ప్రసారాలను నిలిపేశారని ఆయన కోర్టుకు నివేదించారు. ఇలా చేసే అధికారం వీరికి లేదన్నారు. గతంలోనూ చట్టవిరుద్ధంగా ఇలా ప్రసారాలను నిలిపేయడాన్ని టెలికం వివాదాల పరిష్కార అప్పిలేట్ ట్రిబ్యునల్ (టీడీఎస్ఏటీ), సుప్రీంకోర్టులు తప్పుపట్టాయని గుర్తుచేశారు. చట్టనిబంధనలను ఏరకంగానూ సాక్షి టీవీ ఉల్లంఘించలేదని, అయినప్పటికీ తమ టీవీ ప్రసారాల్ని నిలిపివేయించారని తెలిపారు. ప్రభుత్వ విధానాల్లో లోపాల్ని ఎత్తిచూపుతున్నామన్న కారణంతో అన్యాయంగా, చట్టవిరుద్ధంగా తమ చానల్ ప్రసారాలను ఆపివేయించారన్నారు. చట్టవిరుద్ధ చర్యలకు పోలీసులను ఉపయోగిస్తున్నారని, అన్ని జిల్లాల ఎస్పీల ద్వారా ఆయా జిల్లాల్లోని ఎంఎస్‌వోలకు తమ టీవీ ప్రసారాల నిలుపుదలకు ఆదేశాలు జారీ చేయించారని వివరించారు. ప్రసారాల నిలుపుదల ప్రభావం ఆంధ్రప్రదేశ్‌కే పరిమితమవలేదని, ఎంఎస్‌వోల ప్రభావమున్న మూడు తెలంగాణ జిల్లాల్లోనూ ఉందన్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే.. ప్రసారాల నిలుపుదల విషయాన్ని తాము లిఖితపూర్వంగా హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీల దృష్టికి తీసుకొచ్చామని, అయితే దీనిపై వారు ఏ రకంగానూ స్పందించలేదని, దీనివెనుక దురుద్దేశాలున్నాయని రామచంద్రమూర్తి తెలి పారు. సమాచార ప్రసరణ అన్నది భావ ప్రకటన హక్కులో భాగమని, దీనిని అడ్డుకోవడమంటే రాజ్యాంగ హక్కులను అడ్డుకోవడమేనని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాల్లో లోపాలను ఎత్తిచూపుతున్నామన్న కారణంతో రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా తమ టీవీ ప్రసారాలను నిలుపుదల చేయించారని తెలిపారు. తమ ప్రసారాలను ప్రభుత్వమే నిలుపుదల చేయిం చిన విషయాన్ని డిప్యూటీ సీఎం బహిరంగం గా అంగీకరించారన్నారు. ప్రసారాల నిలిపివేతకు శాంతిభద్రతలను కారణంగా చూపుతున్నారని, అయితే అందుకు ఆధారాల్ని మా త్రం చూపట్లేదని వివరించారు. ప్రసారాలవల్ల శాంతిభద్రతల సమస్యలు వస్తాయని చెబితే సరిపోదన్నారు. ప్రభుత్వ విధానాల్ని విమర్శించే వారిని ఓ పద్ధతి ప్రకారం నియంత్రించాలన్న ఉద్దేశంతోనే హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీలు ఇలా చేస్తున్నారన్నారు. ప్రభుత్వ ఉచ్చులో చిక్కనివారి పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఏపీ ప్రత్యేక కోర్టుల చట్టం కింద సాక్షి పత్రిక, టీవీ ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి పత్రికాముఖం గా ప్రకటనలు చేశారన్నారు. కోర్టు పరిధిలో ఉన్న అంశంపై వారు దురుద్దేశాలతోనే మాట్లాడారని తెలిపారు. మీడియా హక్కుల గురించి సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో స్పష్టమైన తీర్పులు వెలువరించిందని గుర్తుచేశారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీల చర్యలు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని, అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ఆయన న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. సాక్షి టీవీ ప్రసారాల విషయంలో ఏ రకంగానూ జోక్యం చేసుకోకుండా ప్రతివాదులకు ఆదేశాలివ్వాలని కోరారు. -
‘ప్రత్యేక’ పరీక్ష
త్రికాలమ్ ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయాలన్న రంధిలో అనైతికంగా వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు అనూహ్యంగా మిత్రపక్షానికి దూరం అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాదనే సంకేతాలు చాలా కాలంగా వెలువడుతున్నాయి. శుక్రవారంనాడు పార్లమెంటులో దేశీయాంగ సహాయమంత్రి హెచ్‌పి చౌదరి ఒక ప్రైవేటు బిల్లుపైన చర్చకు సమాధానం చెబుతూ, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ప్రసక్తి లేదని తేల్చిచెప్పడంతో ఈ విషయంలో కేంద్రప్రభుత్వ వైఖరి పట్ల అనుమానాలు ఏమైనా ఉంటే అవి పటాపంచలైనాయి. 14వ ఆర్థిక కమిషన్ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను సిఫార్సు చేయలేదని మంత్రి స్పష్టం చేశారు. కొత్త రాష్ట్రానికి అదనపు నిధులు సమకూర్చే విషయం నీతిఆయోగ్ పరిశీలనలో ఉన్నదనీ, నీతిఆయోగ్ నివేదిక అందగానే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనీ మంత్రి చెప్పారు. ప్రత్యేక హోదాకోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ముఖ్యంగా ఉద్యోగార్థులు, కొండంత ఆశతో నిరీక్షిస్తున్నారు. ప్రత్యేక హోదా ఫలితంగా ఆదాయం పన్నులో, ఎక్సైజ్ సుంకంలో, విద్యుచ్ఛక్తి చార్జీలలో లభించే రాయితీలను దృష్టిలో పెట్టు కొని అనేక కొత్త పరిశ్రమలు వస్తాయనీ, వేల సంఖ్యలో ఉద్యోగావకాశాలు ఏర్పడతాయనీ లక్షల మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ (తెదేపా) అధ్యక్షుడు చంద్రబాబునాయుడూ, భారతీయ జనతా పార్టీ (భాజపా) ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీ 2014 ఎన్ని కల బహిరంగ సభలలో ప్రత్యేక హోదాపైన సంయుక్తంగా వాగ్దానం చేశారు. ఎన్నికల ప్రణాళికలో ఈ హామీని పొందుపరిచారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవ హారాల మంత్రి వెంకయ్యనాయుడు ఈ విషయంలో అనేక విడతల హామీలు ఇచ్చారు. నాటి ప్రధాని మన్మోహన్సింగ్ అయిదేళ్ళపాటు ప్రత్యేక హోదా ఉంటుందంటే అయిదేళ్ళు సరిపోవు పదేళ్ళు కావాలంటూ రాజ్యసభలో పోరాడిన వెంకయ్యనాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రత్యేక హోదా వస్తున్నదనే చెప్పుకుంటూ వచ్చారు. అయిదేళ్ళు అస్సలు సరిపోదు కనీసం పదిహేనేళ్ళయినా ప్రత్యేక హోదా ఉంటే పరిశ్రమలు వచ్చి నిలుస్తాయంటూ చంద్రబాబునాయుడు ఎన్నికలకు ముందూ తర్వాతా మాట్లాడారు. ప్రత్యేక హోదా ప్రసక్తి లేదని కేంద్రం స్పష్టం చేయడం వల్ల చంద్రబాబునాయుడు ఏమి చేయాలి? ‘రాష్ట్రాన్ని కేంద్రం పట్టించుకోవడం లేదు. ప్రత్యేకహోదా, రైల్వేజోన్, ఆర్థిక సహాయం విషయంలో నిమ్మకు నీరెత్తినట్టు ఉంటోంది’ అంటూ ముఖ్యమంత్రి నిష్ఠురమాడారు. భాజపా ఎదురుదాడి ముఖ్యమంత్రిపైన ఎదురుదాడి చేయడానికి భాజపా నాయకులు సంకోచిం చడం లేదు. కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి ఘాటైన విమర్శలు చేస్తున్నారు. ‘నిధులు ఉదారంగా ఇస్తున్నాం. కానీ ఖర్చుల లెక్కలు చెప్పడం లేదు. కేంద్ర నిధులను వినియోగించే పథకాల పేర్లు మార్చి సొంతడబ్బా కొట్టుకుంటున్నారు’ అన్నారు. రెండు లక్షల ఇళ్ళ నిర్మాణానికి కేంద్రం నిధులు మంజూరు చేస్తే ఆ పథకానికి ‘ఎన్టీఆర్ హౌసింగ్ ప్రోగ్రాం’ అని పేరు పెట్టుకున్నారనీ, గ్రామాలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించేందుకు నిధులు పంపిస్తే ఆ కార్యక్రమం పేరును ‘ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు’గా మార్చారనీ భాజపా నాయకుల విమర్శ. ప్రతిపక్ష నాయకుడు జగన్మోహనరెడ్డిని కలుసుకున్నందుకు కేంద్రమంత్రులను రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తప్పు పడితే, ‘ప్రతిపక్ష నాయకుడిని కేంద్రమంత్రులు కలుసుకోవడంలో తప్పేముంది?’ అంటూ భాజపా మంత్రి మాణిక్యాలరావు ప్రశ్నించారు. హైదరాబాద్ హైకోర్టు విభజన జరగపోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కారణమనీ, ఇందుకు అవసరమైన ప్రాథమిక సదుపా యాలను రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కల్పించవలసి ఉన్నదనీ కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ పార్లమెంటులో చెప్పారు. ‘రాజధానే లేకపోతే హైకోర్టుకు ప్రాథమిక సదుపాయాలు ఎక్కడినుంచి తెస్తాం?’ అంటూ రాష్ట్ర మానవవనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. మిత్రపక్షాలు పరస్పరం నిందించుకోవడానికి ఏ మాత్రం సంకోచించడం లేదనీ, రెండు పక్షాల మధ్య దూరం పెరుగుతోందనీ ఈ ఉదంతాలు సూచిస్తున్నాయి. మొదటి నుంచీ నరేంద్రమోదీకీ, చంద్రబాబునాయుడికీ మధ్య సంబంధాలు అంతంత మాత్రమే. మోదీ ఏదీ విస్మరించరూ, క్షమించరూ అంటారు. గుజరాత్లో 2002లో మారణహోమం జరిగినప్పుడు ముఖ్యమంత్రి పదవి నుంచి మోదీని తప్పించాలని పట్టుబట్టిన మిత్రపక్షాలలో తెదేపా ప్రధానమైనది. ఈ మేరకు ఎన్డీఏ సమావేశంలో తీర్మానం రూపొందించడంలో చంద్రబాబునాయుడిది కీలకపాత్ర అంటారు. ఆ తర్వాత హైదరాబాద్ శివార్లలో అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరిగినప్పుడు మోదీ ప్రచారానికి వస్తారని తెలిసి అప్పటి నగర పోలీసు కమిషనర్ కృష్ణారావు ‘మోదీ హైదరాబాద్‌లో అడుగుపెడితే అరెస్టు చేస్తాం’ అని ప్రకటించారు. అప్పుడు అడ్వానీ అడ్డుపడకపోతే మోదీ రాజకీయ జీవితం మరో విధంగా ఉండేది. ఇటీవల చంద్రబాబునాయుడు ప్రధానిని కలిసినప్పుడు ‘నాయుడు గారూ మీరు బలమైన ముఖ్యమంత్రి. గట్టి ముఖ్యమంత్రులు తరచుగా ఢిల్లీకి రారు’ అంటూ వ్యాఖ్యానించారట. చంద్రబాబునాయుడికి ప్రధానమంత్రితో మాట్లాడే అవకాశాలే తక్కువ. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ప్రధానిని కలుసుకునే పరిస్థితి లేదు. పైగా అమిత్ర వైఖరి కనిపిస్తోంది. రాష్ట్రంలో భాజపా నాయకులు తెదేపాతో మైత్రీబంధాన్ని ఎంత త్వరగా తెంచుకుంటే అంత మంచిదని తలపోస్తున్నారు. సొంతంగా ఎదగాలని కలలు కంటున్నారు. అందుకే ఇటీవల వారి మాటలలో పదును పెరిగింది. ‘ఢిల్లీతో పెట్టుకోవద్దు’ ఈ నేపథ్యంలో చంద్రబాబునాయుడు ఏమి చేయాలి? భాజపాతో తెగతెంపులు చేసుకోవాలా? ఇద్దరు కేంద్రమంత్రులను ఉపసంహరించుకోవాలా? ప్రతిపక్ష నాయకుడు జగన్మోహనరెడ్డి శనివారం డిమాండ్ చేసింది కూడా ఇదే. చంద్ర బాబునాయుడు భాజపాకి రాంరాం చెప్పగలరా? అవమానాలను సహిస్తూ మౌనంగా మైత్రీబంధంలో కొనసాగుతారా? చాలా జటిలమైన సమస్య. ‘ఢిల్లీతో పెట్టుకోవద్దు’ అన్నది ఎమ్జీ రామచంద్రన్ సిద్ధాంతం (డాక్ట్రిన్). అమెరికాలో రొనాల్డ్ రేగన్ లాగానే ఎమ్జీ రామచంద్రన్ కూడా సినిమాలో విజయఢంకా మోగించి రాజకీయాలలోనూ బావుటా ఎగురవేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడి మాదిరిగానే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కూడా నూటికి నూరుపాళ్ళు ఆచరణవాది. భేషజాలు లేవు. పంతాలూ పట్టింపులూ లేవు. ఇందుకు ఎంజీఆర్ తీసుకున్న కీలకమైన రాజకీయ నిర్ణయాలే నిదర్శనం. 1976లో ఇందిరాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కరుణానిధి నేతృత్వంలోని డిఎంకె ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించింది. 1977 మార్చిలో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఎమ్జీ రామచంద్రన్ నాయక త్వంలో అప్పుడే ఏర్పడిన ఆల్ ఇండియా అన్నా డిఎంకె (ఏఐఏడిఎంకె) కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని పోరాడింది. తమిళనాడులోని మొత్తం 39 లోక్‌సభ నియోజకవర్గాలలోనూ 34 స్థానాలను కాంగ్రెస్-ఏఐఏడిఎంకె గెలుచుకుంది. ఇందులో సగం (17) స్థానాలు ఏఐఏడిఎంకెకి దక్కాయి. దక్షిణాదిన గెలుపొం దిన కాంగ్రెస్ పార్టీ ఉత్తరాదిలో ఘోర పరాజయం చెందింది. కేంద్రంలో జనతా పార్టీ అధికారంలోకి వచ్చి మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వెంటనే ఎంజీఆర్ జనతా ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికలు జరిగిన రెండు మాసాలకే, 1977 జూన్‌లో, తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్‌తో పొత్తుకు స్వస్తి చెప్పి ఏఐఏడిఎంకె ఒంట రిగా పోరాడి మెజారిటీ స్థానాలు గెలుచుకుంది. ఆ విధంగా ఎంజీఆర్ మొట్టమొదటి సారి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. 1980లో తిరిగి అధికారంలోకి వచ్చిన ఇందిరాగాంధీ ఎంజీఆర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించి ప్రతీకారం తీర్చుకున్నారు. తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఎంజీఆర్ విరోధి కరుణానిధితో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకున్నది. అయినా సరే, ఎంజీఆర్ ఒంటరిగా పోరాడి విజయం సాధించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే కాంగ్రెస్ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి విధేయత ప్రకటించారు. కాంగ్రెస్-ఏఐఏడిఎంకెల బంధం 1987లో ఎంజీఆర్ మర ణించేవరకూ కొనసాగింది. ఏ ప్రాంతీయ పార్టీ అయినా కేంద్రంతో సున్నం వేసుకోవడంలో అర్థం లేదని ఎంజీఆర్ అభిప్రాయం. కేంద్రంతో సఖ్యంగా ఉంటే తమిళనాడులో తన పాలనకు అంతరాయం రాకుండా చూసుకోవచ్చు. కేంద్రం నుంచి నిధులు ఉదారంగా లభిస్తాయి. కేంద్రంతో కయ్యం పెట్టుకుంటే ఏదో ఒక మిషతో అస్థిరత సృష్టించవచ్చు. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ని ప్రయోగించవచ్చు. రాష్ట్రపతి పాలన విధించవచ్చు. బొమ్మైకేసుతో మలుపు 1994లో బొమ్మైకేసులో తొమ్మిదిమంది న్యాయమూర్తుల రాజ్యాంగపీఠం తీర్పు ఇచ్చిన తర్వాత 360వ అధికరణను విచ్చలవిడిగా వినియోగించి రాష్ట్రపతి పాలన విధించడం తగ్గింది. 1985లో ఫిరాయింపుల నిరోధక చట్టం రావడానికి పూర్వం ‘ఆయారాం గయారాం’ సంస్కృతి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. 1977లో జనతా పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రాలలోని కాంగ్రెస్ ప్రభుత్వాలను బర్తరఫ్ చేసింది. 1980లో ఇందిరాగాంధీ పునరాగమనంతో రాష్ట్రాలలోని జనతా ప్రభుత్వాలకు కాలంచెల్లింది. ఆ సమయంలోనే హర్యానాలో భజన్‌లాల్ నాయకత్వంలోని జనతా ప్రభుత్వం ‘తెలివిగా’ కాంగ్రెస్ ప్రభుత్వంగా మారింది- అచ్చం మొన్న అరుణాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ సర్కార్ భాజపా సర్కార్‌గా మారినట్టు. భజన్‌లాల్ మెజారిటీ జనతా శాసన సభ్యులతో కలసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా కొన సాగారు. ఉత్తరాఖండ్ తర్వాత హిమాచల్ ప్రదేశ్, అనంతరం కర్ణాటక కాషాయ ఛత్రం కిందికి రావలసిందేనంటూ భాజపా పార్లమెంటు సభ్యుడు కైలాష్ విజయవర్గియా జోస్యం చెప్పారు. మోదీ తలచుకుంటే తెదేపా శాసనసభా పక్షాన్ని చీల్చడం ఏ మాత్రం కష్టం కాదు. చంద్రబాబునాయుడి కంటే నరేంద్ర మోదీ దగ్గర వనరులు అధికంగా ఉంటాయి. ఓటుకు కోట్ల కేసును సీబీఐ చేత దర్యాప్తు చేయించవచ్చు. అవినీతి ఆరోపణలపైనా విచారణ చేయించవచ్చు. కేంద్రం తలచుకుంటే ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టవచ్చు. నానాతిప్పలు పడుతున్నవారిని చూస్తున్నాం. ఇదంతా ఇప్పుడు ఊహాజనితంగా కనిపించ వచ్చును. ఒకసారి తెదేపా భాజపాతో తెగతెంపులు చేసుకొని, కేంద్రం నుంచి ఇద్దరు మంత్రులనూ ఉపసంహరించుకొని, ప్రధానమంత్రినీ, కేంద్రప్రభు త్వాన్నీ విమర్శించడం ప్రారంభిస్తే కేంద్రం కాక చంద్రబాబునాయుడికి తగులు తుంది. దోషాలను వెతకడం ప్రారంభిస్తే దొరికిపోవడం ఖాయమని ముఖ్య మంత్రికీ తెలుసు. అందుకనే సాధ్యమైనంత వరకూ భాజపాను పట్టుకొని వేళ్ళా డటానికే చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తారు. ప్రత్యేక హోదా అంటే సర్వస్వం కాదంటూ, హోదా వచ్చినంత మాత్రాన అంతా స్వర్గధామం కాబో దంటూ, అదే సంజీవని అనుకోవద్దంటూ సన్నాయినొక్కులు నొక్కడం అందుకే. ప్రత్యేక హోదా లేకపోవడమే మంచిదనే విధంగా ప్రచారం చేయించి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసినా ఆశ్చర్యంలేదు. మొదటి నుంచీ ప్రచారంతోనే జయ ప్రదంగా కొట్టుకొస్తున్నారు. ప్రత్యర్థులకు వ్యతిరేకంగా, తనకు అనుకూలంగా అసత్య ప్రచారం చేయించి లబ్ధి పొందడం రాజకీయ ఎత్తుగడలలో భాగమేననీ, తప్పు లేదనీ తెదేపా అధినేత విశ్వాసం. ఇదీ చాణక్యమేనని నమ్మకం. తెదేపా సంగతి సరే. ప్రత్యేక హోదా సాధించేందుకు ప్రజలు ఏమి చేయాలి? ఎటువంటి ఉద్యమం నిర్మించాలన్నది వారి ఎదుట నిలిచిన ప్రశ్న. వ్యాసకర్త: కె.రామచంద్రమూర్తి -
అవధులు దాటిన అసహనం
వార్త - వ్యాఖ్య ‘నా తెలివితేటలతో రైతులకు నచ్చజెప్పాను. వాళ్ళకున్న కామన్సెన్స్ వీళ్ళకు (ప్రతిపక్షం వారికి) లేదు... హైదరాబాద్ సిటీని ఏ విధంగా కట్టాం?... పట్టిసీమను వ్యతిరేకించారు. పోలవరాన్నీ వ్యతిరేకిస్తున్నారు.... అభివృద్ధిని అడ్డుకుంటే మాత్రం ఉపేక్షించేదిలేదు... కాపు ఉద్యమం ఎవరు చేయిస్తున్నారండీ? ఇంకోపక్క కృష్ణమాదిగ...ఒక వయొలెన్స్ క్రియేట్ చేస్తున్నారు. వెస్ట్ గోదావరిలో ఒక చదువుకున్న అమ్మాయిని కిరోసిన్ పోసి కాల్చి చంపారు... ఊరూరా ప్రార్థనలు చేయించి, ప్రధానిని పిలిచి శంకుస్థాపన చేయించి, పవిత్రమైన భావనతో రాజధాని నిర్మిస్తుంటే అడుగడుగునా అడ్డుపడుతున్నారు.’ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివారం మీడియా గోష్ఠిలో చేసిన ఈ వ్యాఖ్యలు అసందర్భంగా, అర్థంపర్థం లేని మాటలుగా, సంధిప్రేలాపనలాగా కనిపించవచ్చు. కానీ ఈ అసంబద్ధమైన వాక్యాలలో దాగున్న అంతస్సూత్రం ఏమిటంటే ఆరోపణలు చేసినవారిపైన ఎదురుదాడి చేయడం. స్వీయ తప్పిదాలను ఎత్తి చూపినప్పుడు తప్పు ఒప్పుకోకపోగా, సవరించుకోకపోగా ప్రతిసారీ ప్రతిపక్షాన్ని ఆడిపోసుకునే అలవాటు. ఇందుకోసం అసత్యాలూ, అర్ధసత్యాలూ షరామామూలే. ఆత్మస్తుతి, పరనింద సరేసరి. పోలవరాన్ని ఎవరు వ్యతిరేకిస్తున్నారు? పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర బడ్జెట్లో కేవలం వంద కోట్లు కేటాయిస్తే ముఖ్యమంత్రి నోరుమెదప లేదు. ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్రెడ్డి ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతికీ, దేశీయాంగ మంత్రికీ పోలవరంతో సహా విభజన చట్టంలో చేసిన హామీలన్నీ అమలు చేయాలంటూ విజ్ఞప్తి చేశారు, అయినా సరే, ప్రతిపక్షమే పోలవరానికి అడ్డు తగులుతోందంటూ జంకూగొంకూ లేకుండా బొంకటంలోని ఆంతర్యం ఏమిటి? తన హయాంలో జరుగుతున్న అన్ని అనర్థాలకూ ప్రతిపక్షాన్ని నిందించడం, నిరాధారమైన ఆరోపణలు చేయడం ముఖ్యమంత్రికి బాగా అలవాటైన పలాయనవాద, బుకాయింపు రాజకీయంలో భాగం. కాపు ఉద్యమాన్ని, పశ్చిమగోదావరిలో యువతిపై జరిగిన అమానుషాన్ని కలిపి వెంట వెంటనే ప్రస్తావించడంలో ఉద్దేశం ఏమిటి? ఆ రెండింటికీ ఏమైనా సంబంధం ఉన్నదా? సం బంధం ఏమైనా ఉంటే అది ప్రభుత్వ వైఫల్యమే. ముఖ్యమంత్రి మాటలలోనే ప్రశ్నించాలంటే ‘ఎక్కడికి పోతున్నారు?’. చివరికి మంత్రి కిశోర్‌బాబు సుపుత్రుడు హైదరాబాద్‌లో ఒక యువతిని వేధిస్తే దాని తాలూకు టేపులను మార్ఫ్ చేయించింది ప్రతిపక్ష నాయకుడేనంటూ మంత్రి చేత చెప్పిం చిన ముఖ్యమంత్రి ఎటువంటి మానసిక స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవాలి. ఈ దృశ్యాలను అన్ని చానళ్ళూ అనేక సార్లు చూపించాయి. ప్రతి పక్షం ఒక అనవసరమైన అవరోధంగా ముఖ్యమంత్రికి కనిపిస్తోంది. ప్రతిపక్షం లేకుండా పోతే బాగనే భావన ఆయన వైఖరిలో స్పష్టంగా కనిపిస్తోంది. రాజధాని భూముల క్రయవిక్రయాలకు సంబంధించి ఈ పత్రికలో వచ్చిన కథనాలపైన వివరణ ఇవ్వడానికి ఉద్దేశించిన విలేకరుల గోష్ఠిలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వచ్చిన ఆరోపణలను తవ్వితీసుకొని వచ్చి చదివి వినిపించారు చంద్రబాబు. ఔటర్ రింగ్‌రోడ్డు ప్రాజెక్టులో మార్పులకు సంబంధించి తన ప్రభుత్వంపైనా, కడప జిల్లాలో భూముల క్రయవిక్రయాలకు సంబంధించి తన బంధువులపైనా, ఫోక్స్‌వ్యాగన్ వ్యవహారంపైన తన మంత్రివర్గ సహచరుడిపైనా వచ్చిన ఆరోపణలను సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని నిర్ణయించినట్టు వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి హోదాలో 2006 సెప్టెంబర్ 28వ తేదీన ప్రకటించారు. సీబీఐ దర్యాప్తుతో పాటు న్యాయవిచారణ కూడా జరిపించాలని నిర్ణయించారు. అదే స్ఫూర్తితో తన ప్రభుత్వంపైన రాజధాని భూముల విషయంలో వచ్చిన ఆరోపణలలోని నిజానిజాలు నిగ్గుతేల్చడానికి కేంద్ర దర్యాప్తు సంస్థ చేత విచారణ జరిపించవలసిందిగా ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేయవలసిన ముఖ్యమంత్రి పత్రికనూ, విలేఖరులనూ, ప్రతిపక్షాన్నీ తిట్టిపోయడం అన్యాయం. భూమి లావాదేవీల వివరాలను ప్రచురిం చిన ‘సాక్షి’ పత్రికపైన ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేశారు. అటాచ్మెంట్ అంటే ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా తప్పుడు నిర్వచనం ఇచ్చారు. ఏ మాత్రం పొంతన లేని సత్యం రామలింగరాజు కేసుతో పోల్చి తన ‘తెలివితేటలను’ నిరూపించుకున్నారు. ‘సాక్షి’ ప్రజల ఆస్తి. అంటే ప్రభుత్వం ఆస్తి అంటూ చిత్రమైన భాష్యం చెప్పారు. ఏ ఆరోపణపైన అయినా విచారణ ప్రారంభించే ముందే అభియోగాలు ఎదుర్కొంటున్నవారి పేరుపైన ఉన్న ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ ‘అటాచ్’ చేయడం ఆనవాయితీ. అభియోగాలు ఎదుర్కొంటున్నవారు దోషులని అర్థం కాదు. విచారణ తర్వాత వారు దోషులుగానో, నిర్దోషులుగానో నిర్ధారణ అవుతుంది. అంతిమ తీర్పుపైన శిక్ష విధించడమా, నిర్దోషిగా ప్రకటించడమా అనే నిర్ణయం న్యాయస్థానానిది. విచారణ కాలంలో అభియోగాలు ఎదుర్కొంటున్నవారు ఆస్తులను విక్రయించకుండా, వాటిలో మార్పులూచేర్పులూ చేయకుండా నిరోధించే ఉద్దేశంతోనే ఆస్తులను ‘అటాచ్’ చేస్తారు. ఆస్తులపైన హక్కును ఈ అటాచ్మెంట్ హరించదు. ఆస్తుల నిర్వహణకు సంబంధించి ఇబ్బందులు ఉండవు. ఆర్థిక అక్రమాలు చేసినట్టు స్వయంగా ఒప్పుకున్న రామలింగరాజు కేసుకూ, రాజకీయ కక్షతో కాం గ్రెస్, టీడీపీలు కలసి పెట్టించిన కేసులకూ పోలిక లేదు. చట్టం తెలిసినవారందరికీ ఈ విషయం స్పష్టమే. ముఖ్యమంత్రిగా పదేళ్ళకు పైగా పని చేసిన వ్యక్తికి ఈ అంశం తెలియదని ఊహించలేము. తెలిసే, బుద్ధిపూర్వకంగానే, ప్రజలను తప్పుదారి పట్టించే ఉద్దేశంతోనే, రాజకీయంగా ప్రతిపక్షాన్ని దెబ్బతీయాలన్న లక్ష్యంతోనే ‘అటాచ్మెంట్లో ఉన్న ఆస్తులన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి మొన్ననే లెటర్ రాశాం’ అంటూ చెప్పారు. ఒక వేళ ముఖ్యమంత్రి అటువంటి ఉత్తరం కేంద్ర ప్రభుత్వానికి నిజంగానే రాసినా దానికి విలువ ఉండదు. తన మంత్రులూ, మిత్రులూ నేరం చేశారంటూ ఆరోపణలు వచ్చినప్పుడు ‘మీడియా ముసుగులో నేరాలు చేస్తామంటే, రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తామంటే ప్రభుత్వం కఠినంగా ఉంటుంది’ అంటూ బెదిరించడం ఫక్తు బుకాయింపు రాజకీయం. మంత్రులు ఆస్తులు కొనుక్కుంటే తప్పా? వారికి డబ్బులుంటే భూములు కొనుక్కుంటారు. ఇందులో విచారించడానికి ఏముంది? ఇందుకోసం ఢిల్లీ నుంచి సీబీఐ అధికారులు రావాలా? అంటూ ముఖ్యమంత్రి అడిగిన ప్రశ్నలోనే మంత్రులు భూములు కొనుగోలు చేశారన్న ఒప్పుకోలు ఉన్నది. అసైన్డ్ భూములను కొనుగోలు చేసిన సహచరులను మందలించకపోగా సమర్థించడం ముఖ్యమంత్రి స్వభావానికి నిదర్శనం. రాజధాని గురించి ప్రకటన వెలువడటానికి ముందు ఎవరైతే భూములు కొనుగోలు చేశారో వారిపైన విచారణ విధిగా జరిపించాలి. వారికి రాజధానికి సంబంధించి ముందస్తు సమాచారం రహస్యంగా అందించినవారిని ఇన్సైడర్ ట్రేడింగ్ రహస్యాలను మిత్రుడు రాజ రత్నంకు అందజేసి పట్టుబడి న్యూయర్క్‌లో రెండేళ్ళ జైలు శిక్ష అనుభవిస్తున్న ప్రవాస భారతీయ వణిక్ ప్రముఖుడు, గోల్డ్‌మన్ సాచ్ మాజీ డెరైక్టర్ రజత్ గుప్తాతో పోల్చాలి. మన చట్టాలు అమెరికాలో వలె తమ పని తాము చేసుకుంటే పోతే అక్రమాలు చేసేవారికి బరితెగించే వీలు ఉండదు. నిర్దోషులు నిందలు భరించే అవసరం ఉండదు. ప్రశ్నించేవారిపట్ల అసహసనం ప్రదర్శించే అవకాశం ఉండదు. మంత్రులుగా ప్రమాణం చేసే సమయంలో ప్రభుత్వ రహస్యాలను ఎవ్వరికీ వెల్లడించననీ, భయం, పక్షపాతం లేకుండా వ్యవహరిస్తాననీ చేసిన వాగ్దానాలను ఉల్లంఘించే సాహసం ఎవ్వరూ చేయరు. రాజ్యాంగ నైతికతకు భంగం కలిగించే పనికి ఒడిగట్టరు. ప్రభుత్వానికీ, తనకూ, ప్రభుత్వ ఆస్తులకూ, తన ఆస్తులకూ, తన ప్రతిష్ఠకూ, ప్రభుత్వ ప్రతిష్ఠకూ మధ్య అభేదం పాటిస్తున్న రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనపైన వచ్చిన ఆరోపణలను ప్రభుత్వాన్ని అస్థిరపరచే కుట్రలుగా, అభివృద్ధిని అడ్డుకునే ప్రతీప చర్యలుగా అభివర్ణించడంలో ఆశ్చర్యం లేదు. ప్రభుత్వం అవకతవకల గురించీ, ప్రభుత్వంలో ఉన్నవారి అవినీతి పనుల గురించీ రాయకుండా పాత్రికేయులనూ, పత్రికలనూ, టీవీ చానళ్ళనూ బెదిరించడం వల్ల ప్రయోజనం లేదు. ఆరోపణలు చేసినవారందరినీ అభివృద్ధి నిరోధకులంటూ నిందించడం బెడిసికొడుతుంది. ఇది పాలక పక్షానికీ, ప్రతిపక్షానికీ సంబంధించిన వివాదం కాదు. మీడియాకూ ముఖ్యమంత్రికీ మధ్య తగవు కాదు. ఇది ప్రజలకూ, పాలకులకూ సంబంధించిన వ్యవహారం. ముఖ్యమంత్రి సంజాయిషీ చెప్పుకోవలసింది ప్రజలకు. తాను కానీ, తన సహచరులు కానీ ఏ తప్పూ చేయలేదని నిరూపించుకొని ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందే అవకాశం ఉంది. లోగడ ఇటువంటి సందర్భాలలో ముఖ్యమంత్రులు కానీ కేంద్ర మంత్రులు కానీ తమపైన వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించ వలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరేవారు. జైన్ డైరీలో లాల్ కృష్ణ అడ్వానీ పేరు సంకేత మాత్రంగా ఉన్నట్టు ఆరోపణ వచ్చిన వెంటనే ఆయన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేశారు. కోర్టు నిరోషి అని ప్రకటించిన అనంతరమే లోక్‌సభకు తిరిగి పోటీ చేసి ఎన్నికైనారు. చంద్రబాబు నాయుడి నుంచి అంతటి ఉన్నతమైన నైతిక ప్రమాణాలను ఆశించవచ్చునా? రాజీనామా చేయకపోయినా సరే, తనపైనా, తన మంత్రివర్గ సహచరులపైనా వచ్చిన ఆరోపణలపైన సీబీఐతోనో, న్యాయమూర్తితోనో విచారణ జరిపించవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరతారని భావించవచ్చునా? అదీ జరగకపోతే కేంద్ర ప్రభుత్వమే చొరవ తీసుకొని విచారణ జరిపిస్తుందా? రాజధాని భూముల వ్యవహారంలో స్పష్టత రావాలంటే, ప్రజల మనస్సులలో బలంగా నాటుకున్న అనుమానాలు తొలగిపోవాలంటే ఆరోపణలపైన తన అధీనంలో లేని కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న సీబీఐ చేత విచారణ జరపడం ఒక్కటే మార్గం. మీడియాను నిందించడం అంటే తన ప్రతిబింబాన్ని ఉన్నది ఉన్నట్టు చూపించే అద్దాన్ని బద్దలు కొట్టడానికి ప్రయత్నించడమే. ప్రజాస్వామ్య వ్యవస్థలో విశ్వాసం ఉన్నవారు ఎవ్వరూ ఈ ధోరణిని హర్షించరు. ప్రభుత్వాధినేత అవధులు మీరిన అసహనం ప్రదర్శిస్తే ప్రజలే మీడియాను కాచుకుంటారు. ప్రజల తరఫున నిలబడి ప్రభుత్వం పనితీరును నిశితంగా గమనిస్తూ వాస్తవాలు ప్రజలకు నిర్భయంగా నివేదించే విధి నిర్వహిస్తున్న మీడియా సంస్థలు పాఠకులకూ, వీక్షకులకు మాత్రమే విధేయంగా ఉంటాయి. రాజ్యాంగాన్ని శిరసావహిస్తాయి. దోచినవారే రాసినవారిని శిక్షిస్తామంటూ బెదిరిస్తే భయపడవు. ఇటువంటి సందర్భాలు స్వతంత్ర భారత చరిత్రలో అనేకం వచ్చాయి. ప్రతిసారీ ప్రజలు మీడియాకే అండగా ఉన్నారు. చరిత్ర తెలుసుకొని అసహనం, అహంకారం తగ్గించుకుంటే పాలకులకే మేలు. - కె. రామచంద్రమూర్తి -
అసహనం, అన్యాయం...
త్రికాలమ్: ‘నేను కాంగ్రెస్‌వాదిని అయినప్పటికీ సభాపతిగా సభలోని అందరితో, అన్ని వర్గాలతో న్యాయంగా, సమానంగా వ్యవహారం చేయడం నా విధి. ఆ దిశగానే మనస్ఫూర్తిగా కృషి చేస్తాను. నిష్పక్షపాతంగా, పార్టీ ప్రయోజనాలకూ, పదవీ రాజకీయాలకూ అతీతంగా ఉండటం నా కర్తవ్యం’. ఇది లోక్‌సభ తొలి స్పీకర్ గణేశ్ వాసుదేవ్ మావలాంకర్ చెప్పుకున్న సంకల్పం. స్పీకర్ పదవీ బాధ్యతలను నిర్వచించడంలో భారత రాజ్యాంగ నిర్మాతలు బ్రిటిష్ కామన్స్ సభాపతిని ఆదర్శంగా తీసుకున్నారు. నిష్పక్షపాతంగా ఉండటమే కాకుండా ఆ విధంగా ఉన్నట్టు సభ్యులందరికీ కనిపించాలి. శుక్రవారంనాడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సంభవించిన పరిణామాలూ, సభాపతి కోడెల శివప్రసాద్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఆర్థిక, శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు వ్యవహరించిన తీరు మావలాంకర్ సూత్రానికి పూర్తి విరుద్ధం. ఏడు విడతలు అసెంబ్లీ సభ్యుడుగా ఎన్నికైనాననీ, తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగానూ, పదేళ్లు ప్రతిపక్ష నాయకుడుగానూ పని చేశాననీ, తనకు ఎవ్వరూ విధివిధానాలు చెప్పవలసిన అవసరం లేదనీ చంద్రబాబునాయుడు చెప్పిన మాట నిజమే. ప్రజానాయకుడు ఎన్‌టి రామారావును గద్దె దింపి చంద్రబాబునాయుడికి పట్టం కట్టడంలో 1995 ఆగస్టు సంక్షోభంలో స్పీకర్‌గా చక్రం తిప్పిన యనమల రామకృష్ణుడికి శాసనసభ నియమనిబంధనలూ, విధివిధానాలూ తెలియవని అనుకోవడం పొరపాటు. స్పీకర్‌గా ఏణ్ణర్ధంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న శివప్రసాద్‌కి చట్టసభలలో విశేషానుభవం ఉంది. సలహాసంప్రదింపులు జరపడానికి అనుభవజ్ఞులైన అధికారులు అందుబాటులో ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో, శాసనసభా వ్యవహారాలలో, పరిపాలనలో సుదీర్ఘమైన అనుభవం ఉన్న ఈ ముగ్గురు నాయకులూ నిబంధనలనూ, సంప్రదాయాలనూ తుంగలో తొక్కి , ప్రతిపక్షం నోరునొక్కడమే ప్రధానంగా వ్యవహరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం. ఏ వ్యవస్థ అయితే తమకు పదవులు ఇచ్చిందో ఆ వ్యవస్థ పట్ల ప్రజలకు విశ్వాసం సన్నగిల్లేట్టు చేస్తున్నారు. చెట్టు ఎక్కి మొదలు నరుక్కున్న చందం. వైఎస్ఆర్సీపీ శాసనసభ్యురాలు ఆర్. కె. రోజా శుక్రవారంనాడు సభలో వ్యవహరించిన తీరు అభ్యంతరకరంగా పరిగణించినప్పటికీ అధికారపక్షం ప్రతిపాదించినట్టు మోతాదుకు మించిన శిక్ష విధించడం ద్వారా శాసనసభాపతి నిష్పక్షపాతంగా వ్యవహరించలేదనే అభిప్రాయం కలిగించారు. ఎవరైనా సభ్యుడు నియమనిబంధనలను పూర్తిగా ఉల్లంఘించి (గ్రాస్ డిజార్డర్లీ బిహేవియర్) అడ్డగోలుగా వ్యవహరించినప్పుడు సదరు సభ్యుడిని సస్పెండు చేసే అధికారం సభాపతికి 340వ నిబంధన ప్రసాదించింది. ఈ నిబంధనలోని రెండవ సెక్షన్ కింద రోజాను సంవత్సరం పాటు శాసనసభ నుంచి సస్పెండ్ చేసినట్టు సభాపతి ప్రకటించారు. సభ ప్రారంభమైన రోజు ఇద్దరు వైఎస్ఆర్సీపీ సభ్యులను (శివప్రసాద్ రెడ్డి, రామలింగేశ్వరరావు అలియాస్ రాజా) కెమెరాకు అడ్డుగా నిలబడ్డారనే కారణంగా ఒక రోజు సస్పెండు చేయాలని శాసనసభ వ్యవహారాల మంత్రి కోరితే రెండు రోజులు సస్పెండు చేసినప్పుడే స్పీకర్ తొందరపడినట్టు కనిపించారు. రెండో రోజు ఉదయం కాల్‌మనీ-సెక్స్ రాకెట్ ఉదంతంపైన చర్చ జరగాలంటూ ప్రతిపక్షం పట్టు పట్టడం, ఎజెండాలో లేని అంబేడ్కర్‌ను అడ్డుపెట్టి చర్చను దాటవేయడానికి అధికారపక్షం ప్రయత్నించడంతో సరిపోయింది. అంబేడ్కర్‌పైన చర్చ జరిగే వరకూ 54 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన స్పీకర్ అదే రోజున రోజాపై ఏకంగా ఏడాది పాటు సస్పెన్షన్ వేటు వేశారు. ఎటువంటి నిర్ణయం తీసుకోవడానికైనా సభకు (ప్రతిపక్షం లేని సభకా?) హక్కు ఉన్నదనీ, సభాపతికి సర్వాధికారాలూ ఉన్నాయనీ ముఖ్యమంత్రి, ఇతరులూ చేస్తున్న వాదన రాజ్యాంగ సమ్మతం కాదు. సభను సజావుగా, ప్రజాస్వామ్యబద్ధంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించవలసిన బాధ్యత స్పీకర్‌ది. రాజ్యాంగ స్ఫూర్తికి అతీతంగా వ్యవహరించే స్వేచ్ఛ సభాపతికి కానీ, మరెవ్వరికి కానీ లేదు. శాసనసభల విధివిధానాలూ, నిర్వహణకు సంబంధించిన నిబంధనలు సైతం రాజ్యాంగబద్ధమై ఉండాలంటూ రాజ్యాంగంలోని 208వ అధికరణ స్పష్టం చేస్తున్నది. నియమనిబంధనలలో పేర్కొనని పరిస్థితి ఏదైనా ఉత్పన్నం అయినప్పుడు తగిన నిర్ణయం తీసుకునే విచక్షణాధికారం సభాపతికి ఉన్నదని శాసనసభను శాసించే 360, 361 నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. అటువంటి నిర్ణయం కూడా రాజ్యాంగానికి లోబడే ఉండాలి. కరణం ఉదంతం రోజా సస్పెన్షన్ ఉదంతంతో పోల్చదగినది గతంలో కరణం బలరామమూర్తి విషయంలో జరిగింది. 2008 ఏప్రిల్ నాలుగో తేదీన అద్దంకిలో తెలుగురైతు సదస్సు జరిగింది. అందులో స్థానిక తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు కరణం బలరామమూర్తి మాట్లాడుతూ, అసెంబ్లీలో తమను మాట్లాడనీయకుండా గొంతు నొక్కుతున్నారనీ, స్పీకర్ సురేశ్‌రెడ్డిని శిఖండిలాగా అడ్డం పెట్టుకొని తమను ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అణచివేస్తున్నారనీ ఆరోపించారు. బయటికి రావలసిందిగా స్పీకర్‌కి సవాలు విసిరానని చెబుతూ, ‘ నేను బయటకు రమ్మన్నది అప్పుడు స్పీకర్ స్థానంలో కూర్చున్న కుతూహలమ్మను కాదు, గదిలో దొంగలాగా దాక్కున్న స్పీకర్ సురేశ్‌రెడ్డిని’ అంటూ శ్రుతి మించారు. కరణం వ్యాఖ్యల పట్ల అభ్యంతరం చెబుతూ అప్పటి ప్రభుత్వ చీఫ్‌విప్ కిరణ్ కుమార్ రెడ్డి, మరి అయిదుగురు కాంగ్రెస్ సభ్యులతో కలసి బలరామమూర్తిపైన సస్పెన్షన్ వేటు వేయవలసిందిగా స్పీకర్‌కు 2008 ఏప్రిల్ 5న వినతిపత్రం ఇచ్చారు. ఇప్పటి స్పీకర్లాగా అప్పటి స్పీకర్ వెంటనే వేటు వేయలేదు. విషయాన్ని పరిశీలించి నివేదిక సమర్పించవలసిందిగా హక్కుల సంఘాన్ని కోరారు. అప్పటి హక్కుల సంఘం అధ్యక్షుడు గాదె వెంకటరెడ్డికి కరణంతో వైరం ఉన్నది. అయినప్పటికీ ఆయన నియమనిబంధనలను తు.చ. తప్పకుండా పాటించారు. నాటి హక్కుల సంఘంలో బలరామమూర్తి కూడా సభ్యుడే. ఆయనపైనే ఆరోపణ వచ్చింది కనుక కమిటీ విచారణలో పాల్గొనవద్దనీ, తాను చెప్పదలచుకున్నది కమిటీ ఎదుట చెప్పవచ్చుననీ హక్కుల సంఘం నిర్ణయించింది. 14 మంది సభ్యులు గల హక్కుల సంఘంలో కాంగ్రెస్ సభ్యులే కాకుండా ఎస్వి సుబ్బారెడ్డి, రవికుమార్ వంటి తెలుగుదేశం పార్టీ సభ్యులూ, కమ్యూనిస్టు పార్టీకి చెందిన రంగారెడ్డి, గుమ్మడి నరసయ్య కూడా ఉన్నారు. తాను అనని మాటలు తనకు పత్రికలు ఆపాదించాయనీ, ఆనరబుల్ స్పీకర్ అంటే తనకు ఎంతో గౌరవమనీ, ఈ వివాదంలోకి స్పీకర్‌లాంటి పెద్దమనిషిని లాగడం దురదృష్టకరమనీ విచారం వెలిబుచ్చుతూ బలరామమూర్తి ఒక సంజాయిషీ పత్రాన్ని హక్కుల కమిటీకి మే 2న సమర్పించారు. ఈ అంశంపైన చర్చించేందుకు 2008 ఏప్రిల్ 11 నుంచి మే 14 వరకూ సభాహక్కుల సంఘం అయిదు విడతల సుదీర్ఘ సమావేశాలు నిర్వహించింది. ఆగస్టు 8న శాసనసభలో గాదె వెంకటరెడ్డి సభాహక్కుల సంఘం నివేదికను ప్రవేశపెట్టారు. బలరామమూర్తిని ఆరు మాసాల పాటు సస్పెండ్ చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. నివేదికపైన శాసనసభలో జరిగిన చర్చలో పాల్గొని సుదీర్ఘంగా వివరణ ఇచ్చే అవకాశాన్ని కూడా బలరామమూర్తికి సభాపతి సురేశ్‌రెడ్డి ప్రసాదించారు. తర్జనభర్జనల తర్వాత నివేదికను శాసనసభ ఆమోదించింది. ఆ తర్వాతనే సభ నిర్ణయాన్ని సురేశ్ రెడ్డి ప్రకటించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నాయకుడు. ఇంత వివరంగా విచారణ జరిగినప్పటికీ స్పీకర్ ప్రకటన చేసిన రోజు దుర్దినమనీ, సభా నిర్ణయం కక్ష సాధింపు చర్య అనీ వ్యాఖ్యానించారు. గాంధీ విగ్రహం దగ్గర ధర్నా చేశారు. అదే నాయకుడు ఇప్పుడు ప్రతిపక్షానికి మాట్లాడే హక్కు లేదంటున్నారు. సభాపతి నిర్ణయానికి తిరుగులేదంటున్నారు. పార్లమెంటు సంప్రదాయం ఓటుకు నోటు కేసులోనూ స్పీకర్ పద్ధతి ప్రకారమే వ్యవహరించారు. 2008 జూలై 22న ముగ్గురు బీజేపీ సభ్యులు-అశోక్ అర్గల్, ఫగ్గన్ సింగ్ కులాస్తి, మహేశ్ భగోరా-డబ్బు సంచులతో లోక్‌సభలోకి ప్రవేశించారు. యూపీఏ-1 ప్రభుత్వం అమెరికాతో పౌర అణు ఒప్పందం కుదుర్చుకోవడం పట్ల నిరసనగా వామపక్షాలు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించాయి. మన్మోహన్సింగ్ ప్రభుత్వం విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఆ తీర్మానానికి అనుకూలంగా ఓటు చేయాలని కోరుతూ సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అమర్‌సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజకీయ కార్యదర్శి అహమ్మద్ పటేల్ తమకు లంచం ఇచ్చారంటూ నోట్ల కట్టలను ముగ్గురు సభ్యులూ స్పీకర్‌కు చూపించారు. ఈ ఆరోపణలపైన విచారించవలసిందిగా ఢిల్లీ పోలీసు శాఖను స్పీకర్ సోమ్‌నాథ్ చటర్జీ ఆదేశించారు. ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలించేందుకు పార్లమెంటు సంయుక్త సంఘాన్ని(జేపీసీ) నియమించారు. సభ్యులు చేసిన ఆరోపణ నిరాధారమంటూ జేపీసీ 2008 డిసెంబర్ 15న నివేదిక సమర్పించింది. చట్టసభలలో సభ్యులపైన వేటు వేయాలంటే ఇంత తతంగం జరగాలి. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో శుక్రవారం ఏమి జరిగింది? ధూళిపాళ్ల నరేంద్ర, మరి కొందరు తెలుగుదేశం పార్టీ సభ్యులూ అడిగారు. యనమల రామకృష్ణుడు ప్రతిపాదించారు. స్పీకర్ నిర్ణయం ప్రకటించేశారు. చకచకా జరిగిపోయింది. రోజా చేసిన వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగించినట్టు ప్రకటించిన తర్వాత గంటసేపటికి ఆమెను ఏడాది పాటు సస్పెండ్ చేసినట్టు స్పీకర్ ప్రకటించారు. రోజాకు మైకు ఇవ్వలేదు. ఆమె ఏమి అన్నారో ప్రసారం కాలేదు. ప్రజలకు తెలియలేదు. జరిగిన రభస సభకే పరిమితం. క్షమాపణతో సరిపెట్టవలసిన విషయాన్ని సస్పెన్షన్ వరకూ లాగడంలో ఔచిత్యం కనిపించడం లేదు. ఈ ఏకపక్ష నిర్ణయాన్ని పునఃపరిశీలించవలసిందిగా ప్రతిపక్షం శనివారం చేసిన విజ్ఞప్తిని సభాపతి నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. రోజాపైన సస్పెన్షన్ వేటు వేయాలని 340 నిబంధన రెండో సబ్‌క్లాజ్ కింద నిర్ణయం తీసుకున్నట్టు శివప్రసాద్ చెప్పారు. ఈ నిబంధన కింద సంవత్సరం పాటు సభ్యులను సస్పెండు చేసే అధికారమే లేదు. వేటుకు గురి అవుతున్న సభ్యురాలికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా వ్యవ హరిస్తున్నారంటూ మిత్రపక్షమైన బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్ రాజు చెప్పిన హితవునూ పెడచెవిన పెట్టారు. పాత భవనంలో ఇరుకు శాసనసభలో ముఖ్యమంత్రికే రక్షణ లేదంటూ చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న హాలు పాతది. గాంధీ విగ్రహం వెనుక గోపురాలతో ఉన్న భవనాన్ని 1985 వరకూ అసెంబ్లీ సమావేశాలకు ఉపయోగించేవారు. నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటు కారణంగా పదవీచ్యుతుడైన ఎన్‌టి రామారావు ఆగ్రహించి ఆ సభలో అడుగుపెట్టనంటూ ప్రతిజ్ఞ చేసి కొత్త భవనం నిర్మించేందుకు ఆదేశాలు ఇచ్చారు. 315 మంది సభ్యులు కూర్చునేందుకు వీలుగా కొత్త సభాస్థలిని నిర్మించారు. రాష్ట్ర విభజన తర్వాత అది తెలంగాణకు దక్కింది. పాత అసెంబ్లీ భవనంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రతిపక్ష సభ్యులు 67 మందీ స్పీకర్ పోడియం దగ్గరికి ఒక్కసారే వెడితే కొందరు స్పీకర్‌కు కుడివైపు కూడా రావలసి వస్తుంది. స్పీకర్ వైపు చూస్తూ నినాదాలు చేసుకుంటూ వచ్చిన రోజా వెనక్కి తిరిగే సరికి కొన్ని అడుగుల దూరంలో ముఖ్యమంత్రి ఎదురుగా కనిపించారు. నినాదాలు కొనసాగించారు. పనికట్టుకొని ముఖ్యమంత్రి ఎదురుగా వచ్చి నినాదాలు చేయలేదని చెప్పడం మాత్రమే ఉద్దేశం. అభ్యంతరకరమైన పదజాలం ఉపయోగించినందుకు సభ్యురాలి చేత క్షమాపణ చెప్పించవచ్చు. ప్రస్తుత సమావేశాలు ముగిసే వరకూ ఆమెను సస్పెండు చేయవచ్చు. అంతకంటే ఎక్కువ కాలం సస్పెండు చేసే అధికారం స్పీకర్‌కు సైతం 340వ నిబంధన కింద లేదు. క్షణాలలో సభ్యులను ఏడాదిపాటు సస్పెండ్ చేయడం ఒక్క ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోనే జరిగింది. కనీసం శనివారంనాడు సభాపతి నిర్ణయం మార్చుకొని ఉదారంగా వ్యవహరించి ఉంటే ఆయన పట్ల గౌరవం పెరిగేది. శాసనసభకూ అపకీర్తి తప్పేది. వ్యాసకర్త: కె.రామచంద్రమూర్తి -
సంఘటిత రంగానిదే సింహభాగం
అవినీతికి ఆస్కారం లేకుండా వేగంగా పనులు జరిగేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలను సూచించకుండానే 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 23.55 శాతం జీతాలు పెంచాలంటూ సిఫార్సు చేసి 7వ వేతన సంఘం చేతులు దులుపుకున్నది. నిజానికి, వేతన సంఘం చేయవలసింది కేవలం వేతనాల పెంపుదలకు సంబంధించిన సిఫార్సులు చేయడమే కాదు. నరేంద్రమోదీకి 2014 కలలు సాకారమైన సంవత్సరమైతే 2015 ఎదురు దెబ్బలు తగిలిన ఏడాది. ఢిల్లీ, బిహార్ శాసనసభ ఎన్నికలలో పరాజయం మోదీ ప్రభంజనానికి అడ్డుకట్ట వేసింది. మొదటి దెబ్బ ఢిల్లీలో తగలడానికి పరిశీలకులు పేర్కొన్న అనేక కారణాలలో కేంద్ర ప్రభుత్వోద్యోగులను కట్టడి చేయడానికి మోదీ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఒకటి. ఉదయం తొమ్మిదింటికి ఉద్యోగి ఆఫీసులో తన సీటులో కూర్చోకపోతే ఆ సంగతి ప్రధానమంత్రి కార్యాలయానికి తెలిసిపోయే విధంగా సాఫ్ట్వేర్ తయారు చేసి ఉపయోగిస్తున్నారనీ, ఇటువంటి ఆంక్షలు అలవాటు లేని ప్రభుత్వోగులు ఆగ్రహించి భారతీయ జనతా పార్టీని ఓడించడంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు సంపూర్ణంగా సహకరించారనీ ఢిల్లీ రాజకీయ వర్గాలలో అప్పట్లో వినిపించేది. ప్రభుత్వోద్యోగులను ప్రసన్నం చేసుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయని పని లేదు. వారిని ఉపేక్షించే సాహసం ఏ ప్రభుత్వమూ చేయదు. జీవన వ్యయం పెరుగుతున్నకొద్దీ వారి జీతభత్యాలు పెంచడం ఆనవాయితీ. ఏడవ వేతన సంఘం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చేసిన సిఫార్సులు ఈ కోవలోకే వస్తాయి. కొత్త వేతన ప్రమాణాలను అమలు చేస్తే కేంద్ర ప్రభుత్వంపైన రూ.73,650 కోట్లూ, రైల్వేలపైన రూ.28,450 కోట్లూ, వెరసి రూ.1,02,100 కోట్ల అదనపు వ్యయభారం పడుతుందని అంచనా. దీనికి తోడుగా ఉద్యోగ విరమణ చేసిన సైనికులకు ఓఆర్ఓపీ (వన్ ర్యాంక్ వన్ పెన్షన్) విధానం అమలు చేయడం వల్ల పెరిగే వ్యయం. పెరిగిన మొత్తం భారం స్థూల జాతీయ ఉత్పత్తిలో నాలుగు శాతం కంటే అధికం. ఈ వరుస ఇంతటితో ఆగదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలతో సమానంగా తమ వేతనాలు పెంచాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులూ, స్థానికి సంస్థల ఉద్యోగులూ ఉద్యమాలు చేస్తారు. వచ్చే రెండు సంవత్సరాలలో వారి జీతాలు కూడా పెంచక తప్పదు. దీని వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బ తింటుందనీ, ద్రవ్యలోటు తగ్గకపోగా పెరుగుతుందనీ కొందరు ఆర్థికవేత్తలు హెచ్చరిస్తుంటే వేతనాలు పెరగడం వల్ల ఖర్చు పెరుగుతుందనీ, పరోక్షంగా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందనీ, స్తబ్దుగా ఉన్న విపణిలో చలనం వస్తుందనీ మరికొందరు వాదిస్తున్నారు. ప్రభుత్వ వ్యయం పెరిగితేనే నయం? రెండో వాదనను ముందుగా పరిశీలిద్దాం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉంది. ఉత్పత్తుల ధరలు పడిపోతున్నాయి. తగ్గిపోయిన వస్తు వినియోగం వేగంగా పెరగడం లేదు. ద్రవ్యోల్బణం అదుపు తప్పకుండా బుద్ధిగానే ఉంటోంది. పరిశ్రమలు శక్తికి తగిన స్థాయిలో ఉత్పత్తి చేయడం లేదు. కార్పొరేట్ రంగంలో పెట్టుబడులు పెరగడం లేదు. ఈ పరిస్థితులలో మార్కెట్‌ను ఉత్తేజపరచాలంటే ప్రభుత్వ వ్యయం పెంచడం ఒక్కటే మార్గం. ఏడవ వేతన సంఘం సిఫార్సులను అమలు చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వోద్యోగుల ఆదాయం పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతాలలో సగటున 20 శాతం ఆదాయం పన్ను కింద చెల్లిస్తారు. వేతనాల పెంపు వల్ల పెరిగిన వ్యయభారంలో అయిదో వంతు అదనపు ఆదాయం పన్ను రూపంలో ప్రభుత్వ ఖజానాకు వాపసు వస్తుంది. ఇది కాకుండా, కేంద్ర ఉద్యోగి వినిమయ వస్తువులు కొనుగోలు చేసినా, ఇల్లు కట్టుకున్నా, విహారయాత్రలకు వెళ్లినా, ఇతరత్రా ఎటువంటి ఖర్చులు చేసినా పరోక్ష పన్నుల రూపంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పెరుగుతుంది. కనుక యూపీఏ సర్కార్‌లో నాటి ఆర్థికమంత్రి చిదంబరం ద్రవ్యలోటుకు బెదిరి ప్రభుత్వ వ్యయంపైన కోత విధించినట్టు ఎన్డీఏ ప్రభుత్వంలో అరుణ్ జైట్లీ సర్కారు వ్యయాన్ని తగ్గించే ఆలోచన చేయరాదనీ, ప్రభుత్వ వ్యయాన్ని పెంచాలనీ ఈ వర్గం ప్రవీణులు నొక్కి చెబుతున్నారు. వినిమయం, పెట్టుబడి, ఉత్పత్తి పెరుగుదల, లాభాలు, ఇతర అంశాలతో కూడిన విపణి చోదక ఆర్థికచక్రం అగకుండా తిరుగుతూ ఉండాలంటే వేతనాలు పెంచడం అవసరం. కాకపోతే, 2014లో, 2015లో సమర్పించిన చచ్చు బడ్జెట్ కాకుండా 2016లో భారీ సంస్కరణలకు ఊతం ఇచ్చే వైవిధ్య భరితమైన బడ్జెట్‌ను జైట్లీ ప్రతిపాదించాలని ఆర్థిక సంస్కరణలు అత్యవసరమని భావించే ఆర్థికవేత్తలు స్పష్టం చేస్తున్నారు. పన్నులు తగ్గించా లనీ, ప్రభుత్వ రంగంలో ఉన్న పరిశ్రమలను ప్రైవేటు రంగానికి అప్పగించాలనీ, ప్రభుత్వ రంగంలోని భారీ (నవరత్న) సంస్థలలో వాటాలను ప్రైవేటు సంస్థలకు అమ్మివేయాలనీ సంస్కరణవాదుల అభిలాష. వచ్చే బడ్జెట్ ప్రతి పాదనలలో సైతం జైట్లీ విఫలమైతే పుణ్యకాలం కాస్తా గడిచిపోతుందనీ, ఎన్డీఏకి 2019 ఎన్నికలలో ఎదురుగాలి అనివార్యం అవుతుందనీ హెచ్చ రిస్తున్నారు. వాజపేయి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో 2001-02 నుంచి దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ 2003-04లో కోలుకున్నదనీ, కానీ అప్పటికే సమయం మించిపోయిందనీ, ఎన్డీఏ ఓటమి పాలయిందనీ ప్రవీణులు గుర్తు చేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం వేతనాలు పెంచడాన్ని వ్యతిరేకిస్తున్నవారి వాదనలో సైతం బలం లేకపోలేదు. ప్రస్తుతం ద్రవ్యలోటు 3.4 శాతం ఉన్నది. ఈ లోటును పూడ్చడానికి ప్రయత్నించవలసిన ప్రభుత్వం వ్యయం పెంచుకుంటూ పోతే ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుందంటూ సిటీ గ్రూప్, ఇండియా రేటింగ్స్ వంటి సంస్థలు ప్రమాద సూచికలు ఎగురవేస్తున్నాయి. ఇప్పుడున్న ద్రవ్యలోటు పూడాలంటే ప్రభుత్వ ఆదాయం రూ.80,000 కోట్లు పెరగాలి. ప్రభుత్వ రంగ సంస్థలలో వాటాలు విక్రయించి రూ.70,000 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సమీకరించాలని ప్రణాళిక వేసుకున్న ప్రభుత్వం ఇంతవరకూ సేకరించగలిగిన మొత్తం కేవలం రూ.12,700 కోట్లు. అంతర్జాతీయ చమురు ధరలు బాగా తగ్గి ఉన్న కారణంగా ఆర్థిక వ్యవస్థలో అంతగా ఒడిదుడుకులు రాలేదు. ముడి చమురు ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఖజానాపైన భారం మరింత పెరుగుతుంది. ఇవన్నీ ప్రభుత్వ ఉద్యోగులకు అవసరం. పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా తమ ఆదాయం పెరగాలనుకోవడం సహజం. అందుకు వారిని తప్పు పట్టడం భావ్యం కాదు. సంఘటిత రంగంలో ఉన్న ఉద్యోగులు ప్రభుత్వం మెడలు వంచి జీతాలు పెంచుకోగలరు. అసంఘటిత రంగంలో ఉన్న రైతులు బతకలేక ఆత్మహత్యలకు ఒడికడుతున్నారు. గ్రామాలలో రోజుకు రూ.32లు, పట్టణాలలో రూ.47లు ఖర్చు చేసేవారు పేదవారి జాబితాలోకి రారంటూ రంగరాజన్ కమిటీ నిర్ణయించింది. హైదరాబాద్‌లో రూ.47లకు రెండు పూటలా తిండి దొరుకుతుందా? ఈ లెక్కన చూసుకున్నా దేశ జనాభాలో 29.5 శాతం మంది దారిద్య్ర రేఖ దిగువన ఉన్నారని అర్థం. అటువంటి కటిక పేదల సంగతి కానీ, వ్యవసాయం గిట్టుబాటు కాక ప్రాణాలు తీసుకుంటున్న రైతుల గురించి కానీ, కోట్లాది మంది నిరుద్యోగుల గురించి కానీ వేతన సంఘంలో ఉన్న ప్రవీణులూ, సంఘం అధ్యక్షుడు జస్టిస్ మాథుర్ ఒక్క క్షణం కూడా ఆలోచించి ఉండరు. కోటి ఉద్యోగాలు సృష్టిస్తానన్న మోదీ ఎన్నికల హామీ అమలు అయ్యే అవకాశాలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. సమష్టి భావం లోపించడం వల్ల, ఎవరి ప్రయోజనాలు వారు సాధించుకో వాలనే ధోరణి కారణంగా సంఘటితరంగంలోని ఉద్యోగులు ప్రధానుల, ముఖ్యమంత్రుల ముక్కుపిండి జీతనాతాలు వసూలు చేసుకుంటున్నారు. పెంచిన జీతాలకు న్యాయం చేస్తున్నారా అంటే అదీ అనుమానమే. జీతాలతో పాటు గీతాలూ పెరుగుతున్నాయి. పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంటున్నాయి. ఉత్పత్తికీ, వేతనాలకూ ప్రైవేటు రంగంలో సంబంధం ఉన్నది. ఒక ఉద్యోగి వల్ల సంస్థకు ప్రయోజనం కలిగితేనే అతనికి లేదా ఆమెకు పదోన్నతి కానీ, వేతనం పెరుగుదల కానీ ఉంటుంది. పనికీ, జీతాల పెరుగుదలకీ సంబంధం ఉండాలనే వాదనకు ఏడవ వేతన సంఘం 880 పేజీల నివేదికలో కొన్నింటిని కేటాయించింది. కానీ చివరికి ఏమని సిఫార్సు చేసింది? పని చేయనివారిని గుర్తించి ఇరవై సంవత్సరాలలో ఉద్యోగాల నుంచి తొలగించాలని చెప్పింది (అదే ప్రైవేటురంగంలో ఉద్యోగి పనితీరుపై ప్రతి మూడు మాసాలకూ ఒకసారి మదింపు ఉంటుంది). వేతనసంఘం ప్రతిభకు పట్టం కట్టినట్టా, గోరీ కట్టినట్టా? పని చేయనివారికి ఇరవై సంవత్సరాల వెసులుబాటు కల్పిస్తూ, పని తీరును సమీక్షించేందుకూ, పనిచేయనివారిని ఉద్యోగాల నుంచి తొలగించేందుకూ ఎటువంటి విధానం అనుసరించాలో చెప్పకుండా నివేదికను ముగించడం వేతన సంఘం బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. కొసమెరుపు ఈ నివేదికలో కొస మెరుపు ఏమిటంటే ఐఏఎస్ అధికారుల ఆధిక్యాన్ని తగ్గిస్తూ ఐపీఎస్, ఐఎఫ్ఎస్లను ఐఎస్ఎస్ అధికారులతో సమానంగా పరిగణించాలనే ప్రయత్నం. ఈ అధికారులతో పని చేయించుకునే ముఖ్యమంత్రులను కానీ పనిచేయించే రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులను కానీ సంప్రదించకుండా ఐఏఎస్‌ల తోక కోసి సున్నం పెట్టాలంటూ వేతన సంఘం సిఫార్సు చేయడం అర్థరహితం. ఐఏఎస్‌లు జిల్లా కలెక్టర్లుగా, జిల్లా మెజిస్ట్రేట్లుగా సంక్లిష్టమైన బాధ్యతలు నిర్వహిస్తారు. ప్రభుత్వ ప్రతినిధులుగా వారు దాదాపు అన్ని రంగాలలోనూ జోక్యం చేసుకుంటారు. సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్ని స్తుంటారు. వారిపైన పని ఒత్తిడి ఎక్కువ. వారితో సమానంగా తమ తమ శాఖలకు పరిమితమై పనిచేసే పోలీసు ఉన్నతాధికారులనూ, అటవీశాఖ ఉన్నతాధికారులనూ పరిగణించాలనడం సరికాదని ఇదివరకటి వేతన సంఘాలూ, సుప్రీంకోర్టూ స్పష్టం చేశాయి. ఈ స్పూర్తికి భిన్నమైన సిఫార్సును తాజా వేతన సంఘం చేయడం విడ్డూరం. ఐఏఎస్, ఐపీఎస్‌ల మధ్య ఆధిక్య పోరు చాలాకాలంగా చూస్తున్నాం. ఐఎఫ్ఎస్లను కూడా ఈ పోరాటంలో భాగస్వాములను చేయడం ఎందుకు? వేతనం కానీ హోదా కానీ పని స్వభావంపైనా, సంక్లిష్టతపైనా ఆధారపడి ఉండాలి. ప్రతిభావంతులను ప్రభుత్వ ఉద్యోగాలలో నియమించేందుకు వీలుగా, సామర్థ్యానికి పెద్దపీట వేసే విధంగా, జవాబుదారీతనాన్నీ, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించే మనస్తత్వాన్నీ ప్రోత్సహించే పని సంస్కృతిని పెంపొందించే విధంగా సిఫార్సులు చేయాలంటూ ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకొని బృహత్ సంకల్పం చెప్పుకున్న వేతన సంఘం లక్ష్య సాధనలో విఫలమైనట్టే. ఉద్యోగవర్గం (బురాక్రసీ) పనితీరు మెరుగుపరిచేందుకు చేపట్టవలసిన చర్యలను కానీ, అవినీతికి ఆస్కారం లేకుండా వేగంగా పనులు జరిగేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలను కానీ సూచించకుండానే 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 23.55 శాతం జీతాలు పెంచాలంటూ సిఫార్సు చేసి చేతులు దులుపుకున్నది. నిజానికి, వేతన సంఘం చేయవలసింది కేవలం వేతనాల పెంపుదలకు సంబంధించిన సిఫార్సులు చేయడమే కాదు. బురాక్రసీని సంస్కరించడానికీ, దాని సామర్థ్యం పెంచడానికీ, పనితీరులో పారదర్శకతను పెంపొందించడానికీ, తాము ప్రజాసేవకులమని గుర్తెరిగి జనహితంకోసం పని చేయడానికీ ఏమేమి సంస్కరణలు అమలు చేయాలో సిఫార్సు చేయాలి. ఈ దిశగా జస్టిస్ మాథుర్, ఇతర సభ్యులు కృషి చేసిన దాఖలా వేతన సంఘం నివేదికలో పెద్దగా కనిపించదు. వేతన సంఘం చేసిన సిఫార్సులను అమలు చేయడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించే విధంగా ఉద్యోగులు తమ బాధ్యతలను నిర్వర్తించేట్టు చేయడం కూడా కేంద్ర ప్రభుత్వ కర్తవ్యం. క్రమశిక్షణతో, నిబద్ధతతో, సృజనాత్మకంగా, ప్రయోజనకరంగా పని చేసే ఉద్యోగులకు ప్రోత్సహకాలు ఉండాలి. గుర్రాన్నీ, గాడిదనూ ఒకే గాట కట్టే సంస్కృతికి ఇప్పటికైనా స్వస్తి చెప్పకే పోతే భావి తరాలు క్షమించవు. -
ఐసెట్ కన్వీనర్‌గా రామచంద్రమూర్తి
ఏయూ క్యాంపస్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్-2015 ప్రవేశ పరీక్ష కన్వీనర్‌గా ఏయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సీహెచ్.వి.రామచంద్రమూర్తి నియమితులయ్యారు. ఈ సందర్భంగా రామచంద్రమూర్తిని ఏయూ వీసీ ఆచార్య జి.ఎస్.ఎన్.రాజు శుక్రవారం తన కార్యాలయంలో అభినందించారు. ప్రభుత్వం అందించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. రామచంద్రమూర్తి మాట్లాడుతూ తనకు అప్పగించిన బాధ్యతకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తానని చెప్పారు. -
పదాలతో చెడుగుడు.. పతకాలతో బుడతలు
సాక్షి, సిటీబ్యూరో: ఆంగ్ల పదాలతో చిన్నారులు చెడుగుడాడుకున్నారు. అడిగిందే తడవుగా ఇంగ్లిష్ వర్డ్స్ స్పెల్లింగులను గడగడా చెప్పి విద్యార్థులు ఔరా అనిపించారు. పిల్లల్లో ఆంగ్ల భాషా పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు సాక్షి మీడియా గ్రూప్ వినూత్నంగా నిర్వహిస్తున్న సాక్షి ఇండియా స్పెల్ బీ-2014 ఫైనల్స్ శనివారం నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు విడివిడిగా నాలుగు కేటగిరిల్లో నిర్వహించిన పోటీల్లో విజేతలకు బంగారు, వెండి, కాంస్య పతకాలతోపాటు నగదు బహుమతులు అందజేశారు. ఫైనల్స్‌కు ఎంపికైన ప్రతి ఒక్కరికీ ప్రశంసా పత్రాలు కూడా ఇచ్చారు. బంగారు పతాక విజేతలకు రూ. 25 వేలు, రజత పతకం గెలుపొందిన వారికి రూ.15 వేలు, కాంస్య పతకాలు పొందిన వారికి రూ.10 వేలు నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. ఇరు రాష్ట్రాల నుంచి మొత్తం 25 వేల మంది ఈ పోటీలకు నమోదు చేసుకోగా దాదాపు 160 మంది ఫైనల్స్‌కు ఎంపికయ్యారు. శుక్రవారం నగరంలోని రావినారాయణ రెడ్డి ఆడిటోరియంలో ఫైనల్ పోటీలు జరిగాయి. నాలుగు కేటగిరిల్లో నిర్వహించిన పోటీల్లో ఒక్కో కేటగిరి నుంచి ముగ్గురు చొప్పున మొత్తం 24 మందిని పతకాలు వరించాయి. ముఖ్య అతిథులుగా హాజరైన సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ రామచంద్రమూర్తి, భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ మార్కెటింగ్ డెరైక్టర్ ఎం.రవీందర్‌రెడ్డి, సాక్షి మీడియా గ్రూప్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డెరైక్టర్ రాణిరెడ్డిలు విజేతలకు పతకాలు అందజేసి అభినందించారు. వీరితోపాటు భారతి సిమెంట్ మార్కెటింగ్ సీనియర్ జనరల్ మేనేజర్ ఎం.సి.మల్లారెడ్డి, అడ్వటైజింగ్ ఏజీఎం బి.చంద్రశేఖర్, పలు పాఠశాలల ప్రిన్సిపల్స్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సాక్షి ఈడీ రామచంద్రమూర్తి మాట్లాడుతూ విద్యార్థులు ఇలాంటి మేథో పోటీల్లో అమిత ఉత్సాహంగా పాలుపంచుకోవడం సంతోషకరమన్నారు. అందరూ పతకాలు పొందలేకపోయినా ఫైనల్స్ వరకూ రావడమే గొప్ప విజయంగా అభివర్ణించారు. రెండు రాష్ట్రాల నలుమూలల నుంచి విద్యార్థులను ఇంత దూరం తీసుకొచ్చి వారి ఆసక్తి, ప్రతిభను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను అభినందించారు. విద్యార్థుల్లో మేధస్సు సంపత్తిని పెంపొందించే మరిన్ని పోటీలు నిర్వహించేందుకు సాక్షి సిద్ధంగా ఉందని రామచంద్రమూర్తి వెల్లడించారు. సాక్షి ఇండియా స్పెల్ బీ పోటీలు నిర్వహించడం వరుసగా ఇది మూడోసారి. వచ్చే ఏడాది జనవరిలో సాక్షి జీయో బీ-2015 పేరిట ప్రత్యేక పోటీలకు కూడా సాక్షి మీడియా శ్రీకారం చుట్టింది. -
ఎన్.శంకర స్మారక ఉపన్యాస కార్యక్రమం